వర్ణ యుద్ధం

సందె పొద్దు వాలాక
అంతా సద్దు మణిగి పోతుంది
ఎక్కడా ఆనవాళ్లు మిగలవు
పగిలిన తలుపు చెక్కలు
ఊడి వేళ్లాడుతున్న గొళ్లేలు మాత్రం
మూగ సాక్షులై మౌనంగా
కన్నీటి రాగాలు ఆలపిస్తుంటాయి

ఎండిన నెత్తుటి చారల గొడ్డళ్లు
పిడచ గట్టుకున్న కులం గొంతుల్ని
ఇనుప వేళ్లతో సవరించుకుంటుంటాయి .
తలుపు మూలన
అరిగి పోయిన చీపుళ్లుండవు
పిల్లవాడి బిళ్లం గోడులుండవు
సగం విరిగిన క్రికెట్ బ్యాట్ లుండవు
పిల్ల దాని ఆటబొమ్మల మూట
అటక మీద ఉసూరుమంటుంది

చీకటి మూలల్లో
రక్త తర్పణానికి సిద్ధమవుతున్న
రహస్య ఆయుధాలు
పొడుగాటి బరిసెల చేతుల్తో
పెదాలకు నెత్తుటి లిప్ స్టిక్ అద్ది
వర్ణ యుద్ధానికి ముస్తాబవుతుంటాయి

ఒక నిశ్శబ్ద ఘోషలోంచి
ఒక పొలికేక పొలిమేర దాటుతుంది
ఒక తాళి తెగి
నల్లపూసలు చెల్లా చెదురవుతాయి
మరో ఇల్లాలి నుదుటి మీద
సూర్యుడు తిలకమై అస్తమిస్తుంటాడు
రెండు రంగుల కుత్తుకలు తెగిపడి
శరీర ద్వయం ఒరిగిపడ్డప్పుడు

రెండు వర్ణాల రక్తాలు
రెండు రక్తాల వర్ణాలు
ఏకమై విలీనమై
ఒక మానవతా నదీపాయగా
పారుతున్నప్పుడు మాత్రమే
శవాల కళ్లు విప్పారుకుంటాయి
రక్త వర్ణం అందరిదీ ఒకటేనన్న సత్యం
కొనవూపిరి కొట్టుకుంటున్నప్పుడు మాత్రమే అర్ధమవుతుంది

మృతులు మంకెన పూలై రాలుతుంటారు
సందె పొద్దు వాలుతుంది
అంతా సద్దు మణిగి పోతుంది
మురుగు కాల్వల్లోంచి
పంట పొలాల తూము ల్లోంచి
మూతి బింగించిన బస్తాల్లోంచి
బహిష్కృత శవాల గొంతులు
నాగరీకుల గుండెల్లో
ప్రశ్నార్ధకాలై ప్రతిధ్వనిస్తూనే వుంటాయి

– (సుప్రభాతం 20 మే 1992)

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to వర్ణ యుద్ధం

 1. మణి వడ్లమాని says:

  “రెండు వర్ణాల రక్తాలు
  రెండు రక్తాల వర్ణాలు
  ఏకమై విలీనమై
  ఒక మానవతా నదీపాయగా – ‘

  యెంత హృద్యంగా చెప్పారు హేమలతగారు . రెండు వర్ణాల సంఘర్షణ గురుంచి ,అద్భుతమైన పద ప్రయోగం

 2. Thirupalu says:

  //నాగరీకుల గుండెల్లో
  ప్రశ్నార్ధకాలై ప్రతిధ్వనిస్తూనే వుంటాయి //

  నాగరికులు కాస్త అనాగరికులైనపుడు
  ప్రతిద్వనించాల్సిన ప్రశ్నార్ధకాలు తోకముడిచి వెనక్కు వాలి రాలి పోతున్నాయి ఒక్కొక్కటి.
  వర్ణయుద్దం బాగుందండి.