మహిళా ఉద్యమం (1857 – 1956)

    vihangaఎనబై ఐదు సంవత్సరాల తూర్పు ఇండియా కంపెనీ పాలన రద్దయి, భారతదేశం బ్రిటిషు ఇండియాగా మారేటప్పటికే (1773- 1858) ఇంగ్లీషు విద్య, క్రైస్తవ మిషనరీల మత ప్రచారం, హేతు చింతన ఒకదాని కొకటితోడై  వైజ్ఞానిక దృష్టిని దేశంలో అంటుకట్టాయి, సంప్రదాయ జీవన విధానాన్ని వలస ప్రయోజనాల కనుగుణంగా ఇంగ్లాండులో అభివృద్ధి చెందిన రాజకీయ సామాజిక ఆర్థిక సిద్ధాంతాల వెలుగులో సామాజిక సంస్కరణలను ప్రేరేపించాయి. సామాజిక జీవిత సంబంధాలను విమర్శనాత్మకంగా చూచి అర్థం చేసుకొనే విద్యవంతులైన మధ్యతరగతి వర్గం అభివృద్ధి చెంది ఆ భావధారను అంది పుచ్చుకొన్నది. దానితో  ఆచారాల పేరిట అలవాటుగా జరుగుతున్న కౌటుంబిక సామాజిక కార్యకలాపాలలోని ఔగాముల చర్చ ప్రారంభమైంది. ఆదే క్రమంలో  కుటుంబంలో స్త్రీల ఆధీన స్థితి, అణచివేత, తక్షణం సంబోధించవలసిన, సంస్కరించవలసిన అంశాలుగా స్పష్టమైంది.

    సామాజిక మత సంస్కరణలను ఆశించి రాజరామమోహనరాయ్‌ బ్రహ్మ సమాజాన్ని (1825) స్థాపించాడు. స్త్రీ విద్యను ప్రచారం చేశాడు. మరీముఖ్యంగా మరణించిన భర్తతోపాటు స్త్రీని చితిమంటల్లో కాల్చేసే దుష్టసంస్కృతి అయిన ‘సతి’ పై యుద్ధం ప్రకటించాడు. 1812నుండి సతికి వ్యతిరేకంగా సామాజిక  బౌద్ధిక రంగాలలో ఆయన చేసిన కృషి ఫలితమే 1829 సతీ సహగమన నిషేద చట్టం. 1850లనాటికి అటు బెంగాల్‌లో ఈశ్వరచంద్రవిద్యాసాగర్‌ వితంతు వివాహ ఉద్యమాన్ని నిర్మించి 1856లో వితంతువివాహ చట్టం  రావటానికి కారకుడైతే ఇటు మహారాష్ట్రలో జ్యోతిబాపూలే బ్రహ్మ సమాజం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ బ్రహ్మణేతర సామాజిక  వర్గ దృక్పథంనుండి సంస్కరణోద్యమాన్ని నిర్వచించి,  స్త్రీ విద్యకొరకు కృషిచేశాడు.  స్త్రీ పునర్వివాహాలు నిర్వహించాడు. భార్య సావిత్రీ బాయి ఆయనతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వామి. ఆతరువాతి కాలంలో పురుషాధిక్యానికి సవాల్‌ విసిరిన తారాబాయి షిండే ఆమెకు జతపడింది.
    ఈ దేశీయ నేపధ్యంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్ర దేశంలోనూ ‘స్త్రీ సమస్య’ సంఘ సంస్కరణలో కీలకాంశమైంది. మద్రాసు సుప్రీం కోర్టులో తెలుగు, అరవము, ఇంగ్లీషు భాషలలో తర్జమా చేసే ఇంటర్‌ప్రిటర్‌ ఉద్యోగిగా వున్న ఏనుగుల వీరస్వామయ్య. సుప్రీంకోర్టు అడ్వకేట్‌ జనరల్‌గా వున్న జార్జి నార్టన్‌ దొర, వెంబాకం రాఘవాచార్యులు, కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ కలిసి హిందూ లిటరరీ సోసైటీని (1833), ఏర్పరచి సభలు చేసి సామాజిక రాజకీయ విద్యా విజ్ఞాన వికాసానికి చేసిన ప్రయత్నాలు ప్రజా చైతన్యాన్ని ఆధునికీకరించే ప్రక్రియకు తొలి జీజాలు వేశాయి. శ్రీనివాస పిళ్ళ స్త్రీ విద్య పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరచి స్వయంగా ఆడపిల్లల పాఠశాల నడిపాడు.

    ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రా చరిత్ర (1838) లో ఆనాటి వేశ్యాశ్యవస్థను , స్త్రీ పునర్వివాహాన్ని , స్త్రీల మూఢ భక్తిని ,ఆచారాలను, స్త్రీలు పురుషుల వలెనే మోక్షార్హులా కారా అనే అంశాన్ని ,సహగమనాన్ని , తనదైన దృష్టితో ప్రస్తావించాడు. సహగమనాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాడు. జమిందారులు, జాగీర్దారులు తమ భూముల్లోని ప్రజలపై చలాయిస్తున్న హక్కును భార్యమీద భర్త చలాయించే అధికారం కంటే ఎక్కువయిన అధికారంగా వుందని , పోలిక చేసి చెప్పిన దానిని గమనిస్తే భార్యాభర్తలవి అధికార సంబంధాలుగా వున్నాయన్న స్పృహ వీరస్వామయ్యకు వున్నదని అర్థమవుతుంది. ఆరకంగా తెలుగనాట స్త్రీ స్థితిగురించిన ఒక కొత్త ఆలోచనాధార సన్నసన్నగా ప్రారంభమైంది.
|
    1805నాటికి క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో ఆంగ్లవిద్య పాఠశాలలు ఏర్పడుతూ 1850ల నాటికి విశాఖ, కడప గుంటూరు నెల్లూరు, ఒంగోలు మొదలైన చోట్ల ప్రత్యేకంగా బాలికల కొరకు పాఠశాలలు, స్థాపించబడ్డాయి. ఇవి సంస్కరణోద్యమ భావ ప్రసారానికి అనుకూల వాతవరణాన్ని కల్పించాయి. 1854లో గోదావరి ఆనకట్ట, 1855లో కృష్ణా ఆనకట్ట పూర్తికావటంతో వ్యవసాయం అభివృద్ధి చెంది మిగులు  సంపద పోగుపడిన సంపన్న రైతాంగవర్గం తమ పిల్లలను ఇంగ్లీషు విద్యలోకి ప్రవేశపెట్టటానికి ఉత్సాహం చూపారు. పాఠశాలల ఏర్పాటుకు విజ్ఞప్తులు చేశారు. 1857లో మద్రాసు విశ్వవిద్యాలయం ఏర్పడటం, ఆంధ్రదేశంలో ఉన్నత విద్యకు నాలుగు కళాశాలు ఏర్పడటమూ క్రమంగా జరిగింది. ఇదంతా ప్రజతంత్ర విలువల కొరకు పోరాడే మధ్యతరగతి వర్గం అభివృద్ధి కావటానికి దోహద పడింది. సంఘసంస్కరణోద్యమానికి  అవసరమైన సామాజిక పునాదిని సమకూర్చింది. ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమానికి  వైతాళిక రచన అనదగిన హితసూచని 1862లో వెలువడింది. 

    స్వామినీన ముద్దు నరసింహం నాయుడు రాజమండ్రి జిల్లా కోర్టులో 1848 నుండి 1856లో మరణించే వరకు జిల్లా మునసపుగా పని చేశాడు. స్థానికంగా వుండే తెల్లదొరలతో సంభాషణలు సాగించేంత పరిచయాలు ఆయనకు వున్నాయి. దేశకాల పరిస్థితులను శాస్త్రీయ దృష్టికోణం నుండి  ఆకళింపు చేసుకొన్నాడు. దాని ఫలితమే హితసూచని,  పీఠికను ‘స్త్రీలకు విద్యలు సాధకము లౌచున్నవి’ అన్న వాక్యంతో ప్రారంభించటమే స్త్రీ సమస్యపై ఆయన ఎంతగాఢంగా ఆలోచించాడో సూచిస్తుంది. విద్య, వైద్యం, విశ్వాసాలు మొదలైన అనేక అంశాలతో పాటు ఆయన ఈ గ్రంథంలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం, స్త్రీ పునర్వివాహం మొదలైన విషయాలను చర్చించాడు. స్త్రీ జాతికి ఎవరెవరి  మర్యాదకు, స్థితికి అనుకూలమైనంత వరకు  విద్య చెప్పించాలని, స్త్రీలు చదువుకొనటానికి వీలుగా గ్రంథాలు వ్రాయాలని చెప్పాడు. రజస్వలానంతర వివాహాలే కన్యాదాన ఫలాన్నిస్తాయని అనేక దృష్టాంతాలతో వివరించాడు. పెండ్లికి వధూవరుల పరస్పరేచ్ఛను మొదటి షరతుగా పేర్కొన్నాడు. ” సుఖమునున్ను,  సంతోషమునున్ను వివాహస్థితిన్ని పొందే హక్కు భగవంతుడు స్త్రీ పురుష జాతులకు సమానముగానే కలుగ చేసియున్నాడు” అని స్త్రీ పునర్వివాహాన్ని ఆయన సమర్థించాడు.

    1856 నాటికే స్త్రీసమస్య గురించిన అవగాహన నిర్థిష్టతను, స్పష్టతను సంతరించుకొంటూ వికసిస్తున్నదనటానికి హితసూచని ఒక కొండగుర్తు. ఈ అవగాహన వ్యక్తుల చైతన్యంతో బలపడుతూ కొనసాగింది. బాలికల విద్యకు ప్రోత్సాహకరంగా విశాఖపట్నంలో గోడె జానకమ్మ పాఠశాలను స్థాపించి (1867) నిర్వహించింది. విజయనగరం మహారాజు విజయరామగజపతి విజయనగరంలోనూ,  పిఠాపురం రాజా కాకినాడలోనూ బాలికల పాఠశాలలు (1868) ఏర్పరచారు. ఈ క్రమంలో విశాఖపట్టణ పాఠశాలల ప్యూటి యినస్పెక్టరుగా వున్న జి. వేదాంతాచారి 1870లో మద్రాసు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రం చెప్పుకోదగింది.  బాల్య వివాహాలు, వధూవరులు మధ్య వయోతారతమ్యం, కన్యాశుల్కం మొదలైన దురాచారాలు స్త్రీల జీవితాన్ని దు:ఖభూయిష్టం చేస్తున్నాయని వైధవ్యం, అవినీతికర అనుచిత స్త్రీపురుష సంబంధాలు దాని ఫలితాలని, కనుక వివాహ విషయంతో   సంస్కరణలు అవసరమనీ ఆయన ఆ వినతి పత్రంలో పేర్కొన్నాడు.  తెలుగునాట స్త్రీ సమస్యగురించిన చింతన ఇలా అభివృద్ధిచెందుతూ, సంస్కరణలను ఆకాంక్షించే విధంగా పరిస్థితులు పరిపక్వం అవుతుండగా కందుకూరి వీరేశలింగం పంతులు రంగం మీదకు వచ్చాడు.

    1870 నాటికి స్త్రీ విద్యకు అనుకూల ప్రతికూల సంవాదం తెలుగు సమాజంలో ఊపందుకొంది. కొక్కొండ వెంకటరత్నం పంతులు  స్త్రీవిద్యకు ప్రతికూలంగా ఆంధ్రభాషాసంజీవని పత్రికలో రాస్తుంటే కందుకూరి వీరేశలింగం పంతులు అనుకూలంగా పురుషార్థ  ప్రదాయిని పత్రికకు రాస్తూ వచ్చాడు. రాతలతో ఆగక భావ ప్రచారానికి ఉపన్యాసాన్ని మాధ్యమంగా అభివృద్ధి చేసుకొన్నాడు. చదువు  జ్ఞానాన్ని బుద్ధిని వికసింప చేస్తుందని,  స్త్రీ విద్య శాస్త్ర సమ్మతమేనని ప్రజలలో నమ్మకం  కలిగించటానికి పట్టుదలతో పని చేశాడు. ధవళేశ్వరంలో సభలు చేసి బాలికా విద్యాభ్యాసం వలని లాభాలను గురించి పలు ప్రసంగాలు చేశాడు. తత్ఫలితంగానే 1874లో ధవళేశ్వరంలోని ప్రముఖులందరూ చేరి చందాలు వేసుకొని బాలికా  పాఠశాల ప్రారంభించారు. అదే  సంవత్సరం స్త్రీవిద్య గురించి తదితర స్త్రీ సమస్యల గురించి తన భావాలను వెల్లడించటానికి స్వంత పత్రిక ఒకటి వుండాలని వీరేశలింగం వివేకవర్థని పత్రికను స్థాపించాడు.  1883లో స్త్రీల కోసం ప్రత్యేకంగా సతీహిత బోధిని  పత్రికను స్థాపించాడు.

    1874లో మద్రాసులో స్త్రీ పునర్వివాహాలను ప్రోత్సహించటానికి మద్రాసు ప్రభుత్వోద్యోగ వ్యవస్థలో ఉన్నత పదవిలో వున్న శ్రీపళ్ళె చెంచెలరావు పంతులు కార్యదర్శిగా ఒక సమాజం స్థాపించబడింది. ఆ విషయమై ఆంధ్రదేశంలోని వారిని  సమీకరించటానికి ప్రకటనపత్రాలు కూడా పంపబడ్డాయి. ఆ సందర్భంనుండే విశాఖపట్టణంలో సంప్రదాయ పండితుడు, సంస్కరణాభిలాషి అయిన శ్రీ మహామహోపాధ్యాయ పరవస్తు వెంకటరంగాచార్యులు (1822 -1900) స్త్రీ పునర్వివాహం శాస్త్రసమ్మతమని నిరూపిస్తూ 1875లో ఒక పుస్తకం ప్రచురించాడు. కొక్కొండ వెంకటరత్నం పంతులు వంటివారు దానిని హర్షించక ఖండించాలని ప్రయత్నించినా ‘సౌఖ్యార్థి’ వంటి వారు వితంతు వివాహాలను సమర్థిస్తూ పురుషార్థప్రదాయినికి వ్రాస్తూనే వున్నారు.

    1878 సెప్టెంబరు 8నాడు రాజమహేంద్రవరంలో సంఘ సంస్కార సమాజాన్ని స్థాపించి కార్యరంగంలోకి దిగిన వీరేశలింగం పంతులు మిత్రుడు చల్లపల్లి బాపయ్య ప్రేరణతో స్త్రీ పునర్వివాహ విషయమైన అనుకూల  భావజాల నిర్మాణానికి ఏడాది తిరగకుండానే (1879 ఆగస్టు) పూనుకొన్నాడు. విజయనగరం మహారాజుగారి బాలికా పాఠశాలలో చేసిన తొలి ఉపన్యాసం సంచలనం కలిగించింది. వీరేశలింగం  ఉపన్యాసానికి  గుంటూరు, బందరు చెన్నపూరి, కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం, అల్లూరు మొదలైన ప్రాంతాల పండితులు ఖండన గ్రంథాలు వ్రాశారు. వీటికి సమాధానంగా అదే సంవత్సరం అక్టోబరు 12న విజయనగరంలో మళ్ళీ సభ జరిపి ఉపన్యసించాడు వీరేశలింగం పంతులు. వివేకవర్థినిలో స్త్రీపునర్వివాహ వ్యతిరేక వాదులకు తగిన జవాబులిస్తూనే అనేక స్థలాలకు వెళ్ళి స్త్రీ పునర్వివాహానికి జనుల సమ్మతిని కూడగట్టటానికి కృషిచేశాడు. చల్లపల్లి బాపయ్య పంతులు, బసవరాజుగవర్రాజు, ఏలూరి లక్ష్మీనరసింహం మొదలైన మిత్ర బృందంతో కలిసి స్త్రీ పునర్వివాహ సమాజాన్ని ఏర్పరచి కార్యాచరణకు సన్నద్ధమయ్యాడు. శ్రీబారు రాజారావు, శ్రీ పైడారామకృష్ణయ్య  హార్థిక ఆర్థిక సహకారాన్ని అందించారు. స్త్రీ పునర్విఆహ వ్యతిరేక వాదుల దాడిని ఎదుర్కొనటంలో వీరేశలింగానికి  విద్యార్థుల సహాయం ఎంతైనా లభించింది. వీరేశలింగం ఉద్యమం ఎంత వ్యాప్తిని పొందిందంటే వితంతు  స్త్రీలు కొందరు తమను వైధవ్య దు:ఖంనుండి తప్పించి కాపాడవలసినదని ఆయనకు స్వయంగా ఉత్తరాలు వ్రాసేంతంగా – రెండేళ్ళలో 1891 డిసెంబరు 11న రాజమహేంద్రవరంలో తొలి స్త్రీ పునర్వివాహం జరిపించగలిగాడు వీరేశలింగం పంతులు.
.
    1880 నాటికే వీరేశలింగం పంతులు బాల్య వివాహాలను స్త్రీ సమస్యకు కారణంగా గుర్తించాడు. బాల్య వివాహాలు నిర్భంధ వైధవ్యంగా పరిణమించి నిరపరాధినులైన కన్యల జీవితాన్ని దు:ఖ భాజనం చేస్తున్నాయని ఖండించాడు. అతి బాల్య వివాహాలను నిరుత్సాహపరిచే చర్యలు ప్రభుత్వం తీసుకొనాలని ఆశించాడు. ఈ విషయంపై కూడా సనాతన పండితులను ఆయన ఎదర్కొనవలసివచ్చింది. బాల్య వివాహాల   
    స్త్రీ సమస్యల గురించిన చర్చ, పరిష్కారానికి ప్రతిపాదనలు, తీర్మానాలు ఈ కాలంలో విస్తృతమయ్యాయి. బందరు నుండి వచ్చే బుధవిధేయి పత్రిక 1988 మే 1 సంచికలో స్త్రీల చదువుపై ప్రకటించిన ఒక వ్యాసంలో ‘విద్య అన్ని బుద్ధుల చేత సమముగానే గ్రహింపబడును గాని మగవారికొక విధముగాను ఆడువాండ్రకిం కొక తీరుగాను వచ్చుననుకొనుట పొరపాటు. అన్న వాక్యంలో లైంగిక ద్వంద్వవిలువలతో స్త్రీకి విద్యను నిరాకరించటం  పట్ల నిరసన వినబడుతుంది. ఆడవాళ్ళకు చదువువస్తే మనకు తెలిసినన్ని  సంగతులు వాళ్లకు తెలస్తాయి కనుక అపుడు మనం వాళ్ళకంటే ఎక్కువ కాకుండా పోతాము కదా అన్న పురుష దురాలోచనను పసిగట్టి తిరస్కరించటం ఈ వ్యాసంలో కనబడుతుంది.

    స్త్రీ విద్యకు అవరోధంగా వున్న పరిస్థితులను గుర్తించి మార్చుకొనే ప్రయత్నాలు కూడా అప్పటికి ప్రారంభమయ్యాయి. హిందూబాలికల విద్యకొరకు మిషనరీ దొరసానులు శ్రద్ధవహిస్తున్నా మతాంతురులైన మాల మాదిగలు వుంటారని, మతాంతీకరణకు ఒత్తిడి చేస్తారనే సంకోచాలతో ఆడ పిల్లలను మిషనరీ బళ్ళకు సంపటంలేదని, అందువల్ల హిందూ బాలికల విద్యకోసం హిందువులు పోషణలోనే ఒక పాఠశాల వుంటే  ఆసమస్యతీరుతుందని, అందుకోసం బందరులో కలెక్టర్‌ ఎటి అరండల్‌ యిస్కోయర్‌ దొర ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 3వ తేదీన హిందూ హైస్కూలులో సభ జరిగిందని ఒక వార్తను బుధవిధేయి పత్రిక ప్రచురించింది. పురాణం వెంకటప్పయ్య, కుంభకోణం కృష్ణమాచార్యులు వంటివారి పూనికతో చందాలు వేసుకొని బడి కట్టేందుకు తీర్మానం జరిగిందని ఆవార్తలో వుంది. పండితరమాబాయి ప్రారంభించిన శారదా సదనాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో జమిందారులు స్త్రీలకు చేతిపనులు నేర్పించే పాఠశాలలు నెలకొల్పాలని కూడా ఈ పత్రిక ఆశించింది. (5 నవంబరు 1889)

    జగన్నాథపురంలో దివాన్‌ బహుద్దూర్‌ రఘునాథరావు అతని అనుమాయులు సమావేశమై రజస్వలానంతరవివాహాలకు,  వితంతు వివాహాలకు అనుకూలంగా, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయటమే కాక వృద్ధవివాహాలకు పరిష్కారంగా నలభై ఏళ్ళుదాటిన మగవాడు 15ఏళ్ళు దాటిన ఆడపిల్లలనే పెళ్ళాడాలని కూడా తీర్మానించారు(20మే 1889) బుధ విధేయి ముసలి మగడు పడచుపెళ్ళాం సమస్యను కూడా చర్చించింది. (5 జూన్‌ 1889)
(ఇంకా వుంది )

– ఆచార్య కాత్యాయనీ విద్మహే ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో