‘కోడలూ ఓనాటికి అత్తే!!

ఉదయం ఇంకా పక్కదిగకుండానే నా భార్య భానుమతి సణుగుడు  చెవిన పడింది.దాంతోపాటుగా ఎవ్వరూ అక్కడ లేనందున గిన్నెలపై ఆమె చూపే ప్రతాపం కూడా వినిపిస్తూనే ఉంది. ఎవ్వరూ అంటే ముఖ్యంగా మా అమ్మన్నమాట.                                                                                                                                        

“కోడళ్ళట కోడళ్ళు! కొడవళ్ళు…కొడవళ్ళు, ఇద్దరు వెధవలూ భార్యల  కొంగుల చాటు చవటలు.భార్యలని అదుపులో పెట్టు కోలేని దద్దమ్మలు..”   ఎందుకో భాను మాటలు  నా చెంపమీద  ‘ఛళ్ ఛళ్ ‘మనిపించి నట్లై గభాల్నమంచం దిగాను.   ” ఏంటిభానూ! నీలో నువ్వే ఏదో మాట్లాడు కుంటున్నావ్?” అన్నాను,ఏదో ఒకటి పలకరించాలి కనుక.  “ఏముందీ! పొద్దుటే అమ్మకు ఫోన్  చేస్తే జ్వరాన పడుందిట ! ఇద్దరు దద్దమ్మలూ వాళ్ళ భార్యా పిల్లలతో ఉమ్మడి స్నేహితుని చెల్లెలి పెళ్ళి కెళ్ళారుట!  ఈమేమో’  తానూ వస్తాన’ని వెళ్ళవలసింది.అడిగినా తీసుకెళ్ళరనుకోండీ!…” కసి కసిగా అంది భాను.                                                                                                                                      

“అయ్యోపాపం ! ఎలాఉంటున్నారు అత్తయ్యగారు! కాఫీ కాచిచ్చే వాళ్ళైనా ఉన్నారో లేరో!”అన్నాను ఉపశమనంమనంకోసం.  “ఆ…పనమ్మాయిని ఉంచి వెళ్ళారుట లేండి,అది అన్నీచేసి ఇస్తూనే ఉన్నదిట. ” అంది బాను.                                        నామనస్సు కొంచెం వెనక్కెళ్ళింది. అమ్మకు జ్వరం వచ్చిపడుకోనున్నపుడు మేమంతా ఆమెను ఒక్కర్తినే వదలి మూడు రోజులు భానుఅన్నగృహ ప్రవేశానికి వెళ్ళాం . అమ్మను వంటరిగా వదలి ఎలావెళ్తామని పైకి అనలేని చవట దద్దమ్మను కదా!                                 

       కాఫీ తాగినట్లుంది భాను వచ్చి హాల్లోకూర్చుని మరదలిపైనా, వదిన పైనా నోటి కొచ్చినవన్నీ తనకోణంలోచూస్తూ నాన్ స్టాప్ గాతిట్టడం మొదలెట్టింది. ” అసలువాళ్ళకు మొగుళ్ళెలా వచ్చారుట! ఆమెకని పెంచి,చదివించి ,పెద్ద చెస్తేనేకదా.“అంటూ.  ‘మరి తనకు మొగుడెలా వచ్చడో మరి! గురివింజ గింజ ! ‘ అసలు విషయానికోస్తే వాళ్ళమ్మ నగలూ ,వెండిసామానూ  నాల్గు   వాటా లేసి ఉన్నదంతా ముగ్గురికీ పంచేసింది. ఆమె వాటా మాత్రం ఉంచుకుంది .అది తనకు ఇవ్వాలని, అది తన కోడళ్ళిద్ద రికీ ఇస్తుందేమోని భానుకు చెప్పలేని బాధ. ఆమె మెడలో ఉన్ననాల్గు పేటల చంద్రహారం, చేతులకున్నడజనేసి బంగారు గాజులూ,రవ్వల దుద్దులూ ,ఆమె అన్నంతింటున్న పదికేజీల పాతకాలపువెండికంచం , గ్లాసూ , వెండికుందులూ పూజా సామగ్రీ లాంటివి మరి కొన్నితర్వాత వాళ్ళకే ఇస్తుందే మోని కూడా భాను భయం. అందుకే ఆమెను మంచి చేసుకోను కాచు క్కూర్చుంటుంది. బంగారం, వెండి రేటుపెరిగి పోయాక భానుకు వాళ్ళమ్మపై ప్రేమ కూడా పెరిగి పోయింది. స్వార్ధం లేందే భాను ఎవ్వర్నీఇష్టపడదు.  పెళ్ళైన కొద్దిరోజులకే భాను మనస్సు నాకుబాగా అర్ధమైంది.                                                                                                         

