ఎనిమిదో అడుగు – 16

n-399-222x300‘‘మన పెద్ద కొడుకు లోకేష్‌ తనపై అధికారికి వాళ్ల మామ గారిని పరిచయం చేసి నన్ను చెయ్యలేదు.  నలుగురిలో నాకెంత అవమానం ఇది?’’ అన్నాడు.  ‘‘దేన్నీ తట్టుకోలేరు మీరు! ఇది అవమానం కాదు, మీ అవసరం లేదు వాడికి! చూడండీ! స్కూల్లోనో, కాలేజిలోనో చదువుతున్నప్పుడు తండ్రిని పరిచయం చేసే కొంతమంది కొడుకులు ఒక స్టేజికి రాగానే తండ్రి పట్ల అంత ఉత్సాహం  చూపరు.  తండ్రి గురించి ఆలోచించాలన్నా మాట్లాడాలన్నా టైం వేస్ట్‌ అనుకుంటారు.  అయినా మీరు లోకేష్‌ తండ్రి అని అక్కడ చాలా మందికి తెలియదు లెండి! అది అలా పక్కన పెట్టి ఇది వినండి! ఇకముందు  ఈ ఇంట్లో  ఆ గ్రే కలర్‌ రూంలో వుండబోయేది ఎవరో తెలుసా?’’ అని ఇంతకు ముందు దూరపు బంధువు చెప్పిన మాటల్ని తన భర్తతో చెప్పబోతుండగా పక్క నుండి తమ వియ్యంకుల మాటలు విన్పించాయి.  అవి వింటూ మాట్లాడడం మానేసింది నీలవేణి.

‘‘…. ఏమండీ! అల్లుడుగారు వాళ్లపై అధికారికి మిమ్ముల్ని పరిచయం చేసినప్పటి నుండి మీ ముఖం వెలిగిపోతోంది.  అంతేకాదు, మన అమ్మాయి మనం రాగానే మనల్ని ఆ గదిలో వుండమన్నది అని తెగ మురిసిపోతున్నారు….. నా అభిప్రాయం కూడా చెబుతాను వినండి! అమ్మాయి మనది అయినంత మాత్రాన అల్లుడు మనవాడు కాడు.  మనం మనింట్లోనే చావాలి.  ఇక్కడికి వద్దామంటే నేను రాను…. మన గురించి లోకం కాని, అల్లుడ గారి తరపు బంధువులు కానీ నీచంగా అనుకోవటం నేను తట్టుకోలేను.  ఇంత బతుకు బతికి అల్లుడి ఇంట్లో చచ్చారు అంటారే కాని ఈ అల్లుడ్ని కొనుక్కోవటం కోసం ఒకప్పుడు మనం అమ్మిన ఆస్తుల్ని, చేసిన అప్పుల్ని ఎవరూ చూడరు…’’ అంది. ఆమెకి కడుపులోంచి దు:ఖం తన్నుకొస్తోంది. 

ఆమె అంతగా బాధపడ్తుతుంటే ఆ ఫంక్షన్‌లో ఎవరో ఏదోఅని వుంటారని ఆమె భర్త గ్రహించి, ఓదార్పుగా చూస్తూ…. ‘‘ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చెయ్యాలంటే మనలాగే చాలా మంది ఆస్తుల్ని అమ్మి, అప్పుల్ని చెయ్యటం, సహజంగా జరిగేదే! అది పైకి చెప్పుకున్నా ఆగేది కాదు…. కానీ ఒక తల్లిగా నీ కూతురుపై నీకు ఆశలు వుంటాయి.  ఆమె దగ్గరకి రావాలని, చూడాలని, వుండాలని,….  వీటిని ఖండిరచాలని చూడడం మానవత్వం కాదు.’’ అని

ఇంకా ఏదో అనబోతుంటే ఆయన నోటిమీద చేయిపెట్టి ఆపుతూ….

‘‘ఆశలు, హక్కులు మగపిల్లల్ని కన్నతల్లులకే వుండాలి, వుంటాయి. అలా అని పిల్లల్ని కనేటప్పుడు ఎక్కువ నొప్పులు మగపిల్లాడి తల్లి పడిందని కాదు.  అది అంతే! ఏది ఏమైనా మనం గద్వాల్‌ వదిలి చచ్చినా బెంగుళూర్‌ రావొద్దు.’’ అంది కచ్చితంగా.

 ఆ మాటలు నీలవేణమ్మ మనసుసై రోకటి దెబ్బల్లా పనిచేశాయి.  తను మనసులో అనుకున్న మాటలు పైకే అని ఆమెనెవరో బాధించి వుంటారని అర్థం చేసుకొని వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి…. ‘‘వదినా! పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఏదో ఒక విధంగా మనల్ని గాయపరుస్తూనే వుంటారు.  కానీ కడుపుతీపిని మరచిపోయేంతగా మనల్ని మనం గాయపరచుకోవద్దు.’’ అంది నీలవేణి… 

ఆమె మౌనంగా వుంది. 

రాజేంద్ర ప్రసాద్‌ మనసులో వున్న బాధ ఒక్కసారే చేత్తో తీసేస్తే పోయేది కాదు అన్నట్లు ఆయన ఆలోచనలో ఆయన వున్నాడు. 

స్నేహిత మాత్రం తన వయసున్న ఆడవాళ్ల దగ్గర కూర్చుని ‘పిల్లలు పుట్టాలంటే ఎలాంటి పక్రియల్ని పాటించాలి?’ అన్న దాని గురించి చాలా సున్నితంగా అడిగి తెలుసుకుంటోంది. 

హేమేంద్ర రాజమౌళి మందుల షాపులో చేరి, ఆయన చేత మెత్త, మెత్తగా తిట్లు తింటూనే మందుల పేర్లు, డాక్టర్ల ప్రిష్కష్షన్లు చదవటం నేర్చుకున్నాడు.  మందులు అమ్మటంలో మెళకువలు నేర్చుకున్నాడు.   క్రమంగా తన దిశను మార్చుకుంటూ నలుగురితో ఎలా వుండాలి, ఎలా మాట్లాడాలి అన్నది గ్రహించాడు…. పదిమంది మధ్యన రాణించాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా రాత్రికి రాత్రి వచ్చేది కాదని తెలుసుకున్నాడు.  ఏది రావాలన్నా , ఏది చెయ్యాలన్నా ముందుగా తనలో వున్న కోపాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు….

హేమేంద్ర కాకుండా ఆ షాపులో ఇంకో కుర్రాడు కూడా వున్నాడు.  హేమేంద్ర వచ్చాక ఆ కుర్రాడితో అవసరం అంతగా లేకపోయినా ‘వుంటాడులే తన మనిషిలా’ అని రాజమౌళి ఆ కుర్రాడిని షాపులోంచి తీసెయ్యలేదు.

హేమేంద్రకి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా` హాస్పిటల్లోకి వచ్చి పోయే పేషంట్లని, వాళ్ళ తాలూకు బంధువుల్ని గమనిస్తుంటాడు.  రిప్రజెంటీటివ్‌లను, వాళ్లు వేసుకునే డ్రస్‌లను, వాళ్లు మాట్లాడే విధానాన్ని కళ్లార్పకుండా చూస్తుంటాడు.  ఒక్కోసారి అతనిక్కూడా రిప్రెజెంటేటివ్‌ వేసుకునే డ్రస్‌ల్లాంటివి తీసుకోవాలని ఆశ కల్గుతుంది.  మరుక్షణమే ముఖం మీద నీళ్లు చల్లినట్లయి, కేవలం ఒంటి మిాద బట్టల కోసం తండ్రికుండే ఎకరం పొలం అమ్మమనటమో, తాకట్టు పెట్టమనటమో కుదరదు కదా! ఎందుకంటే తన తండ్రి మొన్ననే చెప్పి వెళ్లాడు.   ‘ఇకముందు నువ్వు రాజమౌళి సార్‌ ఇచ్చే డబ్బులతోనే  నీ అవసరాలు తీర్చుకో ’ అని….ఇంతకి ముందులా ఇంకా తండ్రి మీద ఆధారపడటం అతనికే నచ్చటం లేదు. 

పేషంటు మందుల చిట్టీ పట్టుకొని రాగానే మన లోకంలోకి వచ్చాడు హేమేంద్ర. ఆ పేషంటు తెచ్చిన ప్రిష్కిప్షన్‌లోని మందు పేరు సరిగ్గా అర్థం కాక డాక్టర్‌ గారి దగ్గరకి వెళ్లి తన సందేహాన్ని తీర్చుకొని వచ్చాడు.  ఆ తర్వాత ఓ రిపోర్టు తాలూకు డౌట్‌ ఏదో వుంటే లాబ్‌లోకి వెళ్లి అడిగి తెలుసుకున్నాడు. 

ఓ.పి.లో కూర్చుని టి.వి. చూస్తున్న ఒకామె లాబ్‌లోంచి బయటకొస్తున్న హేమేంద్రను చూడగానే లేచింది…. ‘‘నువ్వు శేఖరయ్య కొడుకువి కదూ? ఒకప్పుడు తాటిచెట్ల చుట్టూ తిరుగుతూ ఎండిన పెంకులా ఎలా వుండేవాడివి. ఇప్పుడు నీళ్లు పోసిన మొక్కలా చక్కగా వున్నావ్‌! ఎక్కడున్నావ్‌? ఏం చేస్తున్నావు?’’ అంది ఆశ్చర్య పోయి చూస్తూ…

ఆమె అలా అడగడం ఆత్మీయంగా వున్నా, తను లోగడ తాటి చెట్లు ఎక్కటం ఎవరూ వినకూదన్నట్లు కంగారుగా….‘‘ఇక్కడే! ఈ మెడికల్‌ షాపులో’’ అన్నాడు హేమేంద్ర మెడికల్‌ షాపు వైపు చూపిస్తూ.

‘‘పోన్లే! జాగ్రత్తగా చేసుకో…. ఏ పనీ లేకుంటే ఏముంది దరిద్రం తప్ప! కాలక్షేపం చేస్తూ వృధాగా కూర్చున్నా కాళ్లు నొప్పులొస్తాయి. ఇదిగో నాలాగ… ఈ నొప్పులు తగ్గించుకోవాలని హాస్పిటల్‌ చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరుగుతున్నా… తగ్గట్లేదు. సర్లే! నా బాధ పక్కన పెట్టు. నువ్వు ఆ చేసే పనేదో నేర్పుగా, నైపుణ్యంగా చేసుకో….’’ అంది. తలవూపాడు హేమేంద్ర.

పక్కనున్నామె అదిపనిగా మూలుగుతుంటే అటు చూశారు ఇద్దరు.

రోగపీడితురాలైన ఆమె తన బాధను అర్థం చేసుకోమన్నట్లుగా చుట్టూ వున్న వాళ్లను చూస్తూ… 

  ‘‘నా దగ్గర డబ్బులు వున్నన్ని రోజులు నా అక్కలు, నా చెల్లెళ్లు, నా తల్లి,దండ్రులు  నన్ను ఒక మాయలో పడేసినట్లు నా చుట్టూ వుండేవాళ్లు.. ఇప్పుడేమో ఒక్కరూ రావటం లేదు.  నాకిప్పుడు డబ్బులు అవసరమని వాళ్లకి తెలుసు….. నాకొచ్చిన రోగం అలాంటిది. ఈ రోగానికి మంచి మందులు కావాలట…. ఆపరేషన్‌ కూడా చెయ్యాలట…. ఏం చెయ్యను? నాకిప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్లు లేరు.  చూసేవాళ్లు లేరు.  వుత్త చేతులతో డాక్టర్‌ దగ్గరకి వస్తే డాక్టర్‌ మాత్రం ఏం చేస్తాడు?’’ అంది. ఆమెలో వున్న వ్యాధి కన్నా, నిస్సహాయతే ఆమెను ముందు చంపేలా వుంది. 

చుట్టూ వింటున్న వాళ్లంతా టి.వి. ముందు కూర్చున్న ప్రేక్షకుల్లా చూస్తున్నారు.  

హేమేంద్రకు మాత్రం ఆమెను చూస్తుంటే ` ఇన్ని రోజులు ఆమె తన దగ్గర వున్న డబ్బును  అపాత్రదానం చేసిందేమో ననిపించింది. ఏ అవసరం ఎప్పుడొస్తుందో, ఏ వ్యాధి ఎప్పుడొస్తుందో తెలియక అనుబంధాల పేరుతోతనకి తనే అన్యాయం చేసుకుందేమో ననిపించింది.  ఇలాంటి వాళ్లను ప్రస్తుతం ఒక్క డబ్బు తప్ప ఏ అనుబంధం కాపాడలేదు…. మనిషికి జీవితంలో డబ్బు ఇంత అవసరమా అన్న దానికి ప్రత్యక్ష సాక్షిలా వుందామె…

హేమేంద్ర ఆమెనే జాలిగా చూస్తూంటే…. ‘‘హేమేంద్రా! సందర్భం జాలిపడేదే అయినా నిజానికి ఆమెను క్షమించకూడదు.  మోసం చేసేవాడి కన్నా మోసపోయేవాడిదే తప్పు….. ఇన్ని రోజులు తన దగ్గరే డబ్బున్నట్టు, తన వాళ్లందరు దరిద్రులైనట్టు, అది పదిమందికి తెలియాలన్నట్లు ఎంతో పదిలంగా కాపాడుకోవలసిన డబ్బును చిల్లర పైసలు పంచినట్లు పంచింది.  తన వాళ్లందర్ని సోమరిపోతుల్ని చేసింది.  తను హాస్పిటల్‌ పాలైంది.  కొన్ని చోట్ల అనుబంధాల పేరుతో జరిగే దోపిడీలో ఇదొకటి…. వాళ్లేమో అక్కడ హాయిగా వున్నారు.  ఈమె ఇక్కడ ఏడుస్తోంది.’’ అంది వున్నది వున్నట్లు చెప్పటం నా తత్వం అన్నట్లు చూస్తూ….

అంతలో పక్కావిడ కల్పించుకొని…

‘‘పాండవులకు సూది మోపినంత స్థలం కూడా ఇవ్వకుండా దుర్మార్గంతో వ్యవహరించి రారాజుగా వెలిగాడు దుర్యోదనుడు. అదెంతసేపు.  ద్రౌపదికి తొడ చూపించి, ఆ తొడలను విరగొట్టించుకొని మృత్యువు పాలయ్యేంతవరకే కదా!  వేదాలు కూడా అదే చెప్పాయి.  మంచి, చెడు వల్లనే కర్మలొస్తాయని…. దాన్ని బట్టి చూస్తే ఆమె  చేసిన మంచి కాని, దానం కాని ఆమెను ఎప్పటికైనా కాపాడతాయి. భయపడాల్సిన పనేలేదు.’’ అంది ధర్మ సూక్ష్మం చెప్తున్నట్లు… ఆమెను చూస్తుంటే రోజూ గుడికెళ్లే దైవభక్తురాలిలా వుంది. గుళ్లో వెలిగే కర్పూరం వాసనే వస్తోంది ఆమె దగ్గర. పంటి నొప్పితో బాధపడ్తున్నట్లుంది. చెంప బాగా వాచివుంది. చెంపను పట్టుకునే మాట్లాడుతోంది. 

‘‘అవునా! గాలిలో వెలిగే దీపం కూడా చేతులు అడ్డుగా పెడితేనే వెలుగుతుందనుకున్నా ఇన్ని రోజులు పిచ్చిదాన్ని…. చేతులు లేకుండా కూడా వెలుగుతుందా? అంటే లోగడ చేసిన దాన ధర్మాలు బ్యాంకు బ్యాలెన్స్‌ల్లాగా   మందుల షాపులో ప్యాకేజిలై రారమ్మని పిలుస్తాయా రోగమొచ్చిననప్పుడు?’’  అంది వ్యంగ్యంగా హేమేంద్రకి తెలిసినావిడ…

 ( ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Comments are closed.