నా జీవనయానం లో ఆరవతరగతి లో .- 3

 

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

నేను స్కూల్లో చేరిన రెండు నెలలకి హెడ్మా స్టారి నుంచి ఒక నోటీసొచ్చింది . ఆడ పిల్లలందర్నీ ఆఫీసు రూమ్ దగ్గరకి రమ్మని అందరం వెళ్లి గుంపుగా నిలబడ్డాం . హెడ్మాస్టరు పూర్ణయ్యగారు బైటికొచ్చి “ ఈ సంవత్సరం నుంచీ ఆడపిల్లలకి ఫీజు రద్దు చెయ్యబడింది . ఇక మీద మీరంతా ఉచితంగా ఎనిమిదివ తరగతి వరకూ చదువుకో వచ్చు . ఫె యి లైన వాళ్లు మాత్రం ఫీజు కట్టి చదువుకోవల్సి ఉంటుంది . అందుకని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ జాగ్రత్తగా చదువుకోండి “ అని ఓ చిన్న ఉపన్యాసం ఇచ్చేరు . గుమాస్తా గారు ఒక్కొక్క ళ్లకీ మూడేసి రూపాయిలు చేతిలో పెట్టి “ ఈ రెండు నెల్లకీ కట్టిన ఫీజు తిరిగి ఇచ్చే స్తున్నాం .పట్టు కెళ్లి ఇంట్లో ఇచ్చే య్యండి “ అన్నారు . నాకప్పుడర్ద మైంది , నెలకి ఫీజు రూపాయిన్నర అని కట్టలేని వాళ్ల కది ఎక్కువే ఆ రోజుల్లో సామాన్యుడికి ఐదు రోజుల కూలి అది .

         నేను ఆ మూడు రూపాయిలు తెచ్చి మా నాన్న చేతిలో పెట్టి విషయం చెప్పేను . మా నాన్న నవ్వుతూ ఆ డబ్బులు తిరిగి నాకే ఇచ్చేసి ఏమైనా కొనుక్కో అన్నారు . నేను ఎప్పటి లాగే మా న్నానమ్మకిచ్చి ట్రంకు పెట్టెలో దాచమన్నాను . మా నాన్నమ్మ ఆ డబ్బుల్ని చాలా సేపు లెక్క పెట్టింది .ఎందుకంటే అవన్నీ పది పైసల బిళ్లలూ , ఐదు పైసల బిళ్లలూను 1957 లోనే నయా పైసలు చలామణీ లోకి వచ్చినా మా నాన్నమ్మ లాంటి వాళ్లకి పాత నాణేలు అణాలు , బేడలు తప్ప వీటిని లెక్క పెట్టడం వచ్చేది కాదు .

                       నాన్న ఈ డబ్బుల్తో ఏమైనా కొనుక్కోమన్నారు కదా , ఏం కొందాం అని మా నాన్నమ్మతో కలిసి తెగ ఆలోచించేసి బట్టలు కొందాం అని నిర్ణయించుకుని బొండా రాజులు గారి తండ్రి గారి బట్టల కొట్టు కెళ్లి మా నాన్నమ్మ ఎంచిన తానుల్లోంచి రెండు పరికిణీలు , జాకెట్లు చింపించుకుని ఇంటి కొచ్చేం . లేత నీలం మీదా , లేత గులాబి పూలు పరికిణీ ముక్కే జాకెట్టుకి కూడా . మొట్టమొదటిగా నా కోసం చేసుకున్న బట్టల కొనుగోలు అది చాలా ఆనందంగా ఇంటి కొచ్చిన మా మొహాలు అయిదు నిమిషాలైనా కాక ముందే చిన్నబోయేయి . మా అమ్మ వాటిని విప్పి చూసి “ఈ చీటీ గుడ్డలా కొనుక్కోచేరు , ఇయ్యేవైనా మన్నుతాయా ? పైగా రెండూ ఒకే లాంటియి “ అనేసింది . నిజంగానే ఆ బట్టలు మా చాకలి లక్ష్మీం దేవత్తచేతిలో మొదటి రేవుకి సగం , రెండో రేవుకి పూర్తిగా రంగు వెలిసిపోయి పాత గుడల్లా అయిపోయేయి. మా నాన్న తెచ్చిన క్రేప్ సిల్క్ బట్టల ముందు అవి వెలాతెలాపోయిఇంట్లోకి మాత్రమే పరిమితమైపోయేయి. ఈ అన్నిటికన్నా మా హెడ్మాస్టారు చెప్పిన ఫెయిలైతే ఫీజు కట్టి చదువుకోవాలి అన్నమాట నా మనసులో బాగా నాటుకుపోయింది . చాలా మంది ఫెయిలై చదువులు మానెయ్యడం తెలుసు కాబట్టి ఎప్పుడూ ఫెయిల్కాకుండ  జాగ్రతగా చదువుకోవాలి అని గట్టి నిర్ణయానికి వచ్చేసేనపుడే.

                          ఆగష్టు 15 కి నెల రోజులు ముందు ఓ ఆదివారం పాటలు పాడే ఆసక్తి ఉన్న విద్యార్ధుల్ని వాళ్లింటికి వచ్చి పాటలు నేర్చుకోమని పిలేచేరు మా తెలుగు మాస్టారు. నేను ,లీల, మీనాక్షి .విశాలాక్షి , మరో అయిదారుగురు కలిసి వెళ్లేం. అప్పటికి మాస్టారు ఇప్పటి లయన్స్ కమ్యూ నిటి హలు కె దురుగా ఉండే కానాపట్ల వారింట్లోకుడి వైపు భాగంలో ఉండేవారు . మేం వెళ్లేసరికి ముందున్న అరుగు మిద గదిలో చాపమీద బాసిం పట్టు వేసుకుని కూర్చొమని, అందరం ఆడపిల్లలమే ఉండడం చూసి “ ఓ హో అబ్బాయిలెవరికీపాటలు పాడే ఆసక్తి లేదన్నమాట!” అన్నారు, మాస్టారి భార్య కూడా వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. పచ్చగా దబ్బ పండు రంగులో చాలా బాగున్నా రావిడ.ఇద్దరూచిన్న వాళ్లే .పెళ్లై నాలుగేళ్లు, మాస్టారు ఉద్యోగంలో చేరి రెండేళ్లూ అయిందట . ఇంకా పిల్లలు లేరు . ఆవిడ పేరు వెంకటలక్ష్మి తనని ‘ అక్కయ్యగారు ‘ అని పిలవమని చెప్పేరు .

“ తనే వరలక్ష్మి “ అని నన్ను ప్రత్యేకంగా పరిచయం చేసేరు మాస్టారు .

“ నువ్వు బాగా చదువుతావట , బాగా పాడ తావ ట “ అంటూ ఆవిడ ఆదరంగా నా చెయ్యి పట్టుకున్నారు . అందర్నీ తలా ఒక పాట పాడమని విని . శృతి బద్ధంగా పాడుతున్న వాళ్లని ఎంపిక చేసి కొన్ని జాతీయ గీతాలు , అభ్యుదయ గీతాలు మాస్టారు . అప్పటి వరకూ వందేమాతరం , జనగణమన తప్ప మరో జాతీయ గీతం రాని మేము ‘విజయా విశ్వతి రంగా ప్యారా ‘ లాంటి జాతీయ గీతాన్ని , ‘ విద్యలు నేర్వాలి చెల్లెలా – విఖ్యాతి గడించాలి చెల్లెలా ( మాస్టారు రాసిన పాట ఇది ) లాంటి అభ్యుదయ గీతాల్ని నేర్చుకుని స్వాతంత్ర్య దినోత్సవం నాడు పాడేం .

మాస్టారి భార్యకు కూడా నా మీద ఎందుకో చెప్పరాని ఆదరం కలిగింది . ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికెళ్తూ మాస్టారు “అక్కయ్య గారు రమ్మందిరా “ అని తన సైకిల్ వెనక ఎక్కించుకుని తీసుకెళ్ళేవారు . ఆవిడేమో నన్ను వాళ్ల వంటింటిలోకి తీసుకెళ్లి దోసెలు , గుగ్గిళ్లు లాంటివి పెట్టేవారు . నాకేమో బ్రాహ్మల వంటింట్లోకి వెళ్లకూడ దేమోనని సంశయంగా ఉండేది . “ ఒరేయ్ , నువ్వు మా అమ్మాయివి తెలుసా “ అనేవారావిడ .

ఒకసారి మా పెరట్లో కాసిన ఆనపకాయొకటి ఇచ్చి మా అమ్మ . అలా ఎప్పుడూ ఏమి తేవద్దని కోప్పడ్డారు మాస్టారు . నా ఏడుపు మొహం చూసి “ ఏవిటండీ , చిన్న పిల్లని అలా భయపెట్టేసారూ “ అన్నారు అక్కయ్య . అప్పుడప్పుడు ఆవిడ మా ఇంటికొచ్చి మా అమ్మతో

స్నేహంగా కబుర్లు చెప్పేవారు . రెండు మూడు సార్లు మాతో కలిసి సినిమాలకు కూడా వచ్చేరు . ఆ తర్వాత నుంచి తరచుగా మా అమ్మ పంపించే కమ్మని మీగడ పెరుగుని వద్దనకుండా తీసుకునే వారు .

అక్కయ్య గారు ఏ పేరంటానికి వెళ్లినా నన్ను తీసుకెళ్ళేవారు . బైటి నుంచి తప్ప చూడని చాలా మంది బ్రాహ్మణుల ఇల్లు లోపలి కెళ్లి చూసే అవకాశం అలాగే కలిగింది . ఎప్పుడూ పెట్టే వారో తెలీదుకాని , ఆ సంవత్సరం ఏచూరి మామ్మగారింట్లో బొమ్మలకొలువు పెట్టేరు . దసరాకి , సినిమాల్లో పుస్తకాల్లో తప్ప నిజమైన బొమ్మల కొలువు చూడ్డం అదే మొదటి సారి నాకు సంతానం కోసం కొందరు బొమ్మల నోము నోచేరట . అందరూ కలిసి ఏచూరి వారింట్లోనే ఆ తొమ్మిది రోజులూ పూజలు చేసుకునే వారు . అప్పటికి రామ్మూర్తి తాతగారున్నారు . ఎప్పుడు అలంకరించుకునే వారో తెలీదు కాని , మేం వెళ్లే సరికే మామ్మ గారు ముడి చుట్టూ పూలు , ఒళ్లంతా నగలు , పెద్దాపురం పట్టుచీర లో మెరిసి పోతూ కన్పించేవారు . మమ్మల్ని చూడగానే “ ఈ పిల్లేవిటే వెంకటలక్ష్మీ! నీ వెనకాల , దాన్ని ముట్టేసుకుంటున్నావు కూడానూ అనే వారు మామ్మగారు . “పెద్దావిడ కదా , చాదస్తం ఎక్కువ . నువ్వేం చిన్న బుచ్చు కోకూ “ అని సర్ది చెప్పేవారు అక్కయ్య గారు .మాస్టారి దగ్గర ఒక పెద్ద బౌండు బుక్కులో ఆయన రాసిన చాలా పాటలుండేవి .అప్పట్లో సినిమా పాటల వరసల్లో భక్తి పాటలు రాయడం కవులు కొందరు చేసే వారను కుంటాను . మాస్టారు కూడా అలాంటి పాటల్తో బాటు అభ్యుదయ గీతాలు , జానపద గీతాలు , దేశ భక్తి గీతాలు చాలానే వ్రాస్తూ ఉండేవారు . ముందు గదిలో వ్యాస పీఠం లో రామాయణం , పక్కనే గీతాల పుస్తకం ఉండేది . మాస్టారు రాస్తూనో , చదువుతూనో ఉండాలనుకునే దాన్ని , ఆడ వాళ్లకి ఇంటి పనే సరి పోతుందనే జ్ఞానం కలగలేదప్పటికి .

                 దంపతులిద్దరికీ పిల్లలంటే మహా ప్రేమ . ఒకోసారి మా చిన్న తమ్ముణ్ణి తీసుకెళ్లి ఆడించి తీసుకొచ్చే వారు . మాస్టారు ఇంట్లో చాలా కొంటె వేషాలు వేసేవారు . అక్కయ్య గార్ని అరేయ్ , ఒరేయ్ అని పిలిచే వారు . అప్పటికి జగ్గంపేట పెద్దాపురం తాలూకాలో ఉండేది . పెద్దాపురం వెళ్లి నాగభూషణం రక్త కన్నీరు నాటకం చూసొచ్చి చాన్నాళ్లు ఆ దృశ్యాల్ని అనుకరించి అభినయించి నవ్వించేవారు సత్య సాయి బాబా కూడా అప్పట్లో పెద్దాపురం వచ్చేడట . ఆ సభకి వెళ్లోచ్చి ఒక బుట్ట మీద నల్ల గుడ్డ కప్పి నెత్తిన బోర్లించుకుని , కుర్చీ లోనో స్టూలు మీదో కూర్చుని ఆయనలాగే మాట్లాడుతూ నవ్వించేవారు . అప్పటికింకా ఈ ప్రాంతంలో ఎవరికీ సత్య సాయి గురించి తెలీదు . ఒకసారి రోడ్డు మీద కోతిని ఆడించడం చూసొచ్చి , పంచెను మోకాళ్ల మీదికి బిగించి గుడ్డముక్క నొకదాన్ని తోకలాగా తగిలించుకుని ఆ విన్యాసాలు కొన్నాళ్లు చేసేరు . తర్వాతెప్పుడో వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ చేసిన అలాంటి దృశ్యం చూసినప్పుడు మా మాస్టారే గుర్తుకొచ్చేరు . కాని అప్పటికి మాస్టారు విశ్వ హిందూ పరిషత్తులో ప్రముఖ స్థానం వహిస్తూ ఒక ఆధ్యాత్మిక ధోరణిలో ఉండడంతో పూర్వపు చనువు చూపించే అవకాశం ఉండేది కాదు .

 

            చుట్టు పక్కల పల్లెటూళ్ల ఆడవాళ్లు ఓ వైపు ఓపెన్ గా ఉన్న పొట్టి లంగాల మీద ఆ చీరలు కట్టుకుని సంతకి వచ్చేవారు . వాళ్ల నడక , ఆ చీరలు గాలికెగిరే విధానం అభినయించి చూపుతూంటే అక్కయ్య గారూ , నేనూ పది పడీ నవ్వే వాళ్లం . స్కూల్లో మాత్రం చాలా గంభీరంగా ఉండేవారు మాస్టారు .

   అక్కయ్య గారు వెంట పేరంటాని కెళ్లి ఆవిడ చెప్పినప్పుడల్లా భక్తి గీతాలు , మంగళ హారతులు పాడుతూ ఉండేదాన్ని . ఆ శ్రావణ మాసంలో ఒక మంగళ వారం నాడు పేరంటాని కెళ్లే ముందు నా కళ్లకు కాటుక పెట్టి “ అద్దంలో చూసుకో నే కళ్ళెంత   బావున్నాయో “ అన్నారు . నేనింటి కొచ్చి చెప్పగానే మా అమ్మ పాలేరుని మంచి నీళ్ల చెరువు ఒద్దు నుంచి గుంతకలగరాకు తెప్పించి , ఆ ఆకుల పసరు తెల్లని , మెత్తని గుడ్డకు పట్టించి ఆర బెట్టి , ఒక మట్టి ప్రమిదలో మంచి ఆముదం పోసి , దానిలో ఆ గుడ్డను వత్తిగా వేసి వెలిగించి , చుట్టూ మూడు ఇటుక రాళ్లు పెట్టి , ఆ రాళ్ల పైన శుభ్రంగా తోమిన ఇత్తడి పళ్లెంలో నీళ్లు పోసి పెట్టింది అడుగున వెలుగుతున్న దీపం మసి పొక్కులు పొక్కులుగా పళ్లెం అడుగున కట్టింది . దాన్ని చిన్న తాటాకు ముక్కతో గీసి తెల్లని కాయితం మీద పోసింది అలా దీపం వెలిగించినంత సేపూ

కాటుక పొడి వచ్చింది . తాజా వెన్న కలిపితే అదే కాటుక అయ్యింది . కొంత పొడి అక్కయ్య గారికి పంపించింది . ఆ రోజు నుంచి నేను క్రమం తప్పకుండా కాటుక పెట్టుకోవడం మొదలు పెట్టేను .

ఆ సంవత్సరం స్కూలు వార్షికోత్సవానికి మాస్టారు గన్నయ్య అనే హాస్య నాటకం రాసి , గన్నయ్య పాత్ర నా చేత వేయించేరు . ఏడవ తరగతిలో ఉన్న జల్దంకి సుబ్బలక్ష్మి చేత నా భార్య పాత్ర వేయించారు . ఆ అమ్మాయి నా కన్నా జానెడు ఎత్తుగా ఉండేది . రిహార్సల్ ఫ్రారంభమైనప్పటి నుంచీ దంపతులుద్దరూ నన్ను ‘ గన్నా “అని పిలవడం మొదలు పెట్టేరు . ఈ మధ్యనే మాస్టారు కాలం చేసే వరకూ అలాగే పిలిచే వారు .

ఆ సంవత్సరం జూనియర్స్ లో అటు స్పోర్ట్స్ విభాగంలో , ఇటు సాంస్కృతిక విభాగంలో మొదటి బహుమతులన్నీ నాకే వచ్చాయి . నాటకాల్లో మా నాటకానికీ , నా గన్నయ్య పాత్రకీ ప్రధమ స్థానా లొచ్చాయి . ఫైనల్ గా స్కూల్ మొత్తానికి ఉత్తమ విద్యార్ధినిగా నేనూ , ఉత్తమ విద్యార్ధిగా తొమ్మిదవ తరగతి చదువుతున్న జంధ్యాల అవధానిఎంపికయ్యేం . ఆ బహుమతికి గాను ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు తో బాటు వెండి నెమలి కుంకుమ భరిణ   ఇచ్చేరు . మొయ్యలేనన్ని పుస్తకాలు , అద్దాలు , పౌడరు డబ్బాలు , సబ్బు పెట్టెలు , కాంపాస్ , ఫ్లాస్క్ లాంటి బహుమతులు బోలెడన్ని వచ్చాయి .

 

పూర్ణయ్య గారు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న మూడేళ్లూ ఉత్తమ విద్యార్ధినిగా బహుమతి నేనే అందుకున్నాను . ఆయన బదిలీ మీద వెళ్లిపోయేక వార్షికోత్సవాలు ఆగిపోయాయి . మా తెలుగు మాస్టారు మంచి నటులు కూడా వార్షికోత్సవంలో రెండవ రోజు టీచర్స్ ఈ వెంట్స్ లో రంగూన్ రౌడీ పాత్ర వేసి ఒక చేతిలో సి గరెట్టు , మారో చేతిలో సీసా పట్టుకుని నటిస్తూంటే నేను ఏడ్చేసాను . “ వెర్రి పిల్లా , అది నటనే కదా “ అని పక్కనున్న అక్కయ్య గారు నన్ను ఓదార్చేరు .

 

                   బొమ్మల నోము తర్వాత అక్కయ్య గారు నెలతప్పేరట . “ మనం చేసినవేవీ తినరే “ అని మా అమ్మ చాలా బాధ పడిపోయేది . స్కూలుకు సెలవులిచ్చేక ఊరికేళ్తూ ఒంటెద్దు బండి దిగి మా ఇంట్లో కొచ్చేరు . మా అమ్మకి , నాన్నకి , నాన్నమ్మకి చెప్పి బస్టాండు వరకూ నన్ను వెంట బెట్టుకుని తీసుకెళ్లేరు . అ అమ్మ సంచిలో మామిడి పళ్ళు వేసి ఇస్తూ “ పండంటి కొడుకుని ఎత్తుకుని రండి అంది . “ లేదమ్మా , మాకు గన్నయ్య లాంటి కూతురు కావాలి అన్నారు అక్కయ్య గారు నా చెంపలు నిమురుతూ . ముందుగా మాస్టారి ఊరు రాజోలు దగ్గరున్న పొదలాడ వెళ్లి అక్కడి నుంచి పురిటికి ఆవిడ పుట్టింటికి (లంకల్లో అగ్రహారం ) వెళ్తారట . వెళ్లిన వారంలోనే ఇద్దరూ కలిసి నాకొక ఇన్ లాండు కవరు ఉత్తరం రాసేరు . అది నేను అందుకున్న మొదటి ఉత్తరం . మారో ఉత్తరం వచ్చే వరకూ ఆ ఉత్తరాన్ని ఎన్ని సార్లు చదువు కున్నానో లెక్కలేదు .

 

               జూన్ ఫస్ట్ కి జీతం అందుకోవడానికి వచ్చి రెండు రోజుల క్రితం పాపాయి పుట్టిందని , స్కూలు తీసేక వస్తానని చెప్పి వెళ్లేరు మాస్టారు . మరో వారం తర్వాత స్కూలు తెరిచిన రోజు మాస్టారు రాలేదు . నేను టీచర్స్ రూం దగ్గరకి వెళ్లి వెతుకుతూంటే గుమస్తా దొరగారు “ వరలక్ష్మీ , మాస్టారి భార్య ధనుర్వాతంతో పోయారట . అందుకే ఆయన రాలేదు “ అన్నారు . ఎంత ఏడ్చినా నేను ఆ షాక్ నుంచి చాలా కాలం వరకూ కోలుకోలేక పోయాను . అంతటి ప్రేమ మూర్తి , సాత్త్వికతకు మారు పేరైన ఆవిడ ఇక లేరా ? ఆవిడను ఇక చూడలేనా ? కొన్ని సంవత్సరాల పాటు ఆ విషాదం ఎంతగా ఆవరించుకుందంటే “ పయనించే ఓ చిలకా ఎగిరిపో “ లాంటి పాట విన్నా , మబ్బు కమ్మినా , వాన కురిసినా ఎక్కెక్కి ఏడుపొచ్చేసేది .

                       వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో బిడ్డకు జన్మ నివ్వడం ప్రాణానికి తెగించడమే . అందుకే కాబోలు ఎక్కువ మందిని కన్నా స్త్రీలకి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారు .

(ఇంకా ఉంది )

–  కె . వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

ఆత్మ కథలుPermalink

Comments are closed.