మహిళా ఉద్యమం (1857 – 1956)

స్థానికంగా సంఘాలు ఏర్పరచుకొనటం, స్త్రీ సమస్యలను చర్చించటం మాత్రమే కాక, సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయి సంబంధాలలోకి కూడా ప్రవేశించారు ఆంధ్రదేశపు స్త్రీలు. అలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ (అఖిల భారత మహిళా సంఘం) 1927లో పూనాలో తొలిసమావేశం జరుపుకొన్నాక భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా సంఘాల ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా దానిని విస్తరించి బలోపేతం చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పటికే బత్తుల కామాక్షమ్మ అఖిలాంధ్ర రాష్ట్ర మహిళా సభ కార్య నిర్వహణ సభ్యురాలు. అఖిలభారత మహిళా సంఘ కార్యదర్శిని అయిన కమలాదేవి చటోపాధ్యాయ రాజమహేంద్రవర స్త్రీల రిక్రియేషన్‌ క్లబ్బుకు కార్యదర్శిగా వున్న ఆదుర్తి భాస్కరమ్మను ఆంధ్రదేశం పక్షాన పనిచేయమని కోరింది. అప్పుడామె జిల్లా సభలు, రాష్ట్రసభలు జరిపి ఆంధ్రదేశపు ప్రాతినిధ్యం. అందులో వుండేట్లు కృషిచేసింది. అందులో భాగంగా 1939లో గుంటూరు మండల సప్తమ మహిళా సభ అక్టోబరు 28,29 తేదీలలో జరిగింది. దానికి అఖిలఙఙభారత మహిళా సభ అంధ్రశాఖాస్థాయీ సంఘ సభ్యురాలైన సి.హెచ్‌. చంద్రమతమ్మ హాజరై సభను ప్రారంభించింది. ఆదుర్తి భాస్కరమ్మ అధ్యక్షతన ఆసభ జరిగింది. (గృహలక్ష్మి 1939, డిసెంబరు).

బాపట్లలో కొటికలపూడి సీతమ్మ స్త్రీ విద్యావశ్యకతను గురించి చేసిన ఉపన్యాసం విని బాల్యంలోనే ప్రభావితురాలై స్త్రీ చైతన్యంకోసం 1931లో స్త్రీహితైషిణీమండలిని స్థాపించిన కనుపర్తి వరలక్ష్మమ్మ 1930వ థకం ప్రారంభానికే స్త్రీ అబలకాదు అని తర్కయుక్తంగా నిరూపిస్తూ వ్యాసం వ్రాసింది. స్త్రీ సహజశక్తులు మత సాంఘిక కట్టుబాట్ల చేత, ఆచారవ్యవహారాలచేత కుటుంబపరిస్థితుల చేత అణచివేయబడుతున్నవని – దానితో స్త్రీ పురుషుల మధ్య సమత్వ ధర్మంపోయి పాలకపాలిత పద్ధతి, బానిస యజమాని ధర్మం ప్రవేశించాయని – ఇది స్త్రీ వికాసానికి అవకాశాలను నిరోధించిందని, ఇంత నిర్భందంలో కూడా స్త్రీల బుద్ధిబలం, వాగ్భలం, దేహబలం పురుషునికి తీసిపోని విధంగా సమయం చిక్కినపుడల్లా బయటపడుతూనేవున్నాయని – అది గుర్తించకపోవటం దేశపురోభివృద్ధికి భంగకరమని ఆమె స్పష్టం చేసింది (1930 ఏప్రిల్‌)

స్త్రీసనాతన ధర్మమండలి 25వ వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించి కనుపర్తి వరలక్ష్మమ్మ తన ఉపన్యాసంలో ‘పరస్పర’ సహకారంతో స్త్ర్రీలు జ్ఞానవంతులు కావటానికి స్త్రీ సమాజాలు ఉపయోగపడతాయని – స్త్రీల జ్ఞానం, విద్య పురాణేతిహాసాల పఠనంతో ఆగక భూగోళం, చరిత్ర, మతం భాషా, ఆర్థిక విషయాల గురించిన సమగ్ర జ్ఞానంగా అభివృద్ధిచెందాలని లీలావతి, గార్గి, విజ్జలదేవి మొదలైన ప్రాచీన స్త్రీల
పాండిత్యం ఎంతటిదో గుర్తుచేసి, వార్తా పత్రికల పఠన ప్రాధాన్యతను వివరించి స్త్రీలు రాజకీయ విషయాలలో కూడా ఆసక్తిని పెంచుకోవాలని (1930 నవంబరు) ప్రభోదిఙంచింది.