    గంటతొమ్మిదైంది.కడుపు నకనకలాడుతున్నది.రోహిత్ ,మోహిత్ ఇద్దరూలేచి “అమ్మా! ఆకలి, ఆకలి, క్రికెట్ మేచ్ టైమైంది “  అంటూ అరుపులనే కంటే  కేకలే వేస్తూవచ్చారు.                                                                                                                                

 ”  ఏదోమనస్సుబాగాలేక కూర్చున్నానే అనుకోండి,ఆవిడకాస్తంత టిఫిన్చేస్తేఏంటిట!” అంది . ‘ఆవిడ’అంటే మా అమ్మ , భానుకు అత్తగారు, భానుది ఏమాత్రం ఛాన్స్ వదులుకునే తత్వం కాదు.  ప్రతిఆదివారం జరిగేతతంగమే ఇది,మాకేంకొత్తకాదు. గతవారం ఇలాగే కూర్చుంటే అమ్మ ఉప్మాచేస్తే ,’ఛీ పాడు ఉప్మా పిల్లలు తినరే తినరూ’ అంది .వాళ్ళు బాగానే భానుకూ మిగల్చ కుండా లాగిచ్చేసి వెళ్ళిపోయారను కోండీ! ఆముందువారం’ పూరీ’చేస్తే ‘అమ్మో ఎంత నూనె ,’ఇలా డీప్ ఫ్రైస్  తింటే ఆరోగ్యాలే మై పోనూ!’ అన్నట్లు గుర్తు. అంతక్రితం వారం’ పెసరట్టు’చేస్తే ‘ఇలా అట్లు మరిపితే ఆతర్వాత [అంటేఅమ్మపోయాకన్నమాట!]  గంటలకొద్దీ నిల్చుని అట్లు పోయటం నావల్ల కాద’న్నట్లూ గుర్తే!’ కానీ నేను అసమర్ధుడుని ,అన్నీలోలోపల అనుకోవలసిందే!                                                                                                              

     భాను దెప్పిన మరుక్షణంలోనే  టేబుల్ మీదకు ’ పెసరపప్పు పొంగలి’ ఘుమఘుమా వాసనల తోవచ్చి చేరింది. ముక్కు పుటాలు అదిరి పోతుండగా  .రోహిత్ ,మోహిత్ ఇద్దరూ గబగబా వచి ప్లేట్స్ నిండా పెట్టుకుని రుచిచూసి,  “అదిరింది బామ్మా! ఆహా ఏమిరుచి! “ అంటూ ,నాకూ ఒకప్లేట్లో పెట్టిచ్చి “తినునాన్నా! బామ్మ చెయ్యే చెయ్యి ” అంటూ అందించి, ఇంచు మించు గా  అంతా లాగిచ్చేశారు. ఆతర్వాత  సైకిళ్ళేసుకుని ‘బై ‘ చెప్పి వెళ్ళిపోయారు. ప్రతిఆదివారం వాళ్ళ కు క్రికెట్ మ్యాచ్! తుఫాన్ వచ్చినా ఆగరు! అడుగున మిగిలిందంతా ప్లేట్లోకి గీకి గీకి పెట్టుకుని తింటూ , చాలి నట్లు లేదు పాపం, ” ఏంమరికాస్త చేస్తే పోయేదేమిటిట!నేనుతినేస్తాననిబాధ.ఐనా ఈ పెసరపప్పుఎంతవాతం!”తింటూనే సొణగ సాగింది. నాచెవులకెప్పుడో మా అమ్మగురించీ నాభార్య అనే మాటలు వినిపించని రోగమొచ్చేసింది లెండి!           

