భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జమిందారీ దాష్టీకాన్ని సాయుధంగా ఎదుర్కొన్న

భక్తావర్‌ మాయి

Naseer Ahammad

Naseer Ahammad

 భారతీయ ముస్లిం మహిళలు జాతీయోద్యమంలో పాల్గొనటమే కాకుండా, బ్రిటీష్‌ ప్రభుత్వ వత్తాసుదారులుగా మారి ప్రజలను హింసిస్తున్న ప్రజాకంటకులను ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న సంఘటనలు కూడా చరిత్రలో దర్శనమిస్తాయి. జవిూందారీ దాష్టీకాలను ప్రతిఘటించే క్రమంలో గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ఆయుధం ఎత్తుకుని చరిత్రకెక్కిన మహిళలలో శ్రీమతి భక్తావర్‌ మాయి ఒకరు.

 భక్తావర్‌ మాయి వాయువ్యసరిహద్దు రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌ భూభాగం) లోని సింథ్‌ ప్రాంతం లాషారి గ్రామానికి చెందిన ఆడపడుచు.  ఆమె భర్త వలి ముహమ్మద్‌ లాషారి. అతను సామాన్య రైతు. ఆ ప్రాంతపు జవిూందారు పరమ క్రూరుడు. బ్రిటీషర్ల తొత్తు. ఆతడు రైతుల శ్రమను దోచుకుంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ విషయమై ఎవ్వరైనా జమిందారునిగాని, అతని వత్తాసుదారులను గాని ప్రశ్నిస్తే అంతటితో వారికి నూకలు చెల్లినట్టే.  

అది 1946 నాటి సంఘటన. భారతదేశం పరాయిపాలకుల పాలనలో ఉంది.  ఆ పాలకవర్గాల తాబేదారులైన జవిూందారుల రాజ్యం గ్రామాలలో సాగుతూనే ఉంది.  లాషారి గ్రామ రైతులు ఆరుగాలాలు శ్రమపడి పండించుకున్న పంటను ఇళ్ళకు తెచ్చుకుని ఆనందిస్తున్నారు.  జవిూందారుకు అప్పగించాల్సిన పంటభాగాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.  జవిూందారు అత్యధిక భాగాన్ని కోరాడు. ఆ కోరికను మన్నించలేమని రైతులు మొరపెట్టుకున్నారు. ఆగ్రహించిన జవిూందారు తన మనుషులను లాషారి గ్రామానికి పంపాడు. ఆ గూండాలు రైతుల కష్టార్జితాన్ని ఎత్తుకుపోవటానికి రాగా, బక్క జీవులలో రోషం రగిలించి, ధైర్యం చెప్పి జవిూందారు అనుచరులను ఎదుర్కొనేందుకు ఆమె రంగం సిద్ధం చేశారు.  

ఆ పరిస్థితులను గమనించిన జవిూందారు గూండాలు పోలీసులను తమకు వత్తాసుగా పిలిపించుకుని గ్రామస్థుల విూద విరుచుకుపడ్డారు. భక్తావర్‌ దంపతులు జవిూందారు మూకలకు తగిన బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. భార్యభర్తలిరువురు సాయుధులై ధర్మపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ దాడిలో భర్త వలి మహమ్మద్‌ లాషారి తీవ్రంగా గాయపడినా  ఆమె ఏ మాత్రం అధైర్య పడకుండా గ్రామస్థులలో ఉత్సాహం నూరిపోస్తూ, జవిూందారి మూకల విూద విరుచుకుపడ్డారు. సాయుధ శిక్షణ పొందిన గూండాలను ఎదుర్కోవడం గ్రావిూణులకు అసాధ్యమైంది. ఆ పోరాటంలో భక్తావర్‌ గుండెలను చీల్చుకుంటూ తుపాకి గుండ్లు దూసుకు పోవటంతో ఆమె నేల కూలింది.  నేల కూలిపోతూ కూడా ఒక్క గింజ కూడా రాక్షసులకు అందనివ్వకండి అని కోరుదతూ ఆ యోధురాలు కన్నుమూసింది.  ఆనాటి సంఘటనలో ఆమె ప్రదర్శించిన త్యాగాన్ని ప్రజలు మర్చిపోలేదు. భక్తావర్‌  ధైర్యసాహసాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈనాటికి కూడా ఆమె అమరగతిని పొందిన రోజున సింథ్‌్‌ ప్రాంతంలోని  ప్రజలు, ఆమె పట్ల గౌరవాభిమానాలు వ్యక్తం చేస్తూ చెడు విూద మంచి సాధించిన విజయంగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవటం విశేషం.

జనచైతన్య కార్యక్రమాల నిర్వహణలో దిట్ట

ఫాతిమా బేగం

భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు తమ సహజ పరిమితులకు మించిన భాగస్వామ్యాన్ని అందించారు.  బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యకలాపాలలో పాల్గొని కొందరు పోరాటరంగాన అగ్రభాగాన నిలిస్తే మరికొందరు పరోక్షంగా జాతీయోద్యమానికి క్రియాశీలక తోడ్పాటు నిచ్చారు. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న మహిళల వివరాలు కొంతలో కొంతగానైనా అందుబాటులో ఉన్నాయి.  ఎందువల్లనంటే ప్రభుత్వాలు, తమను ఎదిరిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, వ్యక్తిగత రికార్డులను భద్రపరుస్తాయి. ఉద్యమాలకు, ఉద్యమకారులకు పరోక్షంగా తోడ్పాటు నందించిన వారి గురించి రికార్డుల పరంగా సమాచారం లభించే అవకాశాలు అంతగా ఉండవు.  అటువంటి వ్యక్తులు ఎంతటి త్యాగమయ సేవలను అందించినా, గొప్ప బాధ్యతలు నిర్వర్తించినా ఆయా వివరాలు గుప్తంగానే ఉండిపోతాయి. ఈ విధంగా పరోక్షంగా జాతీయోద్యమానికి ఎనలేని తోడ్పాటు అందచేసిన మహిళ శ్రీమతి ఫాతిమా బేగం. 

