టగ్ ఆఫ్ వార్ 14

380280_3926581654039_1527681385_n-225x300-112x150ఓ చేత్తో కళ్ళద్దాలు తీసిపట్టుకుని ఎడం చేతి బొటన వేలు చూపుడు వేలితో కళ్ళు సున్నితంగా నులుముకుని ఒక్క క్షణం అలా ఉ౦డి పోయింది …………..

అప్పుడే ఎన్నేళ్ళు గడచిపోయాయి ? నిన్న మొన్న జరిగినట్టుగా వుంది తల్లులు పిల్లలు అక్కడ, చంప ఇంట్లో సమావేశమై. వసుంధర ,రత్నబాల ,సాహితి , పావని,  శకుంతల ఇంకా ఒకరికొకరు పరిచయం కాని అయిదారుగురు.

చంప గొంతు సరిచేసుకుని తలవంచుకు కూచున్న అమ్మాయిల వంక చూసింది.

ఆ చూపులో కోపం లేదు , ఓ రకమైన బాధ తప్ప.

అందరివైపూ ఓ సారి చూసి

 “ఇహ మొదలెట్టానా?” ఎవరినీ ఉద్దేశ్యించి అనలేదు. అందరినీ అలర్ట్ చేస్తున్నట్టుగా తనలో తనే అనుకుని

 “ మీ మీ పరిచయాలు మీరే చేసుకుంటే బాగుంటుంది. మరీ అపరిచితుల్లా కాకుండా ,కనీసం ఒకరికొకరు కాస్త తెలిసినట్టు అనిపిస్తుంది.  రత్నా నువ్వు మొదలుపెట్టరాదూ ?”

కొంచం వెనకముందాడినా లేచి నిల్చుంది రత్న.

“కూచునే చెప్పు వినిపిస్తు౦దిలే, నీ ఇష్టం .నీకెలా బాగుంటే అలాగ .. “

“ ముందుగా పేరు చెప్పనా ? రత్నబాల టీచర గా పనిచేస్తున్నాను. వసుంధర సాహితి నాపిల్లలు “అంటూ ఇద్దరినీ చూపింది.

శకుంతల పరిచయం చేసుకున్నాక ఆ కాలనీ వాళ్ళూ తమను తమ పిల్లలను పరిచయం చేసారు.

చంప ఆరంభించింది.

“ ఇక్కడ ప్రతివాళ్ళూ ఎదో ఒక సమస్యలో ఉన్నవాళ్ళే .ఆ సమస్యలు ఏమిటి ఎందుకలా చేసారనేది ఇక్కడ అమ్మాయిలే చెప్తారు ఆ తరువాత మనం పరిష్కారం గురించి చర్చించుదాం.

అయితే ఒక కండిషన్, తల్లులు పూర్తీ శాంతంగా వినాలి మధ్యలో కల్పించు కోరాదు. అలాగే పిల్లలూ ఇక్కడ ఉన్నదున్నట్టుగా వివరించాలి ఏ కల్పిత గాధలూ కల్లబొల్లి మాటలూ అవసరం లేదు. అలాగైతేనే మనం వీటిని సమిష్టిగా చర్చించుకుని ఒక కొలిక్కి తేగలం. “

అందరూ అంగీకారంగా తలలూపారు.

“ వసుంధరా ఇటురా తల్లీ రా నాపక్కన కూచో “ వసుంధరను పిలిచి పక్కన కూచోబెట్టుకుని “స్థిమితంగా చెప్పు. ఎలాటి బాధ భయం అవసరం లేదు “ అంటూ ప్రోత్సహించింది.

తలవంచుకుని చీరకోగు అంచుతో చిన్న  కుచ్చిళ్ళు పెడుతూ విప్పుతూ కాసేపు గడిపాక , అది వదిలి ఎడమ చేత్తో జుట్టుపైకి తోసుకుని ,ఒకసారి తలెత్తి అందరివంకా చూసి మొదలు పెట్టింది వసుంధర.

“ నాపేరు వసుంధర.”  మృదు మధురంగా వినబడింది తియ్యని స్వరం.

నా పేరు వసుంధర. ఎక్కడి నుండి చెప్పను? నిజానికి చిన్నప్పటినుండీ చెప్పాలి. అయితేనే నాకెందుకు చదువు అబ్బట్లేదనేది మీకు తెలుస్తుంది.

ఊహ తెలిసేవరకూ ఏం చదివానో ఎలా చదివానో గుర్తు లేదు కాని ఐదో తరగతికి వచ్చాక జరిగిన ప్రతి చిన్న విషయమూ అంతో ఇంతో గుర్తుంది.

చిన్నప్పుడే, రె౦డోఏటో ,ఎక్కడో జెండా ఎగరవేస్తు౦టే వెళ్లి జనగణమన  పాడానని ప్రతి వారూ మెచ్చుకుని అప్పటికప్పుడు ఏవేవో బహుమతులిచ్చారని అమ్మ చెప్తూ౦డేది.

