సహనం చచ్చినట్లై….‘‘కాలేజి వుండి కూడా వెళ్లలేదా? ఎంత డబ్బు కట్టానురా కాలేజిలో..! అయినా అందరు కాలేజికి వెళ్లి చదువుకుంటుంటే నువ్వు ఇంట్లో వుండి ఏం చేస్తావ్?’’ అన్నాడు శేఖరయ్య.
అందరితో నన్ను పోల్చకు…. నువ్వు అందరి తండ్రుల్లా వున్నావా?’’
‘‘ నీకేం తక్కువ చేశానురా?’’
‘‘ మా ఫ్రెండ్స్‌కి వాళ్ల పేరెంట్స్ ఇచ్చినంత పాకెట్ మనీ ఇస్తున్నావా? వాళ్లు వేసుకునే డ్రసుల్లాంటివి తీసిస్తున్నావా? బయటకెళ్లి వాళ్లు ఖర్చు పెట్టినట్లు నేను ఖర్చు పెడితే నువ్వొప్పుకుంటావా?’’
‘‘చదువు ముఖ్యం కదరా! ఏదో వున్నంతలో సర్దుకుపోవాలి’’
‘‘ నన్ను ట్రైడ్ మిల్ పై వదిలిపెట్టి మైదానంలో పరిగెత్తుత్నునట్లు వూహించుకోమంటున్నావ్! కాని అది ప్రొఫెషనల్ కోర్స్. ప్రతిదీ ఫ్రొఫెషనల్ గానే వుంటుంది’’
‘‘సరే! ఇంకెక్కడైనా అప్పు అడిగి చూస్తాను. ప్రస్తుతం ఎంత కావాలో చెప్పు! నీ బస్ టైం వరకు తెస్తాను. అంతేకాని నువ్విలా కాలేజి మానుకోవద్దు.’’
‘‘నువ్విప్పుడు చేసే అప్పులకి వడ్డీలు కట్టలేక జీవితాంతం నేను చావాలి. చేసిన అప్పులు చాలు. నేను చదువు మానేస్తున్నా…. నువ్వు కాదన్నావనుకో గుర్రాన్ని నది దగ్గరకి తీసికెళ్లి నీళ్లు తాగమన్నట్లే అవుతుంది.’’ అన్నాడు తను కాలేజిలో సస్పెండ్ అయిన విషయం తండ్రితో చెప్పకుండా….
‘‘నువ్వు మాలాగ ఎద్దుల్ని పొడిచి, భూమిని చీల్చి బ్రతకలేవురా! నా మాట విను….’’ అన్నాడు శేఖరయ్య…. ఆయన మాటల్లో పితృవాత్సల్యం పొంగి, ఉప్పొంగటం స్పష్టంగా తెలుస్తోంది.
కొంతమంది కొడుకులు కొన్ని వేల సంవత్సరాలు నేలలో కలసిపోకుండా విషవాయువుల్ని విడుదల చేసే ప్లాస్టిక్ కవర్లు, పాత సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లాగా తయారై, భూమి తల్లికి కీడు చేస్తున్నా, తండ్రి మాత్రం ఆకాశంలా మారి ఊపిరి వెలుతురు, పోషణ అందిస్తూ కడుపున మోయకపోయినా కడుపులో పెట్టుకోవాలని చూస్తాడు. అంతేకాదు తను నాటుకున్న మొక్కకు నీటి ఎద్దడి రానివ్వకుండా ఎంత దూరాన్నుండైనా నీళ్లు మోసుకొచ్చి తడుపుకోవాలని చూస్తాడు.
అసలే ఆత్మ న్యూనతా భావంలోంచి బయటపడలేకపోతున్న హేమేర్రదకి ఆ కాలేజి అన్నా ఫ్రెండ్స్ అన్నా చదువు అన్నా, విరక్తిగా అయిష్టంగా వుంది. తండ్రివైపు అసహనంగా చూశాడు.
కొన్ని వేల సంవత్సరాలు నేలలో కలసిపోకుండా విషవాయువుల్ని విడుదల చేసే ప్లాస్టిక్ కవర్లు, పాత సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లాగా తయారై, భూమి తల్లికి కీడు చేస్తున్నా, తండ్రి మాత్రం ఆకాశంలా మారి ఊపిరి వెలుతురు, పోషణ అందిస్తూ కడుపున మోయకపోయినా కడుపులో పెట్టుకోవాలని చూస్తాడు.
హేమేంద్ర మానసికస్థితి బాగలేదని గ్రహించి ఏమాత్రం కదిలించినా రాక్షసుడు బయట కొస్తాడని అతన్ని అలాగే వదిలేసి భార్య దగ్గరకి వెళ్లి కొడుకు మాటల్ని చెప్పాడు శేఖరయ్య. ఆయన వేదనను అర్థం చేసుకొని ఆమె కూడా బాధపడ్తూ….
‘‘సరే లెండి! ఆ కాలేజి చదువులు , ఆ బాధలు మనకేమైనా అర్థమవుతాయా? హేమేంద్ర ఎలా చెబితే అలాగే వినండి! లేకుంటే వాడు మన మీ ద అలిగి ఎటైనా వెళ్లిపోయగలడు. ఏదైనా వస్తుంది, పోతుంది కాని కొడుకు పోతే వస్తాడా?’’ అంది.
‘‘గాలికి తిరిగి చెడిపోతాడేమోనని భయంగా వుంది కరుణా!’’ అన్నాడు.
‘‘మీరు ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచించుకొని మనసు పాడు చేసుకుంటారు. ఇలాంటివి కాలానికి వదిలేసి వేచి చూడటం మంచిది.’’ అంది.
కాలం జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని అందంగా అలకంరించి ఓ చోట కూర్చోబెడుతుందా? తన్నిన తన్ను తన్నకుండా తంతుంది. ఓర్చుకోవాలి. ఓదార్చుకోవాలి. చేతనైతే నేర్చుకోవాలి… ఒక కుట్టే కదా ఊడిపోతే ఏం అని వూరుకుంటే కుట్లన్నీ ఊడిపోతాయి. అప్పుడు కుట్టుకోటానికి దారమనే సహనం ఉండకపోవచ్చు. ఒక చిన్న పగులు ఏర్పడినప్పుడే పడవను బాగుచేసుకోవాలి కాని ఆ పగులు పెద్దదైతే పడవ మునిగిపోయేదాకా పట్టించుకోకపోతే ఎలా? అయినా కన్న తల్లి ముందు బిడ్డ గురించి ఎంత వాఖ్యానించినా, తేలిపోతుందని మౌనంగా వున్నాడు శేఖరయ్య.
‘‘స్నేహిత వుందా బామ్మా?’’ అంటూ లోపలకి వచ్చిన చేతనను చూసి ‘‘రా! చేతనా! కూర్చో!’’ అంది గోమతమ్మ.
చేతన కూర్చుంది. గోమతమ్మ అక్కడకూర్చుని వున్న తన స్నేహితురాళ్ల వైపు చూపించి ‘‘వీళ్ళు నా స్నేహితురాళ్లు. రామేశ్వరి, కాత్యాయని… ఈ అమ్మాయి చేతన. నా మనవరాలితో కలసి చదువుకుంటోంది.’’ అంటూ ఒకరికి ఒకర్ని పరిచయం చేసింది. చేతన వినయంగా ‘నమస్తే!’ చెప్పింది. వాళ్లు ఆప్యాయంగా చూసి చేతనతో మాటలు కలిపారు.
స్నేహిత ఇంట్లో లేనట్లనిపిస్తోంది. బామ్మను మళ్లీ అడిగే కన్నా ఆమెనే గ్రహించి స్నేహిత గురించి చెబుతుందనుకొంది, వాళ్లేమో మాటల్లో పడి చేతనను శ్రోతను చేశారు.
