18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం -నవంబర్14 -20,2013,హైదరాబాద్

                         

siva lakshmi

siva lakshmi

18 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నవంబర్ 14 నుంచి 20 వరకూ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. 7 రోజులు జరిగిన ఈ బాలోత్సవం,13 థియేటర్లలో , 48 దేశాలనుంచి వచ్చిన 200 చిత్రాలతో , బాలలు-వారి తలి- దండ్రులు,ప్రేక్షకులు కలిసి మొత్తం 1,50,000 మంది చూడడానికి ప్లాన్ చేశారు.

1.అంతర్జాతీయ లైవ్ యాక్షన్

2. అంతర్జాతీయ యానిమేషన్

3.అంతర్జాతీయ లఘు చిత్రాలు

4.బుల్లి దర్శకులు

అనే నాలుగు విభాగాల్లో బంగారు ఏనుగు బహుమతు లిచ్చారు.

1969 లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే తీసిన “గూపి గైనే బాఘా బైనే”(ఎడ్వెంచర్స్ ఆఫ్ గూపి & బాఘా) సినిమా అధారంగా- శిల్పా రణడేస్ మలచిన యానిమేటెడ్ మూవీ “గూపీ గవయ్యా బాఘా బాజయ్యా”చిత్రాన్ని లలిత కళా తోరణంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు.

సౌత్ అమెరికా,ఆస్ట్రియా, గ్రీన్ లాండ్ ,లెబనాన్,స్కాట్ లాండ్,మలేషియా తదితర దేశాల్లోని అరుదైన చిత్రాలు బాలల్ని అలరించాయి.ఒక సౌత్ అమెరికా నుంచే ఏకంగా 26 చిత్రాలొచ్చాయి.బెర్లిన్,టొరంటో,కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బహుమతులు గెల్చుకున్న 20 చిత్రాలను ప్రదర్శించారు.

ప్రతిరోజూ ఐమాక్స్ థియేటర్ ఓపెన్ ఫోరంలో బాలల హక్కులు,బాలల చలన చిత్రాలు-ప్రభుత్వ పాత్ర, లింగ వివక్ష మొదలైన అంశాలపై చర్చించారు. చిత్ర నిర్మాణం,స్క్రిప్ట్ రచన,యానిమేషన్,థియేటర్ రంగాలు మొదలైన విషయాలపై వర్క్ షాపులు జవహర్ బాలభవన్ లో నిర్వహించారు.

                                                             *****

1995 నుంచి ఇప్పటికి 17 సార్లు మనదేశంలో బాలల చిత్రోత్సవాలు జరిగాయి.అందులో 10 సార్లు హైదరాబాద్ వేదికైంది.ఇకనుంచి హైదరాబాద్ ను శాశ్వత వేదిక చేయ్యడానికి కృషి చేస్తామన్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అన్ని రాష్ట్రాల బాలల్ని,ఉదాహరణకి ఈశాన్య రాష్ట్రాల బాలల్ని సైతం ఈ చిత్రోత్సవాలు చేరాలంటే వివిధ రాష్ట్రాల్లోని  వివిధ నగరాల్లో వేదికలేర్పాటు చెయ్యాలనీ,ఎప్పటికీ హైదరాబాదే శాశ్వత వేదిక కావడం సబబు కాదని సుప్రసిద్ధ కవి,దర్శకుడు గుల్జార్ అన్నారు.

బాలల చలన చిత్రాలు ప్రదర్శించడానికి దేశంలో థియేటర్లు లేవని ,వారికి కావలసిన పుస్తకాలు లేవని,టి.వి.లోను వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు లేవని  గుల్జార్ విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నిటి పట్ల శ్రద్ధ తీసుకుని తగు చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత మంత్రులను తాను ఎప్పుడు కలిసినా కోరడం జరుగుతుందని ఆయన అన్నారు.

                                                           *****

డెన్మార్క్ దర్శకురాలు దిబాక్, బ్రెజిల్ దర్శకురాలు వర్జీనియా లింబర్గర్, ఫిలిప్పైన్స్  సామాజిక కార్యకర్త రుమినా, విబేక్ నోయర్ గార్డ్ మువాస్యా, జీరోముల్లా మొదలైన విదేశీ మహిళా దర్శకులు, నటీమణులు పాల్గొన్న సదస్సులో సినీ ప్రపంచంలో “లింగవివక్ష ” గురించి చర్చించారు.

“సినిమా అనేది సమాజానికి హృదయం లాంటిది”- అని   డెన్మార్క్ దర్శకురాలు దిబాక్   అన్నారు.

“వివక్ష శతాబ్దాల క్రితమే అక్కడా, ఇక్కడా అని కాదు ప్రపంచమంతటా, ప్రతిచోటా ఉన్న సమస్య.కళ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.ఆ సమాజంలో మహిళలు విభిన్నమైన రీతిలో హీరోలు. బాలలు కలలు కని వాటిని నిజం చేసుకోవడానికి తపన పడాలి. బాలికలు – స్త్రీల హక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.పిల్లల సినిమాల ద్వారా నైతిక విలువల్ని సమాజంలో నాటగలిగితే అది పిల్లల భవిష్యత్తునే గాక సమాజ భవిష్యత్తుని కూడా మెరుగుపరుస్తుంది. ప్రభుత్వాలు వంతెనలు,రోడ్లు,షాపింగ్ మాల్స్ మీద అంత ఖర్చు చెయ్యగలిగినప్పుడు పిల్లల సినిమాలకు ఎందుకు ఖర్చు పెట్టగూడదు? అని  ఫిలిప్పైన్స్  సామాజిక కార్యకర్త రుమినా అన్నారు.

“మహిళలు   చిత్ర ప్రపంచపు ప్రధాన స్రవంతిలో ఉండనే ఉండరు. ఎప్పుడైనా ప్రతిభావంతులై రాణించినా వారిని  చాలా తెలివిగా  పక్కన పెట్టేస్తారు”- అని అన్నారు   పిల్లల  చిత్రాల  సెలక్షన్ కమిటీ మెంబర్ జీరోముల్లా. ఆడశిశువు తల్లి కడుపులో ఉండగానే వివక్ష మొదలవుతుందని భారత్ లో ప్రతి 1000 మంది బాలురికి 940 మంది బాలికలున్న విషయాన్ని చెప్తూ,భ్రూణ హత్యలు,ఆడ శిశు హత్యలు,వరకట్న హత్యలు,అత్యాచారాలు,- ఇవన్నీ స్త్రీ – పురుష సమానత్వం సంగతి అలా ఉంచి,  స్త్రీల పట్ల ఏమాత్రం సహానుభూతి ,గౌరవంలేని పరిస్థితిని రుజువు చేస్తున్నాయన్నారామె.

అమేజాన్ సంస్కృతిని స్ఫూర్తిగా తీసుకుని  “తైనా” అనే ఆదివాసీ బాలికను యుద్ధ వీరురాలిగా చూపుతూ అద్భుత చిత్రాన్ని రూపొందించిన బ్రెజిల్ దర్శకురాలు వర్జీనియా లింబర్గర్  “ప్రకృతికీ,పర్యావరణానికీ- స్త్రీలకూ సంబంధం ఉంది” అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా విజయాలు సాధించగలరన్నారు-అని అన్నారు.

“ఒక బాలుడు చేయగలిగిన పనిని బాలిక కూడా అంతే సమర్ధవంతంగా చెయ్యగలదనీ” తన చిత్రాల్లో బాలికలను తెలివిగా ఏదైనా సాధించగలిగిన ధీరులుగా,స్ఫూర్తినిచ్చే వ్యక్తులుగా చూపడం తన లక్ష్యమని గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు  గెలుచుకున్న చిత్ర దర్శకురాలు  విబేక్ నోయర్ గార్డ్ మువాస్యా అన్నారు. సినిమాల్లో ప్రధానపాత్ర పోషించడానికి 14 ఏళ్ళ వయసులోపు బాలికలు దొరకరన్నారు.

ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్లు బాలికలు- స్త్రీల పట్ల ఎంత కౄరంగా,భయానకంగా వ్యవహరిస్తున్నారో కళ్ళకి కట్టినట్లు తన సినిమాలో చిత్రించిన సిద్దిక్ బార్మాక్ “ఆఫ్గనిస్థాన్ పిల్లలకూ మహిళలకూ చాలా ప్రమాదకరమైన ప్రదేశమని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్న” దన్న  సంగతి చెప్తూ జరుగుతున్న అన్ని నేరాలకూ,ఘోరాలకూ స్త్రీలే మూలకారణమని వారు భావిస్తారని చెప్పారు. పిల్లలు,మహిళలకు సంబంధించిన సినిమాలు ఆఫ్గనిస్థాన్ లో తీయడం చాలా కష్టమని చెప్పారు. వాటిల్లో చూపించేవి  నిజాలైనప్పటికీ,ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నప్పటికీ  ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ తమతో క్షమాపణలు  చెప్పిస్తుందన్నారు.

ఒక బాలుడు చేయగలిగిన పనిని అంతే ధీటుగా బాలికలు కూడా చేయగలరని సినిమాల ద్వారా నిరూపించి చూపడం, సినీ పరిశ్రమ లోనే కాక పిల్లల సిని పరిశ్రమలో కూడా లింగ వివక్ష లేకుండా చూడడమే తక్షణావసరమని సభికులందరూ అభిప్రాయపడ్డారు.

                                                             *****

f20 ఏళ్ళ నుంచి హైదరాబాద్ నగరంలో రెండేళ్ళకొకసారి 10 ఫిల్మ్ ఫిస్టివల్స్ జరిగినప్పటికీ తెలుగులో “భద్రం కొడుకో” తర్వాత చెప్పుకోదగ్గ బాలల చిత్రాలు రాలేదు. బంగారు ఏనుగు లాంటి అవార్డులు సాధించిన భారతీయ బాలల సినిమాలు కూడా దాదాపు లేవనే చెప్పాలి.”100 ఏళ్ళ భారతీయ సినిమా” సందర్భంగా ఇది చాలా విచారించదగ్గ విషయమే! థియేటర్ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ “ఆంధ్ర ప్రదేశ్ లో  బాలల చిత్రాలను ప్రోత్సహిస్తామని  గత నాలుగైదు సంవత్సరాల నుంచి వేదికలమీద పదే పదే చెప్పడమే కాని నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పిన స్వల్ప సబ్సిడిని కూడా ఇవ్వడం లేద“ని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే గత 4-5 సంవత్సరా లుగా  ఒక్క పిల్లల సినిమా కూడా రాలేదన్నారు. మన దేశంలో పిల్లల చిత్ర నిర్మాతలు ఎన్ని జతల చెప్పులు అరిగిపోయినా 20 లక్షల సహాయం అందకపోవడం అటుంచి థియేటర్లలో విడుదల చెయ్యడానికైనా ఒక్క పంపిణీ దారుడైనా ముందుకి రావడం లేదని ప్రముఖ చిత్ర దర్శకుడు శివ నాగేశ్వరరావు  వాపోయారు.

ఈ సారి తెలుగులో మద్దాళి వెంకటేశ్వర రావు తీసిన “చదువుకోవాలి”, అయోధ్యకుమార్ క్రిష్ణశెట్టి తీసిన

“మిణుకుమన్న మిణుగురులు” అనే తెలుగు సినిమాలొచ్చాయి.ఎంతో కాలం నుంచి నగరంలో చిత్రోత్సవాలు

జరుగుతున్నప్పటికీ ఇంతవరకూ  పోటీకి ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం తమదేనని “మిణుకుమన్న మిణుగురులు”  చిత్ర నిర్మాత,దర్శకుడు – అయోధ్యకుమార్ క్రిష్ణశెట్టి చెప్పారు.తన ఆర్ధిక పరిస్థితి అసలు బాగుండలేదనీ,అనేక కష్ట నష్టాలకోర్చి బాలలకోసం శ్రమించినప్పటికీ   ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదన్నారు.అంధ విద్యార్ధుల సమస్యలపై నిశితంగా పరిశోధన చేసి, 9 నెలలు పడిన శ్రమకు “మంచి సినిమా” అన్న ప్రేక్షకుల స్పందన,ప్రశంసలు దక్కాయన్నారు.

                                                             *****

బాలల చిత్రాలకు భారీగా ఆర్ధిక సహాయం చేస్తున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి డి.కె. అరుణ చెప్పారు.

కఫల్ చిత్రంలో నటించిన బాలలు అజయ్,అంత్రాగ్,హరిణ్,అంజలి తమ తల్లి -దండ్రులకు దూరంగా గ్రామంలో హరిద్వార్ కు 300 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు.ఈ బాలలకు థియేటర్ అంటే ఏమిటో తెలియదట. ఇక్కడ చాలా సినిమాలు చూశామని ఆనందంగా చెప్పారు. పల్లెల్లో పెరిగే పిల్లలకే ప్రాపంచికజ్ఞానం  ఎక్కువ.జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను,అవాంతరాలను ఎదుర్కొని వాళ్ళే బాగా తట్టుకోగలుగుతారు. థియేటర్ తెలియకుండానే,చూడకుండానే నటించారంటే,చూసి అవగాహన చేసుకుంటే ఇంకెన్ని అద్భుతాలు సాధిస్తారో కదా?

అందుకని “బాలల సినిమాలన్నీ దేశంలోని పిల్లలందరికీ,ముఖ్యంగా పల్లెలకు చేరాల”న్నారు బాలీవుడ్ నటి,థియేటర్ ఆర్టిస్ట్ సంజనా కపూర్.

ఇంత చక్కని బాలల చలన చిత్రోత్సవం కేవలం 7 రోజులు హైదరాబాద్-సికిందరాబాద్  లోని 13 లో మాత్రమే నిర్వహిస్తే సరిపోదని సి ఇ ఓ శ్రవణ్ కుమార్ బాగానే గ్రహించారు.

చిల్డ్రెన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షురాలు కవితా ఆనంద్ మానసిక వైకల్యం లాంటి పిల్లల సమస్యలపై ప్రత్యేక సినిమాలు తియ్యాలంటూ, అలాంటి ప్రత్యేకమైన బాలల పట్ల సిఎఫ్ ఎస్ ఐ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు.

పసివాళ్ళను సంపాదన కోసం కన్నవాళ్ళే  టి.వి.షోలకు ప్రోత్సహించడం బాధాకరమని అంటూ “సినిమా నిర్మాణాన్ని సిలబస్ లో చేర్చి నిరంతర శిక్షణ ఇవ్వాల”ని కాంపిటిషన్ లిటిల్ డైరెక్టర్స్ జ్యూరీ మెంబర్ వేద కుమార్ అన్నారు.

“బాల కళాకారులుగా తమ పిల్లల్ని చూసుకోవాలనుకుని ఉవ్విళ్ళూరే తలిదండ్రులు వేలం వెర్రిగా పిల్లల్ని టి.వి.రియాల్టీ షోలకు పంపుతున్నారు.పాటలోని అర్ధమేమిటో తెలిసే వయసే లేని పిల్లలు చేసే డాన్సులు   జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇది చాలా విచారించదగ్గ విషయ”మని అంతర్జాతీయ బాలల లైవ్ యాక్షన్ పోటీ విభాగం జ్యూరీ అధ్యక్షులు  హానీ ఇరానీ అన్నారు.

సినిమా అవార్డ్స్ కోసం తీసేది కాకుండా మంచి సమాజ నిర్మాణానికి దారి తీసే విధంగా ఉండాలి”  అన్న విలువైన మాటలు చెప్పారు “జానీస్ నోర్డ్స్” అనే  యువ దర్శకుడు.”మదర్ ఐ లవ్ యూ” అనే అతని తొలి సినిమానే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి కి ఎంపికైంది.

                                                             *****

సమాజ మనుగడకు అత్యంత ఆవశ్యకమైన “పిల్లలకంటే ప్రపంచంలో విలువైంది మరేదీ లేదు” అని అంటారు పెద్దలు. కానీ ప్రభుత్వానికి ఉండే “క్లాస్” స్వభావం వల్ల అది బాలలందర్నీ చేరడం లేదు.నవంబర్ 13 న “విక్టోరియా మెమోరియల్ హోం” లో కూడా చిత్ర ప్రదర్శన ఉంటుందని మీడియాలో వచ్చింది.చాలా సంతోషమనిపించింది ఎందుకంటే అది అనాధ బాలల ఆశ్రమం. విక్టోరియా మహారాణి వచ్చినప్పుడు ఆమె కోసం నిర్మించింది కాబట్టి చాలా విశాలంగా ఉండి పేద బాలలందరూ చూసే అవకాశముంటుందనుకున్నాం. 14 న థియేటర్ లన్నింటితో పాటు విక్టోరియా మెమోరియల్ హోం లో సినిమా కోసం చూస్తే ఆ పేరే లేదు!

ఒకపక్క బ్రహ్మాండంగా బాలల సంబరాలు జరుగుతుంటే పాతబస్తీ లోని సుధా టాకీస్ లో సినిమాల గురించి బాలలకు తెలియదు. “బాలల దినోత్సవం” రోజున రకరకాల పనుల్లో చట్టవిరుద్ధంగా చాకిరీలో మగ్గిపోతున్న బాలకార్మికుల్ని మీడియా చూపించింది.

డెలిగేట్ పాస్ కోసం అప్లై చేసినవాళ్ళని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సినిమా కష్టాలు పెట్టారు. 2, 3 నంబర్ అప్లికేషన్ లకు కూడా పాస్ లు రాలేదు.మంచి సినిమా కోసం ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమించి సాధించారు   సినీ ప్రేమికులు.

చిన్న చిన్న చీకటి కోణాలను కాసేపు వదిలేస్తే అసలైన వెలుగులు- సినిమాలు మాత్రం ఒకదాన్ని మించి ఒకటి వర్ణనాతీతంగా ఉన్నాయి.రోజుకి మూడు సినిమాలు చొప్పున మేము చూసిన ప్రతి సినిమా ఒక అద్భుతమే! ఈ ఘనత మా మిత్రబృందానికి చెందుతుంది.ముఖ్యంగా పైడి తెరేష్ బాబు గారు బోలెడంత హోం వర్క్ చేసి ఎప్పుడెప్పుడే సినిమా ఎక్కడ చూడాలో చెప్పేవారు.ఇంకా బాపూ గారి అసిస్టెంట్ డైరెక్టర్ తన దగ్గరున్న సి. డి.లను మినహాయించి సమయం వృధా కాకుండా జాగ్రత్తలు చెప్పేవారు.ఇంకా మా మిత్రుల్లో  పిల్లల కథా రచయితలు  భూపాల్,బమ్మిడి జగదీశ్వర రావు,సినీ రంగానికి చెందిన రాజు గారు,రఘు గారు,జగన్- సుధ అందరూ సినిమా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న హేమా హేమీలే!అందువల్ల మేమందరం చూసిన చిత్రాలన్నీ దేనికదే ఇతివృత్తాలు గొప్పగా ఉండి బాగున్నాయి.

ఉపన్యాసాల్లో తప్ప బయట ప్రపంచంలో ఎక్కడా కనపడని ఉన్నతమైన మానవసంబంధాలు,ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ప్రేమ,నాన్న లేని ఇంట్లో అమ్మను,అమ్మ లేని  ఇంట్లో నాన్నను అపురూపంగా చూసుకునే పిల్లలు,పెంపుడు జంతువుల్ని ప్రేమగా సాకే పిల్లలు, ఉపాధ్యాయులు-విద్యార్ధుల మధ్య సదవగాహన,మంచి పనులకోసం సాహసాలు చేసే బాలలు,స్నేహితుల కష్టాలకు స్పందించి అవి తీర్చడానికి తపన పడే బాలలు,జంతువుల భాషను పట్టుకోగలిగిన ప్రత్యేకమైన పిల్లలు – మంచితనం,సహానుభూతి -ఇలాంటి సుగుణాలన్నీ సినిమాలోని పిల్లల్లో చూసి మనసులు ఆనందంతో తృప్తితో నిండిపోయాయి. ఈసారి చిత్రోత్సవంలో అసాధారణ రీతిలో బాలికలు ప్రతిభ కనపర్చిన సినిమాలు రావడం ఎంతో ప్రశంసనీయం ! మానవత్వ విలువలు ప్రాతిపదికగా ఆ యా దేశాల్లో ఎన్నో కష్ట నష్టాల కోర్చి చిత్ర నిర్మాణం గావించే దర్శక, నిర్మాతలు-ఆ కధాంశాలను అర్ధం చేసుకుని సమర్ధవంతంగా నటిస్తున్న బాలలు – వీరు ముందు ముందు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తారనే ధీమా కలిగించారు!

ఇద్దరు మనుషులు కలవడమే గగనమైన ఈ రోజుల్లో చిత్ర ప్రపంచానికి సంబంధించిన సినీ సృష్టికర్తలు- సినీ ప్రియులు ఒకచోట చేరి గొప్ప సినిమాలను ఆస్వాదించడం నిజంగా అపురూపం!!

ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించ బడ్డ చిత్రాల పరిచయాన్ని ”  చింటి”తో ప్రారంభించుకుందాం .

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చింటి

 pattem

Director: Natalia Mirzoyan

Style: Animation

Language: English

Age Group: 7 Years and Up

Duration: 8Minutes.

Country: Russia.


తాజ్ మహల్ ను చూసిన నాటినుంచి “చింటి“ అనే చిన్న చీమ ప్రపంచం పూర్తిగా మారిపోయి, ముమ్మూర్తులా అలాంటి భవంతిని పోలిన భవంతిని తానున్న నదీతీరంలో శ్రమించి స్వంతంగా నిర్మించుకోవడమే ఈ చిత్ర కధాంశం.

ఈ చిట్టి పొట్టి సినిమా లో ప్రధాన పాత్రధారి చిన్న చీమ. దాని పేరు చింటి.ఒకానొక నదీతీరాన, గోడపక్కన యిరుకైన కొద్ది స్థలంలో పేరుకున్న చెత్తకుప్పల మీద భారతీయ చీమల దండు  తమ స్థిర నివాస మేర్పరచుకుంటుంది.మన చిట్టి హీరోయిన్ “చింటి” తెల్లారిలేస్తే చూసిన దృశ్యాలే చూడవలసి రావడాన్ని విసుగ్గా భావిస్తుంది. యాంత్రికంగా అతికష్టంగా రోజులు గడుపుతూ ఉంటుంది.

ఒకరోజు చెత్తకుప్పలో నుంచి ఒక చిన్న కాగితపు టికెట్ చింటి కంటపడుతుంది. అందులో ఒక నది ఒడ్డున దేదీప్యమానంగా మనోజ్ఞమైన సౌందర్యంతో,అద్భుతమైన శిల్ప నిర్మాణంతో శోభిల్లుతున్న “తాజ్ మహల్” ను ఆ కాగితపు టికెట్ మీద చింటి చూస్తుంది. ఆ అందానికి ముగ్ధురాలై ఆ భవంతి పట్ల అపరిమితమైన ప్రేమ,పారవశ్యంతో మైమరచిపోతుంది. అప్పటివరకూ బోర్ గా అనిపించిన జీవితానికి ఎక్కడ లేని శక్తీ వస్తుంది. దాని కళ్ళు మిల మిలలాడతాయి.

తాజ్ మహల్ ఏమిటో ,ఎక్కడుంటుందో చింటికి తెలియదు.ఎంత దూరంలో ఉంటుందో తెలియదు.ఎంత పరిమాణంలో ఉంటుందో కూడా తెలియదు.కానీ చింటికి అది చూసిన క్షణం నుంచి తనకందుబాటులో ఉన్న చెత్తతోనే ఆ దివ్యమైన భవన నిర్మాణానికి పూనుకుంటుంది. అదే  చింటి జీవిత ధ్యేయమవుతుంది.చెత్తలోని ఒక్కొక్క పనిముట్టునూ ఏర్చి కూర్చి పేర్చి తాజ్ మహల్ రూపంలో నిర్మాణాన్ని పూర్తి చేసి, గర్వంగా భారతీయ జెండా ఎగరేసిన  విధానం ప్రేక్షకుల్ని దిగ్బ్రమకు గురిచేస్తుంది! తాజ్ మహల్ కోసం ఆ చిట్టి చీమ పడే కష్టాలను ఎవరికి వారు చూసి ఆనందించవలసిందే!!

ఈ చిన్న చిత్రంలో గొప్ప సందేశం కూడా ఉంది. ఎదురైన అడ్డంకులన్నిటినీ ఒక్కొక్కదాన్నీ పరిష్కరించుకుంటూ  చీమ తాజ్ మహల్ ని కట్టిన పనితీరు అద్బుతం!పిల్లలు మురిపెంగా చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు.వాళ్ళు గొప్ప గొప్ప ఆశయాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేవరకూ విశ్రమించకుండా తమ కలల్ని నిజం చేసుకునేలా  బాలల్ని ప్రోత్సహించేలా ఉందీ చిత్రం! ఇక పెద్దలైతే “చీమలు క్రమశిక్షణ తో నిరంతరం శ్రమించే మంచి పౌరులు”అని చింటి ఆచరణను బట్టి తెలుసుకుంటారు.”తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?”అన్న శ్రీ శ్రీ కవిత గుర్తొచ్చి వేలమంది కూలీలు మన తాజ్ మహల్ ను కడితే చలాకీ చిట్టి చీమ, చీమల ప్రపంచానికో తాజ్ మహల్ ను ఒంటి చేత్తో కట్టేసిందని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోతాం!మొత్తానికి ఇది మన సినిమా లాగే ఉందే అని అబ్బురమనిపిస్తుంది!!

రష్యన్ ఫెడరేషన్ నుంచి వచ్చిన ఒక గొప్ప సినిమా “చింటి”.ఇది అచ్చు  మనం మన బుజ్జాయిల్ని పిల్చుకునే”చంటి” అనే ముద్దు పేరు గుర్తొచ్చి మురిపించేస్తుంది.శీర్షిక గొప్పగా ఉండడమే కాదు చిత్రం కూడా కంటికింపుగా ఉండి మనోల్లాసాన్ని కలిగిస్తుంది. యువ దర్శకురాలు “నతాలియా మీర్ జోయాన్” దర్శకత్వంతోపాటు,స్క్రిప్ట్ రచయితగా, కళాదర్శకురాలుగా,యానిమేటర్ గా కూడా పని చేశారు. వివిధ రంగుల టీ ఆకులతో, రకరకాల అల్లికలతో మేళవించి యానిమేషన్ చిత్రంగా రూపొందించారు నతాలియా. దేవ ప్రేమల్ అందించిన “జై రాధా మాధవ్” సంగీత థీమ్ వీనుల విందు చేస్తుంది.

చిత్ర విమర్శకులు,సినీ ప్రియులు ఈ సినిమాని చూసి ప్రశంసల వర్షం కురిపించారు.అంతే ధీటుగా అవార్డుల పంట కూడా పండించిందీ బుజ్జి చిత్రం!

2012 – హిరోషిమా (జపాన్) లో అంతర్జాతీయ జ్యూరీ ప్రత్యేక బహుమతి వచ్చింది.

2012- సూజ్ డా (Suzdal-రష్యా) లో అత్యుత్తమ దృశ్య బహుమతి, ప్రొఫెషనల్ ఓటుకి రెండవ బహుమతి గెల్చుకుంది.

2012 -శాన్ వాకీ (San Joaquin – ఆమెరికా) లో బాలల చలనచిత్రోత్సవాలకు యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కోసం అడల్ట్ జ్యూరీ అవార్డు వచ్చింది. .

2012 – ఓపెన్ సినిమా (రష్యా) లో ఉత్తమ రష్యన్ చిత్రం ప్రత్యేక అవార్డు వచ్చింది.

2012 – ఫాంటాషి (Fantoche – స్విట్జర్లాండ్) లో ప్రేక్షకుల అవార్డు గెల్చుకుంది.

2012 – యానమాజే (Animage- బ్రెజిల్) లో పిల్లల ఉత్తమ యానిమేషన్ బహుమతి వచ్చింది

2012 – “రీయానిమేనియా” (Reanimania-అర్మేనియా) లో చిన్నిఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఎంపికైంది

2012 – “వాటిలో ఆంక్” (హంగేరీ) లో చిన్నిఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఎంపికైంది

2012 – “లో చెజాని ఏంజెల్” (Luchezarny Angel -రష్యా) లో యానిమేషన్ విభాగంలో మొదటి స్థానం. గెల్చుకుంది

2012 – మాస్కో (రష్యా) లో ప్రేక్షకుల అవార్డు గెల్చుకుంది

2012 – యూరోప్ విండో (Window to the Europe-రష్యా) జ్యూరీ డిప్లొమా అవార్డు గెల్చుకుంది

2012 లో సినిమా, బెర్లినాలే (Berlinale) పోటీ కార్యక్రమంలో   పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

 2012 లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ మేగజైన్ “Anima-Mundi” లో చోటు సంపాదించుకుంది. అంతేగాక గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన “Cinanima”, “Annecy”  లాంటి అంతర్జాతీయ యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి అనేక అరుదైన వాటిలో భాగం పంచుకుంది.

– శివ లక్ష్మి

ప్రరవే కార్యవర్గ సభ్యురాలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం, సినిమా సమీక్షలు, Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Vijaya Bhanu Kote
Vijaya Bhanu Kote
6 years ago

వండర్ఫుల్ 🙂
కూడోస్ మేడం