అవును నాకూ గుర్తుంది గులాబీ రంగు శాటిన్ రిబ్బన్ ముక్క, రంగురంగుల కలర్ పెన్సిళ్ళు, చిన్న రబ్బరు బొమ్మ , ఒక పలక , రంగు రంగుల ప్లాస్టిక్ అంచులున్న పలక.

అయితే పేరు ప్రఖ్యాతి అంటే తెలియని వయసులోనే అందరూ నా స్వరాన్నీ , నాపాటనీ మెచ్చుకోడం నామీద నాకే ఓ విధమైన అభిప్రాయ౦ ఏర్పడిపోయింది.

పాట నాకు స్వ౦తమనే అభిప్రాయం,  నేను గొప్ప గాయకురాలిని అయ్యే౦దుకే పుట్టాననీ.అంత చిన్న వయసులో ఎవరూ పెద్దగా గమనించలేదు కాని ఏ పాట రాగం విన్నా వెంటనే పట్టేసి పొల్లుపోకుండా పాడేదాన్ని. పాటల విషయానికి వస్తే ప్రార్ధన నేను లేకుండా జరగదు. ఏ ప్రత్యేక కార్యక్రమమైనా నా పాటతో మొదలై నా పాటతోనే ముగియాలి.

చిన్నప్పుడు , అయిదారు తరగతుల వరకు బాగానే ఉండేది కాని పెద్ద క్లాస్ లకి వచ్చాక నాకు నచ్చని మాత్స్ చెయ్యాలి, నాకు ఆసక్తి లేని సైన్స్ పాఠాలు చదవాలి. ముఖ్యంగా టీచర్ల పద్ధతే నాకు నచ్చేది కాదు. క్లాస్ లో రెండు మూడు లెక్కలు బోర్డ్ మీద చేసి ఎక్కి౦చుకో౦డి అనే వారు. ఏ స్టెప్ ఎలా వస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. ఆపైన ముప్పై నలభై లెఖ్ఖలు హోమ వర్క్. అవి చేయి౦చే౦దుకు ట్యూషన్ టీచర్ . ఆవిడా అంతే.

టకటకా స్టెప్స్ చెప్పేసి రాసుకోమనడం.

సైన్స్ అంటే పుస్తకాలు పట్టుకుని చదివి వినిపించేసి. ప్రశ్న జవాబులు రాయించడం.

అయితే ఈ పద్ధతంతా స్కూల్లో చిన్నప్పుడు చదివే రోజుల్లో చాలా బాగుండేది.

తొమ్మిదో క్లాస్ వరకూ ఏదో రకం గా నెట్టుకొని వచ్చినా తొమ్మిదో తరగతిలో ఒక్కముక్కా తలకేక్కేది కాదు.

దానికి తగ్గట్టు ఇంట్లో సమస్యలు. నాన్న ఎప్పడూ ఊళ్లు తిరగడమే. నెలకోటి రెండు సార్లు వచ్చి చుట్టం లా నాల్రోజులు౦డి వెళ్ళిపోవడమే.

అమ్మ పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

చుట్టు పక్కల వాళ్ళు గుసగుసలు పోయే వారు , ఆయనకింకెక్కడో మరో సెటప్ ఉండే ఉ౦టు౦దనీ ,అందుకే ఇక్కడ ఉ౦డడనీ. కోపం వచ్చేది. దానికి మించిన బాధ. నాన్నను డైరెక్ట్ గా అడిగే  సాహసం చెయ్యలేకపోయేదాన్ని. అమ్మను ఒకటి రెండు సార్లు అడిగి విసిగి౦చినట్టున్నాను.

స్కూల్లోనూ టీచర్ల ధోరణి మారిపోయింది.

పాటలు పాడుకుంటే సరిపోతుందా నాలుగు అక్షరాలూ రాకపోయాక ? రోడ్డు పక్కన గుడ్డ పరచుకుని పాడతావా ఏమిటి ? చదువు మీద శ్రద్ధ పెట్టు అని గదిమే వారు. కోపం వచ్చేది. ఒక్కట్టికీ నాలుగు ముక్కలు పాడటం రాదు , నన్నిలా అంటారా అని ఉక్రోషం వచ్చేది. కాని లోలోపలే గొణుక్కోడం తప్ప ఎం చెయ్యలేకపోయేదాన్ని.

తొమ్మిది ఎలాగోలా ప్రమోట్ అయినా పది దాట లేకపోయాను.

రెండు సబ్జెక్ట్ లలో  పోయింది.

మాత్స్ ,సైన్స్. మిగతా వాటిలో బొటాబొటీ మార్కులు.

