మమతా బెనర్జీ రూలింగ్లో ఇంకో భయంకరమైన దారుణం.
రేప్ ఒక శిక్ష!
అది కూడా పంచాయతీ పెద్దల సమక్షంలో నచ్చినంత మంది వేయగలిగే శిక్ష!
తప్పేదైనా కానీ..
యావజీవ కారాగార శిక్ష నాకు తెలుసు. మరణ శిక్ష నాకు తెలుసు!
పంచాయితీల్లో జరిమానాలు తెలుసు, తప్పు వెయ్యడం, వెలి వెయ్యడం తెలుసు!
కొన్ని విచిత్రమైన శిక్షలూ తెలుసు!
కానీ రేప్ శిక్షగా వేస్తారా?
స్త్రీని అణచడానికీ, ఆమెను అవమానపర్చడానికీ, శిక్షించడానికీ అత్యాచారం ఒక ఆయుధం!
నచ్చినంతమంది ఊరిపెద్ద ఇంట్లోనే ఈ ఘనకార్యం చేయడం!
దీన్ని గురించి ఏమ్మాట్లాడవచ్చు?
ఏమాలోచించొచ్చు?
ఏమని బాధపడొచ్చు?
ఎంతని భారతజాతి యావత్తూ తల క్రిందికి….పాతాళంలోకి పాతేసుకోవచ్చు?
సరే! ఇక నాకనిపించిన కొన్ని విషయాలు చెప్తాను.
ఇప్పటివరకూ మనం చూసిన రేప్ కేసుల్లో అమ్మాయిని ఎత్తుకుపోవడం/ ఎవరూ చూడకుండా ఇంట్లోకి దూరడం/ నడుస్తున్న వాహనాల్లో అత్యాచారం చేయడం మనకు తెలుసు.
ఇక్కడ విషయం వేరు!
పంచాయితీలో అందరి ఎదురుగా జరిగిన చర్చ, తదుపరి అందరిలోనో వేసిన జరిమానా….
అది కట్టలేనని ఆ అమ్మాయి అన్నపుడు వాళ్ళు వేసిన శిక్ష!
ఇదంతా ఎక్కడో, ఎవరికీ తెలియకుండా, చాటుగా జరిగినది కాదు!
నా ప్రశ్న ఏమిటంటే, ఎంత గిరిజన ప్రదేశమైనా, అటువంటి హేయమైన శిక్షకు వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పలేదా?
అంత బహిరంగంగా గ్రామ పెద్ద ఇంట్లోనే ఈ “హేయమైన కార్యం” జరిగినపుడు, ఎవరూ అడ్డుకోలేదా?
అన్ని చోట్లా మొబైల్ ఫోనులున్న ఈ కాలంలో ఏ మీడియాకీ/ న్యూస్ పేపర్ వాళ్ళకో/ వేరే ఊరిలోని వారికో/ అధికారులకో ఈ విషయాన్ని ఎవరూ తెలుపలేదా?
అసలు ప్రజా చైతన్యం ఏమయింది?
జనాల ప్రతిస్పందన ఎందుకు లేదు?
అదే ప్రాంతంలో ఏ పెన్షన్ డబ్బులో ఆ ఊరిపెద్ద తినేస్తే ఊరుకుంటారా?
అదే ప్రాంతంలో తమ పొలాన్నో, ఇంటినో ఊరిపెద్ద ఎవరికైనా ఇచ్చెయ్యమంటే ఇచ్చేస్తారా?
ప్రజలు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? ఎందుకు స్పందించలేకపోతున్నారు?
ఇక్కడ నేను ప్రజల స్పందన గురించే మాట్లాడదలచుకున్నాను.
నిర్భయనూ, ఆమె స్నేహితుడినీ రోడ్డుపై నెత్తురోడుతూ, దుస్తులు లేకుండా చలికి వణుకుతున్నా, భయంతోనో, నిర్లక్ష్యంతోనో, నాకెందుకనుకునో ప్రక్కనుండి వెళ్ళిపోయిన మనుషులను చాలా తిట్టుకున్నాం ఆ సమయంలో!
మరి ఊరి అందరి ముందూ ఇటువంటి తీర్పును ఇచ్చిన పంచాయితీని వ్యతిరేకించడానికి అక్కడి ప్రజలు ఎందుకు సాహసించలేదు?
ఎక్కడైనా ప్రజాచైతన్యం లేకపోతే ఘోరాలు జరుగుతూనే ఉంటాయి!
మనం మనుషులమని మనకు మనం అనుకోవాలన్నా….
బ్రతుకుతున్నామని విశ్వసించాలన్నా….
చైతన్యాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది!
– విజయ భాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
8 Responses to రేప్ ఒక శిక్ష!?