” ఒరే రాఘవా! అలా గుళ్ళోకెళ్ళి వస్తాన్రా !” అనిచెప్పి అమ్మ కాస్తంతసేపు గృహజైల్ నుండీ బైల్ కోసం ఆదివారాలప్పుడు గుడిని ఆశ్రయించడం మామూలైపోయింది.అక్కడ అభిషేకానంతరం పెట్టేప్రసాదం,అరటిపండుతిని,వచ్చేస్తుంది.ఇహ ఆరోజు కు లంచ్ లేదు, సాయంకాలం తిరిగి గుళ్ళోప్రసాదమే! ఆమె తనను తాను,నన్నూ, సంరక్షించుకోను ఆదివారాలు అలా చేస్తుంటుంది. కోడలితో పడలేదని అంతా అనుకుంటారని ఎక్కడా నోరువిప్పదు. కొడుకు పరువు తనప్రాణంగా భావి స్తుందామె. కూతురి క్కూడా ఒక్కమాట చెప్పదు.                                                                                                                                                                                                   

 కోడలు వాళ్ళమ్మగురించీ రోజంతా బాధపడటం చూసి అమ్మ ,సాయంకాలానికి ” పోనీ రాఘవా! నీవువెళ్ళిభానూ వాళ్ళమ్మ  వసంతమ్మని తీసుకురా కూడదుట్రా ! కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారావిడ ! ఆవిడకూ కాస్తంత  వెసులుబాటుగా ఉంటుందికదా! ”    అంది .అమ్మ మనస్సు నిజంగానే అమృతం.తన ఉనికే పడని తనకోడలు, ‘తల్లి‘గురించీ బాధపడటం చూడలేక ఇంత ఆలో చిస్తు న్నదంటే ఆమె మనస్సు ఎంతగొప్పదో అనిపించింది నాకు. కానీఏం లాభం? గుడ్డికన్ను తెరిస్తేనేం మూస్తేనేం!                                                                                                                       

        మా చెల్లాయి ” అన్నా! అమ్మను పంపుతావా నాల్గురోజులుంచుకుని పంపుతాను.మా ఆయన క్యాంప్ కెళుతు న్నారు. మాక్కాస్త తోడుగా ఉంటుందిపిల్లలకు పరీక్షలురా! నేను ఆఫీసునుండీవచ్చే వేళకు వాళ్ళకు కాస్తంత వండిపెడుతుందనీ..”   అనిఫోన్ చేసింది. నాకూఅనిపించింది మా అత్తగారు వస్తే ఉండేందుకుమరో గది లేనందున, “సరేని”  మా అమ్మను  చెల్లి ఊరికి పంపాను.  అమ్మ అన్నట్లు తనకూ కాస్తంత వెసులుబాటుగా  ఉంటుందని. భానుతనే వెళ్ళి బలవంతాన వాళ్ళమ్మను టాక్సీ మాట్లాడితీసుకొచ్చింది.                                                                                                                                                      

“మీఅన్నవచ్చాక వస్తాన మ్మాయ్!, నాకోసం పనమ్మాయిని కూడా మాట్లాడిపోయారు, నాకన్నీఅమరుస్తున్నది. డాక్టరూ రోజూ వచ్చిచూస్తూనే ఉన్నాడు,ఇదిఫ్లూజ్వరంట మరోరెండురోజుల్లో లేచితిరిగే ఓపిక వస్తుంది, వాళ్ళు లేనపుడు వస్తే బాగుం డదు. ” అని ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఇతర్లమాటవినే తత్వంకాదు భానుది.భాను వాళ్ళమ్మను తీసుకు ని వచ్చేసరికి అమ్మ లేకపోడంతో , ఆకాశమంతెత్తు ఎగిరింది.                                                                                                                                                          