బేగం ఫాతిమా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు. ఆమె  జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌ రాష్ట్ర శాఖ సభ్యురాలు. జాతీయోద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరించి ఉద్యమ కార్యక్రమాల వైపు వారిని ఆకర్షించి ఉద్యమంలో చురుకుగా పాల్గొనేట్టుగా చేయటంలో ఆమె దిట్టగా ఖ్యాతిగడించారు. ఈ విశిష్టతను గమనించిన జాతీయ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా జనచైతన్య కార్యక్రమాల  బాధ్యతలను ఆమెకు అప్పగించారు. 

బేగం ఫాతిమా 1939 నుండి 1940 వరకు పంజాబ్‌ రాష్ట్రమంతా పర్యటిస్తూ జాతీయోద్యమ లక్ష్యాలను, స్వరాజ్యం సాధించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో ప్రజలను కార్యోన్ముఖులను చేయటంలో  అద్వితీయ ప్రతిభను కనపర్చారు. ఆమె ఆకర్షణీయమైన విగ్రహం, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ప్రజలను   తనవైపుకు ఇట్టే తిప్పుకునేవారు. విషయ వివరణ, ప్రత్యర్థ్ధుల వాదనను తిప్పికొడుతూ  సాగించే సంవాదం, ప్రత్యర్థ్ధులను సహితం సమ్మోహితులను చేయటం ఆమె విశిష్టత. 

భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు  రాష్ట్రంలో పలు సభలను, సమావేశాలను ఆమె ప్రతిభావంతంగా నిర్వహించారు.  స్వయంగా ఆమె మంచి వక్త కావటంతో ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరిలో స్వరాజ్య కాంక్షను రగిలించారు. స్వరాజ్య సాధనా మార్గంలో ధనమాన ప్రాణాలను అర్పించేందుకు ప్రజలను సన్నద్దం చేశారు.  స్వాతంత్య్ర సంగ్రామ పోరాటయోధులను సవిూకరించటం, నిబద్ధత గల ఉద్యమకారులను ఎంపిక చేయటంలో దిట్టగా ఆమె జాతీయ నాయకుల ప్రశంసలు పొందారు.

ఆ రోజుల్లో ఉద్యమకారుల విూద  బ్రిటీష్‌ గూఢచారి దళం ఎల్లప్పుడూ తీవ్ర నిఘా ఉంచేది. బ్రిటీష్‌ పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా వారి కన్నుగప్పి ఆమె తన కార్యకలాపాలను నిరాఘాటంగా సాగించారు. జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు పంజాబ్‌ శాఖ అప్పగించిన బాధ్యతలన్నిటినీ చాకచక్యంగా నిర్వహించిన  ఫాతిమా బేగం జీవిత విశేషాలు చరిత్రపుటలలో సమగ్రంగా నిక్షిప్తం కాలేకపోయాయి. జాతీయోద్యమ నాయకుల సంభాషణలలోని ప్రస్తావనలు, నేతలు పరస్పరం రాసుకున్న లేఖలలో దొర్లిన వాక్యాలు, ఆమె కార్యకలాపాలతో పరిచయం ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ హషీం కిద్వాయ్‌ లాంటి పెద్దలు వెల్లడించిన వివరాల ద్వారా మాత్రమే ఫాతిమా బేగం ప్రశంసనీయ పాత్రకు సంబంధించిన విశేషాలు నమోదు కాగలిగాయి. 

 ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోరిన  

నఫీస్‌ ఆయేషా బేగం

భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజానీకం పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు.  పాలక పక్షాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన వారికి పలురకాల శిక్షలు ప్రతిఫలంగా లభించాయి.  వారి వివరాలు అందుబాటులో ఉంటున్నాయి. పరోక్షంగా జాతీయోద్యమానికి సహాయ సహకారాలు అందించి పోలీసుల చిట్టాలకు ఎక్కకుండా ఉండిపోయిన తెలుగు ఆడపడుచులు ఎందరో ఉన్నారు. ఆ తల్లుల త్యాగాలు ఎంత శ్లాఘనీయమైనవైనా అవి అక్షరరూపం ధరించకపోవటంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. 

ప్రత్యక్ష పోరులో శిక్షలకు గురైనవారి వివరాలు పోలీసుల రికార్డులలో నిక్షిప్తమై ఉన్నందున కొంతలో కొంత సమాచారం లభ్యం అవుతుంది. ఈ మేరకు పోలీసు రికార్డుల ఆధారంగా తయారైన గ్రంథాలలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహిళా యోధురాలు శ్రీమతి నఫీన్‌ ఆయేషా బేగం. ఆంధ్రప్రదేశ్‌  ప్రస్తుత  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన జనాబ్‌ హవిూద్‌ ఆలీఖాన్‌ కుమార్తె ఆయేషా బేగం. తండ్రి జాతీయ భావాలతో ప్రభావితురాలైన ఆయేషా బేగం హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశం అవతరించాక ఇండియన్‌ యూనియన్‌లో చేరడానికి నిరాకరించిన నైజాం సంస్థానాధీశుల పట్ల నఫీస్‌ ఆయేషా బేగం నిరసన వ్యక్తంచేశారు. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని, నైజాం సంస్థానంలోని వాసులంతా భారతదేశ పౌరులుగా పరిగణించ బడాలని ఆమె ఆకాంక్షించారు. 

