నా కళ్లతో అమెరికా-27

అమెరికా తూర్పు తీరం-రోజు-1

          సెలవుల్లో ఎక్కడికైనా వెళదామని పిల్లలు ఒకటే పేచీ. తలా ఒక ప్లేస్ సజెస్ట్ చేసేరు. వరు హవాయ్ దీవులకు వెళదామని గూగుల్ లో రీసెర్చి చేసి, ఒక కాగితమ్మీద వివరాలు ప్రింట్ చేసుకుని మరీ తెచ్చింది. “కానీ ఇన్ని రోజులైంది, అసలు అమెరికా ఈస్ట్ కోస్ట్ కి వెళ్లలేదన్న” అసంతృప్తి నాలో బలంగా ఉండిపోయింది. అసలు అమెరికా అంటే చిన్నప్పుడు మొదటగా తెలిసినది న్యూయార్క్ మాత్రమే. కానీ ఇంత వరకూ చూడలేదు. “హవాయి తర్వాత, ముందు న్యూయార్క్” అని భీష్మించాను.

సరే అసలెక్కడికైనా, వేసవి సెలవుల్లో వెళ్లడానికి ఫ్లైట్ లు బుక్ చేద్దామని కూచుంటే టిక్కెట్ల ధరలు చుక్కల్లో ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు కాకుండా నెలల ముందే అడ్వాన్సుగా టిక్కెట్లని బుక్ చేస్తే తక్కువకు వస్తాయి కదా ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందే తడవుగా మరో మూణ్ణాలుగు నెలల్లో రాబోతున్న “థాంక్స్ గివింగ్” వరస సెలవులకి కాసిన్ని డుమ్మా సెలవులు కలిపి వెళ్లొచ్చేందుకు బుక్ చేసేసాను.
తీరా ఫ్లైటు బుక్ చేసాక ఆలోచిస్తే అవి అతి చల్లని రోజులు న్యూయార్క్ వైపు. “నెట్టుకురాగలమా చంటిపిల్లతో”అని భయం వేసింది. మొత్తం వారం రోజుల ప్రయాణం. వారం బుక్ చెయ్యడం మాట అటుంచి , ఇక అక్కణ్ణుంచి అసలు పని ప్రారంభమైంది నాకు. యధావిధిగా మొత్తం ప్లానింగు మొదలుపెట్టాను. ఏయే ప్రదేశాలకు వెళ్లాలి? వారమంతా న్యూయార్క్ మాత్రమే చూస్తే ఏవేమి చూడాలి? చుట్టు పక్కల మరేదైనా ప్రదేశాలు చూడడానికి వీలవుతుందా? వీలైతే ఎలా వెళ్లాలి? ఇలా రక రకాల ప్రశ్నలు. ప్రతీ చోటా హోటళ్లు, డే టూర్ లు, తిరగడానికి కారు..ఇవన్నీ బుక్ చెయ్యాలి కదా. నా రీసెర్చి మొదలైందిక. గూగుల్ లో గంటల తరబడి మంచి ఆఫర్ల కోసం వెతకడం, నోట్ చేసుకోవడం, ట్రిప్ ఎడ్వైజర్ మొదలైన సైట్ల లో వివరాలు చదవడం.

ఇలా అదే పనైంది అక్కణ్ణించి. కానీ ప్రతీదీ ఒక్క బుర్ర తో ఆలోచించి లాభం లేదని పిల్లల సాయం కూడా తీసుకోవడం మొదలెట్టాను. ప్రతీ సాయంత్రం భోజనం బల్ల దగ్గిర మాట్లాడుకోవడం, కొన్ని రిజర్వేషన్ల ఆలోచనలు చెయ్యడం, మర్నాటికి మళ్లా కొత్త ఆలోచనలు.
చివరికి చకచకా నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఆన్ లైను లో చూసి అయిదు రోజుల “ఈస్ట్ కోస్ట్ బస్ టూర్” బుక్ చేసాను. మొత్తం అయిదు రోజుల పాటూ అయిదారు రాష్ట్రాల టూర్. నయగారా కూడా లిస్టు లో ఉంది. ఇంకేం మరి. అదీగాక ఆఫ్ సీజన్ వల్ల మంచి ఆఫర్ ఉంది. రెండు టిక్కెట్లు కొంటే, రెండు ఫ్రీ.
బస్ టూర్ హోటల్ తో కూడా కలిపిన పేకేజ్. టూరుకి ముందు రోజుకే మేమక్కడికి చేరిపోతాం, టూర్ అయిపోయాక కూడా మరో రోజు ఉంటాం. ఆ రెండు రోజులకి మా స్వంత హోటల్ బుక్ చేసుకున్నాం. ఆ రెండు రోజుల్ని ప్రయాణపు బడలిక తీర్చుకోవడానికి, లేదా ప్రయాణానికి సిద్ధం కావడానికి ఉపయోగించుకుందాం, పైగా న్యూయార్క్ లో స్వయంగా చూడాల్సినవి చూద్దామని ప్లాను చేసుకున్నాం.
అనుకున్న నవంబరు అతి త్వరితంగా రానే వచ్చింది. ఎకామడేషన్లు, ప్రయాణపు రిజర్వేషన్లు, ఫ్లైటు టిక్కెట్లు, ఎయిర్ పోర్ట్ నించి హోటల్ కు, ఇతర ప్రాంతాలకు చేరేందుకు టాక్సీలతో సహా అన్నీ ఆన్ లైన్ లో బుక్ చేసాను. ఎక్కడా తడుముకోనవసరం లేకుండా. (డబ్బులెన్నయ్యాయని చూసుకోకుండా, అవెలాగూ మంచి నీళ్లలా ఖర్చయ్యాయి.)

ఇక ప్రయాణానికి సూట్ కేసులు సర్దడం మొదలైంది. ఈ సారి వెళ్తూన్నది ఫ్లైటు లో గాబట్టి US డొమెస్టిక్ ఎయిర్ లైన్సు నిబంధనల ప్రకారం సర్దుకోవాలి కదా. తీరా చూద్దును కదా, ఇండియా ప్రయాణం లో లాగా పెద్ద సూట్ కేసులు పట్టు కెళ్తే ఒక్కో సూట్ కేసుకి ముప్ఫై నలభై డాలర్లు ఛార్జి కట్టాలి. కేవలం హేండి గా ఉండే చిన్న సైజు బాగులు మాత్రం ఉచితం. వెంట వెంటనే త్వరితంగా ఆలోచించాను. పిల్లలతో సమావేశం ఏర్పరిచాను. “ఓ పని చేద్దాం. ఎవరి బాగు వాళ్లు సర్దుకోనివ్వు.ఇలా ఎవరికి వాళ్లు ఒకో బాగు తెచ్చుకోవడం వల్ల మనకు బిల్లూ పడదు, నీకూ పని తగ్గుతుందని” సత్య సలహా ఇచ్చాడు. పిల్లలూ ఒప్పుకున్నారు. ఇంకేం, వరసగా సర్దిన బాగులు రేప్పొద్దిటికల్లా హాలులో పెట్టలని రూలు పాస్ చేసాను. అంతే కాదు ప్రయాణం లో ఎవరి బాగ్ లు వాళ్లు మోసుకోవాలన్న మాట. అందుకే అందరం చక్రాల బ్యాగులు, చిన్న చక్రాల సూట్ కేసుల్లో సర్దుకున్నాం. అవిగాక భుజాలకు తగిలించుకునే ఒక్కో హాండ్ బాగు. ఇక సిరి తో పరుగులెట్టడం, నిద్రపోతే మొయ్యడం కష్టం కనక పిల్లకు బేబీ కార్టు. వెరసి పదకొండు కనబడ్డాయి ఉదయానికి హాల్లో. సామాన్లంటేనే హడావుడి చేసే సత్య ఇవన్నీ చూసి “అయ్యబాబోయ్” అని నెత్తి పట్టుకున్నాడు.
“ఇంతదానికే డీలా పడితే ఎలా? ఇంకా వారం బయట ఇవన్నీ మోసుకుని తిరగాలి” అని గీతోపదేశం చేసాను.

సరే ఇక ప్రయాణం ముందు రోజు న్యూయార్క్ వెదర్ రిపోర్టు చూద్దుము కదా. సరిగ్గా అదే రోజు పెద్ద తుఫాను అని ఉంది. ఇంకేముంది! వర్షానికోగొడుగూ, చలికి పనికొచ్చే కోట్లు, థర్మల్సు, గ్లోవ్స్ ఇలా.. మరో లిస్టు సిద్ధమైంది. అప్పటి కప్పుడు మరలా షాపులకి పరుగెత్తి, లేనివన్నీ కొని తెచ్చుకున్నాం. కాలిఫోర్నియాలో మేమున్న ప్రాంతంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఎప్పుడూ రాదు. కానీ ఇప్పుడు మేం వెళ్లబోతున్న ప్రదేశాలు కొన్ని మైనస్ లలో ఉండే అవకాశం ఉంది. అందుకనన్న మాట ఈ జాగ్రత్తలు. కానీ అవన్నీ పట్టుకెళ్లడం ఎంత మంచిదయ్యిందో ప్రయాణం లో అడుగడుగునా అర్థమైంది.

మొత్తానికి మేం బయలుదేరే రోజు వచ్చింది. మా ఫ్లైటు ఉదయం తొమ్మిదిన్నరకైనా ఇంటి నుంచి మమ్మల్ని తీసుకెళ్లే షటిల్ టాక్సీ ఆరుగంటలకే బుక్ చేసుకున్నాం కనుక తెల్లారగట్ల లేచి గబగబా రెడీ అయ్యాం. సిరి కూడా ఇంటిలో హడావిడికి అయిదింటికే లేచి కూచుంది. నేను పాపను పట్టుకుంటాను కనుక నాకు బేగ్గుల మోత లేదు. కోమల్ పేద్దోడయ్యాడుగా అన్ని పన్లూ వాడు చక్కగా అందుకున్నాడు. ఇక వరు పదేళ్లకే పెద్ద స్టైలిష్ అమ్మాయి అయిపోయింది. జుట్టు ముఖమ్మీదికి తప్ప వెనక్కి వేసుకోదు. తన బాగులు తను తప్ప ఎవరినీ ముట్టుకోనివ్వదు. ఇక మేమిద్దరం ఈ పిల్లల వైపు చూస్తూ నవ్వుకోవడమే ప్రయాణమంతా. శాన్ ఫ్రాన్ సిస్కో ఎయిర్ పోర్ట్ కి ఏడుగంటలకల్లా చేరుకున్నాం. ఇంటి దగ్గర పాలు తాగండ్రా అంటే అబ్బే తెల్లారి మాకు ఆకల్లేదన్న పిల్లలు ఎయిర్ పోర్టు లో మేం చెకిన్ కాగానే “బాబోయ్ ఆకలని” గోల. చెకింగ్ పాయింట్లో అందరి బాగులూ సేఫ్ గా బయటికొచ్చాక సత్య ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ప్రయాణాల్లో చెకింగ్ లో ప్రశ్నించడం లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తనకి ఇష్టం ఉండవు.

చెకింగ్ పాయింటులో సిరి ని బేబీ కార్టు లో నుంచి తీసి బేబీ కార్టుని చెకింగు మెషీన్ లోంచి పంపే చిన్న గేప్ లో కూడా ఆ పిల్ల పరుగుని ఆపడం మాకు కష్టమైపోయింది. ప్రతీ చోటా ఇదే ప్రాబ్లం. అంతా చెకింగ్ లో బిజీగా ఉండి ఒలిచేసిన కోట్లు, బూట్లు వేసుకునే సమయానికి తుర్రుమని ఈ పిల్ల కనిపించనంత దూరం పరుగు పెట్టేది. ఎవరో ఒకళ్లం ఎప్పుడూ కాపలా కాయాల్సిందే. ఎక్కడ వదిలినా ఇదే పని మాకు. సిరి ఈ ప్రయాణం లో మాకు బాగా పరుగు నేర్పించింది.

ఇక డొమెస్టిక్ ఫ్లైటులో ఫుడ్ కొనుక్కుని తినాల్సి రావడం, కొనుక్కున్నా చల్లని సేండ్విచ్ లు తప్ప ఏమీ లేకపోవడం నచ్చలేదు మాకు. పైగా పొద్దున్న పది గంటలకు ఎక్కితే సాయంత్రం 7 గంటల వరకు ఫ్లైటు లో కూర్చోవడమూ పిల్లలకు విసుగెత్తింది పాపం. అమెరికాకి పశ్చిమ తీరమైన కాలిఫోర్నియాకి, తూర్పు తీరమైన న్యూయార్క్ కి సమయంలో మూడు గంటలు తేడా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు సమయం మా దగ్గర కంటే 3 గంటలు ముందు ఉంది. కాలిఫోర్నియా లో ఈ సరికి మధ్యాహ్నం 4 అయ్యి ఉంటుందని అనుకున్నాం.

అదృష్టం కొద్దీ మేం దిగే వేళ కి తుఫాను తెరిపిన పడింది. క్షేమంగా న్యూజెర్సీ EWR ఎయిర్ పోర్టు లో చీకటి వేళ వర్షంలో మెరుస్తూన్న నగరమ్మీద విహంగంలా గిరికీలు కొడుతూ కిందికి దిగింది విమానం. మేం అక్కడి నుంచి న్యూయార్క్ లో ఉన్న మా హోటల్ కు చేరేందుకు బుక్ చేసుకున్న టాక్సీ సర్వీసు కి దిగిన తర్వాత ఫోను చేసే ఆప్షను పెట్టుకున్నందు వల్ల బాగా లేటయ్యింది. ఎయిర్ పోర్టు బయటకి రాగానే వేళ్లు కొంకర్లు తిరిగే చల్లని చలి చుట్టు ముట్టింది. గ్లోవ్స్ త్వరగా వేసుకున్నాం. కోట్లు, మఫ్లర్లు బిగించాం. అయినా తగ్గదే. ఇక అయిదు నిమిషాలకొకళ్లం డ్యూటీ వేసుకుని సామాన్లు కాపలా కాస్తూ మిగతా అందరం అద్దాల లోపలికి పరుగెత్తాం.

మా టాక్సీవాలా గత 20 సం.లు గా న్యూయార్క్ లోనే ఉన్నాడట. చాలా చలాకీగా బాగా మాట్లాడేడు. ఇంతకీ మా హోటలు న్యూయార్క్ JFK ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 40 మైళ్లు. మేం అక్కడ హోటల్ బుక్ చేసుకోవడానికి కారణం మర్నాడు ఉదయం 6 గంటలకే మేం ఎక్కవలిసిన టూర్ బస్ స్టాపు అక్కడికి దగ్గర్లో ఉంది. పగలంతా చల్లని వర్షంలో తడిసిన నగరం నీటి బిందువులతో మెరుస్తూ ఉంది. రాత్రి పూట చినుకుల కాంతి మేఘాల ఒళ్లు దులుపుకుంటున్నట్లు అప్పుడప్పుడూ చినుకులు పడీ, ఆగుతూ ఉన్నాయి. చెమ్మగా ఉన్నందు వల్లో, చీకటి కాబట్టో కానీ ఏదో టైం మెషీన్ ఎక్కి ప్రాచీన కాలంలోకి వచ్చినట్లనిపించింది. కాలిఫోర్నియా లో ఉన్నలాంటి మెరుపు లేదిక్కడ రోడ్ల మీద. ఏవేవో వంతెనలు దాటి రోడ్లు దాటి కారు నడుపుతూన్న డ్రెవర్ ని పిల్లలు మంచి హుషారుగా ప్రశ్నిస్తున్నారు. నేను దీక్షగా బయటికే చూస్తూ అంతా వింటూ ఉన్నాను. మేం బస తీసుకున్నా హాం టన్ ఇన్ కు మరో గంట లో చేరేం.

రాత్రి భోజనానికి వెతుక్కుని చలిలో ఎక్కడికి వెళతాములే అని హోటల్ కు తెచ్చిచ్చే సర్వీసు లో ఇండియన్ ఫుడ్ ఆర్డరు చేసేం. బిర్యానీ అనబడే పోఫు అన్నం తినలేక తినలేక తిన్నాం. సర్లే మధ్యాహ్నం  ఆ చల్లని బ్రెడ్డు కంటే నయమే అని సరిపెట్టుకున్నాం. ఇక గబ గబా వేడి నీటి స్నానాలు చేసి పక్కలెక్కేసి టీవీ పెట్టేసారు పిల్లలు. ఉదయమే లేవాలని అందర్నీ పడుకోబెట్టే సరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇక మర్నాటి నించి ఉదయమూ సాయంత్రం టైం టేబుల్ ప్రారంభమవుతుంది మాకు. తెల్లారగట్ల లేవడం రాత్రి పెందరాళే పడుకోవడం ఇవేళ్టికే సగం మొదలయ్యింది. కానీ టైమింగు తేడా వల్ల మా కెవరికీ నిద్ర రాలేదు. సిరి అసలే ఫ్లైటు లో మంచి నిద్ర చేసిందేమో పన్నెండున్నర వరకూ అందరి పక్కలూ ఎక్కి దిగుతూ గదిలో తిరుగుతూనే ఉంది. ఇక ఆ పిల్ల పడుకునే వరకూ మాకూ జాగారం. అయినా కొత్త ప్రదేశాలు చూడబోతున్నామన్న ఆనందపు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ గడిపేం.

                                                                                                                       – డా.కె.గీత  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా కళ్ళతో అమెరికాPermalink

Comments are closed.