  ” మా అమ్మ వస్తే పని చేయాల్సి వస్తుందని దొంగెత్తేసి వెళ్ళింది, కుళ్ళుమోతుది” అంది భాను .                                                                                                                     

మా అత్తగారే ” ఏం మాట్లాడుతున్నావే భానూ! మీ అత్తగారినలా అనవచ్చా? నీభర్తతో ఇలాగేనామాట్లాడేది?” అని మందలిం చింది కూడా. నేనుప్రేక్షక పాత్ర పోషించడంతప్ప  ఏమీ మాట్లాడలేని దద్దమ్మను. ఊరెళ్ళేప్పుడే అమ్మ మాఅత్తగారి కోసం తన గది  ఖాళీచేసి వరండాలో మెట్లక్రింద అడ్డుగా తడికెలు పెట్టి గదిలాచేసిన లంబర్రూం లో తన మడతమంచం  వేసుకుని తన పుస్తకాలూ, బట్టలూ సర్దుకువెళ్ళింది . వారం తిరిగేసరికి అన్నట్లుగా మా చెల్లాయ్ అమ్మనుపంపేసింది.                                                                                                                                                మా అత్త గారు వచ్చాక మా అమ్మకు ఇంకాపని ఎక్కువైంది. వాళ్ళమ్మకు బాగాలేదని  నాభార్య తానేమీ పని చేసేది కాదు. ఆవిడ దగ్గరే రోజంతా ఇంట్లో ఉన్నంతసేపూ కూర్చుని గడిపేసేది, ఆఫీసు టైందాకా.                                                                                                                  

     అందరికీ ఉదయాన్నే కాఫీలు టిఫిన్స్ ,8కంతా  క్యారేజీలు కట్టడం అన్నీ అమ్మమీదే పడ్డాయి .పిల్లలుస్కూళ్ళ కు ,నేనూ , భానూ ఆఫీసులకూ వెళ్ళాక ,ఇంతకు ముందు ఆమె పురాణం చదువుకునేది,లేదా  కాస్తంతసేపు టి.వీ. లోఏ రామాయణమో,  భాగవతమో, సి.డీలు పెట్టుకుని చూసేది. ఇప్పుడు మా అత్తగారు వచ్చాక ఆమెకు మందులు, వేడివేడిగా జావకాచివ్వటాలూ  చేయవలసి వస్తున్నది.మా అమ్మవచ్చి అన్నీ వేళకు అమర్చడంతో మాఅత్తగారు  బలం పుంజుకుని మెల్లిగాలేచి నడవ సాగింది.      ” అయ్యో మీరు నాకు చేయటమేంటండీ!భాను నుమరో నాల్గురోజులు శలవు పెట్టమంటాను.మీరీ వయస్సులో ఇంతపని చేయటం నాకు చాలా బాధగా ఉంది. అనవసరంగా తీసుకొచ్చింది,  అక్కడ నాకు అన్నీ అమర్చే వెళ్ళారుపిల్లలు ” అన్నారావిడ .  కూతురు రాగానే ఆమెచెప్పినట్లుంది .భాను మా అమ్మపై సీమ టపాకాయలా పేలింది.                                                                                                              ” మా అమ్మ నావద్ద నాల్గురోజులుంటే కళ్ళల్లో నిప్పులుపోసుకోవాలా ఏం? లేనిపోనివన్నీ ఆమెకు చెప్పి అసలే బాగులేని ఆమె మనస్సు బాధ పెట్టాలా?”అని పెద్ద రగడ చేసింది .                                                                                                                  అదివిన్న మా అత్తగారు “ఏమే భానూ ! నీకింత నోరెక్కడవచ్చిందే! పరువు మర్యాద లేకుండా అత్తగారిని పట్టుకుని ఎంతెంత మాట లంటున్నావే!? నీకేమన్నా మతిపోయిందా? ఆమె కనిపెంచి,చదువు సంస్కారం నేర్పించి, పెళ్ళి చేస్తేనేకదా నీకీ నాడు రాఘవ మొగుడయ్యాడు? అసలు నీముఖం ఒక్కసారి అద్దంలో చూసుకో,మీఆయనపక్కన నిల్చునే అర్హతకూడానీకులేదు. ఆఫీసులో చూసి నీవు ఇష్టపడుతున్నావని మేము వచ్చి అడిగితే మీ అత్త గారు తనకొడుక్కు’నాయనా! మనం ఇష్టపడేవారి కంటే  మనల్ని ఇష్టపడేవార్ని చేసుకుంటే జీవితం హాయిగా సాగుతుంది ‘ అని నచ్చజెప్పి వప్పించింది. తల్లిమాట జవ దాటని ఆసంస్కారి నీ అందాన్నికాక, తన తల్లి మాట కోసం నిన్నుచేసుకున్నాడు. చిన్నతనంలోనే భర్త మరణించినా, ఆ బాధకడుపు లోపెట్టుకుని,కూతుర్నీకొడుకునూ చదివించి సంస్కార వంతంగా పెంచిన మహాఇల్లాలు. మీఆయన నోరులేని వాడని ఇలా ఆమెపై నోరు పారేసుకుంటున్నావ్? తల్లిని ఇన్ని మాటలంటున్నా నోరువిప్పకపోడం ఆయన సంస్కారం, మంచి తనం. ఆవి డెంత మంచిది! నాకు తనగదిచ్చి బయట చలిలో తడికెల గదిలో పడుకుంటున్నది , ఆమెకు నేను చేయ వలసిన పనులన్నీ నాకు చేస్తున్నది! ఎంత అహంకారమే నీకు! నీలాగే మీవదినా మరదలూ నన్నూ చూస్తే మీ అన్నదమ్ములు బయటికి గెంటే స్తారు వాళ్ళని . నేనిక నీ ఇంట్లో ఒక్కక్షణం ఉండను. నీకూ ఇద్దరు కొడుకులున్నారు, వాళ్ళన్నీ చూస్తున్నారుగా వాళ్ళ పెళ్ళి ళ్ళయాక నీకోడళ్ళూ నిన్నిలాగే చేస్తారే !కోడలూ ఒకనాటికి అత్తే అని గుర్తుంచుకో.” అని తన బట్టలు సర్దుకోసాగిందామె.                                                                                                                                                                      

