మహిళా ఉద్యమం (1857 – 1956)

Katyayani                   స్త్రీ ఉద్యోగం విషయంలో ఎల్లా ప్రగడ సీతాకుమారి వ్రాసిన ‘ భార్యలకు జీతాలా? ఇచ్చేవారు భర్తలా? ‘ అనే వ్యాసం అత్యంత ఆసక్తి కరమైంది. స్త్రీలు ఉద్యోగాలలోకి రావటం వలన  అలజడి చెందిన పురుషలోకం స్త్రీలు ఉద్యోగాలకు వెళ్తే ఇల్లు చక్కదిద్దేవారుండని, నౌకరులెందరున్నా భార్యవలె పోషించరని, కనుక స్త్రీలు ఎంత చదువుకొన్నా లలితకళలూ, గృహ నిర్వహణ నేర్చుకొని సర్వవిధాల భర్తను సంతోషపెట్టడానికి ఆవిద్య వినియోగిస్తే భర్తలే భార్యలకు  కొంత జీతం ఇస్తారని వచ్చిన ఒక ప్రతిపాదనపై విమర్శ ఈ వ్యాసం.  భర్త దగ్గర జీతం తీసుకొనే పని ఏమిటి? ఎంతమంది భర్తలకు, భార్యలకు   జీతాలియ్యగలిగిన పరిస్థితివుంది? అనే ప్రశ్నలు వేసి ఉద్యోగం చేసే చోట తగిన వేతనం లేపోయినా  గౌరవం లేకపోయినా ఉద్యోగం వదిలేసే అవకాశం వుంది. కానీ జీతం నచ్చినా నచ్చక పోయినా, గౌరవంగ ఆలిని  చూడకపోయినా హీనం చేసి చూచినా భార్యకు భర్తనుండి విముక్తి లేదు కదా అని తర్కించి భర్తల దగ్గర జీతాలు పుచ్చుకొనటం అనేది మొదలైతే స్త్రీలకు సంసారంలోని బానిసత్వం ఇంకా స్థిరపడుతుంది తప్ప జరిగే మేలేమి లేదంటుంది సీతాకుమారి 

వివాహం,  వరకట్న సమస్యకూడా ఈ థలో చర్చించబడ్డాయి. ఆడపిల్లలకు చదువులు చెప్పించటం, అంతకన్న ఎక్కువ చదువు కొన్న వరుళ్ళను వెతక వలసి రావటం,  కట్నం సమస్య ఇవన్నీ  కలిసి బాల్య వివాహాలే మంచివేమో, ఆడపిల్లలకు చదువు చెప్పించకూడదు అన్న అభివృద్ధి నిరోధక దోరణిని వ్యాపింపచేసే ప్రమాదం కనబడుతున్నదని అహల్యాదేవి ” స్త్రీలు – వివాహ స్వాతంత్య్రం ‘  అనే వ్యాసంలో పేర్కొన్నది. వివాహాలు నిర్ణయించే బాధ్యత యువతీ యువకులకు వదలకపోవటమే అసలుదోషమంటుంది  ఆమె.  స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం వున్నపుడు కులమత భేదాలు లేకుండా యువతీ యువకులు స్వంత బాధ్యతపై వివాహంచేసుకొంటారని ఆ దిశగా  మహిళాసంఘాలు కృషి చేయాలని అన్నది.

వరకట్నం అనాగరికమని, స్త్రీ స్వాతంత్య్రానికి భంగకరమని కొంపల్లి శారదాంబవ్రాస్తే కట్నం పెళ్ళిళ్ళను కాదనగల చైతన్యం యువతీ యువకులలో రావాలని, శారదా బిల్లు వలె వరకట్నం బిల్లు కూడా రావలసివుందని, ఆస్తి హక్కుకూడా ఇందుకు దోహదపడుతుందని కట్నాల బాధను నిర్మూలించటానికి ఆడపిల్లలే పూనుకోవాలని, వారికి ధైర్య సాహసాలు చాలకపోతే సోషలిష్టు సమాజం వచ్చే వరకు సమస్య పరిష్కారానికి వేచి చూడవలసిందేనని లక్ష్మీ రఘురామయ్య అభిప్రాయపడింది. గోపరాజు సీతాదేవి కూడా సమాజంలో పై చేయిగా వున్న కట్నం సమస్యకు స్త్రీలకు ఆస్థిహక్కు ఇయ్యటమే పరిష్కారమన్నది. స్త్రీలకు ఆర్థిక హక్కులిస్తే భూమి ఛిన్నాభిన్నమైపోతుందని వాపోవటం సరికాదంటుంది. స్త్రీకి సహధర్మచారిణి, అర్థాంగి, గృహలక్ష్మి అని బిరుదులిచ్చిన సంఘం వితంతువులు. పరిత్యక్తలు అయిన స్త్రీలకు కనీసం తినడానికి తిండి, కట్టు కోవటానికి బట్ట ఉండేట్టు శ్రద్ధ వహించకపోతే ఎట్లా అని వేదన పడింది. హిందూలాను వీటిని దృష్టిలో పెట్టుకొని సవరించాలన్నది. శాసనసభలలో స్త్రీలకు తగినంత ప్రాధాన్యమియ్యాలని అందుకు తగిన సామర్థ్యం కలిగిన స్త్రీలు లేరని  తోసెయ్యటం సరికాదని అవకాశం వస్తేనే కదా సమర్థతను నిరూపిచుకొనటం అని వాదిస్తూ దువ్వూరి సుబ్బమ్మ పోణాకా కనకమ్మ మొదలైన 18మంది స్త్రీలు కాంగ్రెసుకు ఒక వినతి పత్రం సమర్పించారు.  1949 నవంబరు 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సుమతి, ‘రాజ్యాంగం’ గురించి ఒక వ్యాసం వ్రాసింది. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా రాజ్యం చేసే వారిలో గుణం లేకపోతే పరిపాలన భ్రష్టమవుతుంది ‘ అని ఆనాడే ఆమె హెచ్చరించింది. 

‘ భారతదేశం స్త్రీల సమస్యలు ‘ అనే వ్యాసంలో గవిర్నేని రామతులశమ్మ స్త్రీల నగల వ్యామోహాన్ని విమర్శించింది. స్త్రీలకు ఆస్తిలో హక్కు గురించి వాదించింది. ఆస్తిలో సగభాగం స్త్రీలకు పంచివ్వాలని జవహర్లాల్‌ నెహ్రూ ప్రతిపాదించగా నాయకులు అంగీకరించారు కానీ అదింకా అమలులోకి రాలేదని చెప్తూ స్త్రీలకు ఆస్తి పంపకం అనగానే పొలం ముక్కలవుతందనే విమర్శతో ముందుకు వచ్చేవారి వాదనను ప్రస్తావించి దానిని  పురుషులు పంచుకుంటే మాత్రం ముక్కలుకాదా, స్త్రీలు మాత్రం పురుషుల వలె పుట్టలేదా అన్న ప్రశ్నలతో తిప్పి కొట్టింది.  విద్య, ఆరోగ్యం, వ్యాయామం తదితర అంశాలలో  మరింత చైతన్యవంతులై హక్కులను కాపాడుకొనే దిశగా స్త్రీలు ఎదగాలని ఆమె పిలుపునిచ్చింది.

 పెద్దాడ సరస్వతీదేవి ” నేటి స్త్రీల కర్తవ్యం”  అనే వ్యాసంలో మహిళలు నాలుగు గోడలు దాటి బయటకి రాగలిగినపుడే భారతావనిలో సుప్రభాతం అని చెప్పింది.  స్త్రీలు సమాన అధికారాల కొరకు పురుషులతో పోరాడి అన్ని రంగాలలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చింది. ఆదుర్తి భాస్కరమ్మ స్వాతంత్య్ర సమరంలో పురుషులతో సమంగా స్త్రీలుకూడా ధైర్య స్త్థెర్యాలతో పోరాడారు అని చెప్తూ స్వాంతత్య్రాన్ని సంపాదించటంలో స్త్రీలకెంత బాధ్యత ఉన్నదో దానిని నిలబెట్టటంలో, నడిపించటంలోకూడా అంత భాద్యత ఉంది అని గుర్తుచేెసింది. ‘ స్వతంత్ర భారతదేశంలో  స్త్రీల అభ్యున్నతి’ అనే వ్యాసంలో. స్త్రీలకు పురుషులు చేసే అన్యాయాన్ని గురించే కాక స్త్రీలు స్త్రీల పట్ట అన్యాయంగా ప్రవర్తించే ధోరణిని గురించి కూడా స్త్రీలు  ఆలోచించాలని సూచించింది.. సంకుచితత్వం ఈర్ష్యాసూయలు విడనాడి ఆడపిల్లలను మగపిల్లలతో సమంగా ఆదరగౌరవాలతో పెంచాలని, అల్లుళ్ళను ఆదరించి గౌరవించినట్లే కోడళ్లపట్ల ప్రవర్తించాలి అని,  స్వశక్తి మీద నమ్మకంతో  స్త్రీలు పూర్వస్త్రీల చరిత్రనుండి స్ఫూర్తిని పొంది పనిచేయాలని బోధించింది.

ఈ రకంగా స్వాతంత్రం వచ్చే నాటికి స్త్రీలు తమ ప్రయోజనాలకు, విలువలతో కూడిన జీవితం నిర్మించుకొనటానికి అవసరమైన విద్య, ఆర్థిక స్వతంత్రం, రాజకీయ చైతన్యం, భాగస్వామ్యం మొదలైన వాటిని తమకొరకు తామే నిర్వచించుకోగలిగిన చైతన్యస్థాయికి ఎదిగారు. ఙ| 1950 జనవరి 26న భారతదేశం సర్వసత్తాక గణతంత్రరాజ్యంగా ఆవిర్భవించింది. 1947 ఏప్రిల్‌లో స్త్రీల వివాహ వారసత్య హక్కుల గురించి బియన్‌ రావు కమిటీ కేంద్ర శాసనసభకు సమర్పించిన హిందూ కోడ్‌ బిల్‌ను మహిళా సంఘాల సవరణలు సూచనలు కలుపుకొని 1948 ఆగస్టులో న్యాయ మంత్రిత్వశాఖ తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపట్టింది. కాంగ్రెస్‌లో అతితక్కువమంది దానిని ఆమోదించారు. చాలామంది వ్యతిరేకించారు. భిన్నాభిప్రాయాల మధ్య దానిపై నిర్ణయం తీసుకొనటానికి సందేహించి నెహ్రూ ప్రభుత్వం 1951 సెప్టెంబరు 6న 1952 ఎన్నికల దృష్ట్యా దానిని ఉపసంహరించింది. నెహ్రూతో పాటు ఈ బిల్లును తొందరగా చట్టం చెయ్యాలన్న ఉత్సాహాన్ని ఆసక్తిని కనబరుస్తూ వచ్చిన న్యాయశాఖా మంత్రి అంబేద్కర్‌ అందుకు నిరసన ప్రకటిస్తూ రాజీనామా చేశాడు. స్వాతంత్రం వచ్చే వరకు రాజకీయాలలో చొరవచూపిన స్త్రీలు, స్త్రీ హక్కుల చట్టభద్రత గురించి ఆందోళన పడిన స్త్రీల నుండి దీనికి పెద్ద ప్రతిఘటన రాకపోవటం ఒక విషాదం. బ్రిటిషు ప్రభుత్వం వైదొలగటంతో సామాజిక విప్లవానికి అవరోధం తొలిగిపోతుందన్న నమ్మకంతో వున్న మహిళా సంఘాల నాయకులు ఈ సందర్భంలో ప్రభావవంతమైన ప్రాతినిర్వహించలేక పోవటం అందుకు కారణం. అధికార రాజకీయాల, వ్యూహాల గురించిన అనుభవం పెద్దగా లేకపోవటం దానికి తోడయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర దేశంలో మహిళా ఉద్యమం వాడి వేడి తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్త్రీల ఆస్తిహక్కుల విషయమై, వారసత్వాధికారాల విషయమై లోక్‌సభలో జరుగుతున్న తర్జన భర్జనలను ఆంధ్రదేశంలోని మహిళా సంఘాలు పట్టించుకోలేదన్న విమర్శ వచ్చింది. (ఉత్తర, ఆంధ్రపత్రిక 15-12-54) స్త్రీల ఉద్ధరణకోసం వెలసిన మహిళా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి వరలక్ష్మీ పూజలకు, శిశు పోషణకు పరిమితమైన ఆగిపోతున్నాయని కె. రామలక్ష్మి తిరోగమనవాదుల విజృంభణ అనే వ్యాసంలో (తెలుగు స్వతంత్ర 15-7-1955& 22-7-1955) హెచ్చరించింది. 1956 సెప్టెంబరు గృహలక్ష్మి పత్రిక ఆగస్టులో జరిగిన దుగ్గిరాల మహిళా సమాజపు వార్షికోత్సవం గురించి వ్రాసిన వార్త భజనలు, పురాణకాలక్షేపం ఆ సంఘపు పనులుగా పేర్కొనటం గమనించవచ్చు. అయితే అ సభకు అధ్యక్షత వహించిన రామ సుబ్బమ్మ మాత్రం దేశ రాజ్యాంగంలో స్త్రీలు మరింత ఆసక్తి చూపి తమ పాత్ర నిర్వహించాలని ఉద్భోదించింది. 1952 సాధారణ ఎన్నికలలో విజయం సాధించిన నెహ్రూ అంచెలంచెలుగా హిందూ కోడ్‌ బిల్లులోని ఒక్కొక్క అంశాన్ని చట్టం చేయటానికి పూనుకొన్నాడు. ఆ మేరకు 1954లో ప్రత్యేక వివాహచట్టం, 1955లో హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం వచ్చాయి. ఈ చట్టాలను ఆహ్వానిస్తూనే ఉత్తర, పి. జయప్రదాదేవి స్త్రీ విద్యా వ్యాప్తి జరిగి ఉద్యోగావకాశాలు పెరిగితేనే ఈ చట్టాల అమలు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డాయి. 1955నుండి తెలుగు స్వతంత్ర పత్రిక స్నేహలత అనే శీర్షికను నిర్వహించింది. చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని ఊరికే తిట్టుకుంటూ కూర్చోకండి. ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని, ఎంత చిన్నదైనా సరే వెలిగించండి. అని ఈ శీర్షిక క్రింద బాక్స్‌కట్టి ప్రచురిచారు ఆంధ్ర యువతను సమీకరించటం, వరకట్నం, విడాకులు, వరాంతర వివాహాలు, స్త్రీ విద్య మొదలైన సమస్యలపై అవగాహన పెంచటం, కార్యోన్ముఖులను చేయటం లక్ష్యంగా ఈ శీర్షిక ఏడాదికి పైగా నిర్వహించబడింది. ఊరూరా స్నేహలత సంఘాలు ఏర్పడ్డాయి. అయ్యదేవర కాళేశ్వరరావు వరకట్ననిషేద బిల్లు ప్రవేశపెట్టినందుకు అభినందిస్తూ వరంగల్‌ జిల్లా నరసంపేట నుండి పెండ్యాలగోపాలరావు ఇది సామాజానికి సంబంధించిన పెద్ద సమస్య అని, కేవలం శాసనమే దీనిని నిర్మూలించలేదని, ప్రజలలో నైతిక మార్పు అవసరమని అందుకు స్నేహలత సంఘాలు దేశపు నలుమూలలో ఏర్పడాలని ఆశిస్తూ వ్రాశాడు. (3, ఫిబ్రవరి 1956) విజయవాడలో స్నేహలతకు వరకట్న నిర్మూలనా శాఖ ఒకటి ఏర్పడింది. భీమవరం మహిళా సంఘం కార్యదర్శి పెండ్యాల అనసూయమ్మ స్నేహలతకు సహకారమిచ్చింది. (9 సెప్టంబరు 1955) హనుమకొండ (వరంగల్లు) నుండి తెన్నేటి అహల్యాదేవి కూడా ఈ చర్చలలో చురుకుగా పాల్గొన్నది. అయితే స్నేహలత కేవలం ఒక చర్చా వేదికగా మాత్రమే పనిచేస్తుందన్న సందేహాలు కూడా ఆసందర్భంలో వ్యక్తమైనాయి. అయితే స్త్రీలు వ్యక్తులుగా సమకాలీన సామాజిక సందర్భాలపట్ల స్పందించటం రాజకీయ అభిప్రాయాలను వ్యక్తీకరించటం పూర్తిగా మాయం కాలేదు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటినుండి అనేక పురాతన గ్రంథాలు, పత్రికలు, చదివి, అనేక పట్టణాలు పల్లెలు, నదీతీరాలు, ప్రాజెక్టులు కట్టవలసిన స్థలాలు స్వయంగా పరిశీలించి ఆంధ్రదేశ వనరులను గురించి తెలియజేస్తూ ఆంధ్రరాష్ట్రం సంపాదించుకొనాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ భమిడిపాటి వెంకటరమణమ్మ 1955 మార్చి నాటికి ఆంధ్రరాజ్యలక్ష్మి అనే పుస్తకాన్ని ప్రచురించటం స్త్రీలు ఎంత క్రియాశీలంగా వున్నారో సూచిస్తుంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత ఇన్నాళ్లనుండి ఏమహిళల హక్కులకై బహుముఖంగా ఉద్యమాలు నడిచాయో ఆహక్కులకు చట్టబద్ధత అయితే లభించింది కానీ వాటిని సామాజిక జీవిత సంస్కారంగా మార్చుకొనటానికి అవసరమైన కొత్త మహిళా ఉద్యమ నిర్మాణం జరగవపోవటం వలన స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతునే వున్నాయి.

– ఆచార్య కాత్యాయనీ విద్మహే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~
సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.