కొత్త సంవత్సరం వస్తూ వస్తూ మహిళా రచయితులకు మంచి ప్రోత్సాహకాలనే అందించింది . ఒక వైపు విహంగ మహిళా సాహిత్య పత్రిక మూడేళ్లు పూర్తి చేసుకుని నాల్గో వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంలో విహంగ రచయిత్రులు , సంపాదక వర్గ సభ్యులకు పురస్కారాలు రావటం ఆనందదాయకమే . 2013 వ సంవత్సరంలో మహిళా చైతన్యం ఎంత రగిలినా మహిళలపై ఆగడాలు ఏమాత్రం తగ్గలేదు . నిర్భయ చట్టాన్ని వల్లె వేస్తూనే నిర్భ యంగానే మహిళలపై దాడులు , అత్యాచారాలు జరిపారు . ఈ సంఘటనలపై రచయితలు స్పందిస్తూ కవితా సంకలనాలను , చైతన్య సాహిత్యాన్ని సృష్టించారు . మన పత్రికలో కూడా మహిళల పై దాడులను ఖండిస్తూ కథలు , కవితలు , వ్యాసాలూ రాసారు . ఎంతో మంది చదువరులు ఎప్పటికప్పుడు తగిన సహాలిస్తూ లోటుపాట్లను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చారు . రచనలపై తమతమ అభిప్రాయాలను తెలియజేస్తూ అటు రచయితలని , ఇటు సంపాదక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు .
పత్రిక అందంగా ఆకట్టుకునేలా సాహిత్య విలువలు తగ్గకుండా నాణ్యతతో రావడానికి సహకరిస్తున్న సంపాదక వర్గానికి , సాంకేతిక నిపుణులకి హృదయ పూర్వక ధన్యవాదాలు . మీ సహకారాన్ని ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం .
*** *** *** ***
ఈ సంవత్సరపు విశేషం కేంద్ర సాహిత్య అకాదెమి అవార్డు తెలుగువిభాగంలో కాత్యాయనీ విద్మహేకి అవార్డు లభించటం గర్వించదగ్గ విషయం . ఆంగ్ల , కాశ్మీరి విభాగాల్లో కూడా స్త్రీలకే అవార్డు లభించటం సంతోషకరం .
కాత్యాయనీ విద్మహే పరిచయం అక్కరలేని సాహిత్య విమర్శకురాలు , విద్యావేత్త . 1955 మార్చి 11 న ప్రకాశం జిల్లా మైలవరంలో జన్మించిన కాత్యాయనీ విద్మహే స్త్రీ వాదానికి , సాహిత్య విమర్శకి ప్రతినిధిగా, ప్రతిభతో తన ముద్రను వేసుకున్న వ్యక్తి . ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్ , వరంగల్ లో జరిగింది . కాకతీయ విశ్వవిద్యాలయం లో ఎం.ఏ వరకు చదివారు .బుచ్చిబాబు రాసిన “ చివరకు మిగిలేది “ నవలపై పిహె.డి పూర్తి చేసారు . 1977 నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపన్యాసకురాలుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు . ప్రస్తుతం సినీయర్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు . స్త్రీ వాదం , స్త్రీల సమస్యలు . సాహిత్య విశ్లేషణ , విమర్శ వంటి ప్రక్రియలపై నిరంతర అధ్యయనం చేస్తూ స్త్రీల సమస్యలపై స్పందిస్తూ సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు .
1980 వ దశకం నుంచి ఆమె కలం నుంచి జాలువారిన వ్యాసాలు , సమీక్షలు ,పరిశోధన పత్రాలు అనేక అంశాలపై రాసిన సాహిత్య విమర్శ , సాహిత్య ప్రపంచంలో సమగ్రమైన సమాచారాన్ని ఆవిష్కరించాయి . ఆమె మొత్తం 18 గ్రంధాలు , 270 వ్యాసాలు రచించారు.
ఆమె సాహిత్య ప్రస్థానంలో పులికంటి కృష్ణారెడ్డి , ఏటుకూరి బాలరామమూర్తి , వట్టి కొండవిశాలాక్షి , తెలుగు విశ్వవిద్యాలయం , గురజాడ పురస్కారం , రంగవల్లీ స్మారక పురస్కారం వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు . స్త్రీ జనాభ్యుదయ,అధ్యయన సంస్థను స్థాపించి దాని ద్వారా మహిళల సమస్యలు , మహిళా సాహిత్యం వంటి సామాజిక అంశాలపై పని చేస్తున్నారు . స్త్రీవాద సాహిత్యాన్ని సమస్యలను అభ్యుదయ దృక్పథంతో విశ్లేషించి ఎన్నో ప్రసంగాలను , పత్ర సమర్పణ లను చేసారు .
మానవ హక్కుల వేదిక సభ్యురాలుగా ఉన్నారు . ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కాత్యాయనీ విద్మహే కి కేంద్ర సాహిత్య అకాదెమి అవార్డు లభించటం ప్రరవే సభ్యలతో పాటు సాహిత్య అభిమానులందరికీ సంతోషకరమైన విషయం .
విహంగ మహిళా సాహిత్య పత్రిక సంపాదక వర్గం సభ్యురాలైన కాత్యాయనీ విద్మహేకి జయహో! ….
*** ***
కీర్తి పురస్కారాలు అందుకున్న వారిలో రచయిత్రి స్వాతి శ్రీపాద ఒకరు.ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక పురస్కారాన్నిఅందుకున్నారు. . గోడలు,మనసుంటే…,పునరాగమనం, ఎక్కడినుంచి …ఇక్కడి దాకా,పాటల మధువని ,అవతలి వైపు పుస్తకాలను రచించారు. ఎన్నో కథలను, కవితలను, ఆంగ్లంనుంచి తెలుగులోకి అనువదించారు.సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రచించిన నవలని Sound of Raindrops పేరుతో , రాళ్లబండి కవితాప్రసాద్,k .శివారెడ్డి తదితరుల కవితలని తెలుగులోకి, సుద్దాల అశోక్ తేజ రాసిన నేలమ్మ నేలమ్మా! తదితర తెలుగు పాటల్ని అదే ట్యూన్ లో ఆంగ్లంలో పాడుకునే విధంగా అనువదించారు.
ఆమె తో పాటు ఇల్లిందల సీతారామారావు – సరస్వతీదేవి స్మారక పురస్కారం – డా . మంగళగిరి ప్రమీలా దేవి – జీవిత చరిత్ర ,శ్రీమతి మల్లాది సుబ్బమ్మ కీర్తి పురస్కారం – శ్రీమతి పరుచూరి జమున – మహిళాభ్యుదయం , డా . పైడి లక్ష్మయ్య స్మారక పురస్కారం – యస్ . జ్యోతి రాణి ( ఉత్తమ నటి ), డా . నట రాజు రామ కృష్ణ స్మారక పురస్కారం – శ్రీమతి . పి . జయ లక్ష్మి ,గాడిచర్ల హరి సర్వోత్తమ రావు , బి . వి దాశరధి పురస్కారం – శ్రీమతి అమృత లత ( సంఘ సేవ , నిరంతర విద్య , వ్యక్తిత్వ వికాసం ),అబ్బూరి రామ కృష్ణా రావు , వరద రాజేశ్వరరావు స్మారక పురస్కారం – ఆచార్య . ఎ . ఉషా దేవి ( భాషాచ్చందస్సాహిత్య విమర్శ ) వీరు కూడా పురస్కారాలను అందుకున్నారు .
2014 సంవత్సరంలో కూడా మహిళా మేధావులు , ఉద్యమ వేత్తలు , రచయిత్రులు , సామాజిక కార్యకర్తలు ,కళాకారిణులు సాహిత్యాకాశాన్ని పూర్తి స్థాయిలో స్వతంత్రించుకోవాలని ఆకాంక్షిస్తూ ……
– హేమలత పుట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to సంపాదకీయం