ఈ  ఆకాంక్షకు భిన్నంగా  నిజాం సంస్థానాధీశులు, ఆయన మద్దతుదారులు వ్యవహరించటంతో ప్రజలు నిరసన వ్యక్తంచేశారు. ఈ నిరసనలు ప్రదర్శనలుగా మారాయి.  ఈ వ్యతిరేక ప్రదర్శనల పట్ల ఆగ్రహించిన నిజాం ప్రభుత్వం ప్రదర్శనకారులను నిర్బంధించింది. అరెస్టుల పర్వం సాగించింది. ఈ అరెస్టులలో భాగంగా  ఆయేషా బేగం కూడా జైలు పాలయ్యారు.  ఆమెను 1948, 16న  అరెస్టు చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలులో నిర్బంధించారు. ఆ అరెస్టులు ఆమెను అధైర్యపర్చలేదు. జైలు నుండి విడుదల తరువాత కూడా ఆమె లక్ష్య సాధన పట్ల నిబద్ధతతో సాగారు. చివరకు ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనమైంది. 

ఆ యోధురాలి పూర్తి వివరాలు తెలియలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్‌ సరోజిని రెగాని సంపాదకత్వంలో రూపొందించిన సంపుటాలలో స్థానం పొందగలిగిన ఏకైక ముస్లిం మహిళ ఆయేషా బేగం కావటం విశేషం. ఆ గ్రంథంలో ఆమె అరెస్టుకు సంబంధించిన వివరాలను, కొద్దిపాటి వ్యక్తిగత విశేషాలను పేర్కొనటంతో ఆ మాత్రమైనా ఆమె గురించి తెలుసుకునే అవకాశం కల్గింది. 

తెలంగాణ పోరులో కమ్యూనిస్టు యోధురాలు

జమాలున్నీసా బాజి

జాతీయోద్యమంలో ప్రవేశించి తద్వారా బ్రిటీషర్ల బంధనాల నుండి విముక్తి కోసం పోరాటం మాత్రమే కాకుండా విముక్తి పోరాటాల స్ఫూర్తితో సమతా-మమతల వ్యవస్థలను స్థాపించి జాతి జనులకు ఉత్తమోత్తమ వ్యవస్థను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగిన మహిళలు ఎందరో. ఆ క్రమంలో ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోరుతూ సాగిన ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా ఆతరువాత సాగిన తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ప్రజల పక్షం వహించి పోరుబాటన నడిచిన మహిళా ఉద్యమకారులలో జమాలున్నీసా బాజి ఒకరు.

జమాలున్నీసా 1915 ప్రాంతంలో హైదరాబాదు సంస్థానంలో జన్మించారు. ఆమె తల్లి హైదరాబాదుకు చెందినవారు కాగా తండ్రిది ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం. ఆయన నైజాం సంస్థానంలో న్యాయాధికారిగా పనిచేశారు. కుటుంబంలోని పెద్దలు ఆచార సంప్రదాయాల పట్ల అనురక్తులైనప్పటికి తల్లితండ్రులు మాత్రం ఉదార స్వభావులు. తల్లి తండ్రులు చిన్ననాటి నుండే తమ పిల్లలకు తగినంత స్వేచ్ఛ కల్పించారు. ప్రధానంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా చిన్నతనంలోనే జమాలున్నీసాకు స్వతంత్ర భావనల తోపాటుగా జాతీయ భావనలు అలవడ్డాయి. 

పదమూడు సంవత్సరాల వయస్సులోనే  ఆమె ‘ నిగార్‌ ‘ పత్రికను  చదవటం ఆరంభించారు. లక్నోకు చెందిన నియాజ్‌ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్‌ పత్రిక వచ్చేది. ఆ పత్రిక, ఛాందసత్వానికి, మతమౌఢ్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుక పోవడానికి కృషిచేసింది. అందువల్ల  యీ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదని నైజాం ప్రభుత్వం భావించి హైదరాబాదు సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హైదరా బాదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్‌.ఎం.జవాద్‌ రజ్వి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ, 1985, పేజి.25). 
నిషేదిత నిగార్‌  పత్రిక ప్రభావం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రిటీషర్ల మిత్రుడిగా మారిన నైజాం సంస్థానాధీశుడ్ని నిరశిస్తూ జమాలున్నీసా ఉద్యమించారు. ఆమె అభిప్రాయాల స్థిరత్వానికి  కుటుంబ వాతావరణం కూడా   తొడ్పడింది. మత సంబంధమైన కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడా సమకాలీన సమాజం అభిప్రాయాలకు  భిన్నంగా ప్రవర్తించటం వలన జమాలున్నీసా స్వజనుల నుండి చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులని పిలిచేవాళ్ళని జమాలున్నీసా స్వయంగా చెప్పుకున్నారు. ఈ మేరకు స్వతంత్ర భావాలతో ఉద్యమిస్తున్న ఆ కుటుంబ సభ్యుల పద్దతులు సరికాదంటూ బంధువులు ఎంతగా చెప్పినా ఆ కుటుంబ సభ్యులు తమదైన మార్గంలో ముందుకు సాగారు. తొలిథలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జాతీయోద్యం పట్ల మొగ్గు చూపిన జమాలున్నీసా చివరివరకు ఆ పోరుబాటన నడవటమే కాకుండా  కమ్యూనిస్టుగా  తన పోరాట పరిధిని మరింతగా విస్త్రృత పర్చుకున్నారు.
స్వతంత్ర ఆలోచనలు, ఉదార స్వభావం గల కుటుంబంలో జన్మించి, ఆ వాతావరణంలో ఎదిగిన జమాలున్నీసా వివాహం సంకుచిత ఆలోచనలు గల కుటుంబంలో జరిగింది.
ఆ కారణంగా అత్తవారింటి వాతావరణంతో అలవాటు పడేందుకు తొలిథలో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఆమె వివరిస్తూ  మా అత్తవారిల్లు చాలా వెనుకబడ్డ కుటుంబం. మొదట్ల్లో చాలా బాధవేసేది. కష్టంగా అనిపించేది. నేను కొంత సరిపుచ్చుకోవాల్సి వచ్చేది…నన్ను ఒక సంవత్సరం దాకా మా వాళ్ళు మా అమ్మ ఇంటికి పోనివ్వలేదు. మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళుతుండేవాడు. నా భర్త అన్న, అతని భార్య చాలా సంకుచిత స్వభావం కలవారు. ఎవర్నీ బయటకు వెళ్ళనిచ్చేవారు కారు. మూడు సంవత్సరాలు నేను ఒక కుటుంబ స్త్రీగానే ఉన్నాను- కుట్టుపని  నేర్చుకున్నాను. ఇంట్లో కట్టేసినట్టుండేది కాని నాకున్న కొన్ని అభిప్రాయాలను మాత్రం నేను దాచలేదు. పుస్తకాలు చదివేదాన్ని కాని ఎదో సర్దుకుపోయేదాన్ని-కుటుంబ జీవితంలో. తర్వాత మేం వేరే ఇల్లు ఉస్మాన్‌పురా కట్టెల మండి దగ్గర తీసుకున్నాం. నా కొడుకప్పుడు మూడేళ్ళవాడు. సెలవుల్లో మా నాన్న దగ్గరకు వెళ్ళుతుండేదాన్ని. అది మా అత్తగారింట్లో ఇష్టం ఉండేది కాదు. అటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా ఆమె తన చిన్ననాటి స్వతంత్ర భావనలను వదులుకోలేదు. ఆ తరువాతి కాలంలో  అత్తవారింటి వాతావరణంలో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పులతో  తాత్కాలికంగా తెరపడిన  కార్యకలాపాలను మరింత ఉత్సాహంతో జమాలున్నీసా ఆరంభించారు. 
చిన్నతనంలోనే జాతీయోద్యం పట్ల ఆకర్షితురాలైన జమాలున్నీసా స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రస్తావిస్తూ, స్వదేశీ ఉద్యమం కూడా మమ్మల్ని ప్రభావితం చేసింది. నేను స్వదేశీ బట్టలనే కట్టుకునేది.  అని అన్నారు. ఆ సమయంలో జమాలున్నీసా కుటుంబం విూద స్వాతంత్య్రసమరయోధుడు, ప్రసిద్ధ కవి మౌలానా హస్రత్‌ మోహని ప్రభావం ఉంది. ఆమె కుటుంబానికి  ఆయన దగ్గర బంధువు.హైదరాబాదు వచ్చి మల్లేపల్లి మసీదు వద్ద ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నారని, ఆయనకు తమ కుటుంబంతో సన్నిహిత బంధుత్వ సంబంధాలున్నాయని జమాలున్నీసా  చెప్పుకున్నారు. మౌలానా మోహాని చాలా చురుకైన స్వదేశీ ఉద్యమకారుడు. జాతీయోద్యమంలో ఆయన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ పలుమార్లు జైళ్ళపాలయ్యారు. ఆయనను  సహచరులు ‘ ఫైర్‌ బ్రాండ్‌ ‘ గా పరిగణించేవారు. అటువంటి యోధునితో ఏర్పడిన పరిచయం జమాలున్నీసా కుటుంబ సభ్యులను జాతీయోద్యమం, స్వదేశీ ఉద్యమం, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల దిశగా నడిపించాయి. 
ఆ కారణంగా జమాలున్నీసా జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయినప్పటికి చేయాల్సినంతగా చేయలేదని ఆమె చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మొదట్నించి జాతీయోద్యమంలో వుండేవాళ్ళం. మేమేం చేయడం లేదని ఎప్పుడూ అన్పించేది. మేము అజంతాలో వున్నప్పుడు ముహమ్మద్‌ అలీ, ఆయన భార్య అక్కడికొచ్చారని తెలిసింది. మేము, అఖ్తర్‌ (సోదరుడు) మా పెద్ద నాన్న మా పాకెట్‌ మనీ -15, 20 రూపాయలు జమచేసి బేగం ముహమ్మద్‌ అలీకి ఇచ్చాం, అని చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదరాబాద్‌, 1986, పేజి.175). 
ఆనాడు నిజాం సంస్థానంలో జాతీయోద్యమ భావాలు వ్యక్తం చేయటం కాదు కనీసం మనస్సులో ఉండటం కూడా పెద్ద అపరాధంగా భావిస్తున్న భయానక వాతావరణం. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండటమే చాలా పెద్ద నేరం. ఆ వాతావరణంలో జమాలున్నీసా స్వతంత్ర భావనలు కలిగి ఉండటమే  కాకుండా స్వదేశీ ఉద్యమంలో ఆచరణాత్మకంగా పాల్గొనటం జాతీయోద్యమానికి  ఆర్థికంగా తోడ్పటం చాలా ప్రమాదకరమైన ప్రయత్నం. అటువంటి సాహసాన్ని జమాలున్నీసా ప్రదర్శించారు. జాతీయోద్యమ నిధికి చిన్న వయస్సులోనే తన పాకెట్‌ మనీని అందచేసి జాతీయోద్యమంలో  భాగస్వాములు కావటం విశేషం. 
జాతీయోద్యమంలో పాల్గొన్న జమాలున్నీసా బాజి  ఆ తరువాత సంతరించుకున్న కమ్యూనిస్టు భావాల కారణంగా  క్విట్‌
ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. ఈ విషయాన్ని  ప్రస్తావిస్తూ, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. కాని ఆ ఉద్యమం పట్ల, ఉద్యమకారుల పట్ల సానుభూతి ఉండేదని, అమె స్వయంగా చెప్పుకున్నారు. అనాడు బాజి కుటుంబం గాంధీ కంటే సుబాష్‌ చంబ్రోసు అభిప్రాయాలతో ఏకీభవించారు. ఈ విషయాన్ని కూడా అమె స్పష్టంచేస్తూ గాంధీ కంటె నెహ్రూనే ఇష్టపడేవాళ్ళం. సుభాస్‌ బోస్‌ కాంగ్రెస్‌ నుంచి తీసేసినపుడు మాకు చాలా కోపం, బాధ కలిగింది  అన్నారు.      (మనకు తెలియని మన చరిత్ర )
జమాలున్నీసాకు చిన్నతనంలో  సరైన పాఠశాలలో విద్య లభించలేదు. అయినా ఆ తరువాతి కాలంలో స్వయంగా శ్రమించి ఉర్దూ, ఆంగ్ల భాషలను అమె నేర్చుకున్నారు. ఆ విధంగా సంపాదించుకున్న బాషా పరిజ్ఞానంతో చెల్లెలు రజియా బేగంతో కలసి సాహిత్య సమావేశాలకు హజరయ్యారు. ఆ క్రమంలో హైదరాబాదు నగరంలోని మలక్‌పేట లోగల తమ గృహాన్ని సాహిత్యకారుల కూడలిగా మార్చారు. ఆమె ‘ బజ్మె ఎహబాబ్‌ ‘ పేరుతో  సాహితీ మిత్రుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో  వారి ఇంట సాహితీ సమావేశాలు, చర్చలు, గోష్ఠులు జరిపారు. ఆ సమావేశాలలో పలువురు యువ రచయితలు-కవులు పాల్గొనేవారు. ఆ సత్సంగంలో సాహిత్య చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా  ప్రజల సమస్యల గురించి, జాతీయోద్యమం గురించి, సామ్యవాద భావాల గురించి, కమ్యూనిస్టు పార్టీ గురించి, అహేతుకు ఆచారసంప్రదాయాల విూద విశ్త్రుతంగా చర్చలు సాగేవి. ఆ చర్చలలో జమాలున్నీసా తన సోదరి రజియా మాత్రమే కాకుండా ఆమె అన్నదమ్ములు కూడా భాగస్వామ్యలయ్యేవారు.  
ఆ కార్యక్రమాలలో భాగంగా ఏర్పడిన భావాల మూలంగా పరాయి పాలకుల పెత్తనం నుండి మాత్రమే కాకుండా మతమౌఢ్యం, ఛాందసం భావాల నుండి కూడా  ప్రజలు విముక్తి కావాలని ఆమె ఆశించారు. ఇస్లాం మతం ప్రబోధించిన మౌలిక ధార్మిక సూత్రాలకు వ్యతిరేకంగా వివిధ ఆహేతుక కర్మకాండలు స్వమతస్థులలోని ఆచార సంప్రదాయాలలో చోటు చేసుకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అటువంటి ఆహేతుక సంప్రదాయాలను ఆమె  నిరాకరించారు. ఆ వివాదాస్పద విషయాల విూద చర్చలు జరిపారు. ముహమ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజు పండుగను (మిలాద్‌- యే-నబి) పురస్కరించుకుని చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సందర్భంగా ఇస్లాం మతం యొక్క నిజమైన సారాంశం వివరిస్తూ, కొంత మంది ముస్లింలు అనుసరిస్తున్న అహేతుక కర్మకాండల గురించి చర్చించి, హేతుబద్దం కాని అనాచార సంప్రదాయాలను తిరస్కరించాల్సిందిగా ప్రజలను కోరారు.  ఆ కాలంలో అమలులో ఉన్న పర్దా పద్దతిని తిరస్కరించారు. ఆ తిరస్కారం స్వజనుల ఆగ్రహానికి కారణమైనప్పటికి జమాలున్నీసా లెక్కచేయలేదు. ఆగ్రహించిన సన్నిహితులకు విషయాన్ని తర్కబద్దంగా వివరించి నచ్చ చెప్ప ప్రయత్నించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నైతిక మద్దతు వలన తన అభిప్రాయాల విూద జమాలున్నీసా బాజి చివరివరకు సుదృఢంగా నిలిచారు.
జాతీయోద్యమ కార్యక్రమాలలో తనదైన పాత్ర నిర్వహిస్తూ వచ్చిన జమాలున్నీసా క్రమక్రమంగా కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.  కమ్యూనిజం ప్రభావానికి ఆమె ఒక్కతే లోనుకాలేదు. ఆమె సోదరులు అన్వర్‌, జఫర్‌, సోదరి రజియా బేగం కూడా  ప్రభావితులయ్యారు. కమ్యూనిజం సాహిత్యాన్ని పఠిస్తూ సిద్ధాంత పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రజలలో కలసి పనిచేయటం ఆరంభించారు. అన్ని రంగాలలో సమానత్వం సాధించటం, సమసమాజ స్థాపన అను మహాత్తర లక్ష్యాలను సాధించేందుకు కమ్యూనిజం  ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మిన జమాలున్నీసా బాజి కుటుంబ సభ్యులు ఆ దిశగా ఎంతో నిబద్దతతో ముందుకు సాగారు. ఆ లక్ష్యసాధనకు తమ ప్రాణాలు బలిపెట్టడానికి కూడా ఆమె అన్నదమ్ములు జఫర్‌్‌, అన్వర్‌లు సిద్దమయ్యారు. ఆ సోదరులకు మద్దతుగా జమాలున్నీసా బాజి అమె చెల్లెలు రజియా బేగం, ఇతర కుటుంబ సభ్యులు కూడా  కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల ప్రచారానికి తోడ్పడ్డారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ విూద పలు ఆంక్షలు, నిషేధాలు ఆమలులో ఉన్నప్పటికి పోలీసుల, గూఢచారుల కంటపడకుండా తమ ఇంటిని రహాస్య కేంద్రంగా చేసుకుని జమాలున్నీసా ఎంతో ధైర్యంతో పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు.
జమాలున్నీసా కుటుంబం వామపక్షభావాల వైపుగా సాగించిన ప్రస్తానం గురించి స్వయంగా ఆమె ఈ విధంగా వెల్లడించారు. ఆ కథనం ప్రకారం, మొదట్నించీ మేము వామ పక్షానికి దగ్గరగా వుండేవాళ్ళం. 1941లో అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి వుండేది. మఖ్దూం, నజర్‌ హైదరాబాద్‌ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్క చెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడా వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటుకోసం చేసిన ఏర్పాటు) వెనుక కూర్చునేవాళ్ళు….సజ్దాద్‌ జహీర్‌, ఓంకార్‌, పర్షాద్‌ లాంటి వాళ్ళు చాలా మంది అండ్‌గ్రౌండ్‌లో వున్నప్పుడు మా యింట్లో వుండే వాళ్ళు.1947 తర్వాత లక్నొలో హిందీ కాన్ఫరెన్స్‌-మౌలానా ఎసియాటిక్‌ కాన్ఫరెన్స్‌- వెళ్ళాం. అక్కడ ఎర్రజెండాలు ఎగరేశాం. చాలా మంది అరెస్టయ్యారు. 
ఆ క్రమంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ప్రమీలా తాయిని జమాలున్నీసా కలుసుకున్నారు.1946లో ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.1946 నవంబరులో పార్టీ విూద నిషేధం విధించబడింది. కమ్యూనిస్టు పార్టీ విూద విధినిషేధాల కారణంగా, నిజాం ప్రభుత్వం చర్యల మూలంగా చాలా రహస్యంగా ఆమె కార్యకలాపాలను నిర్వహించాల్సి వచ్చేది. నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పించటం, ఆహారం అందించటం, నాయకుల మధ్య సమాచారం చేరవేయటం, ఆయుధాలను సరఫరా చేయటం, ఆయుధాలను దాచిపెట్టటం లాంటి బాధ్యతలను  జాగ్రత్తగా నిర్వహించారు.  ఈ విషయంలో అమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో సాహసంతో కార్యక్రమాలలో ప్రముఖ పాత్రవహించారు. ఆ విషయాలను కూడా అమె ఈ క్రింది విధంగా వెల్లడించారు.
 
నేను బయటకు వెళ్ళలేకపోయేదాన్ని కాదుకాని అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు వచ్చి ఉండిపోయేవారు. భర్తతో వాళ్ళు నా అన్న స్నేహితులని చెప్పేదాన్ని. మా కుటుంబం వాళ్ళనంతా చూసి క్రమంగా ఆయనకొక నమ్మకం కుదిరింది. నా అన్న తమ్ముళ్ళంతా కాలేజీలు వదలి ఉద్యమంలో చేరి చాలా బాధలుపడ్డారు. అయుధాలిక్కడే దాచేవారు. అన్వర్‌, జఫర్‌, నా అన్న వరస హఫీజ్‌ వీళ్ళంతా కలసి పనిచేసేవారు. వాళ్ళంతా అరెస్టయ్యారు. అన్వర్‌ చాలా సీరియస్‌ జబ్బుతో బాధపడుతుండేవాడు. ఖమర్‌, మజర్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉండి అరెస్టయ్యారు. అన్వర్‌ అత్తగారిల్లు ఎక్కడో దూరంగా హబ్సీగూడా రామాంతపూర్‌లో వుండేది. మఖ్దూం, ఓంకార్‌ అక్కడే ఉండేవాళ్ళ. మఖ్దూం, జఫర్‌, షఫీఖ్‌, బెవ్‌జద్‌తోపాటు అరెస్టయ్యాడు….జఫర్‌ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఊళ్ళకి వెళ్ళి, అక్కడి పరిస్థితులను చూసి నిరాశతో తిరిగి వచ్చాడు. జఫర్‌ రివాల్వర్లను దాచిపెడితే, అఖ్తర్‌ వాటిని ఒక పెట్టెలో పెట్టి పోలీసులు వచ్చిప్పుడు వాటిపైన కూర్చుంది. ఆమె మురాద్‌ నగర్‌ వెళుతూ రివాల్వర్‌ నాకిచ్చింది. నేను దాన్ని ఇక్కడే దాచాను.
జిన్నా ఇంటిర్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శనలిమ్మని పిలుపునిచ్చాడు. అందరూ దాన్ని పాటించారు. కాని మేము పాటించలేదు. మా అన్నలు ఎర్రజెండా ఎగురవేశారు. చుట్టుపక్కల వాళ్లంతా ఇష్టపడలేదు. రాజ్‌ బహుదుర్‌ గౌడ్‌, జవార్‌ (జవ్వాద్‌ రజ్వీ) హస్పిటల్‌ నుంచి తప్పించుకుని ఇక్కడికే మొదలు వచ్చారు. 1947 ప్రారంభంలో ఎక్కడ చూసినా పోలీసులుందేది. రిక్షాకు పర్దాకట్టించి వాళ్ళనిక్కడి నుంచి వేరొకచోటుకి తీసుకెళ్ళాం. రాజ్‌ మమ్మల్ని అండర్‌ గ్రౌండ్‌ వెళ్ళిపొమ్మన్నాడు. అఖ్తర్‌ మధ్యలో ఒకసారిపెరోల్‌ విూద వచ్చి వెళ్ళిపోయాడు.
1948లో నా భర్త చనిపోయాడు. నేను తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాను. పార్టీ కోరకు డబ్బువసూలు చేయటం మొదలుపెట్టాను. తాయి (ప్రమీలా తాయి) యశోధాబెన్‌, బ్రిజ్‌రాణి అంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ విూద నిషేధం వచ్చిన తర్వాత అంతా ఇక్కడికి రావడం ప్రారంభించారు. అభ్యుదయ రచయితల సమావేశాలు కూడా జరిగేవి. 
కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు ఎక్కువైపోయాయి. ఆర్‌.యన్‌(రావి నారాయణ రెడ్డి) బొంబాయి వెళ్ళాడు. తర్వాత అఖ్తర్‌, గోపాలన్‌( ఎ.కే.గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్‌ ఒకటి వచ్చి-1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా విరమించాలా అనే విషయం చర్చించడానికి వచ్చారు. మా ఇంటి ముందున్న యింట్లో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశాము. మా నాన్న సహాయం చేశాడు. చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి. అని ఆనాటి విషయాలను జమాలున్నీసా వివరించారు.
ఈ విధంగా పోరాట కార్యక్రమాలలో పాల్గొన్న జమాలున్నీసా బాజి  కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని విరమించుకున్న తరువాత కూడా పార్టీపరంగా ప్రజలలో పనిచేయటం ఆరంభించారు. ప్రధానంగా మహిళలలో ఆమె ఎక్కువగా పని ప్రారంభించారు. ఆ విశేషాలను ప్రస్తావిస్తూ, పోరాటం విరమించుకున్న తర్వాత, మహిళా సంఘాలు ప్రారంభించాం. కామ్రెడ్‌ ఘనీ అసిఫ్‌నగర్‌లో అతని భార్యతో ఒక మహిళా సంఘం పెట్టాడు. పర్దావేసుకునే స్త్రీలు ఒక సెంటర్‌ నుంచి ఇంకో సెంటర్‌ వెళ్ళేవారుకారు. ఆఘాపురాలో ఒక రాత్రి బడి, మాస్క్‌ దగ్గర ఇంకో సెంటర్‌ పెట్టారు. కథలు, గోర్కీ రచనలు చదివేవాళ్ళం. చాలా రోజులు అలా చేశాం. కొంతమంది అమ్మాయిలు పార్టీ సభ్యురాళ్ళయ్యారు. ఎన్నికల్లో పనిచేశారు. నాతో కలసి గుంటూరు, విజయవాడకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా పెళ్ళిల్లు చేసుకుని, ఏమీ చేయటం లేదని ఆమె పేర్కొన్నారు.
కమ్యూనిస్టు పార్టీకార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న పలువురు పార్టీ కార్యక్రమాల నుండి క్రమంగా దూరమైప్పటికి జమాలున్నీసా మాత్రం తన ప్రజాచైతన్య  కార్యక్రమాలలో కొనసాగారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మగ్దూం మొహిద్దీన్‌ మార్గదర్శకత్వంలో ఆమె తన కార్యకలాపాలను సాగించారు. ఆ వివరాలను ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. 
1952లో మఖ్దూం విడుదలయిన తర్వాత నన్ను స్త్రీలతో పనిచేయమన్నాడు. మేమెట్లా చేయగలుగుతాం ? తాయి (ప్రమీలా తాయి) ఇంకా విడుదల కాలేదు. ఆహార ధాన్యాల ధరల సమస్య బాగా పనికొచ్చింది. ముస్లింలలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఈ సంఘాలు వారిని ఆకర్షించలేదు. ఇంకా కొంత ఆకర్షనీయమైనవి కావాల్సి వచ్చింది. ఓంకార్‌ స్త్రీల ప్రజాస్వామ్య సంఘం పెట్టడానికి తోడ్పడ్డాడు. దాని నియమావళి తయారు చేశాడు. నలభై మంది స్త్రీలు కుట్టుపని, చేతిపని నేర్చుకునేవారు. మేము రాయటం, చదవటం నేర్పించేవాళ్ళం. పత్రికలు పుస్తకాలు కొనేవాళ్లం. చదవటం, చర్చలు పెట్టడం చేసేవాళ్ళం. డబ్బు సరిపోయేది కాదు. కోఆపరేటివ్‌ ఇనస్పెక్టరు కోఆపరేటివ్‌ పెట్టమని సలహా యిచ్చాడు. చాలా మంది కాలేజీ టీచర్లు షేర్‌ హోల్డర్స్‌గా చేరారు. ఆడవాళ్ళకు జీవనాధారం చూపించటం, ఏదైనా పనిగానీ ఒక స్కిల్‌గాని నేర్పించటం ఆ కోపరేటివ్‌ ఆశయం. చాలా మంది పరిక్షలిచ్చి పాసయ్యారు కూడా. ఇప్పుడు కూడా ఆ పని జరుగుతుంది కాని, తక్కువ శక్తితో, ఇద్దరు టీచర్లున్నారు. తెలుగు, ఉర్దూ ఎనిమిదవ తరగతి దాకా నేర్పుతారు. టెక్నికల్‌ ఏడ్యుకేషన్‌ బోర్డు కూడా దీన్ని గుర్తించింది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి.
గతంలో  పర్దాలాంటి సమస్యల గురించి చర్చించేవాళ్ళం. చాలా మంది రజియా సజ్దార్‌ జహీర్‌, ఇస్మత్‌ చోగ్తాయి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడేది. ఆరోజుల్లో స్త్రీలు చదువుకున్న వాళ్ళు రాకపోయినప్పుటికి ప్రశ్నలడిగి ఎన్నో నేర్చుకునేవారు. ఇప్పుడెవరికీ ఆ కుతూహలం లేదు. పార్టీ గురించిగాని, రాజకీయ సమస్యల గురించి కానీ తెలియదు. బహుశ గల్ఫ్‌దేశాల నుంచి వచ్చే డబ్బు కారణం కావచ్చు. కొంత వరకు పార్టీకి ఆసక్తి లేదు. ఏమి పట్టించుకోదు. మహిళా ప్రజాస్వామిక సంఘం ఏమైనా కాన్ఫెరెన్స్‌ కెళ్ళాల్సి వచ్చినప్పుడే పనికొస్తుంది.
ఆ విధంగా స్థానికంగా మహిళలలో పనిచేస్తూ జాతీయస్థాయి కార్యక్రమాలలో కూడా ఆమె చురుకుగా పాల్గొన్నారు. స్వయంగా ఇతర ప్రాంతాలలో జరుగుతున్న సభలు, సమావేశాలకు హజరయ్యారు. ఆనాడు జమాలున్నీసా, ఆమె సహచరులు ఎదుర్కొన్న ఇబ్బందులు అమె మాటల్లో ఇలా ఉన్నాయి.
1952-53లో ఢిల్లీ కాన్ఫెరెన్స్‌లో మేము అఖిలభారత మహిళా కాన్ఫెరెన్స్‌ (జు|ఇ్పు) నుంచి వేరుపడ్డాం. 54లో కలకత్తా సమావేశంలో మహిళా ప్రజాస్వామిక సమాఖ్య నిర్ణయించబడి, ఒక నియమావళి తయారు చేశారు. రేణు చక్రవర్తి, హజ్రబేగం (హజఁరా బేగం) పాల్గొన్నారు. అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్‌..కలకత్తా, ఢిల్లీ సమావేశాలకి వెళ్ళాను. ఇక్కడ పని చేస్తున్న బద్రున్నిసాను తీసుకెళ్ళాను. ఆమెకు రెండేళ్ళ పాప వుండేది. ఆమె కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్టు పేపర్లో వస్తే ఆమె అత్తవారి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. తర్వాత ఆమె భర్త విడాకులిచ్చాడు. ఆమె చాలా భయపడిపోయి ఇక్కడేవుండేది. ఆమెనోక ముసలతనికిచ్చి పెళ్ళి చేయాలని చూశారు. ఆమెకది ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక్కడే టీచరు పనిచేస్తూ, ఎంతో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది స్త్రీలు కోఆపరేటివ్‌ సెంటరుకి నేర్చుకోవటానికి వస్తారు. కాని చాలా కొద్దిమంది పని చేయడానికి వస్తారు. వాళ్ళకు పని అంతగా అవసరం లేదు. వాళ్ళవాళ్ళెవరో ఒకరు వాళ్ళవాళ్ళెవరో ఒకరు బయట పనిచేస్తుంటారు కాబట్టి. మా బంధువోక అమ్మాయి క్లాసులు తీసుకోడానికి ప్రయత్నించింది. కాని ఎక్కువమంది రాలేదు. నాకేవిధంగా పనిసాగించాలో తెలియటం లేదు. మతోన్మాదము కూడా కొంత కారణమైయుంటుంది. ఇదివరకు పర్దాను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. ఇప్పుడట్లాకాదు.
ఇదివరకు ముస్లిం స్త్రీలు ఊరేగింపుల్లో వచ్చేవారు. నేనే ఎన్నో సార్లు ఎలక్షన్‌ మీటింగులకి, కాంపేన్లకి (ప్రచారం) తీసుకెళ్ళాను. హిందూ స్త్రీలు కూడా అంతగాపట్టించుకోవటం లేదు.ఆ ప్రతికూల వాతావరణంలో కూడా జమాలున్నీసా కమ్యూనిస్టు కార్యకర్తగా ఎంతో నిబద్దతతో కొనసాగారు. పార్టీనాయకులు ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళి బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణా ప్రాంతానికి మాత్రమే ఆమె పరిమితం కాకుండా పలు ప్రాంతాలలో పర్యటించారు. ఆ సమయంలో ప్రజలు ప్రధానంగా మహిళలు వారి పట్ల ఏవిధంగా స్పందిచారో ఆమె వివరించారు. ఆమెకు తెలుగు పూర్తిగా రాదు. ఆ  కారణంగా తెలుగు మాట్లాడే ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోయారు. ఆ విషయాన్ని ఆమె ఇలా చెప్పారు. తెలుగు తెలిసి ఉంటే ఇంకా పని చేయడానికి తోడ్పడేది. చాలా మంది బాగా ఉత్సాహంగా ఉండే అమ్మాయిలుండేవారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు జ్ఞాపకం రావటం లేదు. మమ్మల్నెక్కడకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఎక్కడికి ఎలా వెళ్ళడం అనికూడా అడక్కపోయేవాళ్ళం. ఆర్‌.వి (రావి నారాయణరెడ్డి) వెళ్ళమనేవాడు. మేం వెళ్ళిపోయేవాళ్లం. ఒకసారి ఆర్‌.యన్‌.తో మిర్యాలగూడ వెళ్ళాం…బోన్‌గిర్‌, హుజూర్‌నగర్‌ ఎలక్షన్‌ ప్రాపగాండాకు వెళ్ళాం. ఒక ముసలమ్మ నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టింది. కామ్రేడ్లని ఎప్పుడూ బాగా చూసుకునేవారు ప్రజలు.

 

 

(ఇంకా ఉంది )

 – సయ్యద్ నశీర్ అహమ్మద్

`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
– 123
UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో