
siva lakshmi
ఎథనేసియా (ATHANASIA)
Director : Panos Karkanevatos
Country : Greece
Language : Greek
Duration : 95 minutes.
చిత్ర ఇతివృత్తం : ఏంజెలా అనే అమెరికన్ యువతి తనను పెంచి పెద్ద చేసిన పెంపుడు తండ్రితో కన్నతండ్రిని వెతుక్కుంటూ గ్రీస్ దేశానికి ప్రయాణించి ,తన జీవితాన్నీ, తన రక్త సంబంధీకుల జీవితాలనూ ప్రభావితం చేసిన ఒక కీలకమైన విషయాన్ని తెలుసుకుని – చివరికి కన్నతండ్రిని గ్రీస్ లో కలుసుకుంటుంది.
ఎథనేసియా .
ఏంజెలా గ్రీకు వారసత్వానికి చెందిన ఒక అమెరికన్ మహిళ. ఆమె తలి-దండ్రులు మనవరాలి పుట్టిన రోజు పండగ కోసం ఏంజెలా ఇంటికొస్తారు. ఆమె తల్లి ఎథనేసియా. ఎథనేసియా భర్త నిజంగా ఏంజెలాకి సొంత తండ్రి కాదు. అతను ఈ రహస్యాన్ని ఆమె కూతురు పుట్టినరోజు నాడే ఏంజెలాకు చెప్పాలని నిశ్చయించుకుంటాడు.
ఆమెకు జన్మనిచ్చిన తండ్రి గురించీ-గ్రీస్ లో అతనుండే పట్టణం గురించీ ఏంజెలాకు చూచాయగా తెలుసు. అందువల్ల పెంచిన తండ్రిని తోడు తీసుకుని ఆయన సహాయంతో కన్న తండ్రిని వెతుక్కుంటూ అమెరికా నుంచి తన స్వదేశమైన గ్రీస్ దేశానికి ప్రయాణం కడుతుంది ఏంజెలా.
సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఎథనేసియా తన అక్కతో,తండ్రితో గ్రీస్ లోని ఒక పల్లెటూరిలో నివసిస్తూ ఉంటుంది. తెలిసీ తెలియని యుక్తవయసులో ఉన్న ఎథనేసియా వాళ్ళక్కతో ఎంగేజ్ మెంట్ జరిగిపోయిన యువకుణ్ణి ప్రేమిస్తుంది. సహజంగానే తండ్రి నిశ్చితార్ధం ప్రకారం పెద్దమ్మాయిని అతనికిచ్చి వివాహం జరిపిస్తాడు.కొత్తజంట వేరే వెళ్ళిపోతారు. ఎథనేసియా తండ్రితో ఉండిపోతుంది. కొన్నాళ్ళకు తండ్రి చనిపోతాడు. ఎథనేసియాకు నా అన్నవాళ్ళెవరూ లేని పరిస్థితి ఎదురవుతుంది. పైగా చేతిలో చిల్లిగవ్వలేని,పూట గడవని పేదరికం.ఏ దిక్కూ మొక్కూ లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్క పంచనే చేరుతుంది. అక్క గర్భంతో వంట్లో నలతగా ఉంటూ కదలలేని పరిస్థితిలో ఉంటుంది.ఆమెకు సేవలు చేస్తూ ,ఇంటి పనులన్నీ చేస్తూ చాలా ఒబ్బిడిగా ఒదిగి ఒదిగి బతుకు వెళ్ళదీస్తూ ఉంటుంది.బావగారి కళ్ళెప్పుడూ ఎథనేసియా మీదే ఉంటాయి. ఒకరోజు అతను పని నుంచి వస్తాడు.అక్క ఎక్కడికెళ్ళిందని అడుగుతాడు. హాస్పిటల్ కి వెళ్ళినట్లు తెలుసు కుంటాడు. ఎథనేసియా అతనికేదైనా తినడానికిద్దామని ప్రయత్నిస్తుండగా బలవంతంగా అత్యాచారం చేస్తాడు.ఈ లోపల అక్క వచ్చి చూస్తుంది.చెల్లెల్ని విపరీతంగా అసహ్యించుకుంటుంది.ఇక అప్పటినుంచి ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇద్దరినీ వళ్ళంతా కళ్ళు చేసుకుని కనిపెట్టి చూస్తూ గట్టి నిఘాతో ఇద్దర్నీకనిపెడుతూ ఉంటుంది.
ఒకసారి బయటికొచ్చి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుంది ఎథనేసియా . చాలా విషాదంగా కనపడుతుంది.ఎక్కడినుంచో ఊడిపడినట్లు అతనొచ్చి తనకి ఆమె అంటే ఎంతిష్టమో రకరకాల మాటలతో,చేష్టలతో తెలియజేస్తూ మళ్ళీ ఆమెను లొంగదీసుకుంటాడు. ఈసారి ఆమె ఇష్టంగానే అతని వశమైపోయినట్లు కనిపిస్తుంది. అతని ప్రేమంతా ఎథనేసియా శరీరం మీదే కానీ ఎథనేసియాకి మాత్రం జీవితానికి కాస్తంత నమ్మకాన్నీ,ధైర్యాన్నీ ఇస్తాడనే ఆశతో, నిజమైన ప్రేమతో అల్లుకుపోతుంది.
అనివార్యమైన పరిస్థితిలో అక్కడే పడుంటున్న అమాయకపు ఎథనేసియా అతనివల్ల గర్భవతి అవుతుంది. ఈ సంగతి తెలిసిన అక్క ఎథనేసియాని ఇంటినుంచి వెళ్ళగొడుతుంది. ఊరివాళ్ళందరూ రకరకాల అవమానాల పాలు చేస్తారు.ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి అతి కౄరంగా ఎథనేసియా జుట్టు కత్తిరిస్తారు.అనరాని మాటలంటారు.తలా ఒక తన్ను తంతారు. అంతగా ప్రేమించానని నమ్మించిన ఘనమైన ప్రియుడు ఏ రకంగానూ ఆదుకోడు.సుడిగుండంలో కొట్టుకుపోతున్నా రవ్వంత కూడా ఆసరా ఇవ్వకుండా పారిపోయే పురుషులే ప్రపంచం నిండా. ఎంత పైశాచికంగా హింసిస్తున్నా అసలు పత్తా లేకుండా ఆ దరిదాపుల్లోనే ఉండడు. సొంతగ్రామం నుంచి తరిమి తరిమి కొట్టబడిన ఎథనేసియా భవిష్యత్తు గురించి చాలా భయపడుతుంది.
ప్రపంచాన్ని చుట్టివస్తూ రకరకాల భంగిమల్లో ప్రకృతినీ,మనుషుల్నీఫొటోలు తీస్తూ వాటి కధనాలనందించడమే తన వృత్తి యైన ఒక ఫొటో జర్నలిస్ట్ ఎథనేసియాను చూస్తాడు.అతి దయనీయమైన పరిస్థితుల్లో, సముద్రపు హోరు మధ్య ఒక బండమీద తానూ ఒక బండరాయిలా ఉన్న ఎథనేసియాను గమనిస్తాడు. ఒట్టి మనిషి కూడా కాదు, ఒంటరి బతుకులో పొంచి ఉన్న ప్రమాదకరమైన వాతావరణం అసాధారణంగా భీతి గొల్పుతూ అభద్రతకు గురిచేస్తుంటే బేలగా డీలా పడిపోయి తనలాంటి వారికి చావు తప్ప వేరే మార్గం లేదని తలపోస్తూ ఉంటుంది. అనివార్యంగా తననీ దుర్భర పరిస్థితుల్లోకి నెట్టిన అక్క,బావ, తన ఊరి మనుషులతో భయభ్రాంతురాలై చేష్టలుడిగి బిగదీసుకుపోయిఉంటుంది ఎథనేసియా. ఫొటో జర్నలిస్ట్ మంచి మనసుతో ఆమెకు తన చెయ్యందిస్తాడు.వేరే ఏ దిక్కూ కనిపించక మౌనంగా అతన్ని అనుసరిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఆయన స్వదేశం కెనడా చేరుకున్నారనీ, దయమయుడైన అతని సహకారంతో పుట్టిన పాపాయిని ఇద్దరూ కలిసి అపురూపంగా పెంచి వారి జీవితాలను కూడా సుఖమయం చేసుకున్నారనీ, ఆ పాపాయే ఏంజెలా అనీ ప్రేక్షకులకర్ధమవుతుంది.
పాప పుట్టినరోజు నాడు కొన్ని ఫొటోలను వరసగా ఏంజెలాకి చూపిస్తుండడంతో సినిమా మొదలవుతుంది.ముందు ముందు ఏమవుతుందోననే ఆసక్తితో ప్రేక్షకులు సినిమా పట్ల కుతూహలంగా ఉండేలా దర్శకుడు సెటప్ ను చిత్రీకరించడంలో కృతకృత్యులయ్యారు.
ఏంజెలా హీరోయిన్ గా అనిపించినప్పటికీ నిజమైన కధానాయికగా ప్రేక్షకుల మనసుల్లో తిష్ట వేసేది మాత్రం ఎథనేసియానే!
ఎథనేసియా సినిమా మొదటి షాట్లలో నడివయసు దాటిన స్త్రీగా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మొత్తంలో నిబ్బరంగా కష్టాలకెదురీదే నెమ్మదైన యువతిగా కనిపిస్తుంది. మొహం కెమెరా ఫ్రెండ్లీగా ఉంటుంది.ఎక్కడా కూడా ఆమె వయసుని ఎవరూ ఊహించలేరు.బహుశా ఇద్దరు స్త్రీలు సినిమా రెండు భాగాలలో నటించి ఉంటారు.మేకప్ ఎంత వర్ణనాతీతంగా ఉందంటే ఈ సినిమాని రవ్వంత కూడా ఇష్టపడనివారు సైతం ఎథనేసియా అద్భుతమైన మేకప్ కు హేట్సాఫ్ చెప్పాల్సిందే!
క్రీ|పూ| వెయ్యి సంవత్సరాల క్రితం గ్రీకు మహాకవి హోమర్ రాసిన “ఇలియడ్” కావ్యం శతాబ్ధాల నుంచీ అన్ని దేశాల కళల్నీ-సాహిత్యాన్నీ ప్రభావితం చేసింది. ప్రపంచం లోనే ప్రప్రధమ నాగరిక పట్టణం ట్రాయ్.అందంలో సిరిసంపదల్లో దానితో పోల్చదగినది మరొకటి లేదు. అటువంటి పట్టణం ట్రోజన్ యుద్ధం వల్ల నామరూపాలు లేకుండా పోయింది.. దీనికికారణం “హెలెన్” అనే స్త్రీ అందమని గ్రీకు పురాణం చెప్తుంది. స్త్రీలకు సంబంధించి దాదాపు ఇలాంటి కథనాలే మన పురాణాల్లోనూ ఉన్నాయి. మన రామాయణంలో రామ రావణ యుద్ధం “సీత” వల్ల అనీ, భారతంలో కురుక్షేత్ర యుద్ధం “ద్రౌపది” వల్ల అనీ మన పురాణాలు ప్రతిపాదించాయి.ఈ పురాణాల్లో దేవుళ్ళూ-దేవతలూ , వాళ్ళ విలాస వంతమైన జీవితాలూ ఉంటాయి. కధానాయకుడు ధీరోదాత్తుడూ,ధీరలలితుడూ అయిఉండి సకల సద్గుణాలతో ఉండాలి కదా మామూలు మనుషుల్లాగా సర్వ అవలక్షణాలతో కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారేమిటి?అని మనకెక్కడ అనుమానం వస్తుందోనని వెంటనే ఒక శాప కారణంగానని రచయిత చెప్తాడు. మొత్తానికి పురుషుల్ని వివశుల్ని చేసి వాళ్ళ వినాశనానికీ, జన ప్రాణ నష్టానికీ, రాజ్యాల సర్వ నాశనానికీ మూలకారణ మయ్యేది స్త్రీలేనని పురుషులు రాసిన ఈ కావ్యాలు తేల్చేస్తాయి.
క్రిస్టఫర్ మార్లో (Christopher Marlowe) ట్రాయ్ పట్టణం లోని హెలెన్ ముఖ వర్చస్సు గురించి వర్ణిస్తూ “The face that launched a thousand ships” అంటాడు. పురాణ కథలు మనల్ని ఎప్పుడు చదివినా కొత్త కొత్త గా ఊరిస్తూనే ఉంటాయి. 1000 ఓడల్ని జలప్రవేశం చేయించి, పదేళ్ళపాటు వేలమంది యోధులతో భార్యా బిడ్డల్నీ,సర్వ సుఖాల్నీ వదిలి ఏక దీక్షతో పోరాడే శక్తినిచ్చిన ఆ మనోహరమైన ముఖం ఎలా ఉండి ఉంటుందని ఒకటే కుతూహలం నాకు! టీనేజ్ లో చదువు కుంటున్నప్పుడు ఈ గ్రీకు సాహిత్యం చాలా ఇష్టంగా, కథలు అద్భుతంగా ఉండేవి. తేజస్సుతో యవ్వనంతో మెరిసిపోయే అందమైన స్త్రీలు కనిపించినప్పుడల్లా వాళ్ళ ముఖాల్లో హెలెన్ ముఖం కోసం వెతికేదాన్ని.కానీ ఎవరి పోలికలూ నా మనసులో ప్రతిష్టించుకున్న హెలెన్ తో సరిపోయేవి కాదు. అప్పటినుంచీ ఈ రోజువరకూ వెతుకుతూనే ఉన్నాను. ప్రపంచానికి ముందు చూపు నిచ్చిన ఎందరో మేధావుల్ని అందించిన గ్రీస్ దేశం ప్రపంచీకరణ వల్ల 100 సంవత్సరాలనుంచి ఘోరమైన తిరోగమనం దారిలో పయనిస్తూ ప్రపంచానికి గానీ,తన ప్రజలకుగానీ ఏమీ కంట్రిబూట్ చెయ్యలేకపోయింది. అంత వైభవంతో వెలిగిపోయిన “హెలెన్” ఇప్పుడు ఆధిపత్య శక్తుల కుట్రల వల్ల దుర్భర దారిద్ర్యంలో, భీకరమైన సామాజిక పరిస్థితుల్లో చిక్కుకుపోయి,జీవితం మొత్తం కుప్ప కూలిపోయి ఒంటరి “ఎథనేసియా” అవతారమెత్తిందనిపించింది.ముఖారవిందాల గురించిన భ్రమలన్నీ ఎథనేసియా చిత్ర ప్రభావంతో పటాపంచలైపోయాయి!
గ్రీకు స్త్రీలు ఆజానుబాహు (రాబస్ట్ బాడీస్- Robust Bodies) లనీ,దృఢoగా, పరిపూర్ణమైన ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉంటారని చదువుకున్న విషయం పురుషులకు ధీటుగా బలంగా, ఎత్తుగా, నిండుగా ఉన్న ఎథనేసియా రూపం చూసినప్పుడు గుర్తొచ్చింది. “శరీర ఆకృతి కంటే మహిళల్లోని ఒక రకమైన మేధో అందమంటే నాకు చాలా ఇష్టం. వారిలోని దయా గుణం,హేతుబద్ధతను నేను ఆరాధిస్తాను”అని అంటారు సత్యజిత్ రే. కవులు వర్ణించే నాజూకుతనం,కోటేరు ముక్కూ,సన్నని నడుమూ,వణికిపోయే శరీరాలూ,తెల్ల రంగు శరీర చాయలూ-ఇవి అసలు అందాలే కావని తెలిసొచ్చింది. జీవితంలో తనకంటూ ఏ హక్కూ లేక పోయినా, నిలువనీడ లేక పోయినా, మానవహుందా తనంతో పేదరికాన్నీ,దుర్భర పరిస్థితుల్నీ, ఎదుర్కొని నిండు జీవితాన్నినిలబెట్టుకోవడంలోనే అసలైన అందముందని తెలిసింది.
గ్రీకు సాహిత్యంలో “పెనిలపి”లాంటి ఏ కొందరు స్త్రీమూర్తులనో మినహాయిస్తే దాదాపు స్త్రీలందరినీ భర్తలకు తెలియకుండా రహస్యంగా పరాయి పురుషుల కోసం తపించి వారి వెంట పడేవారుగా ఈ గ్రీకు కావ్యాల్లో రాశారు కవులు.ప్రపంచంలోనే ప్రప్రధమ మహాకవులైన హోమర్,ఎస్కిలస్ లే స్త్రీల గురించి అభూత కల్పనలు చేశారు గనుక తర్వాత తరాల మహా మహా కావ్య రచయితలందరూ వారిననుసరించారు.ఆ పురాణాల కాలాలనుంచే స్త్రీలు రకరకాల అపవాదులకూ,అన్యాయాలకూ బలవుతూ వచ్చారు! రూపంలో అంటే వేషభాషల్లో కొంత ఆధునికత సంతరించుకున్నట్లు కనిపించినా,సారంలో అంటే ఆలోచనల్లో మాత్రం ఈ కాలం వరకూ అదే కొనసాగుతుంది!!
సినీ ప్రియులందరూ ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. గ్రీకు సాహిత్యమన్నా,ముఖ్యంగా అందులోని గ్రీకు స్త్రీలన్నా నాకు ప్రాణం గనుక నాసంగతి చెప్పనే అఖ్ఖర్లేదు.
2008 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ – మార్క్ డెమింగ్, రోవీలో ఎథనేసియా చిత్రం అధికారికంగా ఎంపికైంది
ఎథనేసియా – నా అభిమాన గ్రీకు సినిమాతో నేను యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను పూర్తి చేశాను.
ఒకే ఒక్క వాక్యంలో చెప్పడానికి అనువుగా ఉండాలనేది మంచి సినిమా కథకి ప్రాధమిక సూత్రం. ఈ సూత్రాన్ని పాటిస్తూ ఈ సినిమాలన్నీ కూడా గంటన్నర-రెండు గంటల లోపు నిడివితో ఉంటాయి. చలన చిత్రమంటేనే కదిలే మనుషులతో,సంభాషణలతో,వర్ణనలతో చెప్పే దృశ్య కథ. సినిమాలో ప్రతిదృశ్యం,ప్రాణంలేని,ప్రాణమున్న ప్రతి వస్తువూ మాట్లాడుతుందంటారు ఐజెన్ స్టీన్. ఏదో చెప్పాలనే తాపత్రయంతో రాయడమే కానీ సినిమా చూసిన భావన కలిగించడం నా వల్ల కాని పని. “My task… is to make you hear, to make you feel-and above all to make you see. That is all, and it is everything”- అని అంటాడు Joseph Conrad. జోసెఫ్ కాన్రాడ్ అన్నట్లుగా ఎవరికివారు సరైన అనుభూతిని పొందాలంటే ఈ చిత్రాలు చూసి తీరాలి!
మహిళా సమస్యల పట్ల మరింత అవగాహన పెరగడం కోసం మీరీ చిత్రాలు చూసేలా ప్రేరేపించాలని నాప్రయత్నం!!
ప్రపంచంలోని అగ్ర రాజ్యాలతో సహా ఏ దేశంలోనూ మహిళల్ని మానవులుగా సమాజంలో సగ భాగంగా భావించడం లేదు. మహిళల సమస్యలమీద తీసిన మంచి సినిమాలు చూడడం ఇష్టం నాకు. టి వి డబ్బాలో గానీ, లాప్ టాప్ లో గానీ సినిమాలు చూస్తే దాని పూర్తి ప్రయోజనం సాధించినట్లనిపించదు. అందువల్ల మండుటెండల్లో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రద్దీలో పోవడానికీ రావడానికీ కష్టమైనా స్నేహితులమధ్య కూర్చుని మహిళల చిత్రాలు చూడడం వల్ల కలిగిన ఆనందంతో ఆ కష్టమంతా ఇష్టమనిపించి, ఎప్పుడూ లేనంత శక్తి వచ్చింది!!
భారత దేశంలోని మహిళలకు ఇంత మంచి అవకాశాన్నిచ్చిన యూరోపియన్ యూనియన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు!
– శివలక్ష్మి
ప్రరవే కార్యవర్గ సభ్యురాలు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మీ కామెంట్స్ బాగున్నాయి. అయితే, ఎథనేసియ పాత్ర ధరించిన నటి ఎవరూ అన్న సందేహం మిగిలిపోయింది.