జోగిని

santhi prabodha అప్పటి వరకూ ఉన్న సాయిలుకీ విద్య కొత్తగా కన్పిస్తోంది. ఈ విధంగా ఎవర్నీ చూడలేదు… అనుకొంటుండగా

            ”సాయిలూ నువ్వు వెళ్ళిపో… ఇంటి దగ్గర నీకు పని ఉండవచ్చు. దారి తెల్సింది కదా నేను వచ్చేస్తాలే” అని పంపించేసింది. సాయిలు భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా, నమ్మిన బంటులా కన్పిస్తాడు. అదీ కాక అతని ముందు సాయవ్వ తమ విషయాలు చెప్తుందో లేదోనన్న అనుమానం కల్గింది.

            ”జోగిని నిత్య సుమంగళి. ఆమెకు వైధవ్యం లేదు. చిన్నపుడే దేవతను లగ్గం చేసుకుంది కావట్టి దేవత ప్రతిరూపం. ఊరు విడిచి ఎక్కడికీ పోరాదు. వేరే ఎవర్నీ లగ్గం చేస్కోవద్దు. దేవునితో లగ్గమయ్యింది కాబట్టి ఆమె ఊరందరికీ పెండ్లాం ఆసొంటిది, ఆమె దగ్గరకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. పోవచ్చు. అప్పుడామె కాదనొద్దు. జోగిని పిల్లలకు తండ్రి ఉండడు. ఊరపండుగల్లో, శవాల ముందు ఆడుకుంట, అడుక్కుంట, కళ్ళాల్ల గింజలడుక్కుంట జీవనం చేసుడు మా బతుకు.” నిర్వికారంగా చెప్పింది సాయవ్వ.

            ఎంత అమానుషం? ఊరందరూ ఆమె ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా వాడుకొంటారా, ఇంకా అసలు తెల్సుకోవాల్సింది చాలా ఉందనుకొన్న విద్య

            ”సాయవ్వా… నిన్ను జోగినిగా ఎందుకు చేశారు? ఎవరు చేశారు?” అడిగింది.

            ”ఎందుకేందక్కా… అది మా ఇంటికి వతను కొద్దీ అచ్చింది. మా నాయనమ్మ, వాళ్ళ అమ్మమ్మ బీజోగుదే. మా నాయనమ్మ జోగుదే. మా మేనత్త జోగుదే. నేను జోగుదాన్నే… నా బిడ్డ, నా మనుమరాలు అంత జోగోల్లమేనయితిమి. ఇది ఏండ్ల బట్టి మాకు వతను కొద్దీ అచ్చింది. ఆల్లకు ముందట ఇంకెంత మంది ఉండెనో…” అంది అతిసాధారణ విషయం అన్నట్లుగా. ఈ దుష్ట సంప్రదాయం తరతరాలుగా వస్తోందని అర్థమైంది. కానీ ”వతను” అంటేనే తెలీలేదు. మొన్న ఊరపండుగ గూర్చి చెప్తూ రాజాగౌడ్‌ కూడా వతను అనే పదం వాడిన విషయం గుర్తించింది విద్య… అందుకే.

            ” వతను అంటే ఏంటి సాయవ్వా”

            ” ఈ ఊర్ల ఇంత మంది మాలోల్లు, మాదిగోల్లు ఉన్నరు గద, ఎవరికి లేదు. మా ఇంటికే ‘జోగు’ ఇడుసుడు ఎనకెటి కెల్లి అస్తున్నది. ఒక్కల్ల జమాన ఒడుస్తే… ఇంకోల్లకు జోగు ఇడవాలె. లేకుంటే మాకు వతను అచ్చిన ఊర్లు పోతయ్‌. మా కుటుంబానికి 4 ఊర్లు ఉన్నయ్‌. ఆ నాలుగూర్లకు మేం జోగినులం. అసలు గిదంత తెల్వాల్నంటే ఏర్ల కాడికెళ్ళి తెలుసుకోవాలె.” అంది సాయవ్వ.

            నిజమే రూట్స్‌ ఏమిటో తెలుసుకోవాలి. తల్లి వేరు ఎక్కడుందో పట్టుకోవాలి. కానీ ఈ రోజు కాదు రేపు ఎల్లుండి రావాలి. ఇక బయలు దేరదాం అనుకొంటుండగా, నాలుగు కల్లు సీసాలతో వచ్చింది  ఓ పాతికేళ్ళ పడుచు. కట్టుబొట్టు అచ్చం సాయవ్వ లాగే కాకపోతే ఈమె చెవి చుట్టూ 5 రకాల పోగులు ఉన్నాయి. ఎర్రరాళ్ళు, ముత్యాలతో. కాళ్ళకు చేతులకు వెండి కడియాలు. బహుశా ఈమె పోశికావచ్చు అనుకొంది విద్య. ఆమె వెనకే పదేళ్ళ పిల్ల రెండు సీసాలతో లంగా జాకెట్టూ – చింపిరి జుట్టూ-

            ఇద్దరూ విద్యకేసి వింతగా చూస్తూ, ఆశ్చర్యంగా చూస్తూ అర్థంకానట్లుగా..”బిడ్డా అయ్యి ఆడ బెట్టి గిటురాయే”

            కేకేసింది సాయవ్వ వీళ్ళ చేతుల్లో సీసాలు చూసి సీను అర్థం చేసుకున్న విద్య వీళ్ళప్రైవసీకి తాను అడ్డుకాకూడదన్న ఉద్దేశ్యంతో లేవబోయింది.

            ”బిడ్డా… ఈ పట్నపు అక్క పెద్దగౌడ్‌ బిడ్డకు దోస్తట. మనలను చూసెతందుకచ్చింది.

            ”ఏం జూస్తదట. మన బతుకుతోని ఆల్లకేందట? ఆల్లు మంచిగున్నరు. సాలు గద” దురుసుగా ఆమె స్వరం. కణ కణ మండే చింత నిప్పుల్లా ఆమె కళ్ళు. ఊకుండే.. పోసి. చుట్టపు అక్క మంచిదే. గట్ల అనకే పాపం తగుల్తది. ఆమె నారాజయితది. నచ్చ జెప్పబోయింది సాయవ్వ.

            పెద్దపెద్ద కళ్ళతో, ఆ కళ్ళు అలా అప్పగించేసి విద్యనే చూస్తోంది. ఆ పాప శుభ్రంగా లేదు కానీ కను ముక్కు తీరు చక్కగా ఉంది. 

            ”వెళ్ళి వస్తాను సాయవ్వా.. రేపు రావచ్చా మిమ్మల్ని కలవడానికి అంటున్న విద్య దగ్గరకు వచ్చి” నీ కాల్మొక్త బిడ్డా… పోసి మాటలు ధ్యానంల బెట్టుకోకు. దాని మనసు ఎన్న. గా పెద్ద గౌడ్‌ మాటింటేనే అది అగ్గోలె అయితది. నువ్‌ పెద్దగౌడ్‌ ఇంటి సుట్టం గద… గందుకే.. గట్ల అన్నది. దానికి తోడు ఓ కాయ ఎక్కింది నెత్తికి” అంటూ విద్య కాళ్ళు పట్టుకోబోయింది.

            ఆ హఠాత్‌ చర్యకు విద్య కంగారుపడి కాళ్ళు వెనక్కి తీసుకుని ”అదేంటి సాయవ్వా.. అంత పెద్దదానివి నాకాళ్ళు పట్టుకుంటానంటావేంటి? ఏం తప్పు చేశావని?”

            ‘నీ అసోంటి గొప్ప మర్యాదగల్లోల్లను ఈ జల్మాల సూత్తనా… నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు రాబిడ్డా.. ఎటు పోతం మేం! ఇంట్లనే ఉంటం గద! అంటూ కూతురు ప్రవర్తనకు బాధపడ్తూనే మళ్ళీ రమ్మని ఆహ్వానించింది.

            ‘సాయవ్వా…నీవేం బాధపడకు.నేను రేపువస్తానులే” అని బయటకు నడుస్తోన్న విద్యకి తోడుగా ఇంటిదాక దిగబెట్టి రమ్మని మనవరాలికి పురమాయించింది.

            ”ఎందుకు సాయమ్మా… నేను వెళ్ళగలను. పాప మళ్ళీ అంత దూరం నుండీ ఒక్కటే రావద్దూ” అంటూన్న విద్య దగ్గరికి వచ్చి.

            ”నీతోని నేనస్త” అంటూ ఆ పాప కదిలింది సంబరంగా.

            ” నీ పేరేంటమ్మా”

            ”జోగు సబిత ”

            ” సబిత.. చాలా బాగుంది నీపేరు, ఏం చదువుతున్నావు?

            ”దొరసాని.. నేను బడికి పోను”

            ” నేను దొరసానిని కాదు. అక్కని నా పేరు విద్య. విద్యక్కా అని పిలువు చెప్పింది విద్య.

            ఆ పాప చాలా సంబరపడిపోయింది. సంతోషపడిపోయింది. అంతలోనే ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా అని తన చేయి తానే గిల్లి చూసుకుంది. నిజమేనని నిర్ధారించుకున్నాక ‘అక్కా’ అంటూ విద్య చేయి అందుకొంది.

            ”అబ్బ.. నీ చెయ్యి ఎంత మెత్తగా ఉన్నది. దూది లెక్క!” చేయి నొక్కుతూ అంది.

            ” బడికి ఎందుకు వెళ్ళట్లేదు”

            ”ఆ .. కొన్నొద్దులు పోయిన బడికి .. మూడోదిలకు అచ్చినంకనే బడి బంద్‌ బెట్టిన నాకయితే బడిలకు పోవాల్నని ఉన్నది.. కానీ మానేశాను”.. మీ అమ్మ, అమ్మమ్మా ఒద్దన్నారా.?”

            ”ఊహు.. కాదు” తల అడ్డంగా ఊపుతూ.

            ”మరెందుకు?”

            మా వాడలకెల్లి నల్గురమే బడికి పోతం. మా నల్గురికి అసుంట కూసోబెడ్తడు మాసారు. ఎప్పటికి ముండా… మాద్గిదానా… అంటడు. లేకుంటే ఒకనాడు బడిల పాటం ఒప్పజెప్పలె… మాసారు ఓ జోగుదానా నీకు బడెందుకె… సదువెందుకే… అని ఏందేందో తిట్టబట్టె. బడిల పొల్లగాల్లంత మంచిగ ఆడుకుంటరు.

            ‘ఆల్లతోని ఆడనీయరు. ఆల్ల ఇంట్లకు రానీయరు. నన్ను దుష్మన్‌ లెక్క జూస్తరు. ఊకే జోగిదానా, మాద్గిదానా అంటరు. నాకు కోపమస్తది. నాకు పేరు లేదాని తిడ్త. మరి నాకు పేరు లేదా అక్క’ ఉక్రోషంగా అడిగింది.

            అయ్యో పసిదాని మనసుని అందరూ కలిసి ఉండాలని చెప్పాల్సిన టీచర్లే గాయపరుస్తే వీళ్ళే కులం పేరుతో వేలెత్తి చూపితే, వెలివేస్తే ఎంత క్షోభ పడిందో కదా ఆ పసి మనసుఅనుకొని.

            ”నీ వన్నట్లు నీకు పేరు లేదా- వాళ్ళలాగే – ఎంచక్కటి పేరు నీది. సబితా అని పిలవకుండా వేరే పేరుతో పిలిస్తే ఊరుకోకు” అంటున్న విద్యవైపు ఆరాధనా పూర్వకంగా చూసి ఆమె చేయినొక్కి పట్టుకుంది. అపురూపంగా…

            ” విద్యక్కా నాకు అయ్య లేడట. ఎవరో తెల్వదట. ఏందేందో అంటరు. ఆల్లు అట్ల అంటే నాకు మస్తు కోపమయితది. కయ్యమాడ్త, ఊకె కయ్యమాడ్తున్నవ్‌. అని మా సారు నన్ను బడిలకు రావద్దన్నాడు. బంద్‌ బెట్టిన సంకురాతిరి పండుగ ముంగట” జరిగినదంతా చెప్పుకొచ్చింది సబిత.

            వాళ్ళిద్దరు అలా మాట్లాడుకొంటూ ఉండగానే పెద్ద గౌడ్‌ ఇల్లు వచ్చేసింది. మేయిన్‌ గేట్‌ దగ్గరే నిల్చున్న రాజాగౌడ్‌ ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

            ” అక్కా… మల్లరేపు అస్తవ్‌ కదా.. ఒట్టు….” అంటూ రావాలని చేతిలో చేయి వేయించుకొని ప్రామిస్‌ చేయించుకొని వెనుదిరిగింది సబిత.