రామేశ్వరి తన చేతులపై మడతల్ని చూసుకొని గోమతమ్మ వైపు వేదనగా చూస్తూ. ‘‘ఇన్ని రోజులు ఈ శరీరాన్ని బాగానే ఉపయోగించుకున్నాం గోమతీ! బాల్యంలో చదువుకి, ఆటలకి, .. ఆ తర్వాత పెళ్లికి, పిల్లల్ని కనటానికి ఇంటి పనులకి, వంట పనులకి ఇలా ఒకటా రెండా? అన్ని పనులతో ఈ శరీరాన్ని ముప్పుతిప్పలు పెట్టాం. పాపం! అదికూడా మనం చెప్పినట్లు విన్నది, మనల్ని భరించింది. కానీ ఇకముందు అలా జరగదేమోకదా!’’ అంది ఎంతో పోగొట్టుకున్న దానిలా చూస్తూ….
వెంటనే గోమతమ్మ సన్నగా నవ్వి రామేశ్వరి చేతిని ప్రేమగా నిమిరి….
‘‘ఎందుకు జరగదు వ్యాయామాలతో, నడకలతో శరీరధారుఢ్యాన్ని పెంచుకొని తాము ఇష్టపడే పనుల్ని పూర్తి చెయ్యాలని చాల మంది నీలాగే ఆలోచిస్తూంటారు. అయినా చెయ్యటానికి నీకు ఇంకేం పనులు మిగిలి వున్నాయి రామేశ్వరీ? ఏం లేవనే కదా మొన్న మన ముగ్గురం కలసి కాశీకి వెళ్లొచ్చాం…. ‘‘ అంది గోమతమ్మ.
కాశీ ప్రయాణం గుర్తురాగానే రామేశ్వరి కళ్లు చెమర్చాయి.
చేతనకి వాళ్లనలా చూస్తుంటే ఆశ్చర్యంగా వుంది ఇంత వయస్సు వచ్చినా మనుషులు ఇంత ఆత్మీయంగా వుంటారా అని….
‘‘చేతనా! మమ్మల్ని ఎవరు చూసినా మా స్నేహం చాలా గొప్పదంటారు. నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బు లేదు. వీళ్లిద్దరు నన్ను అన్ని చోట్లకి తమ సొంత ఖర్చులతో తీసికెళ్తారు.. వాస్తవంగా ఆలోచిస్తే కొంతమంది భర్తలు తాళి కట్టిన భార్యల మీద ఖర్చు పెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటి భర్తలున్న భార్యలే భర్తలు గురించి గొప్పలు చెప్పుకుంటుంటారు. ఆ విషయాన్ని పక్కనపెడితే… కడుపున పుట్టిన పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రులపై ఖర్చు పెట్టే విషయంలో అలాగే ఉంటున్నారు. ఉదాహరణకి నేనే.. అలాంటి నన్ను వీళ్ళు నేపాల్‌కి కూడా తీసికెళ్తామంటున్నారు. కేదార్, కాశీ,నేపాల్ చూస్తేనే ఫలితం దక్కుతుందట….వీళ్ల ఋణం నేను తీర్చుకోగలనా చెప్పు?’’ అంది రామేశ్వరి.
ఒక్క క్షణం చేతన బాధగా చూసి…
‘‘మీ స్నేహం అపురూపం కానీ బామ్మా! భర్త పెట్టలేదని, పిల్లలు ఇవ్వలేదని మౌనంగా వుండొద్దు. ఎందుకంటే భర్త వూరికే పెట్టట్లేదు. భార్యను జీవితాంతం పోషించటానికి సరిపడా డబ్బుని కట్నం రూపంలో తీసుకుంటున్నాడు. పైగా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు. బయటకెళ్లి డబ్బు సంపాయించి జేబులో పెట్టుకుంటున్నాడు. నువ్వు ఇన్నాళ్లు చేయి చాపి అడిగి, అడిగి అలసిపోయావు. ఇప్పుడు ఆయన లేడు, పోయాడు. ఇక మిా పిల్లలు…. వాళ్లు పెట్టట్లేదు. డబ్బు ఇవ్వట్లేదు. నాకర్థమైంది. ప్లాట్‌ఫాంపై అడుక్కునేవాడికి బుద్ది పుడితే వేస్తాం, లేకుంటే లేదు. నువ్వు కూడా వాళ్లలాగే నాకింతే ప్రాప్తం పెడితే తింటాను. లేకుంటే పస్తులుంటాను. అన్నట్లుగా వుండొద్దు. మనకు కొన్ని హక్కులు వున్నాయి. వాటిని వినియోగించుకుందాం…..’’అంది చేతన.
‘‘ఏమిటవి?’’ అంది వెంటనే కాత్యాయని ఆసక్తిగా..
ఇంత వయసు వచ్చినా మనకు తెలియనివి ఈ అమ్మాయికి ఏం తెలుసు? అన్నట్లు చూసింది రామేశ్వరి.
‘‘ఒకసారి మా ఎదురింటి తాతయ్య విషయంలో ఇలాగే జరిగితే మా అన్నయ్య స్టేట్స్‌కి పోకముందు దాన్ని పరిష్కారం చేసి వెళ్లాడు… అదెలాగో మీ కిప్పుడు చెబుతాను. తల్లిదండ్రులు వయోజన పౌరుల మనోవర్తి సంక్షేమ చట్టం 2007 క్రింద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ట్రిబ్యునల్‌కి ఒక పిటిషన్ పెట్టుకోండి. ఆ ట్రిబ్యునల్ వివరాలు మీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిగి తెలుసుకోండి. అక్కడ వాతావరణం సానుకూలంగా లేకపోతే ఒక లాయర్‌ను సంప్రదించి మనోవర్తి కోసం కోర్టులో కేసు వేయించండి! వృద్దులకు మనోవర్తి ఇచ్చే విషయంలో కోర్టులు సానుభూతితో స్పందిస్తాయి. ఈ వయసులో మిారు మౌనంగా వుంటే తిండి దొరకటం కష్టం.’’
అది వినగానే రామేశ్వరి ఆశగా కాత్యాయనీ వైపు చూసి, గబుక్కున చేయి పట్టుకొని,
‘‘నువ్వయితే ఈ పనులన్నీ చేయగలవు. కాత్యాయని!’’ అంది పిల్లలపై కేసు వేయటం ఆమెకి ఇష్టం లేకపోయినా ఆకలికి సెలవుండదుకదా!
‘‘ మరి నీకు మనోవర్తి రాగానే నేను వుండే ఓల్డేజ్ హోంలో చేరతావా? మళ్లీ కోడళ్లను మంచి చేసుకొని వాళ్ల దగ్గరే వుంటావా?’’ అంది కాత్యాయని.
‘‘వుండను. ఎందుకంటే నా కోడళ్లకి కోడళ్లు వచ్చారు. వాళ్లకి పిల్లలు పుడ్తున్నారు. ఇంట్లో తిండి సమస్య కన్నా నీటి సమస్య ఎక్కువైంది.బోర్‌వెల్స్ ఎండిపోతున్నాయి. ఒకప్పుడు వంద అడుగులు తవ్వకముందే అందే నీళ్లు ఇప్పుడు వెయ్యి అడుగులు తవ్వితేనే అందుతున్నాయి. గుక్కెడు నీళ్లు కూడా గొణిగి, గొణిగి పోస్తోంది నా కోడలి కొచ్చిన కోడలు. అక్కడ నా కోడలికే పవర్‌లేదు. ఇంక నాకేముంటుంది? క్షణక్షణం అసెంబ్లీలో అరచుకున్నట్లు అరవాలంటే నావల్లవుతుందా?’’ అంది.
(ఇంకా వుంది)
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~