లలిత గీతాలు – 16

కనుమూసి తెరచినా పొరబాటు లేదంటు

కలవరించే హరివిల్లుతో కలల కనకాభిషేకమే

 పాటేది పాడినా వినిపించు నీ నవ్వు

 గాలి తెమ్మెర పైన మనసు చిరు బాలికై ఊగేది ఊయలే 

తలపేది మెదిలినా తనువంత  పులకింత

 వలపు పారిజాతాలెన్ని రాల్చెనో

కాలు మెదిపితె చాలు నును లేత మంచులో

 తడిసి తడిపే  పూరెక్కల ప్రవాహాలు

ఇలపైన నెలవైన ఎలమావి చిగురుపై

 నెలవంక రాగాల తొలి పలుకు గీతాలు

పల్లవించినవేమొ అలమోవి వీణపై

 కలహంస రాగమై తెలి తీపి గానమై

ఊహ చుట్టూ పొదిగి స్నేహ మాధురి పెరిగి

అల్లుకున్నది కదా నిలువెల్ల నీ  ఉనికి

ఎదనిండి పొంగేటి మధుర భావనలోన

తూలి సోలిన  గాలి అలల రెక్కలపైన

పంపనా ఒకసారి ఓ మేలుకొలుపుగా….

– స్వాతీ శ్రీపాద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

లలిత గీతాలుPermalink

Comments are closed.