            అక్కడే నిల్చుని ఉన్న రాజాగౌడ్‌కి ఆ పిల్ల విద్య చేయిపట్టుకు రావడమే కంపరం కల్గించింది ఇంకా అక్కా అన్న మాట చెవిన బడడంతోనే.

            ”ఏయ్‌ పోరి… ఏందే మాద్గిపోరి ఎవరే నీకు అక్క? బలుపెక్కిందా..? హుంకరించాడు. గుడ్లురిమి చూశాడు రాజాగౌడ్‌. భయంతో బెదిరిపోయిన ఆ చిన్నారి వెనుదిరిగి చూడకుండా పరుగెత్తింది.

            అనుకోని ఈ సంఘటనకు స్థాణువైపోయింది విద్య ప్చ్‌- పాపం ఆ పసిది ఎంత భయపడిందో- బాధపడిందోనని.

            ”అదేంటంకుల్‌… అలా బెదిరించేశారు… పాపం చిన్న పిల్ల. అయినా అంతకాని పని తనేం చేసిందనీ..? దొరసానీ అంటుంటే, నేనే అక్కా అని పిల్వమన్నాను.” సర్ది చెప్పబోయింది.

            ”విద్యమ్మా… ఆ అలగాజనంతో నీకెందుకు? హాయిగా పట్నంలో చదువుకునే నీకు ఈ జోగోళ్ళ సంగతులెందుకు? వీళ్ళకు చిన్న సందిస్తే చాలు నెత్తిమీద ఎక్కి కూర్చుంటరు. ఎక్కడుండే వాళ్ళను అక్కడ్నే ఉంచాల”. హితవు పలికాడు.

            అంటరానితనం ఉండేదనీ, ఉందనీ తెల్సు కానీ తాను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. పాపం సబిత? అంటరాని కులంలో పుట్టడమే ఆమె చేసిన నేరమా? లేక ఆమె జోగిని కావడమా? ప్రతిచోటా ఆ చిన్ని మనసు ఎట్టా తట్టుకోగలుగుతుందో… ఎంతకంత వైల్డ్‌గా రియాక్ట్‌ అయ్యాడో అంతా పజిల్‌ లా తోచింది. ఈ పజిల్‌ని ఎట్టా విప్పాలి… ఆలోచ్చిస్తున్న విద్యని.

            ”హమ్మయ్య! వచ్చేశావా… ఇంకా రాలేదేమిటా అని నీకోసం చూస్తున్న ”అంటూ కవిత ఎదరొచ్చింది.

            ”కవితా ఆమెను ముట్టుకోకు. దూరం ఉండు మాల్లోల్ల మాదిగోళ్ళ ఇళ్ళు తిరిగొచ్చింది. కద” అని విద్యవైపు తిరిగి ”స్నానం చేసి లోపలికి రా బిడ్డా” అంది రాంబాయి.

            ”ఉండనే నీ బట్టలు బాత్రూంలో వేస్తాను. అంటూ లోనకెళ్ళింది కవిత.

            విద్య నడచి వచ్చిన దారంతా పసుపు నీళ్ళు జల్లి శుద్ది చేస్తోంది రాంబాయి. విద్యకి ఈ తంతు కొత్తగాను, అసహ్యంగాను తోచింది. ఈ చాదస్తం బ్రాహ్మలకి, వైశ్యులకు ఉంటుందని వింది. వీళ్ళకు కూడా ఉందనీ ఈ ఆచారాన్ని ప్రత్యక్షంగా చూసింది. అనుభవించింది ఇప్పుడే. మనం బయటకు వెళ్ళింది. మొదలు ఎంతో మందిని కలుస్తాం. మరెంతో మందిని తెలిసో, తెలియకో ముట్టుకుంటాం. ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతాం అప్పుడుఅక్కడ వాళ్ళది ఏ కులం? ఏ మతం అని చూడం ఆలోచించం కదా! ఎవరి పని వాళ్ళది. మరి ఇప్పుడు ఏమిటో వీళ్ళు ఆచారాలు… పద్ధతులూ, తెలంగాణా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని తెలుసు, కానీ ఇప్పుడు కూడా, ఈ రోజుల్లో కూడా ఇంకా భూస్వామ్య పెత్తందారీ విధానం, అంటరానితనం, అణచివేత, మూఢవిశ్వాసాలు, ఆచారాలు, స్త్రీ వివక్ష ఇంత బలంగా నాటుకు పోయి ఉండడం ఆశ్చర్యమే. ఈ అణగారిన తనంలోంచి, ఈ పెత్తందారీ వ్యవస్థ నుంచే నక్సలిజం ఎదుగుతూ వస్తోందేమో.

            కవిత చదువుకున్నది. తను కూడా ఇది తప్పు. అనాగరికం అని ఇంట్లో వాళ్ళకి నచ్చచెప్పకుండా పెద్దవాళ్ళు చెప్పిందే ఆచరిస్తోంది. ఏమిటి? యూనివర్శిటీలో తను చూసిన కవితకీ, ఇప్పుడు ఇక్కడ తను చూసే భూస్వామి కూతురు కవితకీ ఎంత వ్యత్యాసం? ఏమిటి? ఎందుకిలా? ఎన్నెన్నో ఆలోచనలు, ప్రశ్నలు మెదడు నిండుగాచేరి గందరగోళం చేస్తుండగా ‘నీ డ్రస్‌ బాత్‌రూంలో వేశా… వెళ్ళి స్నానం చెయ్యి’ అన్న కవిత మాటలతో గబగబ బాత్రూంలో దూరింది విద్యవెస్ట్రన్‌ టైప్‌ కమోడ్‌, బాత్‌టబ్‌, గీజర్‌, ఖరీదైన బైల్స్‌తో అత్యంత ఆధునికంగా ఉన్నఆ బాత్రూం నగరాల్లో పోష్‌ ఏరియాలో ఉన్నట్లుగా అధునాతనమైన బంగాళా… వాటి ముందు క్రోటన్స్‌… లోపల చక్కటి అందమైన ఫర్నిచర్‌… అంతా ఆధునికతే… కానీ వాళ్ళ ఆలోచనల్లోకి, అలవాట్లలోకి తొంగి చూస్తే, ఆధునికత, మానవత ఏమైనా కన్పిస్తుందా? తనకు తాను ప్రశ్నించుకుంది విద్య…

            ఈ ఊళ్ళో మోడ్రన్‌గా ఉండే కుటుంబాలు రెండే రెండు. ఒకటి మాది. రెండోది జానారెడ్డిది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఉండడంలేదని వచ్చేటప్పుడు దారితో కవిత చెప్పిన విషయం గుర్తొచ్చింది.

            అసలు ఆధునికత అంటే ఏమిటి? దాన్ని కొలవడం ఎలా? దానికి కొలమానం ఉందా? షవర్‌ తిప్పుతూ తనే ప్రశ్నించుకొంది విద్య.

            పంచె, షర్టు స్థానంలో జీన్స్‌, చీరా జాకెట్ల స్థానంలో షల్వార్‌ కమీజ్‌, మిడ్డీలు, జీన్స్‌లతో మారే కాలంతోపాటు పోటీపడ్తూ మారే ఫ్యాషన్లూ, చుట్ట, బీడీల స్థానంలో సిగరెట్లూ, కల్లు సారాల బదులు బ్రాందీ విస్కీలు, రచ్చబండ కబుర్లు లేకుండా క్లబ్బులు, పేకాట, సైన్సు టెక్నాలజీ ద్వారా లభించిన సదుపాయాలు… ఇదేనా అందరూ అనుకునే ఆధునికత?

            సాలెగూడు వలయంలో చిక్కిగిలగిలా కొట్టుకుంటున్న పురుగులా మదిలో ఆలోచనలు గిరాగిరా తిరుగుతోంటే స్నానం ముగించింది కానీ స్నానం చేసిన ఫీలింగే లేదు, మనసు నావరించిన ఉక్కపోత. చాలా అనీజీగా ఉంది. అంతలో ఎర్రగా పండిన పుచ్చకాయ ముక్కలు తీసుకొచ్చి ముందుంచింది కవిత. చల్ల చల్లగా తీయ తీయగా ఉన్న ఆ ముక్కలు విద్య మనసుని ఆకటుటకోలేకపోయాయి. మాములుగా అయితే ఓహ్‌… ఎంత బాగుంది…! అంటూ మరో రెండు ముక్కలు తినేసేదేమో కానీ ఇప్పుడవి ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనల్ని మళ్ళించలేక పోతున్నాయి. ఆమె హృదయాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆమెను చల్లబరచలేకపోతున్నాయి.

(ఇంకా వుంది)

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో