నిరీక్షణ ముగిసే వేళ…

1.
తేనెలో ముంచిన కవ్వాన్ని
చందమామలో చిలికితే
వచ్చిన తెల్లని వెన్నెల వెన్నముద్ద
దానినుండి వచ్చే దివ్యకాంతి
కళ్లున్న అందరికీ కన్పించదు
తాను కన్పించ దల్చుకున్నవారు
కళ్లు మూసుకున్నా
తాను కన్పించకుండా దాక్కోలేదు
అనంతలోకాల అమృతకాంతి అది

గెలాక్సీలకి ఆవల నక్షత్రాల తోటనుండి
సీతాకోక చిలుకలు తెచ్చే పుప్పొడి పలుకులు
ఆ కాంతి గురించే గానం చేస్తాయి
ఆ కాంతి అవతరణ గురించే చెప్తాయి
చెట్లకీ జంతువులకీ రాళ్లకీ కూడా
పుప్పొడి వాక్యాల జీవ సుగంధం తెలుస్తుంది

హృదయానికి ఆవల….చావుపుట్టుకలకి ఆవల
రూపంలేని ప్రేమామృత అనంత నైరూప్యం నుండి
సృష్టిని నడిపించే తేనెల కాంతి
నేలమీద నడుస్తుందా ?
తన బిడ్డలకి ఆత్మస్పర్శని ఇస్తుందా ?
అసలుందుకే అవతరించిందా?
2.
నేను ఎందుకో ఎవరికోసమో ఎదురు చూస్తునే ఉన్నాను
నేను ఎదురు చూస్తున్న సంగతి తెలియకుండానే ఎదురు చూస్తున్నాను
నేను ఇక్కడ ఓ మేడిచెట్టు మీద పడుకుని
మానవరూపంలోని ఆ దివ్య ప్రేమ కోసం
ఎదురు చూస్తున్న సంగతి నాకే తెలియదు
నాకుతెలియదు నిజానికి అంతా ముందే నిర్ణయమైందని
అంతరిక్షాలకి ఆవల నక్షత్రాల పూదోటలోనే
ఎవరో ముందుగా నన్ను ఆదేశించి
సంగమ సమయం నిర్ణయించి పంపిస్తే
బహుశా నేనిక్కడికి వచ్చి ఉంటాను
3.
సూర్యునిలోని వెచ్చదనం, హిగిరుల్లోని చల్లదనం
తేనెలోని మాధుర్యం మానవరూపంలోని ఆ దివ్యప్రేమామృతం

ఎప్పుడో ఓ శుభదినాన దివ్యప్రేమ నడచి వస్తుంది మా ఊరికి
అపార కృపని వర్షించే దయాస్వరూపం
నన్ను పేరు పెట్టి మరీ పిలుస్తుంది
ఆది ఈ జన్మలో పేరేకానీ
నిజానికి నేను పుట్టకముందు నుంచీ
నక్షత్రాల పూదోటలో కనిపించక
వినిపించే దివ్యకాంతి నన్ను పిలిచేపేరు
ఆ గొంతు నేను పుట్టక ముందు లోకాల్లో విన్న స్వరం

తరింపచేసే దివ్యప్రేమతో నిండిన ఆ కళ్లు
అనంత నీలి సముద్రాల మీద చెలరేగే
వెచ్చని మంచు తుపానుల్ని చీల్చుకుని
ఉదయించే రెండు బింబాల ధవళ స్పర్శానుభవాలు

ఆ చిరునవ్వు
యెదలోయలలోని గడ్డిపూలపై
నిదురించే ముంచు బిందువులను నిమిరే దివ్వకాంతి
జన్మజన్మల రూపాల ,పాపాల అట్టడుగున
ఉనికి తెలియనీయని తెనెబిందువుని
నిద్రలేపే మృదుమధురోదయం

దర్శన …స్పర్పన…. సంభాషణలతో
దివ్యప్రేమ నా గూటికే వచ్చి
దివ్యాశీస్సులు వర్షిస్తుంది
నా జీవితమే ఓ మధుపాత్రగా మారిపోతుంది

గోవు వెంట దూడల్లా.. తల్లిచేప వెంట పిల్లచేపల్లా
కరుణామృతం వెంట.. కరుణాసముద్రంలో నీటిబిందువులై
కరిగి తరించే యాత్ర ఇక మొదలవుతుంది..

                                                                    – వక్కలంక వసీరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to నిరీక్షణ ముగిసే వేళ…

 1. D.Venkateswara Rao says:

  తేనెలో ముంచిన కవ్వాన్నిచందమామలో చిలికి అమృతకాంతిని చూపించారు
  నక్షత్రవీది ఆవతల నక్షత్రాల తోటనుండి సీతాకోక చిలుకలచే పుప్పొడి తెప్పించారు
  సూర్యునిలోని వెచ్చదనం, హిమగిరుల్లోని చల్లదనం తేనెలోని మాధుర్యం మానవరూపంలోని ఆ దివ్యప్రేమామృతం అన్నారు
  అదే దివ్యప్రేమను మీ గూటికే వచ్చి దివ్యాశీస్సులు వర్షించే ఓ మధుపాత్రగా మార్చారు
  ఎంత దూరంగా చూసి వ్రాసారండి వసీరా గారూ
  ఆ దివ్యప్రేమను జీవిత మధుపాత్రగా ఎలా మార్చగలిగారు
  ఏది ఏమైనా ఒక సారి నక్షత్ర వీది లోకి తీసుకెళ్ళారు

  There are probably more than 170 billion galaxies in the observable universe. Most are 1,000 to 100,000 parsecs in diameter and usually separated by distances on the order of millions of parsecs.

  Coma Berenices, is about 55,000 light-years in diameter and approximately 60 million light-years away from ఎర్త్

  In October 2013, z8_GND_5296 was confirmed to be the most distant galaxy yet discovered, at a distance of approximately 13.1 billion light-years from Earth. The galaxy appears to astronomers as it was “just 700 million years after the Big Bang, when the universe was only about 5 percent of its current age of 13.8 billion years.”

 2. mercy margaret says:

  wonderful poem sir …