గతంలో జీవించకు నేస్తం !

n-399-222x300ఇనుపగేటు మీద తన తెల్లటి చేతిని ఆన్చి స్నఫ్‌ కలర్‌ డ్రెస్‌లో నీరెండకు మెరిసిపోతున్న మోముపై నవ్వుల్ని పులుముకొని ‘సెండాఫ్‌’ ఇస్తున్న భంగిమలో నిలబడి ఉందా అమ్మాయి. మొదటి చిత్రంలోని పోలికలే ఈ చిత్రంలోవి కూడ. మన్యు గుండెలో మొండిబాకు దిగినట్లయి, మరో చిత్రంవైపు పరిగెత్తాయి అతని చూపులు.

కాలేజీ కాంపస్ దాటి రోడ్డు మీది కొచ్చాక కామర్స్ లెక్చరర్ వేద ప్రియతో మాట్లాడుతూ చాలా దూరం నడిచాడు ఎకనామిక్స్‌ లెక్చరర్‌ మన్యు. మాటల మధ్యలో కొన్ని రోజులుగా తన గుండెలోదాచుకున్న కోరికను నెమ్మదిగా అతని చెవిన వేసింది. ఆమె అభిప్రాయాన్ని విని విస్తుపోలేదు. నీరెండలో వింత కాంతితో, ఏదో ఆశతో ఆమె మోము మెరిసి పోవటంగమనించి, తలపంకించాడు. ఆమె టైమ్‌ కోసం చేతివైపు చూసుకుంటుండగా ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు మన్యు.

ఇంటికొచ్చాక స్నానం చేసి, ఫ్యాను కింద కూర్చుంటే హాయిగా అనిపించింది మన్యుకి. అలా ఎంతసేపని కూర్చోగలడు? నిముషాలు దొర్లుతుంటే – ఒంటరితనాన్నిఇష్టపడని మనసు అసహనంగా మూలిగింది. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్‌ రానంత వరకూ ఫరవాలేదు కాని,నిశ్శబ్దాన్ని భరిస్తూ- ఏదో వెలితితో పెట్రేగిపోతూ- విసుగ్గా గింజుకుంటే మాత్రం ఒంటరితనమనేది నిజంగా శాపమే? డ్రెస్‌ వేసుకొని, ఇంటికి తాళం వేసి, బయటకు నడిచాడు మన్యు. హోటల్లో కాఫీ తాగాడు.మౌని దగ్గరి కెళ్లాలనుకుంటూనే – బుక్‌స్టాల్‌ దగ్గర చాలాసేపు కూర్చున్నాడు. టైమ్‌ చూశాడు. ఎనిమిది గంటలు కావస్తూంది. హోటల్‌కి వెళ్లి భోంచేసి- మౌని  ఇంటికి బయలుదేరాడు మన్యు. మన్యు పని చేస్తున్న కాలేజీకి ఈ మధ్యనే ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చాడు మౌని. ఆ ఊళ్ళో అద్దె ఇల్లు దొరకటం కష్టమనిపించింది మౌనికి. మన్యును వెంటపెట్టుకొని టులెట్‌ బోర్డుకోసం వెతికి వేసారి, ఓ ఇల్లు దొరికిందనిపించుకొని, ఒక నెల అడ్వన్స్‌గా ఇచ్చి, హాయిగా నిట్టూర్చాడు మౌని. అద్దె ఇళ్ళ వేటలో వాళ్లిద్దరూ బాగా దగ్గరై-మంచి స్నేహితుల్లా మారిపోయారు. వాళ్ళు మాటల్లోకి దిగారంటే సమయం, సందర్భం మరచిపోయి, దేశ రాజకీయాల దగ్గర నుంచి కాలేజీ రాజకీయాల వరకు, క్రికెట్‌ మాచ్‌ దగ్గర నుంచి ఆసియా గేమ్స్‌ వరకు అలిసిపోయి, విసుగొచ్చేంతవరకు విడిపోకుండ మాట్లాుకుంటారు. గేటు తీసి, లోపలకెళ్ళి, బెల్‌ నొక్కాడు మన్యు.