ఇంతలో,భాను అన్నఫోన్ చేశాడు.” ఎందుకేభానూ!అమ్మను తీసుకెళ్ళావ్?అమ్మకు జ్వరంగా ఉండి రాలేనంటేనే, పనమ్మా యిని పెట్టి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాం. నీవు ఊద్యోగం చేస్తున్నావుకదా! ఎలా కుదురుతుందీ ? ఇప్పటికే 15 రోజులైంది, బాగు లేనావిడను అటూ ఇటూ తిప్పటమెందుకని ఇన్నిరోజులూ ఊర్కున్నాం. అమ్మను మేం వచ్చి తీసుకెళతాం” అన్నాడు.                                                                                                                                                             ” ఏరా!అమ్మనలా వంటరిగా జ్వరంతో వదిలేసి  వెళ్ళకపోతే , మీభార్యల్లోఒకర్నిఉంచి వెళ్ళచ్చుగా?”అంది భాను కోపంగా. “ఏమేమాకు చెప్తున్నావ్? నీవు మీ అత్తగార్ని ఎలాచూసుకుంటావో మాకు  తెలీదనుకోకు.పెద్ద నంగనాచి లామాట్లాడు తు న్నావ్? నీ ఆడబడుచు నిన్నిలాగే అడిగితే ముఖమెక్కడ పెట్టుకుంటావే! మీరంతా బాబాయికొడుకు పెళ్ళికీ,మా ఇంటిగృహ ప్రవేశానికి వచ్చినపుడూ మీ అత్తగార్ని తీసుకొచ్చారా?మీరంతా మైసూర్ వెళ్ళి నపుడు జ్వరంతో ఉన్నమీ అత్తగార్ని వంటరి గా వదిలేసి వెళ్ళలేదూ! మీ అత్తగారిని శతృవులా చూట్టంలేదూ! ఆమెకు ఒక్క రోజైనా ఇంతకాఫీ చేసి ఇస్తున్నావా? ఒక్క పూటై నా ప్రేమగా మాట్లాడావా? బావ నోరులేనివాడనేగా నీ ఆటలు సాగుతున్నై? .వారిసంస్కారాన్ని నీవు అర్ధం చెసుకోలేవే! అంత మంచి మనస్సునీకెక్కడిది? నీవుఅమ్మమీద  చూపే ప్రేమెందుకో మాకూ తెల్సు లేవే! నీవు మీ అత్తగారికిచ్చే గౌరవం, ప్రేమ కంటే నాభార్య , తమ్ముడి భార్యా అమ్మను బాగానే చూసుకుంటున్నారు. కావలిస్తే అమ్మనే అడుగు. నేను రేపే వచ్చి అమ్మను తీసుకెళుతున్నాను.నీవు అత్తగార్నికాస్తంత గౌరవంగా చూసు కోచాలు. నీ ఆడబడుచును యాడాదికోమారై నా పిల్చి చీరపెట్టి పంపు. మాకా నీవుచెప్పేది! ‘ గురివింద ‘ గింజా!  నీసంగతేంటోఆలోచించుకో! ” అనిఠక్కున ఫోన్ కట్ చేశాడు . భాను అన్నయ్య.  దిమ్మతిరిగిన భాను , అలా కూర్చుండి పోయింది.  

    ‘  తన సంగతులన్నీ పుట్టింటివారికి తెల్సినందుకూ, తన వదినెలు తన నెలా చిన్నచూపు చూస్తోఅరో అనే భయం పట్టు కుని ,  ఙ్ఞాన నేత్రం కాస్తంత తెరుచుకుంది.  ఒక చిన్న మాటైనా  సరైన సందర్భంలో చెప్తే ఎంతటివారికైనా మార్పురాక తప్పదు.  ‘బుధ్ధిచెప్పువాడు గుద్దితే నేమిరా!’ అన్నట్లు తల్లి, తోడబుట్టినవాడూ తన నైజాన్ని అసహ్యించుకోడంతో భానుకు అద్దం ముందున్న ముఖంలా  తన స్వభావం అర్ధమైంది. ఇంతకాలం బింకంగా ఉంచుకున్న మనస్సు తెరుచుకుంది.                                                                                                                                                                               

  “ఏదోపిచ్చిపిల్ల ,చిన్నదికదా వదిన గారూ! అలా అందరూ ఒకేసారి కోపం చేసుకుంటే ఏమైపోతుందిపాపం ! మెల్లిగా తెల్సు కుంటుందిలేండి! “ అని అమ్మ అంటుండగానే, భాను ఆశ్చర్యంగా తొమ్మిదో వింతలా మా అమ్మకాళ్ళువాటేసుకుని ఆమె పాదాలు తన కన్నీటితో కడిగి పాప [హృదయ]ప్రక్షాళన చేసుకుంది. మా అత్తగారూ ,నేనుచిత్తరువుల్లాచూస్తూఉండిపోయాం..                      

                                                                                                                                        -హైమాశ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~‘                                                          

 

కథలుPermalink

Comments are closed.