అమృత వర్షిణి … !

photoచేతి వే ళ్లు  కదిలి

చెక్కిలి చేరే వరకు

చెమ్మ తెలియలేదు . . 

 
బరువెక్కిన గుండె 
తేలికైన హాయి సోకేవరకు 
ఆ స్పృహే లేదు . . 
 

నువ్వు ఆవేదనంటావు
నేను  ఆర్ద్రత అంటాను . .
నువ్వు పరితాపమంటావు
నేను ప్రక్షాళననుకుంటాను  . .

శతాబ్దాల చేదు అనుభవాలలో
సమసిపోయిన స్పందనల స్మృతుల్లో
చేజారిన జీవపు వ్యధల్లో
ఒంటరితనపు చిత్రవధల్లో

కౌటిల్యపు లోకం తీరుల్లో
కాటిన్యపు కాలం తీర్పుల్లో
అవాంఛనీయ ఘటనల్లొ .
ఆశక్తపు ప్రతిఘటనల్లొ. .

ఒలికి పోతున్న జీవన సుధల్లో
ఓడిపోతున్న మనసు సొదల్లో . .
చెలియలి కట్ట దాటి
చెక్కిట జాలువారుతున్న
ఒక్కో చుక్కా. . రాల్చుతున్న
గత జ్ఞాపకాల మాలిన్యంలా. .
మబ్బు వీడిన గగనపు ప్రశాoతతలా  . .
నిశి తొలిగిన నీలి కన్నుల నిర్మలతలా . .

జీవితపు ప్రతి పరీక్షలో
ప్రతీక్షల్లో

పొడి బారిన నా గుండెల్లో
తడి నింపిన ఆత్మీయతా . .
ఓ అమృత మూర్తీ . . .!
అశ్రు బిందువా . . .
నీకు జోహార్లు. .!

  – నిర్మలారాణి తోట

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

UncategorizedPermalink

Comments are closed.