వేటపాలెం సారస్వతనికేతనం ద్వాథవార్షికోత్సవ సందర్భంగా జరిగిన చతుర్థ మహిళాసభకు అధ్యక్షత వహించి అసమవివాహాలు స్త్రీల జీవితాన్ని దుఃఖపూరితం చేస్తున్నవని, వరశుల్కం మొదలైన దురాచారాలు స్త్రీల పురోభివృద్ధికి ఆటంకంగా వున్నాయని, స్త్రీలు పురుషులతో సమంగా వికాసం చెందే అవకాశాలుంటేనే దేశం బాగుపడుతుందని చెప్పింది వరలక్ష్మమ్మ. స్త్రీల రాజకీయ హక్కుల గురించి స్పష్టమైన దృక్పథంతో ఈ ఉపన్యాసంలోనే చర్చించింది. స్త్రీలకివ్వబడిన రాజకీయాధికారాలలో ఎన్నికలలో పాల్గొనటం ముఖ్యమైనదని, ఓటును వివేకంతో వుపయోగించాలని చెప్తూ స్త్రీల ఓటు హక్కు వినియోగం చాలా వరకు ఇంటిలోని మగవారి సలహాపై ఆధారపడుతుందేకానీ స్వబుద్ధిచే వినియోగింపబడటం లేదని గుర్తించి పేర్కొన్నది. స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకొనటానికి విద్యావంతులు కావటం అవసరమని, స్త్రీలు అధికంగా చట్ట సభలలోకి ప్రవేశించే కొద్దీ స్త్రీలకు మేలు చేసే చట్టాలను రూపొందించటానికి అవకాశం వుంటుందని భావించింది.

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గా ప్రస్దిద్ధికెక్కిన గుమ్మడిదల దుర్గాబాయమ్మ అబలలయెడ జరుగుతున్న అన్యాయాలపై కలం ఎక్కుపెట్టింది ఈ థకంలోనే. వేదనాపూరితమైన ఉద్విగ్న స్వరంతో ఆమె వ్రాసిన వ్యాసం ‘ అబలలయెడ అన్యాయములు ‘ (1930 ఏప్రిల్‌) స్త్రీని ఆటవస్తువుగా, అల్పంగా చూచే ధోరణిని నిరసిస్తూ, స్త్రీల పరాధీనతలోని అన్యాయాన్ని, విషాదాన్ని ప్రస్తావించి ‘గుమ్మం దాటి కదలనీయకుండా స్తీలను ఇంట్లోనే నిర్భంధించే పురుషుల దోషాన్ని ఎత్తి చూపింది ఈ వ్యాసంలో.

1929లో బాల్య వివాహాలను నిరోధించే శారదా చట్టం చేయబడింది. 1930 ఏప్రిల్‌ నుండి అది ఆంధ్రదేశంలో అమలులోకి వచ్చింది. స్త్రీలు చాలా వరకు దానిని ఆహ్వానించారు. అయితే అదే సమయంలో చెన్నపురిలో చెన్నరాష్ట్ర స్త్రీ విద్యా సాంఘిక సంస్కరణ సభ జరిగింది. అందులో స్త్రీలు విడాకులచట్టం కావాలని తీర్మానించారు. పులిమీద పుట్రలాగా ఇదేమిటి అని చాలామంది ఆందోళన పడ్డారు. శారదాచట్టం కొంతవరకు అవసరమే కానీ విడాకుల చట్టం అవసరమేముందన్నారు. శారదా చట్టం వచ్చింది కనుక కన్యకు ఇష్టమైన వరుడితో పెళ్ళిళ్ళే జరుగుతాయని, విడాకులు కోరే అగత్యమే వాళ్ళకు ఉండదన్నారు. 1930 మార్చి, ఏప్రిల్‌, జూన్‌, జులై, ఆగస్టు సంచికలలో 40 మంది స్త్రీలు విడాకుల చట్టంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రచురించబడ్డాయి. వారిలో ఐదుగురు కో. రాజరాజేశ్వరమ్మ, ఆదుర్తి భాస్కరమ్మ, సువర్లలక్ష్మీనరసమాంబ, పి. రత్నమణి, కె. పంకజాదేవి – మాత్రమే నిర్వంద్వంగా దీనికి తమ ఆమోదాన్నీ తెలిపారు. సమానత్వం కోరే స్త్రీల హక్కుగా దానిని వాళ్ళు గుర్తించి చెప్పారు.

ఈ థకంలో తెలంగాణ నిజాంరాష్ట్రాంధ్ర మహాసభల సందర్భంగా 1929 నుండి 1942 మధ్యకాలంలో తెలంగాణాలోని వివిధ ప్రాంతాలలో జరిగిన పన్నెండు ఆంధ్ర మహిళా సభలలో చురుకుగా పాల్గొన్న స్త్రీలు ఇచ్చిన ఉపన్యాస పాఠాలు స్త్రీ సమస్య గురించిన దృక్పథాన్ని వ్యక్తీకరిస్తాయి. 1925లోనే నడింపల్లి సుందరమ్మ మాణిక్యమ్మ, టి. వరలక్ష్మమ్మ మొదలైనవారు ఆంధ్రసోదరీ సమాజం ఏర్పరచి పనిచేయటం ఇందుకు మంచి నేపథ్యమైంది.

స్త్రీ సంఘం కేవలం ఈ యీ విద్యలే నేర్పాలని శాసించే అధికారం ఎవరికీ లేదని యెల్లా ప్రగడసీతాకుమారి ఆభిప్రాయపడింది. స్త్రీల ఆర్థిక పరాధీనతను గురించి ఆమె వేదనపడింది. స్త్రీకి స్వతంత్ర ప్రతిపత్తి జీవితం వుండాలని భావించింది. నడింపల్లి సుందరమ్మ, యెల్లా ప్రగడసీతాకుమారి, పి. సత్యవతీబాయి, విఠోబాయి, చాట్రాతి లక్ష్మీనరసమాంబ, జోగినేపల్లి రాధాబాయి, మాడపాటి మాణిక్యాంబ, బూర్గుల అనంతలక్ష్మి, సి.జయలక్ష్మిదేవి, నందగిరి ఇందిరాదేవి మొదలైన స్త్రీలు అభివృద్ధి మూల బీజంగా విద్యను గుర్తించి నిజాం రాష్ట్రంలో స్త్రీవిద్యఎంత వెనకబడివుందో గణాంకాలతో వివరించి, ప్రతి గ్రామంలో పాఠశాల, నిర్బంధ ప్రాధమిక విద్య, మాతృభాషలో విద్యాబోధన జరగాలని కాంక్షిస్తూ స్త్రీల ఉన్నత విద్య కొరకు వివాహాన్ని వాయిదా వెయ్యాలని ఆశించారు. పురుషులతో పాటు సర్వవిద్యలు సంపూర్ణంగా నేర్చే హక్కు స్త్రీలకు వుందని భావించారు.

బాల్యవివాహాలు, చిన్న వయసులో మాతృత్వం మాతాశిశు మరణాలకు కారణం అవుతుందని గుర్తించి బాల్యవివాహాలను నిరసించారు. స్త్రీల ఆరోగ్యం గురించి చర్చించారు. వితంతు వివాహాలను అభిలషించారు. ప్రభుత్వం వితంతు వివాహశాసనం చేసినందుకు (1936) ఆనందించారు. ఆదేవిధంగా బాల్య వివాహ నిషేధ శాసనం కూడా రావాలన్నారు. స్త్రీ పురుషుని కన్న తక్కువ అన్న బానిస భావం నుండి విముక్తి (1935) చెందాలని మాడపాటి మాణిక్యాంబ పిలుపునిచ్చింది.

వీటితో పాటు నిజాం రాష్ట్రాంధ్ర స్త్రీలు – అసృ ్పశ్యత, మద్యపానం, వ్యభిచారం, పరదాపద్ధతి మొదలైన సమస్యలను సంబోధించారు. సమాజం సంస్కరించబడి ఆర్థిక స్వాతంత్య్రం నిమిత్తం కర్మకౌశలం, శక్తి, ఆత్మ గౌరవం స్త్రీలు పెంపొందించుకొనాలని, స్త్రీలు ఉన్నతోద్యోగాలకు, శాసనసభా సభ్యత్వానికి ప్రయత్నించాలని బ్రిటిషు ఇండియాలోని స్త్రీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జాతియందు సగభాగమైన స్త్రీలు జాతి ఔన్నత్యానికి జరిగే కృషిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మహిళా సభలలోనే కాక పురుషుల సభలలో కూడా స్త్రీలు స్వతంత్రంగా పాల్గొనే అవకాశం రావాలని ఆశించారు. స్వాతంత్రం ఆర్థికస్వాతంత్య్రంతో ముడిపడి వుందని గుర్తించి స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రాన్ని కూడా కాంక్షించారు.

రాయలసీమలో ఈ కాలపు స్త్రీల ఉద్యమచైతన్యానికి బలమైన ప్రతినిధి కె. రామసుబ్బమ్మ. కడప మున్సిపాలిటీ సభ్యురాలిగా పనిచేసింది. ఆ మున్సిపాలిటీ క్రింద పనిచేస్తున్న ఆడ పాకీవాళ్లకు ప్రసవం తరువత నెలరోజులు పూర్తి జీవితం మీద సెలవు ఇవ్వాలని తీర్మానం తెచ్చి ఏకగ్రీవ ఆమోదాన్ని పాందటానికి గట్టి కృషి చేసింది. స్త్రీల కష్టాలు స్రీలకే తెలుస్తాయి. స్త్రీలకొరకు స్త్రీలు గట్టిగా నిలబడతారు అనటానికి ఆమె నిదర్శనం. స్త్రీలలో చైతన్యం కలిగించటానికి స్త్రీ విద్య, మహిళా సమాజాలు సాధనాలని అమె నమ్మింది. అఖిలభారత మహిళా సభలో ఆంధ్ర రాష్ట్ర విభాగానికి అధ్యకక్షురాలిగా మహిళా ఉద్యమ నిర్మాణంలో పాల్గొన్నది. విస్తృతంగా పర్యటించింది. అనేక వూళ్ళలో మహిళా సమాజాలు ఏర్పరచింది. తాను పూనుకొని ఆంధ్రరాష్ట్ర స్త్రీల మహాసభలను చిత్తూరులో ఒక సారి, కడపలో మరొకసారి (1940) నిర్వహించింది. ఆసందర్భంగా కడపలో మహిళా సమాజం స్థాపించబడింది.

1938లో సుబ్బారాయనుగారి బిల్లుపై చర్చలో అనేకమంది స్త్రీలు పాల్గొనటం గమనార్హం. శ్రీమతి రాధాబాయి సుబ్బరాయన్‌ సతి సెంట్రల్‌ అసెంబ్లిలో బహుపత్ని నిరోధక శాసనాన్ని ప్రతిపాదించింది. ఐదు సంవత్సరాలు నయంకాని జబ్బుతో భార్య బాధపడుతుంటే భర్త ద్వితీయ వివాహాం చేసుకొనటానికి అవకాశం కల్పిస్తుందీబిల్లు. ఇది స్త్రీల కన్నా పురుషులకే చాలా ఉపయోగకరమని స్త్రీలు వ్యతిరేకించారు. భార్యను వదిలించుకొనటానికి పురుషులకెన్నో మార్గాలున్నాయన్న లోకనిష్టుర వాస్తవం తెలిసిన స్త్రీ కనుక పాలూరి సత్యకుమారి దానిని వ్యతిరేకించింది.

కాకులపాటి రాధాసుందరమ్మ రెండవ వివాహాన్ని తలపెట్టిన దుష్టపురుషుడు 5 కాదు 10 సంవత్సరాలైన భార్య జబ్బుకు సరియైన మందిప్పించడు అంటుంది. మందులు ఇప్పించినా కుదరని జబ్బయితే ఆమె ఇష్టంతో మాత్రమే వివాహం చేసుకోవాలి అంటుంది. ” భార్య యొక్క అస్వస్థత వలన భర్త విడాకులు కోరుచో” అన్న మాటకు ఆమె అభ్యంతరం చెప్పింది. అటువంటి మినహాయింపులు ఇవ్వరాదంటుంది. భార్యా భర్తలకు ఒకరివల్ల ఒకరికి ప్రాణహాని వున్నదని రుజువైతే విడాకులు పొందవచ్చని, ఆస్తిని బట్టి భార్యకు పరిహారం ఇయ్యాలని ఆమెకు ఆమెపిల్లలకు ఆస్తిలో సగంభాగం ఇయ్యాలని ఈ బిల్లుకు సవరణలను ప్రతిపాదించింది.

పంగలూరి రాజ్యలక్ష్మమ్మ (4) (ఎ) సెక్షన్‌ ప్రకారం 5 సంవత్సరముల కాలం నయం కాని రోగకారణంగా రెండవవివాహం చేసుకొనదలచినపుడు పురుషునికి ఆస్తిలేనిచో ప్రథమ భార్యను పోషించు భాద్యతతో మాత్రమే రెండవ వివాహానికి కోర్టు వారు అనుమతివ్వాలి అన్న సవరణను ప్రతిపాదించింది. స్త్రీల రోగాలకు ముఖ్యకారణం, వివాహం, కాన్పులేనంటుంది ఆమె. అట్లా రోగ పీడితులైన స్త్రీలు అనేకమంది వున్నారని సంఘ కట్లుబాట్లవలన పురుషులు వారిని పోషిస్తున్నారని చట్ట ప్రకారం ఆ బాధ్యత పురుషుడి మీద పెట్టక పోతే రోగపీడితురాలైన ప్రథమ భార్యగతి అధోగతేనంటుంది ఆమె.

డి. భారతి ఈ బిల్లు ‘బహుపతి, బహుపత్నీ నిరోధక శాసనం’ అని వ్యవహరింపబడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. బహుపతులను పొందే పద్ధతి హిందూ స్త్రీలలో వుంటే కదా దానిని నిషేధించటం అంటుందామె. వితంతువివాహామే నిషేదించబడిన దేశంలో బహుపతి నిరోధక శాసనం అవసరం ఏమిటి అని ప్రఙశ్నించింది. బహుపత్ని నిరోధక శాసనంగా మాత్రమే దీనిని వ్యవహరించాలి అంటుంది. నష్టపరిహారం లేకుండా వివాహం రద్దుకు అనుమతించరాదన్నది ఆమె అభిప్రాయం. బహుపత్నీ నిరోధక శాసనం వస్తే స్త్రీలకు మహోపకారం అంటుంది జరుగుమిల్లి రామాబాయమ్మ. భర్తల నిరంకుశత్వం, అక్రమం, దయారాహిత్యం అదుపులో వుంటాయని ఆమె ఆశ.

భార్య ఐదేళ్ళు జబ్బుపడి వుంటే భర్త విడాకులు తీసుకొనటం అన్న భావనను స్త్రీలు హర్షించలేకపోయారు. భార్య సుఖమునకే కానీ, ఆమె దుఃఖంతో తనకు పనిలేదనుకొనే పురుషప్రవృత్తిని కందర్పకమల కుమారి నిరసించింది. రోగాన్ని విడాకులకు, పునర్వివాహానికి కారణంగా చేయటం భూపతిరాజు వెంకమ్మకూడా సహించలేక పోయింది. పెళ్ళి, ప్రసవం కారణంగా స్త్రీలు జబ్బుపడటం ఒకటయితే కొన్నిరోగాలకు ప్రత్యక్షంగా భర్తలే కారణమవుతున్నారు. అలాంటపుడు భార్యలు రోగిష్టులని నిర్బయంగా వేరేవివాహానికి సిద్ధపడటం సమంజసమా అంటుంది పాకాలరాజామణెమ్మ. వివాహ సంబంధమైన ఒక బిల్లుపై స్త్రీలు బాధిత స్త్రీల పక్షం తీసుకొని చర్చలో పాల్గొనటం ఒక అభ్యుదయాంశం.

దరిశి అన్నపూర్ణమ్మ ఆర్యవేశ్యకులంలో వితంతువుల పునర్వివాహాలకు పూనుకొన్న స్త్రీ. వేశ్యస్త్రీలలో సంస్కారానికి కృషిచేసింది. స్వయంగా వాళ్ళ యిళ్ళకు వెళ్ళి వివాహాలు చేసుకొని గౌరవంగా జీవించమని ప్రబోధించింది. భర్త ఉద్యోగరీత్యా విజయవాడలో వుంటున్నప్పుడు తుర్లపాటి రాజేశ్వరమ్మతో కలిసి ఎన్నో మహిళా సంఘాలు స్థాపించి, సమావేశాలు నిర్వహించి మహిళా చైతన్యానికి పాటుపడింది. 1929లో బొంబాయిలో జరిగిన అఖిల భారత మహిళా సభకు ఆంధ్రదేశప్రతినిధిగా బత్తుల కామాక్షమ్మతో కలిసి వెళ్ళింది. 1938లో నరసరావు పేటలో ఉన్నవ లక్ష్మీబాయమ్మ, రాయసం రత్నమ్మగార్ల ప్రోత్రాహంతో స్త్రీ విద్యాభివర్థినీ సమాజం ఏర్పడింది. 1938 నుండి పశ్చిమగోదావరి జిల్లా మహిళా సంఘం స్త్రీ జనాభుద్యయానికి కృషి చేసింది. 1942లో తాడికొండలో మహిళాసంఘం ఏర్పడింది.

ఈ థకంలో కొమర్రాజు అచ్చమాంబ వ్రాసిన వ్యాసాలు స్త్రీల రాజకీయ చైతన్యానికి నిదర్శనం. 1935లో రాజ్యాంగ చట్టం వచ్చిన తరువాత రాజకీయ పరిణామాలను ఆమె విమర్శకు పెట్టింది. ఈ చట్టం ద్వారా ఎన్నికలలో పాల్గొని అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాలను స్థాపించే అవకాశం కల్గింది. స్వతంత్రం లేకుండా రాజ్యభారంవహించి దేశాన్ని సరిదిద్దటం హాస్యాస్పదమని ఆమె అభిప్రాయం. అదే సమయంలో ఆమె స్త్రీలు పురుషుని అభిఙమతం మేరకే స్వేచ్ఛను అనుభవించే స్థితిని కూడా ఖండించింది. పురుషునితో పాటు రాజకీయార్థిక సాంఘికాది అన్ని విషయాల్లోనూ సమానంగా హక్కులలో బాధ్యతలతో పెరిగే అవకాశాలు స్త్రీలు కల్పించుకోవాలని ఆశించింది. హిందూదేశ రాజ్యాంగ చట్టం ప్రకారం జరిగిన ఎన్నికలలో 56మంది స్త్రీలు గెలిచి శాసన సభ్యురాండ్రుగా వున్న విషయాన్ని ప్రస్తావించి మాతృదేశరాజకీయార్థిక స్వాతంత్య్రానికి పాటు పడాలని వాళ్ళను సంబోధించి చెప్పింది.

ఎన్నో అసంబద్దతలతో వున్న ఈ రాజ్యాంగ చట్టం మన ఆదర్శమైన స్వాతంత్య్రం వైపు శతాంశమైన జరగలేదని ‘ సహకారమా విధ్వంసమా? ‘ అన్న వ్యాసంలో చెప్పింది కొమర్రాజు అచ్చమాంబ. ఇదివరకున్న హక్కులను కూడా కాజేసి ఈ చట్టం మనలను మరింత వెనుకకు తీసుకు వెళ్తున్నదని ఆమె అభిప్రాయం. జమిందారీ పద్ధతి నిర్మూలించుట మొదలైన విషయాలమీద శాసన సభలో చర్చపెట్టే ధైర్యం కాంగ్రెసుమంత్రులకు లేదన్నది.

– ఆచార్య కాత్యాయనీ విద్మహే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ -~~~~~~~~~~~~~~~~~~~

29

సాహిత్య వ్యాసాలు ​, , , Permalink

Comments are closed.