గులాబీ హవా

 గులాబీ హవా

                         గులాబీ రంగుని అమ్మాయిలకి ప్రతీకగా సున్నితత్వానికి సూచనగా పరిగణిస్తుంటారు . పరిస్థితులు తారుమారైతే , సహనానికి , ఓర్పుకి హద్దులు చెరిపేస్తే సున్నితత్వంలోంచి కఠినత్వమే బయట పడుతుంది . ఓర్పు నుంచి తిరుగుబాటే మొదలవుతుంది . ఈ విషయం పూర్వం నుంచి ఎన్నో సార్లు రుజువవుతూనే ఉంది . ఒంటరి పోరాటాలు , ఉద్యమాలు, మహిళల చైతన్యానికి ఊపిరి పోస్తున్నాయ్ . స్త్రీలలో తమ హక్కుల పట్ల రగిలే జ్వాల ఉండాలే కాని, అక్షర జ్ఞానం లేకపోయినా కూడా ఉద్యమాలకి శ్రీకారం చుడతారు అని రుజువైయ్యింది . కలిసి పోరాడితే ఎంతటి క్రూర మృగాన్నైనా  తోక ముడిచేలా చేయవచ్చునని” సంపత్ పాల్ దేవి ” నిరూపించింది . 54 సంవత్సరాల వయసులో ఉత్తర ప్రదేశ్ లో గులాబీ గ్యాంగు ను స్థాపించి స్త్రీల పట్ల జరిగే అణచివేతల్ని ఎదుర్కోవడానికి నడుం బిగించింది . 2006 సంవత్సరంలో ప్రారంభమైన “గులాబీ గ్యాంగు ” గులాబీ రంగు చీరలతో , ఒక చేతిలో లాటితో బాధించే పురుషులను ఎదుర్కొంటున్నారు . సంపత్ పాల్ దేవి స్ఫూర్తితో ఈ రోజున గులాబీ గ్యాంగులో 2 లక్షలకు పైగా స్త్రీలు సభ్యులుగా  ఉన్నారు . గులాబీలు సున్నితత్వానికే కాదు తిరుగు బాటుకి కూడా ప్రతీక అనేలా అర్ధాన్ని మార్చిన సంపత్ పాల్ దేవి ని మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం .

                         ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కూడా మహిళా డ్రైవర్ లకు ఉపాధి కల్పించే దిశగా గు లాబీ పై ఒక ప్రయోగం చేసింది . మేయర్ మాజిద్ హుస్సేన్  తదితర అధికారులు మహిళా సాధికారితకు ఆలంబనగా ఒక క్రొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు . తెలుపు , గులాబి రంగుల కలయికతో  ఉన్న ‘షి’ టాక్సీ లను అయిదుగురు మహిళలకి పంపిణి చేసారు . ఈ పథకం వల్ల మహిళా డ్రైవర్లని ఆర్ధికంగా ఆదు కోవడమే కాకుండా, మహిళా ప్రయాణికులకు కూడా భద్రత పరంగా అనుకూలంగా ఉంటుదని భావించవచ్చు . అన్ని పథకాలలా  ఇది  కూడా కంటి తుడుపు పథకంలా మిగిలిపోకుండా మరింత విస్తరించి దేశం అంతా పింక్ కార్లమయం కావాలని ఆశిద్దాం . ఈ క్రొత్త పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ దేశమంతటికీ మార్గదర్శి కావాలని కోరుకుంటూ …… మేయర్ మాజిద్ హుస్సేన్ ని అభినందిస్తున్నాను .

మన తెలుగు రచయిత్రుల విషయానికి వస్తే 2014 లో వివిధ రంగాలలో చాలా  పురస్కారాల్ని అందుకున్నారు .  కాత్యాయని విద్మహే కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం , ఓల్గా – లోక్ నాయక్ పౌండేషన్ పురస్కారం , కె . వరలక్ష్మి – సుశీల నారాయణ రెడి పురస్కారం , స్వాతి శ్రీపాద – తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , శాంతి ప్రబోధ – రాష్ర్ట స్థాయి కందుకూరి పురస్కారం , సుహాసిని – స్త్రీల సమస్యలను ప్రతి బింబించే  పత్ర చిత్రాలని వేసినందుకు ,ఏషియా బుక్ ఆఫ్ రికార్డు , లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు , ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు . వీరందరికీ మరోసారి శుభాకాంక్షలు .

                     రాబోయే మహిళా సంవత్సరంలో  అన్ని రంగాలలోను మరింత ప్రగతి సాధించాలని మరిన్ని విజయాలను చేజిక్కించుకోవాలని మనసారా కోరుకుంటూ …..

           విహంగ మహిళా సాహిత్య పత్రిక తెలుపుతుంది ” అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”  .

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

సంపాదకీయంPermalink

Comments are closed.