పని పిల్లాడు వచ్చి తలుపు తీశాడు. ఒకసారి మాటల మధ్యలో-వాళ్ళ స్వగ్రామం నుండి పనికుర్రాడ్ని తెచ్చుకున్నట్లు చెప్పాడు మౌని. బహుశా వీడేనేమో అనుకుంటూ-”మౌని సార్‌ లేరా?” పిల్లాడిని ప్రశ్నించాడు
మన్యు. ఉన్నారన్నట్లుగా తల ఊపి, గదివైపు చేయి చూపి, నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు పిల్లాడు.
గదిని సమీపించి-డోర్‌ కర్టెన్‌ తీసి చనువుగా లోపలికి అడుగు వేశాడు మన్యు.
ఆశ్చర్చపోతూ అక్కడే ఆగిపోయాడు.
అలికిడికి-గుమ్మంవైపు దృష్టి సారించిన మౌని… చిరునవ్వు నవ్వుతూ ”హాల్లో…మన్యూ…
రండి, రండి” అంటూ ఆహ్వానిస్తూ- ”ఇలా కూర్చోండి. జస్ట్‌ వన్‌మినిట్‌!” అంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు.
”ఫరవాలేదు? మీ పని పూర్తి చేయండి” అంటూ కుర్చీలో కూర్చుని-చుట్టూ కలియ జూశాడు మన్యు.
మని మంచి కార్టూనిస్ట్‌. దాదాపు అన్ని పత్రికల్లోను అతని కార్టూన్స్‌ వస్తుంటాయి.
ఆ కార్టూన్స్‌ను చూసిన వాళ్ళెంత సీరియస్‌ మనుష్యులైనా పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వందే స్థిమిత పడ లేరు. ఈ విషయంలోమౌనిని చాలాసార్లు అభినందించాడు మన్యు.మౌని కార్టూనిస్టే కాక చిత్రకారుడని కూడ ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. ఆగదిలో ఉండే చిత్రాలను చూస్తుంటే-ఇది కొన్ని రోజుల్లో నేర్చింది కాదనిపిస్తోంది. తనతో ఎప్పుడూ చెప్పనేలేదు. మౌని దృష్టిలో తను అనుకున్నంత గొప్ప కాదేమో ఈ కళ! అందుకే తనతో చెప్పలేదు. మౌనిలోని చిత్రకళానైపుణ్యం లోకానికి తెలియకపోయినా ఆ పెయింటింగ్స్‌ చూస్తుంటే కొన్ని ఏళ్ళుగా తనకు నచ్చిన భంగిమలను చిత్రించటంలో  పరిశ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మౌనిని డిస్టర్బ్‌ చెయ్యటం ఇష్టంలేదు మన్యుకి.మౌని కుంచె అనేక వర్ణాలను తాగి-స్టాండ్‌కి అమర్చిన కాన్వాస్‌మీద అతి నేర్పుగా కదులుతూ, తన ప్రతిభను పులుముతోంది.నిండుగా, హుందాగా నిలబడి-చిత్రానికి ఫినిషింగ్‌ టచెస్‌ ఇస్తున్న మౌనిలో ఏదో తృప్తి, అంతు తెలియని ఆనందం, దేన్నో సాధిస్తున్నానన్న ధీమా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి.కుర్చీలో నుంచి లేచి-వరుసగా నిలబెట్టి ఉన్న చిత్రపటాలవైపు నడిచాడు మన్యు.ఒక్కో పటం ముందు నిలబడి శ్రద్ధగా, పరిశీలనగా చూడసాగాడు.
మన్యుకి-కొన్ని చిత్రాలు బొత్తిగా అర్థం కావటంలేదు. రంగుల్ని తాగిన అతని కుంచె వాంతి చేసుకుందేమో అన్నట్లుగా ఉంది. అలా అంటే కళాకారులు ఒప్పుకోరు. అందులో ఎన్నో భావాలు అంతర్లీనంగా దాగి ఉన్నాయంటారు. మనం ఒప్పుకోవలసిందే! కొన్ని చిత్రాలు అర్థమై, కానట్లున్నాయి. మరి కొన్ని నవ్వు తెప్పించేలా ఉన్నాయి. కొన్ని మాత్రం బాగా అర్థమవుతూ-భావగర్భితంగా గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. అతన్ని ఉక్కిబిక్కిరి చేస్తున్న ఆ చిత్రాలను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు పరీక్షగా. ఆ చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి? పదహారేళ్ళ ప్రాయంలోకి అడుగుపెట్టిన ముగ్ధమనోహర సౌందర్యరాశి. అందులో నన్ను మించినవాళ్ళు లేరన్నట్లుగా ఆమె అవయవ సౌష్టవం ద్విగుణీకృత మవుతుంటే- వాలుజడ సవాలు చేస్తున్నట్లుగా కదులుతుంటే-కాలేజీ ప్రాంగణంలోకి చేతిలో పుస్తకాలతో అడుగు పెడుతూ ఎవరినో చిరునవ్వుతో ‘విష్‌’ చేస్తున్నట్లుగా ఉంది. ఆ చిత్రానికి అద్దిన రంగులు సహజంగా ఉన్నాయి. ఆ చిత్రంలోని ఆ అమ్మాయి కళ్ళు మన్యుకి సుపరిచితాలే కావటంతో-వెన్నెముకలో ఏదో జరజర పాకుతున్నట్లై ఆసక్తిగా మరో చిత్రాన్ని దర్శించాడు.

ఇనుపగేటు మీద తన తెల్లటి చేతిని ఆన్చి-స్నఫ్‌ కలర్‌ డ్రెస్‌లో నీరెండకు మెరిసిపోతున్నమోముపై నవ్వుల్ని పులుముకొని ‘సెండాఫ్‌’ ఇస్తున్న భంగిమలో నిలబడి ఉందా అమ్మాయి. మొదటి చిత్రంలోని పోలికలే ఈ చిత్రంలోవి కూడ. మన్యు గుండెలో మొండిబాకు దిగినట్లయి, మరో చిత్రంవైపు పరిగెత్తాయి అతని చూపులు.సముద్రపు ఒడ్డున కేరింతలు కొడ్తూ పరిగెత్తే కెరటంలా పరువాల అలను పవిటకొంగుతో చుట్టివేసి-భాస్కరుని కాంతులకు నీలిముంగురులు వింతగా మెరుస్తుంటే-ఏదో తెలియని ఆనందపు ఊపులో అనుభవాల అంచుల్ని తాకాలన్న తపనతో ఆశగా అడుగులేస్తూ-మధ్యలో పెద్ద బండరాయిని ఢీకొని విరుచుకు పడ్డ పెనుకెరంటంలా ఆగిపోయింది ఆ అమ్మాయి! మన్యు మనసంతా ముద్దలా తయారై, మరో చిత్రాన్ని చూశాడు.
వెన్నెల కురిసిన ఏకాంతంలో-అవధులు లేని ఆనందంతో మౌని గుండెకు తన తలను చేర్చి, అలవోకగా నింగీ నేలను కలిసే చోటును చూస్తోందామ్మాయి. ఆమెను పొదివి పట్టుకొని, ఆమె తలను తన గుండెలకి హత్తుకొంటూ… ప్రేమగా నిమురుతూ… పాపిటను పెదవులతో స్పృశిస్తూ-ఆమెను తనలో ఐక్యం చేసుకోసుకోవాలన్న బలమైన కాంక్షతో ఉవ్విళ్ళూరుతున్నట్లుగా ఉంది ఆ చిత్రంలోని అతని భంగిమ. ఆ భంగిమలో మౌని పోలికలున్నాయి. ఒళ్ళంతా కారం పూసి ఎండలో నిలబెట్టినట్లుగా ఉంది మన్యుకి.

ఆ చిత్రాల్లోని ప్రతి భంగిమా ఎర్రగా కాలిన ఇనుపరాడ్‌గా మారి మన్యు శరీరంలోని అణువణువును వెదికి కాల్చివేస్తున్నట్లై, ఏదో తెలియని వ్యథ అతని గుండెను పిండినట్లై నెమ్మదిగా వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. ముఖానికి పట్టిన చెమటను కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు.

నిముషాలు గడిచిపోతుంటే తనలో చెలరేగుతున్న కడలి ఘోషను, అంతర్మథనాన్ని ముఖంమీద ప్రతిఫలించ నీయకుండా జాగ్రదావస్థ కొచ్చాడు మన్యు. వేస్తున్న చిత్రాన్ని పూర్తి చేశాడు మౌని. ”మిమ్మల్ని బోర్‌ కొట్టించాను. ఏదో మూడ్‌ వచ్చినప్పుడు ఇలా వెయ్యటం అలవాటైంది. ఈ పెయింటింగ్స్‌లో బాగా నచ్చిన వాటిని కళాభవనంలో జరిగే చిత్రకళా ప్రదర్శనంలో చేర్చాలనుకుంటున్నాను. అన్నట్టు ఇప్పుడు అన్ని చిత్రాలనూ చూశారు కదా! కొన్నైనా మీకు నచ్చాయా?” అడుగుతూ మన్యు దగ్గర కొచ్చి కూర్చున్నాడు మౌని.

మంచి మూడ్‌లో ఉన్న మౌని కళ్ళలోని తృప్తిని చూస్తూ-తన మానససరోవరంలో చెలరేగి విరుచుకుపడుతున్న ఆవేశపు కెరటాలకు పిచ్చిగా రెచ్చిపోకుండా తను ఏ విషయం మాట్లాడాలని వచ్చాడో అది ముఖ్యమన్నట్లుగా ప్రస్తుతానికొచ్చాడు మన్యు.

”కొన్నే కాదు. అన్నీ నచ్చాయి” అన్నాడు జవాబుగా.
”థాంక్యూ…” అంటున్న మౌనిలోని కళాహృదయం భరించరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది.
”మౌనీ? మీకు వేదప్రియ తెలుసు కదా?” అడిగాడు మన్యు.
”తెలియకేం! బాగా తెలుసు” చెప్పాడు మౌని.
”మీరు ఈ ఊరికి ట్రాన్సఫర్‌ అయి రెండు నెలలే అయినా-మన మధ్య స్నేహం ఏర్పడటం వేదప్రియగారు గమనించినట్లున్నారు. అందుకే కాబోలు ఈ రోజు నాకో బాధ్యత అప్పగించారు.”
ఏమిటన్నట్లుగా చూశాడు మౌని.
”ఆమె మిమ్మల్ని ప్రేమిస్తున్నారు? అంటే ఐ మీన్‌ ఆవిడ ప్రేమిస్తున్నది. ఎత్తుకి తగ్గ లావుతో, పచ్చని ఛాయతో హుందాగా కనిపించే మీ శరీరాన్ని, తేజోవంతమైన మీ కళ్ళని, విశాలమైన మీ వక్షస్థలాన్ని తీర్చిదిద్దినట్లుండే మీ కళ్ళని, నుదుటిమీద మాటి మాటికీ పడుతున్న మీ ఉంగరాల జుట్టునీ కాదు-మీ వ్యక్తిత్వాన్నీ, మీ టాలెంట్‌నీ-అని మీతో చెప్పమన్నారు” అన్నాడు మౌని కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ మన్యు.
గలగలా నవ్వాడు మౌని.

”నన్నిలా పొగుడుతుంటే ఆడపిల్లలా సిగ్గుపడాలో, మగాడిలా రెచ్చిపోవాలో అర్థం కావటం లేదు” అన్నాడు నవ్వుని ఆపుకుంటూ.
మౌని అందమైన రూపాన్ని, అహంతో కూడిన ఆ నవ్వుని చూస్తుంటే తిక్కరేగుతోంది మన్యుకి. తమాయించుకున్నాడు.
”నేనెప్పుడైనా సీరియస్‌గానే మాట్లాడతానని ఈ పాటికి తెలిసే ఉంటుంది మీకు…” అన్నాడు మన్యు.
మన్యు ముఖంలోకి చూసి మౌనం వహించాడు మౌని.

”ఆమె కూడా ఓ లెక్చరర్‌ కాబట్టి-ఆమెను పెళ్ళి చేసుకుంటే మీ జీవితం హాయిగా సాగిపోతుంది” అన్నాడు మన్యు.
మన్యు మాటలు జోక్‌కాదు. మౌని ముఖంలో రంగులు మారాయి. ఇంతవరకు ఉన్న సంతోషం మాయమయింది. నిరాశ, నిస్పృహ ఆవరించటంతో, ఏదో ఆలోచిస్తున్న వాడిలా ”పెళ్ళిమాట మరచిపోయి… చాలా కాలమైంది?” అన్నాడు.
”ఏం! ఎందుకని? నువ్వు…”

”మగాడినే! ఐ మీన్‌ మనసులేని మగాడిని. నా మనసెప్పుడో ఒక రూపానికి దగ్గరై, ఆ రూపం సమక్షంలో ఎంతో ఆనందాన్ని చవిచూశానన్న ఆత్మతృప్తితో బ్రతుకుతున్నది- మన్యూ! నా ఉనికి ఎలాంటిదో చెప్పనా? చచ్చిన శవం లాంటిది. ఇక్కడ నాకు దొరికిన ఏకైక నేస్తం మీరే. ప్లీజ్‌! నన్ను అర్థం చేసుకోండి…” అంటూ మౌని మాట్లాడుతుంటే-మన్యు గుండెలో అలజడి మొదలైంది.

”మీరే కాదులెండి! యువకుల్లో చాలామంది-నేనొక భగ్నప్రేమికుణ్ణి” అంటూ ఫ్రెండ్స్‌కి గతాన్ని చెప్పుకొని, సానుభూతిని అర్థించటం ఓ హాబిట్‌ అయిపోయింది. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకొని-భర్తతో కాపురం చేసుకుంటూ-ఎప్పుడైనా, ఎక్కడైనా తటస్థపడితే? ‘మీకు తెలుసో, లేదో ఒకప్పుడు ఆమె నా లవ్‌!’ అని ఫ్రెండ్స్‌కి చూపించటం ఓ గ్లామర్‌ అయిపోయింది. ఇదిగో ఇప్పుడుమన వేదప్రియగారిలా ఇష్టపడి దగ్గర కావాలనుకుంటే-వాళ్ళను తిరస్కరించటం ఓ ఫ్యాషన్‌…” అంటున్న మన్యు కొద్దిగా ఆగాడు.

మౌని కళ్ళు చురుగ్గా చూశాయి. ఏదో అనబోయాడు.
”నన్ను మాట్లాడనివ్వండి మౌనీ! ఈ ప్రకృతిలో ఎన్నో అందాలున్నాయి. మీ చిత్రకారులు స్పందించి గీసేందుకు ఎన్నో దృశ్యాలు మీ దృష్టిలో పడతాయి. కానీ మీ ప్రేయసి రూపమే మీకు ప్రేరణ కావటం సంస్కారమనిపించుకోదు. నా ఉద్ధేశం మిమ్మల్ని విమర్శించాలని కాదు. మీరు విరహంలో తృప్తిని వెతుక్కొని, ఊహల్లో జీవిస్తున్నారు. కానీ ఒకప్పటి మీ ప్రేయసి ఈనాడు బాధ్యతల్లో ఆనందించి, వాస్తవంలో బ్రతుకుతోంది. ఆమె రూపాన్ని మీ చిత్రకళా నైపుణ్యంతో చిత్రించి కళాభవనంలో ప్రదర్శించబోతున్నారు. అంటే ఆ విధంగా ఆమెను పదిమంది పోల్చుకుంటే-మీ ప్రేమ జీవించి, మీ ఆర్తికో గుర్తింపు, మీ ఆరాధనకో విలువ, మీ ఆవేదనకో అర్థం ఉంటాయన్న తపనతో – అహర్నిశలూ ఆరాట పడుతున్నారే కాని…ఆమె పచ్చని భవిష్యత్తుతో ఆడుకోబోతున్నారని మాత్రం గుర్తించలేక పోతున్నారు! అన్నాడు” మన్యు.

”మీరు వేదప్రియను దృష్టిలో ఉంచుకొని, ఆమెతో నా పెళ్ళి జరపాలని ఏదో ఆవేశంలో అంటున్నారు. అంతేకానీ… నా ప్రేయసి” అంటూ ఏదో అనబోతున్న మౌని ఆగిపోయాడు.
”స్టాపిట్‌! ఇక వినలేను! మీ ప్రేమతో నా గుండెకి తూట్లు పొడవకండి. మీ గుండెల్లో నిలుపుకున్న ఆ బొమ్మ పేరు తేజస్విత. ఆమె నా భార్య” మనసు తలుపులు భళ్ళున తెరుచుకొని హృదయాన్ని చీల్చుకొని వచ్చిందా మాట.
మౌని గుండెలో బాంబు పేలి బ్రద్ధలైనట్లైంది. తలతిరిగిపోతూ, మెదడు మొద్దుబారినట్లైంది. అంతులేని భయానికి, ఆలోచనల వేగానికి తట్టుకోలేని అతని హృదయానికి-ట్రీట్‌మెంట్‌ లేని యాక్సిడెంట్‌ అయింది.

చటుక్కున కుర్చీలో నుంచి లేచి-మన్యు రెండు చేతుల్ని పట్టుకున్నాడు మౌని. అతని చేతులు కంపిస్తున్నాయి.
”ఫ్లీజ్‌! మన్యూ! ఇదంతా మరచిపోండి! తేజ నా ప్రాణం. ఆమెను మీరు…” అంటూ మాట పూర్తి చేసేలోపలే- ”నోఁ…నోఁ” అంటూ పెద్దగా అరుస్తూ, అర్థిస్తున్నట్లుగా పట్టుకున్న మౌని చేతుల్ని వదిలించుకుంటూ…..
”తేజ-నా భార్య, నా ప్రాణం. నా జీవితభాగస్వామిని. నాతో కలిసి ఏడు అడుగులు నడచిన క్షణం నుంచి ఆమె చిరునవ్వుతో, చల్లని చూపులతో, తియ్యని మాటలతో-మనస్ఫూర్తిగా నన్ను తన సొంతం చేసుకొంది. నిష్కల్మషంగా అభిమానించి, గౌరవించింది. భార్యగా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. నా ప్రతిరూపాలకు తనలో ఊపిరి పోసి, నవమాసాలూ మోసి, మాతృత్వపు విలువను గుర్తించింది. ఇంకో నెల దాటితే ఇద్దరు బిడ్డలకి తల్లి ఆమె. మీ సెంటిమెంట్స్‌కి ప్రాధాన్యం ఇచ్చి, ఆమెను అనుమానించి, అవమానించేంత అవివేకినీ, కుసంస్కారినీ కాదు నేను.

అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి! ప్రేమ-విరహం తప్ప-జీవితం విలువ తెలియని మీకూ, మీ కళాహృదయానికీ ఇకమీదట నా భార్య రూపం ప్రేరణ కావటం నేను భరించలేను, వస్తాను,” అంటూ విసురుగా కుర్చీలో నుంచి లేచి బయటకు నడిచి, నిశీథిలో కలిసిపోయాడు మన్యు.

ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్న మౌని మదిలో వేదప్రియ మెదిలి మాయమైంది.
”నేస్తమా! నువ్వెంత ఎదిగిపోయావు? నీ ముందు నేనెంత! ఆఫ్ట్రాల్‌ ఓ అణువంత,!” అనుకుంటూ కిటికిలోనుంచి చూస్తున్న మౌని కళ్లకి-చీకట్లో నడిచిపోతున్న మన్యు వ్యక్తిత్వం హిమాలయాలను తాకుతూ కనిపించింది.

 

 –  అంగులూరి అంజనీదేవి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

One Response to గతంలో జీవించకు నేస్తం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో