నా కళ్లతో అమెరికా-31

వాషింగ్టన్ డీ.సీ ( భాగం-2)

Dr K.Geetaఉదయం వైట్ హౌస్, కాపిటల్ హాల్ ల సందర్శనల  తర్వాత మధ్యాహ్నం భోజనాల సమయానికి  నేచురల్ హిస్టరీ మ్యూజియం కు తీసుకెళ్లాడు  మా గైడు. సరిగ్గా గంటన్నర సమయంలో మ్యూజియం చూడడం, భోజనం కూడా పూర్తి చేసుకోవాలి మేం. ఈ నేచురల్ హిస్టరీ మ్యూజియం థీం తో తీసిన “నైట్ ఎట్ ది మ్యూజియం”  సినిమా ఇక్కడికి వచ్చే ముందే చూసి ఉన్నామేమో  భలే ఉత్సాహంగా అనిపించింది అందరికీ.

స్మిత్ సోనియన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం:- గుండ్రంగా ఉన్న ఎంట్రన్సు హాలు లో చుట్టూ  ఉన్న ఒక్కో గుమ్మంలో నుంచి ఒక్కో విభాగానికి వెళతాం. ముందుగా కుడి చేతి వైపు ఫాసిల్స్ విభాగంలో డైనోసార్స్ ఫాసిల్స్ ప్రదర్శన అబ్బురపరిచేదిగా ఉండడం తో ముందుగా అటు నడిచాం. నిజానికి అంతా తిరిగి చూడడానికి తప్పనిసరిగా ఒక రోజైనా పడుతుంది. గంటన్నర లో గంట ఎగ్జిబిట్లకి, అరగంట భోజనానికికేటాయించుకున్నాం మేం.

అందుకే ముఖ్యంగా చూడవలసినవి కొన్ని నిర్ణయించుకుని త్వరగా చూసొచ్చాం.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బర్డ్స్ సెక్షన్, ఫస్ట్ ఫ్లోర్ లోని ఆనిమల్ సెక్షన్, మామల్ హాల్  వంటివి వదిలి వేయ వలసి వచ్చింది.

హోప్ డైమండ్ : పై అంతస్థు లోని జెమ్స్ సెక్షన్ లో ప్రపంచ ప్రసిద్ధ్ గాంచిన “హోప్ డైమండ్” ని చూసేం. ఇది గుంటూరు జిల్లా లోని “కొల్లూరు గని ” లో బయల్పడినదట. క్రీ.శ 1650 ప్రాంతం లో గోల్కొండ సామ్రాజ్యానికి చేరిన ఈ వజ్రం  జీన్ తావేర్నియర్ అనే ప్రెంచ్ వజ్రాల వ్యాపారి స్వంతమైంది. అందుకే మొదట దీనిని ” తావేర్నియర్ బ్లూ డైమండ్” అనే వారట. అంతే కాదు, “ది ప్రెంచ్ బ్లూ” అని చారిత్రాత్మక నవల కూడా రాయబడింది. 18 వ శతాబ్ది లో ఇంగ్లండ్ లో థామస్ హోప్ అనే ధనిక వ్యాపారి చేతికి  చేరిన ఈ వజ్రం తర్వాతి కాలంలో “హోప్ డైమండ్ ” గా పిలువబడింది. శతాబ్దాల తరబడి దేశ దేశాలు తిరిగిన ఈ వజ్రాన్ని  1958 లో స్మిత్ సోనియన్ మ్యూజియం కు న్యూయార్క్ కు చెందిన  వజ్రాల వ్యాపారి “హారీ విన్ స్టన్” డొనేట్ చేసాడు.  అప్పట్లో మిలియను  ఖరీదు చేసే ఈ వజ్రాన్ని ఎందుకు డొనేట్ చేయవలసి వచ్చిందో మాత్రం  ఎవరికీ తెలియదు. 

ఇన్సెక్ట్ జూ లో ప్రత్యేక టిక్కెట్లతో అనుమతించే చిన్న సీతాకోక చిలుకల ఎగ్జిబిట్ లోపలికి వెళ్లలేకపోయాం.

ఈజిప్షియన్ మమ్మీస్ ని కూడా సమయాభావం వల్ల చూడలేకపోయాం.

డైనోసార్ విర్ట్యువల్ షో చాలా బావుంది. స్క్రీన్ మీద తిరుగుతున్న డైనోసార్ల మధ్య ఎదురుగా నిలబడ్డ మన ప్రతిరూపాలు కనిపించడం అద్భుతం.  

 ఇక భోజనానికి అక్కడ ఉన్న కాఫెటేరియా లైనులో నిలబడి తెచ్చుకోవడానికే పదిహేను నిమిషాలు పట్టింది. ఇక గబగబా తినడం పూర్తి చేసి బయట పడ్డాం.

ఇక్కడి ఎగ్జిబిట్లన్నీ ” నైట్ ఎట్ ది మ్యూజియం” సినిమాలో చూపించినట్లు రాత్రి లేచి తిరుగుతాయన్నంత నేచురల్ గా ఉన్నాయి.

బయటకు వచ్చేక మా బస్సులో ఒక గ్రూపులో ఒకామె మిసయ్యి పోయింది. ఆవిడ ఫోను కూడా స్విచ్చాఫ్ లో ఉంది. బస్సు వాళ్లు సమయం సరిపోదని పోనిచ్చేసేరు. అయితే లక్కీగా బస్సు మ్యూజియం వెనక వైపు మలుపులో ఆవిడ సరిగ్గా బస్సు కోసం వేచి చూస్తూ కనబడింది. వాళ్ళ గ్రూపు వాళ్లతో పాటూ నేనూ “హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నాను.

“మేడం టస్సాడ్” వేక్స్ మ్యూజియం: అక్కడి నుంచి “మేడం టస్సాడ్” వేక్స్ మ్యూజియం కు తీసుకెళ్లేరు. మొదటి సారి వేక్స్ మ్యూజియం చూసేమేమో భలే అద్భుతంగా ఉంది.  సహజ సిద్ధంగా, నిజంగా అక్కడ ఆ మనుషులే ఉన్నట్లు అనిపించాయి విగ్రహాలు.  ప్రధానంగా పాలిటీషియన్సు విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. చాలా  సినిమా వాళ్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. నచ్చినవారితో నచ్చినన్ని ఫోటోలు తీసుకోవచ్చక్కడ.  వాళ్ళ లాగే నిలబడి ఫోజులు పెట్టి, ఫోటోలు తీసుకుంటూ, నవ్వుకుంటూ బాగా సరదాగా గడిపేం.

ప్రత్యేక టిక్కెట్టుతో ప్రెసిడెంట్ ఒబామా, మిచైల్ లతో ఫామిలీ ఫోటో తీసుకోవచ్చు. ఎలాగూ వైట్ హౌసు దగ్గిర ఒబామా ఫోటో తీసుకునే అవకాశం లేదు కాబట్టి అత్యంత నేచురల్ గా ఉన్న ఈ  విగ్రహాల  దగ్గిర ఫోటోలు తీసుకునే అవకాశాన్ని వదులుకోకుండా ఫామిలీ ఫోటో తీసుకున్నాం. మ్యూజియం చూడడానికి ఉన్న  గంట సేపటిలోనూ ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటూ గడిపేం.

పిల్లలు “వేక్స్ హేండ్ ” కోసం లైను లో నిలబడి, ఆ తయారీలో  చేతులు ముంచి చివరి నిమిషం వరకూ కూచున్నారు. సరిగ్గా సమయానికి బిల్లు కౌంటర్ దగ్గిర చాలా  పెద్ద లైను వల్ల బస్సు వాళ్లు ఖంగారు పెట్టడం తో పరుగెత్తాల్సి రావడం తో మేం అవి కొని తెచ్చుకొలేకపోయాం. పిల్లలు ఏడుపు ముఖాలు పెట్టినా మరో గంటలో తేరుకున్నారు. నాకు మాత్రం భలే బాధగా అనిపించింది. ఇలా టూర్ లో రావడం వల్ల పదినిమిషాల వ్యవధి కూడా అధికంగా లేదు మాకు. అందువల్లే  పిల్లల చేతుల వాక్స్ బొమ్మలు తెచ్చుకోలేక పోయాం.  మా దగ్గిర్లోని  మరో వేక్స్ మ్యూజియంకి మరోసారి  వెళదామని సర్ది చెప్పుకున్నాం.

డీసీ  రివర్టూర్: ఇంతా చేసి మమ్మల్ని  పరుగులెత్తించి సాయంత్రం మరో గంటన్నర పాటూ డీసీ  రివర్టూర్  కి తీసుకెళ్లేరు. ఆ రోజు టూర్ లో వేస్ట్ అనిపించినదదే. ఈ రివర్ బోట్ టూరు ఇంతకు ముందు చూసిన ఏ సిటీ  రివర్ టూర్ కంటే గొప్పగా ఏవీ లేదు. ఒక టూర్ అని బుక్ చేసుకున్నందువల్ల తప్పనిసరిగా చూడాల్సినవాటిల్లో భాగంగా తిరిగాం అంతే.

లింకన్ మెమోరియల్ : ఆ రోజు పొద్దుపోయే వేళకల్లా చివరి స్టాప్ అయిన “లింకన్ మెమోరియల్ ” కు వెళ్లేం. విశాలమైన, ఎత్తైన భవన ప్రాంగణం, మధ్య ఠీవిగా కూర్చుని ఉన్న పెద్ద లింకన్ విగ్రహాన్ని ఎంత చూసినా తనివి తీరనట్టు అనిపించింది. దగ్గరలోనే ఉన్న “జెఫర్సన్ మెమోరియల్ ” చూపించే సమయం లేదని చెప్పేరు టూర్ వాళ్లు.

చల్లటి చలి సాయంత్రాన్ని ఒడిసి పట్టుకుంటున్న వేళ శరీరపు వణుకుని అధిగమించి, నిశ్శబ్దంగా అక్కడిపచ్చిక లో కూర్చుని ఉండిపోవాలనిపించింది.

రాత్రి భోజనాలకు మరలా చైనీస్ రెస్టారెంట్ తప్పలేదు. అయితే ఈ సారి ఒక్కో గ్రూపుకి ఒక టేబుల్ రిజర్వ్ చేసేరు. మాతో పాటూ మరో సౌత్ అమెరికన్ ఫామిలీ ఆ టేబుల్ దగ్గిర ఉన్నారు. గుండ్రంగా తిరిగే మధ్య బల్ల మీద ఒక వెజ్ ప్లేట్ పేరుతో ఉడికించిన పొడవాటి బీన్స్, టోఫు, మిగతా నాలుగైదు ప్లేట్లు నాన్ వెజ్ ..వరసగా నత్తగుల్లలు, టైగర్ ప్రాన్స్, పొడవాటి చేపల వేపుడు, తియ్యటి ఆరెంజి మాంసం, చేతికి అంటుకునే తెల్ల     అన్నం. అన్నిటి మీదా  గుమ్మరించిన సోయాసాస్. అవి చూసేటప్పటికి మాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

వరు సంగతి చెప్పనే అక్కరలేదు. ఆకలితో ఉండలేం కాబట్టి తిందామని ప్రయత్నించాం. ఇప్పుడు తలచుకుంటే బాగా నవ్వు వస్తూంది కానీ అప్పుడు బొత్తిగా రుచీ పచీ లేని భోజనం తినడం చాలా కష్టమైంది.

మా రాత్రి బస డీ.సీ లోనే ఉండడం వల్ల అక్కడి నించి త్వరగానే చేరుకున్నాం. రోజల్లా అలిసిపోయి ఉన్నామేమో బాగా నిద్ర వచ్చేసింది అందరికీ. అక్కడి నించి ఉదయం మా ప్రయాణం మరో నాలుగు వందల మైళ్ల దూరంలో ఉన్న నయాగరాకి. పొద్దుటే అయిదు గంటలకు యథావిధిగా లేవాల్సి ఉంది.

(ఇంకా ఉంది)

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=11553#sthash.i3voaocx.dpuf

(ఇంకా ఉంది)

– డా.కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.