నానా ఇబ్బందులూ పడి ,ట్యూషన్లకి వెళ్లి  ఆబ్జెక్టివ్ పేపర్కి  ఇన్విజిలేటర్ ఆన్సర్లు చెప్పాక సైన్స్ లో పాస్ మార్కులు మల్లె మాత్స్ లో ఫెయిల్. ఇరవై మార్కులే.

మళ్ళీ వార్షిక పరిక్షల సమయంలోనే రాయాలి. ఈ ఏడాది సమయం లో వేల కొద్దీ పాటలు నేర్చుకున్నాను. ఆ విషయం స్కూల్ కి వెళ్ళే అమ్మకూ, పదో తరగతి చదివే చెల్లికీ, ఊళ్లూరేగే నాన్నకూ ఎవరికీ తెలియదు. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే తీరికలేదు.

పాడతా తీయగాకి వెళ్లి పాడాలనుకునేదాన్ని కాని ఏ విధంగా వెళ్ళాలో తెలియదు. ఎక్కడయినా పోటీలు ఉంటే వెళ్దామా అని ఎన్ని సార్లో అమ్మనడిగాను. ఏం వెళ్తావ్? నీ కాపాటి పాడటం వచ్చా , చూద్దాం  లే అనేది.

బయటకు వెళ్ళే అవసరం లేదు ఇరవై నాల్లుగ్గంటలూ   ఇంట్లో ఉంది విసుగొచ్చిన సమయంలో సప్లిమెంటరీ పరీక్షలప్పుడు శంకర్ ఆటోలో వెళ్ళే సమయంలో పాటల ప్రసక్తి రావడం , అతను మెచ్చుకోడం ఎవరో ఒకరు నన్ను మెచ్చుకున్నారన్న ఊహ నన్ను నేల మీద నిలవనివ్వలేదు.

ఎప్పుడూ ఎక్కువ మాట్లాడని నేను అతనితో మనసులోని ప్రతిమాటా ఎలా మాట్లాడానో నాకే తెలియదు.

పాడటం పైన నా ఆసక్తి గురించీ ,గొప్ప గాయినీ మణిని కావాలన్న కోరిక గురించీ , నాన్న తిరగటం వాళ్ళ అమ్మ పడే బాధల గురించీ , ఒకటేమిటి ఏదీ ఇది మిగిలిపోయి౦దె అనిపిoచ నట్టు అన్నీ మాట్లాడాను.

నేను సుశీల కన్నా బాగా పాడతానన్నాడు. పెళ్ళయాక సంగీతం నేర్చుకు౦దువు గాని అన్నాడు.

అమ్మకు ఏ కష్టమూ లేకుండా అన్ని విషయాలూ చూసుకు౦టానన్నాడు.

నిజమే అనుకున్నాను. అమ్మకు ఇబ్బందులు ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు గుళ్ళో పెళ్లి చేసుకు౦దామన్నాడు. తీరా  పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళే వరకూ అతన్ని అంచనా వెయ్యలేకపోయాను.

చిన్నప్పటి నుండీ “అయ్యో పడిపోతావు “ అంటూ ఎక్కడ దెబ్బ తగులుతుందో ,ఎక్కడ కందిపోతారో అన్నట్టు పెంచే అమ్మలు మా జీవితాలూ వాళ్ళే బ్రతకాలనుకు౦టారు. మేమేం చదివాలో వాళ్ళకే తెలుసు , మేం ఏం చెయ్యాలో వాళ్ళే నిర్ణయిస్తారు, చివరికి మా ఆలోచనలు పెరగకుండా చేసి మమ్ములను మరుగుజ్జులుగా మారుస్తారు.

ఏది కావాలో అది ఇవ్వరు , ఏది అవసరం లేనిదో అది అందిస్తారు. 

జీవితానికి కావలసిన లోకజ్ఞానాన్ని తెలుసుకోనివ్వరు . పెద్దవాళ్ళ మాటలు వినకూడదు.

మనసులో ఆకాంక్షలు పెదవిపైకి రాకూడదు.

నోరు విప్పి ఏం అనుకుంటున్నామో చెప్పకూడదు.

ఎందుకంత అస్వతంత్ర్యంగా  పెంచుతున్నారు?

ఒక మూసలో పోసి ఏ రూపం కావాలనుకుంటున్నారు?

ఆగని కన్నీళ్లు వరదలై పారాయి వసుంధర చెక్కిళ్ళ పైన , రత్న బాల చలించి పోయింది. గబుక్కున లేచి కూతురిని గుండెకు హత్తుకుని కన్నీటి పర్యంతమై౦ది.

కూతురి వీపునిమురుతూ ఉండి పోయింది.

“ ఇది నాకు తెలిసిన వసుంధర కాదు. వసుంధరకు ఇన్ని మాటలు వచ్చనీ , దానిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయనీ నాకస్సలు తెలియదు . ఇది పూర్తిగా కొత్త మనిషి నాకు “ పూడుకు పోయిన గొంతుతో బొంగురుగా పలికింది ఆమె స్వరం. 

కాస్సేపాగి “ నిజంగానే సిగ్గుపడుతున్నాను. నా పెంచిన తీరుకు … సారీ రా వసూ”

“ సరిసరి. ఇద్దరికిద్దరూ ఇలా ఇమోషనల్ అయిపోతే ఎలా? అయింది అయిపోయింది. ఇప్పుడిక ఏం చేద్దాం ? అది ఆలోచించాలి కదా! “ హెచ్చరి౦చి౦ది చంప. 

“ దాని జీవితం , దానిలో ఇన్ని ఆలోచనలున్నాక అది ఏం చేస్తానంటే అదే , కాదనను “ రత్న బాల చెప్పింది.

“ అమ్మా నాకు సంగీతం నేర్చుకోవాలనుంది .అయతే ఆ బరువు నీ మీద పెట్టాను ఎదో ఒక పని చేసుకుంటూ సాయంత్రాలు మ్యూజిక్ కాలేజీకి వెళ్తాను. నాకు గుర్తింపు వచ్చే వరకూ నా ధ్యేయం సంగీతమే” ఖచ్చితంగా చెప్పింది వసుంధర.

“ ఏం పని చేసుకుంటావు? ఎవరిస్తారు?” కొంచం నిరాశగా పలికింది రత్నబాల స్వరం.

“రత్నా , నీకు అభ్యంతరం లేకపోతె నా బొటీక్ లో పెట్టుకుంటాను. ఆసక్తి ఉంటే కుట్టు నేర్చుకోనీ లేదూ ఉదయం కాస్త సూపర్విజన్ చేసినా చాలు , ఈ పక్కనే ఫర్లాంగ్ దూరం లో మ్యూజిక్ కాలేజీ ఉంది “

ఆ ప్రపోజల్ కి తల్లీ కూతుళ్లిద్దరూ ఒప్పుకున్నారు.

సాహితి లేచి వెళ్లి అందరికీ టీలు బిస్కెట్లు తెచ్చింది.

వసుంధర మాట్లాడటం ముగిసినట్టుగా “అమ్మ ఇష్టం అత్తా . తనేమంటే. అదే “ అంది.

“సరే ఈ విషయం తల్లీ కూతుళ్ళు చర్చించుకుని చెప్పండి. అయితే ఇక్కడ మనందరం గమనించ వలసిన విషయాలు కొన్ని జనరల్ గా చర్చి౦చుకుందామా? నిజానికి రత్న గురించి మీ అందరికీ పెద్దగా తెలియక ఎదో తన గురించి అపోహ పడతారేమో, కాని పెళ్ళైన క్షణం నుండీ ఇప్పటి వరకు గత ఇరవై ఏళ్లుగా అది ఎంత కష్టపడుతో౦దీ నాకు తెలుసు. ఉద్యోగం రావడం దాని అదృష్టమనుకోవాలో దురదృష్టం అనుకోవాలో గాని వాళ్ళిచ్చే జీతం రాళ్ళకి జీవితం తాకట్టు పెట్టుకున్నట్టే అయింది.ముఖ్యంగా ఎందరి జీవితాలో సరిదిద్దే ఉపాధ్యాయులను ఇలా వెట్టి చాకిరీకి నియమి౦చుకున్నట్టు వాడుకోడం శోచనీయం.

ఇక్కడ మన స్త్రీల పరిస్థిటి ముఖ్యంగా మహిళా ఉద్యోగినుల స్థితి విదేశాలతో పోలిస్తే ఎంత దయనీయంగా ఉందో, అసలు వ్యవస్తే ఎంత అధ్వానంగా ఉందో అర్ధ మవుతుంది. పనిగంటలు అంటూ ఆరున్నర గంటలే కదా స్కూల్స్ కోసం పని చేసేది అంటారు. అయితే మిగతా ఆఫీస్ లతో పోలిస్తే ఉపాధ్యాయులు చేసే పని దానికి మూడు రెట్లు. ఎక్కడో మారుమూలల్లో స్కూల్స్ ఉంటాయి వెళ్లి వచ్చే౦దుకే రెండు గంటలు కావాలి. స్కూల్లో ఉన్న ఆరు గంటల్లో కనీసం నాలుగున్నర గంటలు క్లాస్ లో పాఠాలు చెప్పాలి. మిగతా సమయం ఎ ఒక్క టీచర్ సెలవులో ఉన్నా ఆ క్లాస్ లు చూడాలి, ఇంకా కొన్ని స్కూల్స్ లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ … ఆటలు , పాటలు కార్యక్రమాల తయారీ” ఆగింది చంప.

 – స్వాతీ శ్రీ పాద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో