నా కళ్లతో అమెరికా-32

వాషింగ్టన్ డీసీ  – నయాగరా -1

డీ.సీ నించి ఉదయానే యధావిధిగా తెల్లారుతూనే బయలుదేరేం.

Dr.K.Geethaఆ రోజు 400 మైళ్లకు పైగా సుగీర్ఘంగా ప్రయాణించి రాత్రికి నయాగరా చేరాల్సి ఉంది. మధ్యలో రెండు చోట్ల చూడాల్సిన విశేషాల దగ్గరా, మధ్యాహ్న భోజనానికీ మాత్రమే ఆగుతామనీ చెప్పేడు గైడు. మేం వాషింగ్టన్ డీసీ నించి పెన్సిల్వేనియా, న్యూయార్క్ స్టేట్స్ గుండా ప్రయాణం సాగించాం. ఉదయానే ఆహ్లాదపు శీతాకాల ఆకాశం లో రానా,వద్దా అన్నట్లు దోబూచులాడుతున్న లేలేత మబ్బు చాటు సూర్య కిరణాల వెలుగులో ఎక్కడో కనిపించే  వ్యవసాయ క్షేత్రాల్ని , ఏ మూల చూసినా ఒక్కలాగే కనిపించే ఊళ్లనీ దాటుకుంటూ ప్రయాణం సాగించాం. దారిలో నేనొక తమాషా ఫోటో తీసాను. మా పక్క నుంచి వెళుతున్న ట్రక్కు మీద పొడవుగా పెయింట్ చేసి ఉన్న చికెన్ ఎడ్వర్ టైజ్ మెంట్  అది. ఆ తర్వాత  ఆ ఫోటో చూపించి నేనది ఎక్కడ తీసానో చెప్పమంటే ఎవరూ చెప్పుకోలేక పోయారు.

దారి పొడవునా శుభ్రంగా నిద్రపోతూ గడిపారు పిల్లలు. బాగా లాంగ్ జర్నీ కావడం వల్ల నాకూ అదే పనిగా నిద్ర వచ్చేది. కానీ బయట అన్నీ చూడాలన్న తపన మెలకువగా ఉంచేది.  ఆ రోజంతా మబ్బు పట్టినందువల్ల రోజంతా తెల్లారగట్ల ప్రయాణం చేస్తున్నట్టే సన్నని వెలుతురుగా ఉంది. మేం తిరిగొచ్చేసిన వారం రోజుల్లోనే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఎప్పుడూ లేనంత మంచు తుఫాను పట్టుకుని అంతా మంచు మయమై పోయిందని వార్తల్లో చూసి “హమ్మయ్య” మేం తప్పించుకున్నాం అని అనుకున్నాం. ఆ రోజు ప్రయాణం లో అక్కడక్కడా సన్నని జల్లు అప్పుడప్పుడూ కురిసిందంతే.

హర్షీస్ చాకొలేట్ ఫాక్టరీ: మొదటి స్టాపు హర్షీస్ చాకొలేట్ ఫాక్టరీ అనగానే పిల్లలు ముఖ్యంగా వరు ఎగిరి గెంతేసింది. మామూలుగానే చాక్లొట్లంటే ఆ పిల్లకు మహా ప్రాణం. ఇక ఏకంగా చాకొలేట్ ఫాక్టరీని చూడడం ఒక గొప్ప అనుభూతి కదూ!

ఫాక్టరీ లో ముందు భాగమంతా  పెద్ద గిఫ్ట్ షాపు, పిల్లల ఇండోర్ ఆట ప్రదేశాలు ఉన్నాయి. ఒక పక్కగా ఉన్న ఫాక్టరీ టూర్ లైనులో ముందుకు వెళ్లాం. లోపలికి నడిచే వెళ్లే దారి అంతా దట్టమైన అరణ్యంలో, కోకో చెట్ల మధ్య నడుస్తున్న భ్రాంతి కలిగేలా చీకటి, సన్నని వెలుతురు, గోడలకు చెట్ల పెయింటింగ్ లు, పైన వేళ్లాడదీసిన చెట్ల కొమ్మలతో మొత్తం సెట్టింగ్ బానే అమర్చారు.  మేం డిస్నీలాండ్ లో ఎక్కిన లాంటి ఇండోర్ పెట్టెల రైలు వంటివి వరసగా పెట్టెకు నలుగురు చొప్పున ఎక్కించుకుంటుంది. మా కంటే వరు ముందుగానూ, కోమల్ వెనక గానూ ఉండడం వల్ల అంతా తలో పెట్టెలోకి ఎక్కాం. వరసగా పాల ఉత్పత్తి నుంచి, కోకో దిగుమతి నించి చాకొలేట్లు తయారీ వరకు అంతా నమూనా డిస్ప్లే లతో  టూర్ ఏర్పాటు చేసారు. కాకాపోతే లైట్లు, బొమ్మలూ హడావిడి బానే ఉన్నాయి. అయితే అసలు నిజం ఫాక్టరీ అన్నది చూడనేలేదు. దాంతో వరు బాగా నిరాశ పడింది. కాలిఫోర్నియా లో ఇంతకు ముందు జెల్లీ బీన్ చాక్లేట్ ఫాక్టరీకి వెళ్లినపుడు నిజంగా వాళ్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్లని చూపించేరు వాళ్లు.

ఇక్కడలాంటిదేమీ ఉన్నట్లు లేదు. బయటికొచ్చేక మరి కాస్సేపు సమయం ఉండడంతో గిఫ్ట్ షాప్ లో తలా ఒక గిఫ్ట్ ఐటం కొనుక్కున్నారు పిల్లలు. దాంతో  పాటూ సంచీ నిండా చాకొలేట్లు కొనడమూ తప్పలేదు.

 

లిటిల్ స్టాట్యూ ఆఫ్  లిబర్టీ:  అక్కడి నుంచి రూట్ 322 మీద నించి వెళ్లే దారిలో సుస్కెహన్నా నది మీద డాఫిన్ నేరోస్ లో చిన్న సైజు స్టాట్యూ ఆఫ్  లిబర్టీ ని  నదీ జలాల మధ్య చూపించేడు మా గైడు.

పాత కాలపు రైలు బ్రిడ్జి అవశేషపు స్తంభంమీద నిజానికి 25 అడుగుల పొడవున్న ఈ విగ్రహం దూరం  నించి చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

మహోధృతంగా ప్రవహిస్తున్న నదీ జలాల మధ్య నిబ్బరంగా నిలబడ్డ విగ్రహం చూడడానికి చాలా బావుంటుంది. దీనిని అసలు స్టాట్యూ ఆఫ్  లిబర్టీ కి ప్రతీకగా ఇక్కడ స్థానికులు నిల్పుకున్నారట.

మధ్యాహ్న భోజనానికి ఒక సూపర్ మార్కెట్ లాంటి చోట్ల ఆపేరు మా బస్సు వాళ్లు. అక్కడ బఫె లాంటి భోజన సదుపాయమూ ఉంది. అన్ని ప్రధాన దేశపు వంటకాలు రెండో, మూడో చొప్పున అక్కడ ఉన్నాయి. అందులో ఇండియన్ అని రాసి ఉన్న చోట  వెజిటేరియన్ మాత్రమే ఉన్నాయి. మన రోటీ, చనా కర్రీ రుచిగా లేకపోయినా ఆత్రంగా తిన్నాం. చైనీస్ ఐటెంస్ నాలుగైదు ఉన్నాయి. ఇక ఇటాలియన్ పాస్తా,  ఫ్రెంచ్ బ్రెడ్, ఈ దేశపు మాంస విశేషాలూ ఉన్నాయి. ఐటెంస్ ప్రకారం రేట్లు కావడం వల్ల ఎవరు ఏం తింటారో పద్ధతిగా కొనుక్కునే వీలు కలిగింది. దూర ప్రయాణాల్లో పిల్లలు తినేవీ, తిననివీ తెగ కొనిపిస్తారు. అందుకే నేను వీళ్లకు ఏం కొనుక్కున్నా ఇచ్చిన సమయంలో పూర్తిగా తినాలనీ, బస్సులోకి ఏవీ తెచ్చుకొకూడదనీ రూల్ పెట్టాను. ఒక వేళ అలా తినలేక పోతే వాళ్లకు మరుసటి పూట ఎంచుకునే అవకాశం ఉండదు. పెద్దవాళ్లు ఏం కొనిస్తే అదే తినాలన్న మాట. కోమల్ పెద్దవాడై పోయి చిరు మందహాసం చేసినా, వరు మాత్రం “ఆ రూల్ పెద్దవాళ్లకు, సిరికీ  కూడా పెట్టాలని పేచీ పెట్టింది. అదీగాక “ప్రయాణాల్లో రూల్స్ ఉండవు, ఇంట్లోనే” అని మరో తిరుగుబాటూ. అయితే ఐసుక్రీముల వంటివి, పళ్లు, చాకొలెట్లు వంటి స్థానికంగా విశేష  పదార్థాలూ దగ్గిర ఏ రూల్సూ లేవనే సరికి సంతోషంగా తలూపింది.

ఇక తర్వాతి మా ప్రయాణమంతా మంచి ఆహ్లాదంగా గడిచింది. ఎత్తైన ప్రదేశానికి ప్రయాణిస్తున్నామన్న గుర్తుగా డిసెంబరు మొదటి వారంలోనే మాకు దారి పొడవునా మంచు కనిపించడం మొదలు పెట్టింది.  ఒక చోట పై నించి చిన్న రోడ్డు బ్రిడ్జికి మంచు కత్తులుగా వేళ్లాడుతూ కనిపించింది. పిల్లలు అటు చూడమని గట్టిగా  అరిచారు. బస్సులోని వాళ్లంతా ఆ అరుపులకి మా వైపు విచిత్రంగా చూసేరు.

కార్నింగ్ గ్లాస్ ఫాక్టరీ: మధ్యాహ్నం  3 గంటల వేళ న్యూయార్క్ స్టేట్ లోని లో “కార్నింగ్ గ్లాస్ ఫాక్టరీ” దగ్గిర మా బస్సును ఆపారు.

మ్యూజియం దగ్గిర ఆగగానే ముందు మమ్మల్ని బాగా ఆకర్షించినది  బయట కుప్పలు తెప్పలుగా ఉన్న మంచు.

మ్యూజియం లోపలికి వెళ్లడానికి ముందే మంచులో చతికిలబడి ఆడుకుంటామని పిల్లలు పేచీ మొదలు పెట్టారు. కాని అందరితో కలిసి వెళ్ళి, రావాల్సి ఉండడం వల్ల ముందు లోపలికి అందర్నీ తీసుకు వెళ్లేం. సిరిని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్లవలిసి వచ్చింది. చెయ్యి వదిలితే మంచులోకి పరుగెత్తేది.

ఇక మా అంతట మమ్మల్ని తిరిగి చూడమని మా గైడు వదిలెయ్యడం వల్ల ముందు ఎటు వెళ్లాలో సరిగా అర్థం కాలేదు.

గాజు బల్బులు తయారు చేసే చిన్న ఎగ్జిబిషన్ కి  టిక్కెట్లు ఇచ్చేడు గైడు. అదెక్కడ జరుగుతూందో వెతుక్కుంటూ వెళ్లే సరికి అన్ని సీట్లూ నిండి పోయాయి. చివరన నిలబడి చూసేం. మండుతున్న విద్యుతాధారిత కొలుముల్లో ఎర్రగా కరిగిన గాజు ద్రావకాన్ని వేడి చల్లారక ముండే అతి నైపుణ్యంగా ఊది గాజు బల్బులు, పాత్రలు వంటి విశేషాల్ని తయారు చేసి చూపించేరు ఇద్దరు నిపుణులు. ఆ రోజు అక్కడ హాజరైన వారికిచ్చిన టిక్కెట్లలో ఒకరిద్దరికి లాటరీ తీసి తయారుచేసిన గాజు పాత్రల్ని బహూకరించేరు. మ్యూజియం లో దేశ విదేశాల లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో అపురూప గాజు కళా ఖండాలు ఉన్నాయి. నాకు భలే నచ్చిందా ప్రదేశం. అద్భుతమైన రంగులు, చక్కని పనితనం. ఎంత చూసినా తనివి తీరని అద్వితీయమైన అందం. అసలే గాజు అభిమానినైన నేను అక్కడి నుంచి వచ్చేటపుడు తప్పనిసరిగా కొన్ని చిన్న గాజు వస్తువుల్ని కొని తెచ్చుకున్నాను. ప్రయాణం లో పొడవునా ఎయిర్ పోర్టుల్లో అవన్నీ విప్పి చూసి, మరలా సర్డుకోమనేవారు. అదొక్కటి మాత్రం బాగా ఇబ్బందికరం అయ్యింది.

మ్యూజియం బయటికి అందరికంటే ముందే వచ్చి కనీసం అయిదు నిమిషాలు  పిల్లలని  ఆ మంచు లో ఆడుకోనిద్దామని త్వరగా రావాల్సి వచ్చింది. మంచు ఒకళ్ల మీద మరొకళ్లు  విసురుకుంటూ పిల్లల ఆనందం చూసినప్పుడల్లా ప్రపంచంలో ఇంత కంటే గొప్ప ఆనందం ఉందా ! అనిపిస్తుంది. అది పిల్లలుగా మాత్రమే అనుభవించగలిగిన ఆనందం. కేరింతలు కొట్టే చిన్నారులతో సమానంగా నేనూ ఉరకలు వేసినా  “అమ్మని నేను” అని  అయిదు నిమిషాల్లో గుర్తుకొచ్చేస్తుంది.

అక్కడి నుంచి బయలుదేరేసరికి చీకటి కమ్ముకుంది. దాదాపు 9 గంటల వేళ నయాగారా చేరుకున్నాం. హోటళ్లలో దిగడానికి  ముందే భోజనాలు ఆ సమయంలో బయటెక్కడా  దొరకవు, పైగా అక్కడేదో స్థానిక కళాకారుల  ఫెస్టివల్ అవుతోందని మమ్మల్ని ముందుగా “నేటివ్ సెంటర్ ” కు  తీసుకెళ్ళారు.

(మిగతా తర్వాతి భాగంలో)

 

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో