ముకుతాడు – 12

టి.వి.యస్ .రామానుజరావు

టి.వి.యస్ .రామానుజరావు

“ ఓకే. మంచి మాట. స్నానం చేసివస్తాను” అంటూ సుందరం లేచి తన సూట్కేస్ తెరిచి టవలు, సబ్బు తీసుకుని బాత్రూం లోకి వెళ్లాడు. పంజాబ్ నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాడు. షవర్ బాత్ చేసి వస్తే బడలిక తీరుతుందని అనుకున్నాడు.

ఆయన బాత్రూం లోకి వెళ్ళగానే, “ నువ్వే ఆయనను పిలిచావు కదూ?” కోపంగా అడిగింది చంద్ర.

“హుం” మనో చిన్నగా అన్నాడు.

“ నిజంగా నువ్వే పిలిచావా? చెప్పూ?” మల్లి ప్రశ్నించింది.

జవాబు చెప్పకూడదు అనుకుని కూడా మనో తలవుపాడు.

“ ఎందుకిలాంటి పిచ్చి పని చేసావు?”

“ ఎందుకని అడుగుతావేంటి?” ఎదురు ప్రశ్నించాడు. తను ఎందుకు పిలిచాడో ఆమె గ్రహించే వుండాలి. ఈ గందరగోళం పరిస్థితులు మనో మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, పెదనాన్న ఒక్కడే జటిలంచేసుకున్న సమస్యను పరిష్కరించ గలిగిన మనిషి.

“మాట్లాడవేం,మనో? ఎందుకిలా చేసావు?” బాత్రూమ్ వైపు చూస్తూ మళ్ళీ అడిగింది చంద్ర. ఒక పక్క బాత్రూం నుంచి ఏ క్షణం లో నైనా వచ్చే సుందరాన్ని దృష్టిలో వుంచుకుని కూడా వాళ్ళిద్దరూ అక్కడే చిన్న గొంతుతో మాట్లాడాల్సి రావడం చిత్రమే. అవతలికి వెళ్ళి మాట్లాడదామన్న ఆలోచన లేకపోవడమే కారణం కావచ్చు. దానికి చంద్ర కోపమే కారణం కూడా.

“అమ్మా, నీకు తెలుసు, నేను ఆయన్ను ఎందుకు రమ్మన్నానో?”

“ ఓకే. నాకు అర్ధమైంది. అయన ఏం చెయ్యగలడని పిలిచావు? ఆయన రాక వల్ల ఏదైనా అద్భుతం జరుగుతుందా?”

“ అమ్మా, నువ్వు ఒకోసారి చిన్న పిల్ల లాగా ప్రవర్తిస్తావు. ఆయన నాన్న కన్నా పెద్ద వాడు. నాన్నతో మాట్లాడి, అయన చేసేది తప్పని మందలించి, దోవలో పెట్టగలడు.”

“ కానీ, మనో మన రెండు కుటుంబాల మధ్య అంత సయోధ్య లేదన్న సంగతి నీకు తెలుసుగదా?”

“ నాకు తెలుసు అమ్మా , కానీ, నాన్నను మందలించ గల పెద్ద వాళ్ళెవరూ మన కుటుంబంలో కనబడ లేదు. అందుకే ఆయన్ను పిలిచాను.”

“ అసలు ఆయన్ను ఎలా పిలిచావు? టెలిగ్రాం ఇచ్చావా? “

“ లేదు. ఆయన ఆఫీసుకు ఫోన్ చేసి, సంగతులన్నీ చెప్పాను.

“ఎప్పుడూ?”

“నాలుగు రోజుల క్రితం”

“ ఏం లేదు. మా నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారు. అమ్మ బాధతో పిచ్చిదానిలా అయిపోయిందని చెప్పాను. మీరు వెంటనే వచ్చి ఈ పరిస్థితులు చక్క దిద్ద గలరా అని అడిగాను.”

చంద్ర కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించింది. ఇప్పుడు బావ గారికి తన భర్త చెడు నడత గురించి చెప్పాలి. ఆ ఆలోచనే ఇబ్బందిగా వుంది. తన ఆలోచన ఏమిటో చెప్పి ఆయన్ను ఇక్కడి నుంచి పంపేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే. ఈ మనో చేసే పనులు ఒకోసారి ప్రాణం మీదకు తెస్తాయి. ఇంకా నయం, ఆడపిల్లలు ఇద్దరూ స్కూలుకు వెళ్ళిపోయారు.

చంద్ర మనోతో ఏదో చెప్పబోయి, సుందరం బాత్రూం నుంచి రావడం చూసి ఆగిపోయింది. సుందరం లుంగీతో రావడం చూసి, అయన బట్టలు మార్చుకోవడం కోసం ఇద్దరూ ఆ గది వదిలి వెళ్ళిపోయారు.

కాసేపటికి, సుందరం ఇస్త్రీ చేసిన పంచ కట్టుకుని, చొక్కా వేసుకుని తల దువ్వుకుని హాల్లోకి వచ్చాడు. ఇప్పుడు అతను చాల దూరం ప్రయాణం చేసి అలసిపోయినవాడిలా లేదు. చక్కగా తయారై వస్తున్న అతన్ని చూసి, అన్నదమ్ములనిద్దర్నీ పోల్చి చూసింది చంద్ర. ఇద్దరికీ ఎంత తేడా!

గదిలో వాతావరణం వేడెక్కి పోయింది. చంద్రకు ఆ గదిలో సెగ కొడుతున్నట్లుగా వుంది. ఏదో ఒకటి చెయ్యాలన్నట్లు ఫాన్ స్విచ్ వేసింది. బావ గారికి తను చెయ్యదలుచుకున్నది చెప్పి, ఎలాగో అతన్ని ఒప్పించి వెనక్కు పంపడం ఒక పెద్ద సవాలు. కానీ తప్పదు, తను అనుకున్నది సాధించాలంటే, మరొకరు వేలు పెట్ట కూడదు. అదీ కాక, అన్నదమ్ములిద్దరి మధ్య సయోధ్య ఏమీ లేదు.

నిజానికి సుందరం మూర్తి అంత చదువుకోలేదు. మూర్తి అంత అందగాడు కూడా కాదు. అన్న అయి కూడా ముందుండి తమ్ముడి వ్యవహారాలలో పాలు పంచుకున్నదీ లేదు. మూర్తి అన్నకన్నా మొదటి నుంచి తెలివి, చొరవ గల వాడిగా పేరు తెచ్చుకున్నాడు.

చిన్నప్పటి నుంచి మూర్తి ప్రవర్తన సుందరానికి నచ్చేది కాదు. అతని అలవాట్లను సుందరం తప్పు పట్టే వాడు. తాగడం, పరస్త్రీ వ్యామోహం మూర్తికి వున్న చెడ్డ లక్షణాలు. అంతే కాదు, తను, తన స్వార్ధం తప్ప, మరెవరినీ లెక్క చేసేవాడు కాదు.

అయినా మనో ఫోన్ చేసి పరిస్థితి వివరించి, సహాయం కోరగానే సుందరం వెంటనే వచ్చాడు. చంద్రకు తను ఈ సమయంలో రావడం నచ్చినట్లు లేదు. ఆమె ఆహ్వానం మనస్పూర్తిగా లేదు. చంద్ర మీద అతనికి అభిమానమే ఉంది. అయితే, ముందు ఆమె ఏం చెబుతుందో వినాలి.

చంద్రకు మాత్రం అతనే ముందు మాట్లాడితే బాగుండనిపించింది. ఒక పక్కగా గోడనానుకుని నిలుచుంది. చాలా సేపు ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది.

చివరికి సుందరం తనే గొంతు సవరించుకుని, నెమ్మదిగా అన్నాడు “ మనోహర్ నాకు ఫోన్ చేసి మాట్లడినప్పుడు నేను చాలా ఆందోళన పడ్డాను. హోటల్ లో టిఫిన్ చేస్తున్నప్పుడు వాడు అంతా వివరంగా చెప్పాడు. ఓరి దేవుడా! మూర్తి ఎంత పని చేస్తున్నాడు! వాడికి ఇదేం బుధ్ధి? నీ లాంటి అనుకూలవతి, అందమైన భార్య వుండగా వాడికి మరొక భార్య అవసరం ఏం వచ్చింది ?”

మరింత నెమ్మదిగా ఆమెకు ధైర్యం చెబుతున్నట్లు అన్నాడు” నీ మనసెంత క్షోభ పడుతోందో నాకు తెలుసు. విషయం అంత వివరంగా చెప్పమ్మా! నా దగ్గర సందేహించకు. బాధ చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. నేను నాలుగు దేబ్బలేసి అయినా, వాడికి చెప్ప గలను. చక్కటి సంసారాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు.”

 (ఇంకా ఉంది)

తమిళ మూలం: శివశంకరి  

తెలుగు :టి.వి.యస్ . రామానుజరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

UncategorizedPermalink

Comments are closed.