To Guard a mountain
Director: Izer Aliu
Country: Norway
Duration: 25 minutes
Language: Norwegian with english Subtitles
Age Group: 12 Years and above.
కథాంశం : కనపడకుండా పోయిన ఒక గొర్రెపిల్లను వెతికి తీసుకు రమ్మని తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడం కోసం 12 ఏళ్ల “ఇసా” అనే బాలుడు బాధ్యత-రక్షణ ఏది ముందు? ఏది ముఖ్యం? అనే మీమాంసల మధ్య నలిగి, పడరానిపాట్లు పడి చివరికి విజయం సాధించడమే ఈ సినిమా ఇతివృత్తం.
అదిగో పై ఫొటోలో కనిపిస్తున్న బాలుడే మన కథానాయకుడు.అతని పేరు “ఇసా”.అతనికో చిట్టి తమ్ముడుంటాడు.తమ్ముడి పేరు “హమీద్ ”. వాళ్ళది చాలా పేద కుటుంబం.పర్వత ప్రాంతాల్లోని ఒక ఊరిలో నివసిస్తుంటారు.గొర్రెల పెంపకం -వాటిమీద వచ్చే ఆదాయమే వారి జీవనాధారం.వాళ్ళకున్న గొర్రె పిల్లలలో ఒకటి ఎక్కడో తప్పిపోతుంది. వాళ్ళ తండ్రి గొర్రె పిల్లను వెతికి పట్టుకుని ఇంటికి తెచ్చే బాధ్యతను ఇసా కి అప్పజెప్తాడు.తమ్ముడు హమీద్ ను కూడా తోడు తీసికెళ్ళమంటాడు తండ్రి.
ఇసా తన తండ్రి వలెఒక యువకుడిగా ప్రీ టీన్స్ నుంచి టీన్స్ లోకి మారబోతున్న పల్లెటూరి పిల్లవాడు.నగరాల్లో అన్ని హంగులూ ఉన్నవాళ్ళు 12 ఏళ్ళంటే ఆడుకునే బాల్యంలో ఉన్న పిల్లలు.కానీ పల్లెల్లో పేదింటిమగపిల్లలు ఇంటి బాధ్యతల్ని,నెత్తికెత్తుకునే వయసు.ఆ వయసులో పిల్లలకి తండ్రి అన్నీ సాధించి పెట్టే ఒక మానవాతీత వ్యక్తిలాగా,ఒక సూపర్ హీరో లాగా కనిపిస్తాడు. పల్లెటూళ్ళలో పెద్దలనుంచి పిల్లలువిషయ జ్ఞానాన్ని ఇదీ అని చెప్పకుండానే అందుకుంటారు.. కుటుంబం లోని అబ్బాయిలు అన్ని విషాయాలకీ తండ్రినే ఆదర్శంగా తీసుకుంటారు.ఎంత కష్టమొచ్చినా ఎదురొడ్డి గంభీరంగా,ధీమాగా నిలవాలి గానీపురుషులు ఏడవకూదదనే నిగూఢ నిబంధనలుంటాయి ఊళ్ళల్లో. తండ్రిది కఠినమైన క్రమశిక్షణ.అతని మాట శిలా శాసనమే! గొర్రె పిల్లను ఏ మూలున్నా,ఎంత కష్టమైనా వెతికాల్సిందే! కానీ మంచుతో నిండిపోయిన ఆ పర్వతాల్లోని ఎగుడు దిగుళ్ళు ఎక్కి దిగుతున్నప్పుడు హమీద్ బాగా అలిసిపోయి,గాయపడి, అపస్మారకమై పోయి,ప్రాణాపాయ స్థితిలో పడిపోతాడు.
తండ్రి మాట జవదాటని ఒక ఎదుగుతున్న వ్యక్తిగా బాధ్యతతో వ్యవహరించాలని ఒక పక్కన ఆలోచిస్తాడు.ఇంకోవైపు నుంచి “అయ్యో!తన చిన్నారి నేస్తం,ఎల్ల వేళలా తనకి తోడూ-నీడా గా ఉన్న చిట్టి తమ్ముణ్ణిఇంటికి తీసుకొచ్చి రక్షించుకోవాలని ఆదుర్దా పడతాడు.మనసుతమ్ముడి ప్రాణాలే లక్ష్యంగా స్వంత వ్యక్తిత్వంతో నిర్ణయం తీసుకోమని ఆరాటపెడుతుంది. ఎటూ తేల్చుకోలేక గందరగోళ పడతాడు.తండ్రి ఆజ్ఞా పాలన-తమ్ముడి ప్రాణ రక్షణ, బాధ్యత- రక్షణ ఈ రెండిటి మధ్య మీమాంసలో ఇసా ఏది,ఎలా సాధించాడో,చివరిలో రెండిటి సంయమనంతో చిత్ర నిర్మాణం ఎంత అందంగా తయారైందో చూడాలంటే ఈ సినిమా అందరూ చూసి తీరాల్సిందే!
కథ నేపధ్యం లోకి వెళితే
అత్యంత బాధ,ఉత్కంఠ కలిగించే సంఘటన ఒకటుంది.అది డైరెక్టర్“ఐజర్ అలియూ” (Izer Aliu) కుటుంబంలో జరిగిన ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవ సంఘటనే!ఐజర్ అలియూకి చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ బోలెడన్ని కథలు చెప్తుండేది.అందులో ఐజర్ కుటుంబం లోనే జరిగిపోయిన ఒకభయంకరమైన వాస్తవ ఘటన ఆయన మనసుకి గాఢంగా హత్తుకుంది..అదేమిటంటే వాళ్ళ తాతయ్య తన ఇద్దరు తమ్ముళ్ళతో పనిమీద బయటికి వెళ్తాడు.సినిమాలో హమీద్ కి జరిగినట్లే వాతావరణంఅకస్మాత్తుగా భీతావహంగా మారిపోతుంది.ఒక తమ్ముడు వాతావరణపీడనాన్ని తట్టుకోలేక చనిపోతాడు.ఆ తమ్ముడి శవాన్ని మిగిలిన ఇద్దరు అన్నదమ్ములూ మోసుకొని ఇంటికి తీసుకొస్తారు. ఐజర్ కి పసి హృదయంలో ఒక ఆరని మంటలా తిష్ట వేసిన ఆ చిచ్చే వయసుతో పాటు దావాలనంలా పెరుగుతూ వచ్చిఈసినిమా గా రూపు దిద్దుకుంది.“నాకూ ఓ తమ్ముడున్నాడు.వాడిలా చనిపోతే ఎలా? అనే ఊహ నన్ను నిరంతరం బాధించేది.నేనలా ఆలోచించకూడదుఅనినాకు నేను చాలా నచ్చచెప్పుకునేవాణ్ణి.కానీ నన్ను నేనెంత అదుపులో పెట్టుకుందామని ప్రయత్నించినా సరే ఆ గతానికి సంబంధించిన పీడకల లాంటి భ్రాంతి నన్ను వదిలేది కాదు” అని అంటారుఐజర్.
స్వంత మనుషుల్ని సురక్షితంగా ఉంచడం,మన మనుషులనుకునేవారి పట్ల మనం తీసుకోవలసిన శ్రద్ధ, చూపవలసిన కన్ సర్న్ ,అలాగే చేయవలసిన పనులు,అన్నిటినీ మించి ఇంటా-బయటా నిర్వర్తించవలసిన బాధ్యత మొదలైన అంశాలను చర్చించిన చిత్రమిది.ఇది డైరెక్టర్ స్వంతజీవితానుభవం.ముఖ్యంగా ఎన్నో విధాలుగాభద్రత ను కల్పిస్తారు తలి-దండ్రులు.మన కుటుంబ సభ్యుల క్షేమాన్ని పట్టించుకోవలసిన ఆవశ్యకత గురించి బాల్యంలోమేము మా స్వంత జీవితాలను నుండి గుర్తించగలిగామని చెప్పిన డైరెక్టర్ అభిప్రాయం ఈసినిమాలోప్రతిబింబిస్తుంది. రకరకాల సందర్భాల్లో ఇది మనుషులందరికీ అనుభవంలోకొస్తాయని ప్రేక్షకులు కూడా గమనిస్తారు.
కొన్నిసార్లు పిల్లలు తలకు మించిన భారాన్ని మొయ్యవలసి రావచ్చు. కానీపెద్దవాళ్ళు “మీరు దీన్ని తప్పకుండా చెయ్యగలరు” అనే గట్టి నమ్మకాన్నిస్తారు. ఒప్పించేప్రయత్నం చేస్తారు. పిల్లలు “మేము తప్పకుండా చేస్తాం” అంటారు. బహుశా ఎప్పుడైనా చెయ్యలేని పని గురించి “ఇది మా శక్తికి మించిన పని” అనిపిల్లలు అంగీకరించిపెద్దలకు చెప్పడం ఉత్తమం.కానీ పెద్దల వైపు నుంచైనా,పిల్లల వైపు నుంచైనా కొన్ని పొరపాట్లుజరిగినప్పటికీఇరువైపులా అనుబంధాలు,మమతానురాగాలు, ప్రేమ ఉంటాయనే నమ్మకముండాలంటారు.
మామూలు కథే!కానీజీవితాన్ని,మనుషుల్ని,పరిసరాల్ని గమనించి అర్ధం చేసుకునిసినిమాలు తీసేవాళ్ళు బహుతక్కువ.నిజజీవితంలోఅందరికీ సన్నివేశాలన్నీ వర్తించక పోయినా, కొన్ని మనందరికీ వివిధ సందర్భాల్లో సంభవిస్తూనే ఉంటాయి. తండ్రీ-కొడుకులు,తల్లీ-కూతుళ్ళు,తలిదండ్రులు-పిల్లలు,అన్నదమ్ముళ్ళూ,అక్కచెల్లెళ్ళు-ఇలామానవ సంబంధాలన్నీ, మౌలిక సమస్యలన్నీ కొద్దో గొప్పోతేడా తప్పించి అందరంచట్రంలో భాగమే! దర్శకుడు ఐజర్ అలియూ (Izer Aliu) మాతృభూమి మేసిడోనియా.ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైననార్వేజియన్ సినిమా స్కూల్విద్యార్థి. మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ప్రాజెక్టుకోసంతన జట్టుతో తిరిగి వెళ్ళిఅతి భీకరమైన వాతావరణ పరిస్థితుల్లో నెలలతరబడి పని చేసినార్వేజియన్లు, మెసడోనియన్లు, స్వీడిష్ ,అల్బేనియన్లు – ఇలా ఎన్నో దేశాల ప్రజలను ఏకం చేసిన ఘనత దక్కించుకున్నారు.అంతేకాదు!సినిమా చూస్తున్న వారందరికీ “మన చిన్ననాటి జీవితాలను మనమే చూస్తున్నామా” అని అనుభూతించేలా అద్భుతంగా చిత్రీకరించారు. దర్శకుడు అంటే దార్శనికుడుఅనే అర్ధానికి తగ్గట్లుగాఒక జీవిత సత్యాన్ని బలమైన సారాంశాన్నందిస్తూదర్శకుడు తెర కెక్కించిన విధానం అద్భుతం! సినిమా అంటే కథ మాత్రమే కాదు.స్క్రీన్ ప్లే రచన,సంభాషణలు, నటన,కెమెరా పనితనం మొదలైన ఎన్నో కళల సమాహారం.వీటన్నిటి సహాయంతో పంక్తుల మధ్యప్రజలఅంతర్గత జీవితాలు ప్రేక్షకులకు స్ఫురింపజేశారుదర్శకుడు ఐజర్ అలియూ.
అందుకు ఆయన టీం మంచు కురిసే పర్వతాల మధ్య అననుకూలవాతావరణంలో నెలల తరబడి కృషి చేసిన విధానంఎంతైనా ప్రశంసనీయం!
ప్రీ టీన్స్ బాలలకోసం ఎంతఅర్థవంతమైన చిత్రాలు తీయవచ్చో తెలుసుకోవాలంటే అన్ని దేశాల్లోని దర్శకులూ,సినీ ప్రియులూ ,ఆ మాటకొస్తేఅందరూ ఐజర్ అలియూ నిర్మించిన- ఈ సినిమా అందరూ చూసి తీరాల్సిందే!
ఇసా గా నటించిన “బేసిం మూర్ టుజాని” (Besim Murtezani) అనే బాలనటుడుతన నటనలో ఉత్కంఠ,బాధ,నిర్వేదం,భయంమొదలైనభావాలను పలికించిన తీరు అద్భుతం!చిన్నారి చిట్టి సోదరుడు గా నటించిన ఆల్టాన్ ఆగ్సానీ (Altin Ahxani) , తండ్రిగా నటించినబర్హాన్ ఆమేతి (Burhan Amiti) వారి వారి పాత్రల్లో చక్కగా అమిరిపోయి నటించాడం కాక జీవించారనిపించింది.
“సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ,సాధ్యమైనన్ని తక్కువ మాటలతోనూ నడిచే సినిమా ఉత్తమమైనది” అని అంటారు మన శ్రీ శ్రీ. తూకం వేసినట్లు క్లుప్తంగా సంభాషణలు రాశారు స్క్రీన్ ప్లే రచయితటోర్ హబ్రో స్టీన్(Tor Hubro Stene).దిగంతాల వరకూ వ్యాపించి ఉన్న పర్వతాలనూ,మంచునూ,ప్రకృతి అందాలనూ తన కెమెరాతో మహాద్భుతంగా చిత్రీకరించారుజాన్ – ఎర్లింగ్హోమీన్స్ ఫెడ్రెక్సన్ (John – Erling Holmenes Fredriksen).
ఇక ఈ చిత్రం ప్రపంచ సినీ విమర్శకుల ప్రశంసల వెల్లువతో పాటు అవార్డుల పంట పండించుకుంది.
గ్రాండ్ ప్రిక్స్ జ్యూరీఅవార్డు- ఫ్రాన్స్-2014
విద్యార్థి జ్యూరీ బహుమతితో పాటు జ్యూరీ ప్రత్యేక బహుమతి –ఫ్రాన్స్- 2013
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఫెస్టివల్ – పోలాండ్– 2013
ఉత్తమ లైవ్ యాక్షన్ అవార్డు – అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం- చికాగో-అమెరికా – 2013 బెస్ట్ షార్ట్ ఫిక్షన్ ప్రేక్షకుల అవార్డు – తూర్పు- మధ్య యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ -2013
ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ – నార్వే రైటర్స్ గిల్డ్ గోల్డెన్ చైర్ అవార్డు – సినిమా ఫెస్టివల్- నార్వే 2013
ఉత్తమ దర్శకత్వం – టెటోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ –మేసిడోనియా – 2013
మచ్చుకి ఇవి కొన్ని మాత్రమే! నార్వేలో, మేసిడోనియాలో లెక్కలేనన్ని అవార్డులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా అంతులేనన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాలు పంచుకుంది.
– శివ లక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~