కెరీర్ అనేది ఒక సుడిగుండం లాంటిది. అందులో పడటమే కానీ లేవడమనేది ఉండదు.
ఎందుకంటే..,
సమాజంలో నివసించే ఏ మనిషీ ఒంటరి కాదు.
ఎంత ఒంటరితనం అనుభవించే మనిషి అయినా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో
ఒకరిమీద ఆధార పడకుండా జీవించడం అసాధ్యం. జీవించడానికి మాత్రమే కాదు చివరికి చావాలన్నా కూడా నలుగురి
సహాయమూ కావాలి. నాకు ఎవరూ అక్కరలేదు, నా చావు నేను చస్తానంటే కుదరదు. చచ్చాక కుళ్లిపోయే లోపుగా
అంతిమ సంస్కారం చెయ్యడానికయినా కొందరు మనుషుల అవసరం వుంటుంది.
విత్తనం మొలకెత్తి మొక్కై మానై శాఖోప శాఖలుగా విస్తరించినట్టుగానే మనిషి ఎదుగుదలలో కూడా తను, తన
కుటుంబం, తనబంధువులు, తన స్నేహితులు, తన ఊరివారూ ఇలా తన ప్రపంచం విస్తరిస్తూ పోతుంది. ఆలా
విస్తరించడం చాలా స్వాభావికం. సహజం.
ఆ సహజమైన విస్తరణని కాదని దానికి విరుద్ధంగా చేస్తే ఏమవుతుంది ?
ప్రపంచం అంతా,
తన భాష, తన ప్రాంతం, తన ఊరివారు, స్నేహితులు, బంధువులు, ఇలా పరిమితులకి లోబడుతూ వచ్చి ,’ తను’ అనే
స్వార్ధ పూరిత ఆలోచనా ధోరణిలో పడిపోయి చివరికి మనిషి తన మనిషితనాన్ని కోల్పోతాడు.
అంటే తన అస్తిత్వాన్నే కోల్పోతాడన్నమాట.
తన అస్తిత్వాన్నే కోల్పోయినవారి కెరీర్ ఎంత గొప్పగా వుంటే మాత్రం ఎవరికి లాభం ?
ఏ ఒక్కరి విజయమయినా మరొకరి పరాజయం తరువాతే సిద్ధిస్తుంది.
అందుకే పెద్దలు యుద్ధాలని ప్రోత్సహించరు.
జీవితంలో పైకి రావడం కూడా ఒక యుద్ధం లాంటిదే. ఈ యుద్ధంలో చంపుకోవడాలూ నరుక్కోవడాలూ ఉండక
పోవచ్చుగానీ మానసికమైన ఒత్తిడీ తత్ఫలితంగా సంభవించే విపరిణామాలూ తప్పకుండా ఉంటాయి.
వాటిని అధిగమించడం తీరిగ్గా కూర్చుని పుస్తకాలు చదువుకున్నంత సులభం కాదు.
అయినా సరే,
మనం పైకి రావడం కోసం కెరీర్ గైడెన్స్ పుస్తకాలు ఎన్నో సలహా సూచనలని ఇస్తాయి. ఆయా సలహాలలో మనం
ఊహించలేని విషయాలు ఎన్నోఉంటాయి. వాటిలో చాలా వరకూ మన అభివృద్ధికి ఎన్నో విధాలుగా తోడ్పడతాయి.
మన ఎదుగుదలకి మన చుట్టూ ఉన్న వ్యక్తులూ ఉద్యోగులూ ఉద్యోగాలూ పరిసరాలూ మనకి ఎదురయ్యే సందర్భాలూ
ఆయా సందర్భాలలో ఎదురయ్యే సమస్యలూ వాటిని అధిగమించే ఉపాయాలూ మొదలయిన ఎన్నో విషయాలని
సోదాహరణంగా వివరిస్తాయి. కాబట్టీ ఆయా పుస్తకాలని చదవడం వలన మన అనుభవ పరిధి విస్తరిస్తుంది.
అయితే వాటిని చదువుతున్నప్పుడు ఎలాంటి దృక్పథంతో చదువుతున్నాం అనేదానిమీద మనం పొందే ఫలితాలు
ఆధారపడి వుంటాయి.
మన చుట్టూ ఉన్న సమస్త విషయాలనీ మనకి అనుకూలంగా మలచుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి ఆ పుస్తకం
ఉపయోగిస్తుంది.
అదే సమయంలో మనం కూడా మన చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ పదార్ధాలు మనకి ఎన్ని విధాలుగా
ఉపయోగిస్తున్నాయో, కనీసం అందులో పది శాతమయినా వాటికి మనం ఎటువంటి స్వార్ధం లేకుండా
ఉపయోగిస్తున్నామా ? వాటికి ఉపయోగించడం ద్వారా మనం ఎలాంటి ఉపయోగం పొందగలం? మనకి ఏ ఉపయోగం
లేకపోయినా మనం వాటికి ఎందుకు ఉపయోగ పడకూడదు ? అని ప్రశ్నించుకుంటూ.., ఆ ప్రశ్నలకి జవాబులు
వెతుక్కుంటూ చదవగలిగితే ఆ పుస్తకాలు మన ఎదుగుదలకి కొంత మేరకి దోహద పడతాయి. మనకి ఎలా
ఉపయోగిస్తాయో తెలుసుకోవడం ద్వారా మనం ఎలా ఉపయోగిస్తామో అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యడం అంటే,
మన్ని మనం ఉద్ధరించుకోవడం అన్నమాట. ( ఈ మాట ఏ కెరీర్ గైడెన్స్ పుస్తకాల్లోనూ ఉండదు. ఎందుకంటే అది రాసేస్తే
ఆ పుస్తకాలని కొనేది ఎవరు ? )
అలా చెయ్యలేక పోవడం వల్లనే జీవితమంతా కెరీర్ వెంట పరుగులు తీసీ తీసీ అలిసిపోయిన మలి సంజె వేళలో తమ
అంతరాత్మ నిలదీసినప్పుడు, దానికి సరయిన సమాధానం చెప్పుకోలేక ఎందరో పెద్దలు, ఆత్మ తృప్తి కోసం ఆధ్యాత్మికత,
దైవ భక్తీ అంటూ బాబాల వెంటా స్వామీజీల వెంటా పడి మానసిక శాంతిని వెతుక్కునే వ్యర్ధ ప్రయత్నాలు చేస్తారు.
అలాంటి ప్రయత్నాలు చేసేవారిలో ఆయా పుస్తక రచయితలూ ఉన్నా ఆశ్చర్య పోనక్కరలేదు .
ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిది.
అందుకే, కెరీర్ గైడెన్సు పుస్తకాలని మనం ఏ దృక్పధంతో చదువుతున్నాం అనేదానిమీద దాని ఫలితాలు ఆధారపడి
వుంటాయి.
ఏ లాభాన్ని ఆశించి సూర్యుడు వెలుతురునీ.., చంద్రుడు వెన్నెలనీ.., మేఘం నీటినీ.., చెట్లు పండ్లనీ ఇస్తున్నాయి ? అని
ప్రశ్నించే పద్యాన్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. గుర్తుందా ?
అవన్నీ తమంత తామే ఎవరూ ఏమీ అడక్కుండానే అందరికీ అన్నీ ఎందుకు సమకూరుస్తున్నాయి ?
బహుశా వాటికి చదువు రాకపోవడం వల్ల కావచ్చు..!
ఒకవేళ చదువు వచ్చినా వాటికి కెరీర్ గైడెన్స్ పుస్తకాలు అందుబాటులో ఉండకపోవడం వల్ల కావచ్చు..!
లేదా వాటికి కెరీర్ అంటే తెలియక పోవడం వల్ల కావచ్చు.. !
తెలిసినా తమకి ఎలాంటి కేరీరూ ఉండదనే విషయం ముందే తెలియడం వల్ల కావచ్చు..!
లేదా,
ఏ చదువూ చదవకుండానే తమ జీవితాన్నీ కుటుంబాన్నీ చేతనయితే ఊరినీ కూడా చక్కగా తీర్చి దిద్దుకుంటూ
పదుగురికీ తలలో నాలుకలా జీవించే భారత దేశంలోని కోట్లాదిమంది నిరక్షరాస్యులూ.., అక్షరాస్యులయినా విద్యాధికులు
కానివారిలాగే అవి ఎప్పుడూ తమ కెరీర్ గురించి ఆలోచించక పోవడం వల్ల కావచ్చు..!
అయినా చదవడానికి ముందే స్పష్టమైన దృక్పధం ఏర్పరచుకునేంత జ్ఞానమే వుంటే అసలు ఏం చదవాలి అనే ప్రశ్న
చేదుగా వుండటం సహజమే. ఎందుకంటే, తీపి పూట పూసి అందించడానికి ఇవి మందు బిళ్ళలు కావు. నిజాలు. కాబట్టీ నిష్టూరంగానే వుంటాయి. కెరీర్ గురించి చెప్పే వాళ్ళూ రాసే వాళ్ళూ కూడా తేనే పూసి అమ్ముతారు లేకపోతే అమ్ముడు కావు. కాబట్టీ వాళ్లెప్పుడూ జన రంజకంగానే మాట్లాడతారు. కెరీర్ గైడెన్స్ లో ప్రధానమయిన పరోపకారం గురించి తక్కువగా మాట్లాడ లేదు. గమనించగలరు.
కెరీర్ గురించి మీరు చెప్పిన మాటలు చాలా చేదుగా ఉన్నాయి. కెరీర్ గురించి చెప్పే ఎవరూ ఎదుటివారిని మన స్వార్ధం కోసం ఉపయోగించుకోవాలని చెప్పరు. మీరు కెరీర్ అనే పదాన్ని దానికి సంబంధించిన భావనలనీ అపార్ధం చేసుకున్నట్టు అనిపిస్తోంది. సరైన దృక్పధం తో ఆలోచించి చూడండి, కెరీర్ గైడెన్స్ లో పరోపకారం కూడా ప్రధానమే.
అశోక్ గారూ,
రాణి గారు ఇన్ని రోజులుగా చెప్పిన మొత్తం విషయాలన్నిటినీ కలిపి ఒకే ఒక్క ముక్కలో తేల్చేసారు.
కానీ ఆవిడ చెప్పిన ప్రతీ విషయమూ ఆలోచించ దగినదే.
అయినా నాకో చిన్న అనుమానం,” ఏమి చదివితే ఇంకా చదవనవసరం ఉండదో ” అది ఏదంటారు ?
***ఏమి చదివితే ఇక చదవనవసరం ఉండదో అది చదవాలి..****