మృత్యు పాశాన్ని మచ్చిక చేసుకున్న మాటకారి “సావిత్రి”

             కవిత్రయం మనకందించిన మహాభారతం ప్రతి తెలుగువాడి మనసును విపరీతంగా ఆకట్టు కుంటుంది. ఎంతగా అంటే ఈ భారతకథ మన తెలుగుదేశం నడిబొడ్డున జరిగిందనే భ్రమను కలిగించేటంతగా. సంస్కృత మూలం నుండి సారాంశాన్ని గ్రహించి రకరకాల మార్పులు చేర్పులతో మన తెలుగు వాతావరణానికి అనుకూలంగా కవిత్రయం అనువదించిన ఆంధ్ర మహాభారతాన్ని ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త కావ్యం చదివినట్టే ఉంటుంది.

          ‘ఎండమావిలో నీళ్ళు ఉండవు, స్త్రీ కళ్ళలో నీళ్ళు ఎండవు’ అని ఒక సినీ రచయిత చెప్పినట్లుగా తరతరాలుగా ఒకానొక ప్రాచీనకాలపు దుఃఖం వంటింటి చూరునుండో, స్త్రీకంటి కొసనుండో నిరంతరం స్రవిస్తూనే వచ్చింది. అయితే దీన్ని ప్రాచీన ఋషులు ఏనాడూ విస్మరించలేదు. కప్పిపుచ్చ లేదు. అలాగని ఉన్నదున్నట్లుగా చూపించనూ లేదు. అయితే ఇది సహృదయ సంబంధిత విషయం కనుక ఆ పాత్రలను మనం ఈనాటికీ స్మరించుకుంటూనే ఉన్నాం.

          క్రమంగా కాలం మారుతూ వచ్చింది. దేశకాల సాంఘిక పరిస్థితులను బట్టి అనేక మార్పులు చోటుచేసు కున్నాయి. జాతి జీవనంలో కూడా పెనుమార్పులు సంభవించాయి.  మహాభారతంలో దర్శనమిచ్చే ఎఱ్ఱన గారి సావిత్రి పాత్ర మహోన్నతంగాను, తర్వాత తరాలకు ఆదర్శప్రాయంగానూ నిలిచింది. తాను నమ్మిన సంప్రదాయాలకోసం, సంస్కారాలకోసం యముడితో సైతం పోరాటానికి సిద్ధమైంది. పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి మారుపేరైంది.   

మృత్యువుని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. భయం కౌగిట నిర్భయత్వం, భర్తను పొందాలనే ఆశతోటి ఆరాటం, పురుషుడు చేయలేని పోరాటం, త్యాగగుణం స్త్రీ సొంతం. పైగా మనసున నిలిచిన భర్త మరణశయ్యపై ఉండడం, అంతులేని వేదన… ఇలాంటి సమయంలో జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి?. అదే బాసటగా సమస్త స్త్రీజాతికి ఆదర్శ౦గా నిలిచిన ఒక ఆడపిల్ల తన భర్త ప్రాణాల్ని తిరిగి సంపాదించుకోగలిగింది. భర్తను మృత్యుపాశ విముక్తుణ్ణి చేయించింది. నిజంగా ఇది చరిత్రలో ఒక అద్భుతం. ఇతిహాసంలోని చరిత్ర కూడా. ఈ అద్భుతానికి కారణం ఏమిటి? దాని వెనుక ఉన్న అంతర్గత శక్తులు ఏవి? దాన్ని నేటి జీవితానికి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే శ్రీమదాంధ్ర మహాభారత౦, అరణ్యపర్వం సప్తమాశ్వాసంలోని సావిత్ర్యుపాఖ్యానం చదివి జీవితంలోకి ఆయా విషయాలను అన్వయం (application) చేసుకో వలసిందే.

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలు… ఏ యుగమైనా సరే త్యాగమూర్తులైన మహిళలే శాశ్వతంగా నిలుస్తారు. ఆప్యాయత, అనురాగాన్ని పంచడంలో స్త్రీ తర్వాతి స్థానమే పురుషుడిది. సున్నితమైన మనసు ఉండడానికి కారణం… స్త్రీకి సహజమైన లాలిత్యం, సుకుమారం లాంటివి ఏవైనా కావచ్చు. అంత సున్నితమైన స్త్రీ వ్యక్తిత్వం అవసరమైనప్పుడు ప్రచండశక్తిగా ప్రకోపించ గలదని నిరూపించిన వాళ్ళూ పురాణేతిహాసాల్లో ఉన్నారు. వారిలో సావిత్రిది ఒక అద్భుతమైన కోణం. పాతివ్రత్యంతో, ధర్మబుద్ధితో మృత్యుదేవత వెంట ఒంటరిగా పతికోసం పయనించి యముడిని సైతం నిగ్గదీసి, నిలబెట్టి ధర్మప్రసంగాలు చేసి, మెప్పుపొంది తన భర్త ప్రాణాన్ని బహుమానంగా తిరిగి తెచ్చుకున్న మహా పతివ్రత ‘సావిత్రి’.

మహిళలో అంతర్లీనంగా దాగి ఉన్న నైపుణ్యం ఆమెకు ఆపద వచ్చినప్పటికంటే… తన వాళ్లకు ఆపద వచ్చినప్పుడే త్వరగా బయటపడుతుంది. సావిత్రి సాహసం కూడా అలాంటిదే. ఒక్కతే యముడితో పోరాడింది. అస్త్ర శస్త్రాలతో కాదు, తార్కిక వివేచనతో, యుక్తమైన సంభాషణానైపుణ్యంతో. తద్వారా ధర్మబద్ధంగా విధులు నిర్వర్తిస్తూ, ఖచ్చితత్త్వానికి మారుపేరుగా గుర్తింపు పొందిన యమధర్మరాజును ధర్మసంకటంలో పడేసింది. ఇది ఆమెలో ఉండే ఒక నిపుణత. ఆమె స్త్రీ సహజమైన సహనానికి, త్యాగానికి మారుపేరుగా మాత్రమే నిలిచిపోలేదు, తర్కంతో మనిషిని ఎలా తన దారిలోకి తేవచ్చో సరిగ్గా అలానే వ్యవహరించి గెలిచింది.

ఆమె ఒక ‘మంత్ర స్వరూపిణి’ అనడం కవిత్వీకరణతో కూడిన అంశమే అయినప్పటికీ నిజానికి ఆమె తన శక్తియుక్తులను జీవితానికి అన్వయించుకోగలిగిన విద్యావంతురాలు అని భావించడం నేటి కాలానికి సరిగ్గా సరిపోతుంది. లేకలేక కలిగిన సంతానం పైగా కొడుకు కావాలనుకుంటే స్త్రీ సంతానం లభించింది మద్రదేశానికి అధిపతి అయిన అశ్వపతికి. సావిత్రీదేవిని 18 ఏళ్ళపాటు మిక్కిలినిష్ఠతో ఉపాసన చేయగా కలిగిన వరమే “సావిత్రి”. దానికి ఐశ్వర్యం తోడైంది. సౌందర్యం సహజంగానే ఉంది. సిద్ధ, సాధ్య, యక్ష, అమర (దేవజాతి) కన్యావళిని అతిక్రమించ గలిగిన అందచందాలతో, తేట తెల్లమైన యవ్వనంతో ప్రకాశిస్తున్న సౌందర్యవతియై తండ్రిని ఆలోచనలో పడేసింది. తన కుమార్తెను గుణవయోరూపముల అనుకూలుడైన వరుడికిచ్చి వివాహం చేయదలిచి నీకు ప్రేమ పాత్రుడైన, నచ్చిన వరుడిని, రాజకుమారుడిని వరించమన్నాడు.  

“చిరకీర్తి సాళ్వభూవరు

వరతనయుండయిన సత్యవంతుడు నాకున్

వరుడుగ గోరుదు మదిలో

నరవర! యాతనికి నిమ్ము నను బ్రీతిమెయిన్” (ఆంధ్రమహాభారతం, అరణ్య,7 ఆ, 10 ప)

ఇక్కడ కుమార్తెపై తండ్రికి ఉన్న ప్రేమ, ఆమె ఎవరినైనా వరిస్తే చెప్పమని అడగడంలో ఇచ్చిన స్వేచ్ఛను బట్టి స్పష్టమవుతున్నది. రాజభవనానికి వచ్చిన నారదుడికి, తన తండ్రికి సావిత్రి వందన మాచరించి తనకు తగిన వరుడు సాళ్వరాజైన ద్యుమత్సేనుని కొడుకైన సత్యవంతుడని చెప్పగా అశ్వపతి వారిని గురించిన సమాచారాన్ని సేకరించాడు. ద్యుమత్సేనుడు వయసు రీత్యా గుడ్డివాడయ్యాడని, శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించుకోగా భార్యా పిల్లలతో అరణ్యంలో జీవిస్తున్నాడని చెప్పాడు. నారదుడు సత్యవంతుడికి అన్నీ సుగుణాలు ఉన్నాయనీ కానీ ఒక సంవత్సర కాలంలో అతడు చనిపోతాడని చెప్పాడు. దాంతో తండ్రి తన కూతురు భవిష్యత్తు విషయంలో కాస్త భయపడ్డాడు. ఆ కారణంగా ఇటువంటి వరుడెందుకు? ఇంకొక వరుడిని అన్వేషించడం మంచిదని హెచ్చరించరించాడు. ఈ సందర్భంలో సావిత్రి పుణికి పుచ్చుకున్న మనోనిష్ఠను ఎఱ్ఱనగారు చక్కగా వివరించారు.  

“వినుము మనోవాక్కాయము

లను మూడు తెఱంగులందు నంతఃకరణం

బనఘ! ప్రధానము గావున

మనమున గైకొన్న భర్త మానుట దగునే?” (ఆంధ్రమహాభారతం, అరణ్య,7 ఆ, 14 ప)

మనసులో ఏది అనుకుంటామో దాన్నే చెప్పటం, ఏది చెప్తామో దాన్నే చేయడం త్రికరణశుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి కలిగినవారు తాము కోరుకొన్న దాన్ని పొందగలరు. ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం అనేవి మానవులకు ఎటువంటి కష్టాన్నైనా సహించే శక్తినిస్తాయని నమ్మిన సావిత్రి మనసులో భర్తగా వరించిన వానిని మానటం తగదని నిర్ణయించు కున్నది. తన తండ్రి ఎన్నిచెప్పినా సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో పరివారంతో అరణ్యానికి వెళ్ళి తన కూతుర్ని సత్యవంతుడికిచ్చి వివాహం చేయగా సావిత్రి అరణ్యంలోనే అత్తమామలతో, భర్తతో జీవనాన్ని గడపసాగింది.

అంతలో నారదుడు చెప్పిన సమయం దగ్గరకు రానే వచ్చింది. తల్లిదండ్రుల్ని సేవిస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం అత్తమామల్ని సేవిస్తే వస్తుందని భావించి వారికి తగిన విధంగా సేవలు చేసింది. తద్వారా వారి అనురాగం, ప్రేమను, వాత్సల్యాన్ని పొందింది. అది ఆమెలోని ఓర్పు. నారదమహర్షి మాటమీద గౌరవం, అంతే భయమూనూ. దానికి తగిన పరిష్కారాలు తెల్సుకుంది. ప్రయత్నం ప్రారంభించింది. దానిలోని భాగమే సావిత్రి త్రిరాత్యు పవాస మహావ్రతాన్ని (మూడు రోజుల నిరాహారదీక్ష) పూనుకోవడం. వద్దు అని మామచెప్పినా వినలేదు. అది రోజుల లెక్కలతో కూడిన కాల గమనవేగం. దానికి తగిన సిద్ధతను ఏర్పరుచుకోవడం సావిత్రి సాధన. సుమతి శతకకారుడు చెప్పిన సాధనమున పనులు సమకూరు ధరలోన అనడంలోని వేగం, సాధనలోని శుద్ధి రెండిటితో కూడిన మానసిక పయనం సావిత్రితత్త్వం.

 నాల్గవరోజు పొద్దుపొడవడానికి ముందే నిదురలేచి సమిధలు, దర్భలు, పండ్లు తీసుకు రావడానికి అడవికి బయలుదేరిన సత్యవంతుడితో అరణ్యానికి వెళ్లింది. గొడ్డలితో కొయ్యను నరుకుతున్న సత్యవంతుడికి తీవ్రమైన తలనొప్పి వచ్చి, శరీరం స్వాధీనం తప్పగా గొడ్డలి వదలి సావిత్రి ఒడిలో అలసటతో శయనించాడు. సావిత్రి తన అంకతలాన్ని భర్తకు తలగడగా చేసింది. రాజ కుమారుడైన సత్యవంతుడు నెమ్మదిగా వివశత్వం పొంది చైతన్యం లేని వాడిగా ఉండిపోయాడు. కొంత సేపటికి ఎదురుగా కాలుడు ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజు లెక్కల ప్రకారం సావిత్ర భర్త సత్యవంతుడికి జీవితకాలం పూర్తయింది. విధ్యుక్తధర్మాన్ని అనుసరించి సత్యవంతుడి ప్రాణాలను తీసుకెళ్లడానికి స్వయంగా భూలోకానికి వచ్చాడు.

భయం కొండంత. ధైర్యం పిసరంత. బాధల బంధిఖానా. అలాంటి సమయంలో వాతావరణం అలాగే కనిపిస్తుంది. అప్పుడే చూసింది యముడి ఆకారం. అంతే భయంకరంగా కనిపించినట్లుగా మత్తేభవృత్తం-

“కనియెం గోమలి నీలమేఘవిలసత్కాలాంజనాకారు, ఘో

రనిశాతోత్కట ద్ర౦ష్టృ, నుజ్వల చలద్రక్తాక్షు, బ్రత్యగ్ర కాం

చనవర్ణాంబరు, నంత్యకాలదహన జ్వాలాప్రచండున్, జగ

జ్జనసంత్రాసను, నొక్క దివ్యు, పటుపాశ ప్రౌఢ హస్తోద్ధతున్.” (ఆంధ్రమహాభారతం, అరణ్య,7 ఆ, 48 ప)

నల్లని మబ్బువలె శోభిల్లే నల్లని కాటుకవంటి ఆకారం కలవాడు, భయంకరమైన, వెలుపలికి వ్యాపించిన వాడియైన కోరలు గలవాడు, నెత్తురు రంగు కలిగి మిలమిలమెరసే నేత్రాలు కలవాడు, తళతళలాడే బంగారు రంగుతో వెలుగొందే బట్టలు ధరించినవాడు, ప్రళయకాలంలోని అగ్నిజ్వాల వలె మండే వాడు, లోకంలోని జనులకు భీతిని కలిగించేవాడు, గొప్పపాశాయుధాన్ని ఒడుపుగా త్రిప్పే నేర్పుగల హస్తం చేత గర్వించిన వాడైన యముడిని సావిత్రి గుర్తించింది. తనకంటే ఉన్నతుడిగా గుర్తించింది. ధైర్యాన్ని తెచ్చుకుని పాదాభివందనం చేయగలిగింది.

ఆ నమస్కారం ఎదుటివారికి సంస్కారాన్ని గుర్తుచేసింది. సావిత్రీ! నీవు పతివ్రత అవడంవల్ల నీకీ దర్శన మిచ్చాను అంటూ అసలు విషయాన్ని యముడు చెప్పేశాడు. నీ పతి ప్రాణాలు తీసుకొని వెళ్లడానికే వచ్చానని పాశాన్ని విసిరి అతడి ఆత్మను బంధించి తీసుకెళ్తున్నాడు. అప్పుడు సావిత్రి దీనతను ధైర్యాన్ని విడకుండానే ఆశ్రయించింది. తన భర్త ప్రాణాలను తీసుకుపోవద్దని వేడుకుంది. కానేకాదంటూ… తన విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించడంలో అడ్డుతగలవద్దని అన్నాడు యముడు. అతడు మాటలాడడంతో మరింత ధైర్యాన్ని తెచ్చుకుంది. అక్కడ అప్పుడు ఉండే కఠినమైన మాటల వాతావరణాన్ని సున్నితంగా మార్చడానికి తగిన విధంగా మరో మాటల బాణాన్ని వాడింది. చివరి వరకు తన ప్రయత్నం వాడలేదు. ఉత్తములు విఘ్ననిహన్యమానులై ప్రవర్తిస్తారు అనే ఉత్తమతత్త్వాన్ని ఆశ్రయించి దాన్ని అప్పటికి  అనువర్తింప జేసుకుంది.

          “ఎడపక వాఙ్మనః క్రియల నేరికి హింస యొనర్పబూన రె

          య్యెడలను దీనులం గరుణ యేర్పడ బ్రోవగ జూతురిచ్చుచో

          గడమవడంగ నీకెదిరి కాంక్షితముల్ దుదిముట్ట దీర్తు రె

          క్కుడు మది కూర్తురాశ్రితులకున్ వినుమిన్నియునార్యధర్మముల్!” (ఆంధ్రమహాభారతం, అరణ్య, 7ఆ, 59 ప)

          అంటూ         అమాయకంగా తన తెలివిలేనితనాన్ని వెళ్ళబుచ్చుకుంది. ఆమె అడిగే విధానం యముడిని ఆపగలిగింది లేదా కాస్త వినేలా చేసింది. తెలియని విషయాన్ని అడుగుతున్నట్లు అనిపించింది యముడికి. తెలపడం తన బాధ్యత అనుకున్నాడు యముడు ఇలా మాటలు పెరిగాయి. సావిత్రి యముడిద్వారా ఆర్యధర్మాలన్నీ తెలుసుకుంది. అవే మాటల్ని తెలివిగా అతని మీదకే వచ్చేలా చేసింది. మనోవాక్కాయ కర్మలతో ఎవరికీ హింస చేయనివాడు, దీనులను కరుణతో చూసేవాడు, ఇచ్చేటప్పుడు కొంత ఇచ్చి వెనక్కిలాగని వాడు, ఆశ్రితులను సంపూర్ణంగా పాలించేవాడు ఆర్యుడు. ఇది ఆర్యధర్మం. ఈ లక్షణాలున్న వారంతా ఆర్యులే. ఈ మాటలు చెప్పి “మనం ఆర్యులం” అనడంలో యముడి అహంకారాన్ని సంతృప్తి పరచడమే కాదు, ఇప్పుడు దీనురాలైన తనపై జాలి చూపించాలని, కొంత ఇచ్చి వెనక్కులాగే ప్రయత్నం చేయకూడదని, అలా చేస్తే యముడు ఆర్యుడు కాదనీ చెప్పకనే చెప్పింది సావిత్రి.

చక్కని సందర్భశుద్ధి కలిగిన, పాపాలను పారద్రోలే సావిత్రి మాటలు దప్పికతో ఉన్నవాడికి చల్లని మంచి నీళ్ళు సంతోషభరితుడ్ని చేసేతీరుగా యమధర్మరాజుని సంతృప్తి పరచాయి. ఆమె సంధించిన సందేహాల్లోని సునిశితత్త్వానికి, సౌజన్యపూరితమైన మాటతీరుకు యముడు ఆశ్చర్య పోయాడు. యమ ధర్మరాజు ఆమెను నీపతి ప్రాణందక్క ఇతరమే మైనా కోరుకోమనగా ఆమె తన మామ గారికి అంధత్వము పోయి రాజ్యలాభము కలుగవలెనని, తన తండ్రికి నూరుగురు పుత్రులు కలుగవలెనని వరమడిగింది. యముడు ఆ వరాలను తీర్చాడు.

చాలా దూరం నన్ను వెంబడించి బాగా అలసిపోయావు ఇక వెనుకకి తిరగడం మంచిదని హితవు పలికిన యమధర్మరాజుతో ఆమె తన మనసు భర్తపాదపద్మాలయందే ఆసక్తి కలిగి మిక్కిలి పూజ్యభావంతో శోభిల్లుతున్నది. ఎన్ని వరాలు లభించినా పతివ్రతలకు భర్తను ఆశ్రయించి ఉండటంతో సరిపోలవు కదా! సతికి ఏకైక ధర్మం భర్తృసంశ్రయమే అని చెబుతూ ముందుకు కొనసాగింది. సావిత్రి యముడితో అన్న ఈ మాటలు ఎదుటివాడు మనకు వ్యతిరేకంగా ఉన్నా, మాట నేర్పుతో ముందరి కాళ్ళకి బంధం వేసి పనులు సాధించే నేర్పరితనాన్ని నేర్పుతాయి. తన భర్త ప్రాణాన్ని కొనిపోతున్న యముడిని మాటలతో బోల్తా కొట్టించి తాననుకున్న కార్యాన్ని సాధించింది. యముడు తన కర్తవ్యం నిర్వ హిస్తున్నాడు. కానీ దానివల్ల వల్ల తనకు నష్టం కలుగుతోంది. పైగా తీసుకున్న ప్రాణాన్ని తిరిగి ఇవ్వడం యమధర్మం కాదు. కానీ సావిత్రికి ఆమె భర్త ప్రాణం కావాలి. అంటే యముడితో అధర్మమైన పని చేయించాలి. ఈ పనికి నడుంకట్టిన సావిత్రి తన తెలివి తేటలను ఉపయోగించింది.

          నా భర్త ప్రాణం నాకియ్యి, నువ్వెవరవు దాన్ని తీసుకోడానికి అంటూ యుద్ధానికి దిగలేదు. అయ్యో నా భర్త లేకుండా నేను బ్రతకలేను అంటూ ఏడ్చి, పెడబొబ్బలు పెట్టి యముణ్ణి కరిగించాలనీ అతని కనికరం కోసం ప్రయత్నించ లేదు. అలాగని యముడితో వాగ్యుద్ధానికి కూడా దిగనూ లేదు. ఇందులో ఏది చేసినా ఆమె తన ప్రయత్నంలో తప్పక  విఫలమయ్యేది. ఆమె ఎఱుకగలవారి చరితలు తెలుసుకుంది. సజ్జనసాంగత్యంలో గడిపింది. మంచి విచక్షణ, విజ్ఞానాలు కలది కాబట్టే యముడితో వాగ్యుద్ధానికి దిగి, అతడిని చీకాకు పరచకుండా

          “ ఏడు మాటలాడినయంత నెట్టివారు

          నార్యజనులకు జూట్టంబులగుదురనిన

          చిరసమాలాప సంసిద్ధి చేసి నీకు

          నేను జుట్టమనియు వేఱ యేల చెప్ప” (ఆంధ్రమహాభారతం, అరణ్య,7 ఆ, 77 ప)

          ‘సఖ్యం సాప్తపదీనాం” అంటారు. అంటే కలిసి ఏడడుగులు వేసినా, ఏడు మాటలు మాట్లాడినా సత్పురుషులు ఒకరి కొకరు మిత్రులవుతారట. “Birds of the same feather flock together” అని ఇంగ్లీషులో ఒక సామెత కూడా ఉంది. “ఏడు మాటలాడితేనే చుట్టాలవుతారు కదా, మనమింత సేపు మాట్లాడాము చుట్టాలమెందుకు కామని ప్రశ్నించింది. పైగా ఆర్యజనులకు అని వాడటంతో తానూ గౌరవనీయురాలే అని, యముడితో సమానస్థాయి కలదనీ, కాబట్టి బంధువు అయ్యే అర్హత ఉందని చెప్పకనే చెప్పింది. అంటే తాను పరమయోగ్యురాలు కాబట్టే యముడిని చుట్టంగా భావిస్తున్నట్లుగా తెలియపరిచింది.

          ఇలా సావిత్రి తన పతిప్రాణాల కోసం పోరాడుతోంది. యముడు తన ధర్మాన్ని నిలుపుకుంటు న్నాడు. మనకు సన్నిహితులను మనం ఏమైనా అడగవచ్చు. అవతలి వాడెంత కఠిన మనస్కుడైనా మనకు బంధువైనట్లైతే మనకు కావాలసింది అతడిని అడిగే చనువు మనకు ఉంటుంది. ఈ ఒక్క పద్యంతో సావిత్రి ఆ చనువు సంపాదించింది. ఏడు మాటలాడితేనే సత్పురుషులు బంధువులైతే, ఇన్ని మాటలు మాట్లాడినవారు బంధువులైనట్టే కదా! తిరుగులేని వాదం ఇది. అందుకే తనకోసం ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తించమని యముడిని కోరబోతోంది సావిత్రి.

          అంటే మనమనుకున్న కార్యాన్ని సాధించాలంటే ముందుగా మనకు ఎవరితో పని ఉందో వారి మనస్తత్వాన్ని పరిశీలించాలి. వారు మనకు సుముఖంగా ఉంటే పరవాలేదు. వ్యతిరేకంగా ఉంటే ముందుగా వారి అహంకారాన్ని సంతృప్తి పరచాలి. ఆ సంతృప్తి పరచటంలో మన ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదు. సావిత్రి యముడికి ఆర్యధర్మాలు చెప్పింది. నువ్వు ఆర్యుడవని ఒప్పుకోవాలంటే ఆ ధర్మాలను నువ్వు పాటిస్తున్నావని నిరూపించమంది. ఇదంతా వాదంలా కాక ఇద్దరు సన్నిహితుల నడుమ జరిగే సంభాషణలా జరిగింది. అందుకే సావిత్రి యముడి అహంకారాన్ని సంతృప్తి పరచటమే కాదు, అతడితో బంధుత్వాన్ని నెరపి, అతనితో చేయకూడని పనిని కూడా చేయించింది. విజయం సాధించింది.

          సావిత్రి యముడితో వాగ్యుద్ధానికి దిగకపోవడానికి “అనువు గాని చోట అధికులమనరాదన్న విచక్షణయే కారణం”. ఎందుకంటే యముడు అధికారిలాంటివాడు. సావిత్రి తన భర్త ప్రాణాలను అభ్యర్ధిస్తున్నది కాబట్టి యముడి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండాలి. తన కార్యాన్ని(లక్ష్యాన్ని) సాధించాలంటే అధికారిలోని దయాదాక్షిణ్యాల భావనను జాగృతం చేయాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఒక దిగువ స్థాయి ప్రభుత్వ కార్యాలయంలో పని సాధించటం దగ్గర నుంచి అంతర్జాతీయం గానైనా, అనుకున్నది పొందాలంటే ఇదే మార్గం. అంటే విజ్ఞానం, విచక్షణ సత్సాంగత్యం, పట్టుదల, నిజాయితీలకు మంచిమాట అనేది కూడా తోడవాలన్న మాట. ఇందులో ఏ ఒక్క అంశం లోపించినా వికాసం సంపూర్ణం కాదు. ఈ విషయాన్నే

“సత్యం బ్రూయాత్ ప్రియమ్ బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం,

          ప్రియం చ నానృతం బ్రూయాత్, ఏషః ధర్మః సనాతనః” అని చెప్పారు పెద్దలు.

సత్యం చెప్పాలి. అది ప్రియంగా చెప్పాలి. ప్రియమైన సత్యం చెప్పాలి. అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు. అలాగని ప్రియమైందని అబద్ధం చెప్పకూడదు. యముడిని నువ్వు హంతకుడివి. ప్రాణాలు దొంగిలించేవాడివి అన కూడదు, అవి నిజాలే అయినా అవి అతని అహంకారాన్ని దెబ్బ తీస్తాయి. మొదటికే మోసం వస్తుంది. అందుకే సావిత్రి ప్రియమైన సత్యాలు ఆర్యధర్మాలు చెప్పి, నువ్వు ఆర్యుడివి అన్న నిజం చెప్పి తన కార్యాన్ని సాధించింది. వయసులో చిన్నదైనప్పటికీ సావిత్రి ధర్మబుద్ధికి, పాతివ్రత్యానికి మెచ్చుకుని ఆమె భర్తను తిరిగి జీవింపచేసి యమధర్మరాజు తన లోకానికి వెళ్ళాడు.

ఈ సంఘటన సావిత్రి తార్కికశక్తి, మేధోవికాసానికి మాత్రమే కాక యముడి ఔన్నత్యానికి కూడా ప్రతీక. ఈ వాదంలో తాను ఓడిపోయానని యముడు అవమానంగా భావించలేదు. అలాగని అనవసరంగా వరాన్ని ప్రసాదించానని కలత చెందనూ లేదు. ధర్మసూక్ష్మాలు తెలిసిన సమఉజ్జీతో సంభాషించగలిగానని సంతోషించాడు. తాను వాదనలో ఓడినప్పటికీ ఒక స్త్రీ భర్తను కాపాడుకోవడం కోసం చేసిన సాహసాన్ని మనసారా మెచ్చుకున్నాడు. జీవించినంత కాలం సంతోషంగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు. దానితో సావిత్రి భర్తతో సహా స్వగృహానికి చేరింది. జరిగిన విషయాలు భర్తకి, అత్త మామలకు వివరించింది. అశ్వపతికి నూరుగురు పుత్రులు పుట్టారు. ద్యుమత్సేన దంపతులకు చూపు వచ్చింది. ఆ వెంటనే దాయాదులాక్రమించిన రాజ్యం కూడా తిరిగి చేతికి వచ్చింది.

          మామూలుగా సామాన్యులకు యముడు కనిపించడు. యముడ్ని చూసి, ఆయనతో ధర్మ ప్రసంగములు చేసి మెప్పుపొంది తన భర్తను బహుమానంగా తిరిగి తెచ్చుకున్న సావిత్రి కారణ జన్మురాలు. బ్రతుకు పోరాటంలో కష్టం నుంచి ఏనాడూ పారిపోని సావిత్రి ధీరవనిత.  కాబట్టి నేటితరం స్త్రీలు (స్త్ర్రీ పురుషులిరువురూ) వారి నిత్యజీవితంలో చిన్న పనుల నుంచి పెద్దపనుల వరకూ సాధించటంలో ఆదర్శంగా తీసుకొని పట్టుదల, కష్టాల్ని ఎదిరించగల మనో బలం, ఆత్మవిశ్వాసాలను పెంపొందించుకోవాలి. ఒక్క సావిత్రి మాత్రమే కాదు. పురాణ, ఇతిహాసాల్లో స్త్రీలను గుర్తు చేసుకుంటే… వారు తమ కోసం బతికింది తక్కువ. తమ వాళ్ల కోసం పడిన కష్టాలే ఎక్కువ.

 – పి.వి.లక్ష్మణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

                                               

సాహిత్య వ్యాసాలు ​Permalink

One Response to మృత్యు పాశాన్ని మచ్చిక చేసుకున్న మాటకారి “సావిత్రి”

Leave a Reply to రవి తేజ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో