అమ్మ

unnamed              ‘జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి’ అన్నది ఆర్యోక్తి. ‘మాతృదేవోభవ’ అని అమ్మకి తొలి స్థానాన్నిచ్చాయి మన శాస్త్రాలు.ప్రకృతిని స్త్రీ మూర్తిగా,ఆదిపరాశక్తిని జగన్మాతగా అభివర్ణించాయి. అటువంటి అమ్మను గురించి ఎంత వ్రాసినా,కొంతే అవుతుంది.అమ్మని మరొక బ్రహ్మగా మార్చగలిగేది మాతృత్వం. యీ మాతృ మమత,మాతృ ప్రేమ ఒక్క మానవులలోనే కాదు,పశుపక్ష్యాదులలో కూడా మనకి ద్యోతకమవుతుండడం చూస్తే,ఆ మాతృత్వమనేది ఎంత గొప్పదో అర్ధమవుతుంది.

                 ఉదాహరణకి,ఒక పిల్లి ఒంటరిగా ఉన్నపుడు,తోకాడిస్తూ మనచుట్టూ తిరుగుతుంది. అదే,పిల్లలు పెట్టినపుడు,ఎవరైనా తల్లిదగ్గర వున్న పిల్లల్ని తాకడానికి ప్రయత్నిస్తే,పులిలా మీద పడి రక్కుతుంది.ఇల్లిల్లు తిరిగి తన కూన ఎక్కడ సురక్షితంగా వుంటుందో,ఉండగలదో చూసి అక్కడికి చేరుస్తుంది.ఒక కోడి పెట్టని మనిషి అవలీలగా మెడలువంచి చంపెయ్యగలడు. కాని పిల్లల కోడి తన పిల్లలతో వెళుతుంటే,ఎవరైనా ఒకవ్యక్తి తల్లికోడి ఎదురుగాఒకపిల్లని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తే,తల్లికోడి ఒక్కసారి గాలిలోకి ఎగిరి ఆ వ్యక్తి కళ్ళు పికేయ్యడానికి కూడా వెనుదియ్యని సాహసాన్ని సంతరించుకుంటుంది. అదే మాతృ శక్తిలోని గొప్పతనం.
            పిల్లలకి తల్లిలేక పోతే,అయ్యో!తల్లిలేని బిడ్డలు,అని సానుభూతి చూపిస్తుంది లోకం,వారెలా ప్రవర్తించినా,తల్లి ఆలనా.పాలన లేకుండా పెరిగారు కనుక అలా వున్నారు అని సరిపెట్టుకుంటారు జనం.కాని,తండ్రి లేకపోతే అంత సానుభూతి చూపించరు,పైగా ఎన్నిఅవస్థలు పడి, అష్ట కష్టాలకు ఓర్చి తల్లీ తన బిడ్డల్ని పెంచినా,వారిలో ఏవయినా లోటుపాట్లుంటే ‘’ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది’’ అని ఎద్దేవా చేస్తారు.ఆ తప్పు అనేవారిది కాదు,వినే వారిది.ఎందుకంటే,మాతృస్థానం అంత గొప్పది కనుక.
                సమాజంలోఅగ్నిసాక్షిగా ఆడదాని మెడలో మూడు ముళ్ళు వేసిన భర్త వలన ఒక స్త్రి మాతృమూర్తి కాబోతోందంటే,ఎన్నో వేడుకలు,విందులు,వినోదాలు. వాంచితంగానో,అవాంచితం గానో ఒక స్త్రి మూడుముళ్ళ బంధం లేకుండా తల్లి అయితే ఆమెకి అభిశాపాలు,అవమానాలు.పెళ్లి అనేది ఒక వ్యవస్థ.మాతృత్వం అనేది ప్రాకృతికం,అది స్త్రీకి దైవమిచ్చిన వరం. కొన్ని సందర్భాలలో,స్త్రి క్షణికావేశానికి లోనైనా, కామాంధుల దౌష్ట్యంకి బలైనా,మౌనంగా శిక్ష అనుభవించేది స్త్రీయే. తప్పుచేసినది ఒకరైతే,తప్పుడు మనిషిగా సమాజంలో వేలెత్తి చూపబడుతున్నది ఒకరు. తప్పుచేసిన వారెవరైనా,ఆ తప్పుకి ప్రతిఫలంగా తనలో రుపుదిద్దుకొనే విషభీజాన్ని ‘శంకరాభరణం’గా రూపుదిద్ద గల విజ్ఞత తల్లికి వుంటుంది. కనుక మాతృత్వాన్ని వేలెత్తి చూపించడం,తల్లి కాబోయే స్త్రీని,ఆమె ఎవరైనా సరే,కించ పరుస్తూ మాట్లాడడం,అవమానించడం చెయ్యకుండా,ఆమెకి సహకరించాలి,సానుభూతి చూపించాలి. ‘మాతృదేవోభవ’ అన్న పదం ఆమెకి కూడా వర్తిస్తుందని గుర్తించాలి.
                           తల్లి కడుపులో రూపుదిద్దుకుంటున్నపుడే శబ్ద రస గ్రంధుల ద్వారా తల్లి చలనాలను గ్రహిస్తూ,ఆమె అలవాట్లను,ఆహారాన్ని తనలో జీర్ణింపజేసుకుంటుంది శిశువు.ఈ భూమిపై పడిన వెంటనే శిశువు తొలిసారి గ్రహించేది మాతృ స్పర్శ,అర్ధం చేసుకొనేది ‘అమ్మ’భాష. నిజానికి విద్యాభ్యాసం అనేదానికి పునాది,బిడ్డ తల్లి గర్భస్థ శిశువుగా వున్నపుడే పడాలి అంటారు శ్రీ అరవిందులు.దానివలన ప్రపంచంలో ఉత్పన్నం అవుతున్న సమస్యలకు పరిష్కారమార్గం లభిస్తుందంటారు వారు. దానినే pre-Natal Education అంటారు.ఒక స్త్రీ గర్భవతిగా వున్నపుడు ఉల్లాసంగా ఉండాలని , మంచి పుస్తకాలు చదవాలని,మంచి చిత్రాలు చూడాలని,మంచి వాతావరణంలో మసలాలని చెప్తుంటారు మన పెద్దలు.పెద్దవారు కూడా యీ విషయాన్ని గుర్తుంచుకొని,గర్భిణి స్త్రీలకు ఆ రకమైన వాతావరణాన్ని నెలకొల్పగలగాలి.ఎందుకంటే తల్లి ప్రభావం, పరిసరాల ప్రభావం తల్లి గర్భస్థ శిశువుపై ఎక్కువగా పడుతుంది.మంచి భావాలతో,మంచి సంస్కారంతో బిడ్డలు యీ భూమిపై జన్మించినపుడు,వారు పెరిగి పెద్దవారయ్యాక,ఏ చెడ్డ వాతావరణం కూడా వ్యక్తిలోని ‘జన్మ’సంస్కారాన్ని కదల్చలేదు.
                    
                  నేటి ఆధునిక యుగంలో యంత్రాల మధ్య మరమనుషులుగా మారిపోతున్న నేటి నవనాగరిక సమాజం  అస్తవ్యస్తంగా తయారయింది.సంస్కారం,సంస్కృతి అనేవి నామరూపాలు లేకుండా నశిస్తున్నాయి.ఒకప్పుడు ప్రతి విషయాన్ని మన దేశంలో ఆధ్యాత్మికతతో ముడి పెట్టేవారు.పాపం.పుణ్యం అనే విభజన ద్వారా ఏది మంచి ,ఏది చెడు భోదించేవారు.ఆ నాటి ఆ ఆధ్యాత్మిక సత్యాలు ఆచారాలుగా,కాల క్రమంలో దురాచారాలుగా మారి పోవడంతో జనం వాటిపట్ల విముఖత చూపించడం మొదలెట్టారు. ఆధునిక విజ్ఞానం కళ్ళు తెరువని రోజుల్లో,మన ఆధ్యాత్మికతే ఒక మహోన్నత విజ్ఞాన శాస్త్రంగా పరిడవిల్లేది. నిజానికి ఆధ్యాత్మికం ,విజ్ఞానం ఒకే నాణానికి బొమ్మ,బొరుసు లాటివి. విద్యతోపాటు మనోవికాసం మనుషుల్లో కలుగుతోంది,తద్వారా ఆధునిక విజ్ఞానానికి బానిసలవుతున్నారు,కాని మన భారతీయసంస్కృతి, సాంప్రదాయాలలో వున్న విశిష్టతని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
                 అమ్మ లాలిపాట,అమ్మ జోలపాట ,అమ్మ గోరుముద్ద, అమ్మ పెట్టిన వెన్నముద్ద,ఇవన్ని బిడ్డ అడ్డాలలో వున్నపుడే.ఈ ఆధునిక యుగంలో,విదేశీ వ్యామోహంలో కొట్టుకు పోతున్న వారికి ఎన్నాళ్ళని గుర్తుంటుంది! ఏది గుర్తుంటుంది? పిజ్జా,బర్గర్లు,హాట్ బ్రెడ్స్,సిరియల్స్ (తినేవి)వీటి మోజులో పడినవారికి,మన దేశీయత,సంస్కృతి మీద గౌరవం,విలువ ఎక్కడున్నాయి ?.
ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఈ పీఠమెక్కినా,ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని ,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.
ఈ వాక్యాలు ఎందరికి తెలుసు!ఎందరు విన్నారు ! విన్నా ఎందరు పాటిస్తున్నారు,కనీసం మనదేశం లోనైనా !ఆ తప్పు ఎవరిది అంటే,ఆవు చేనుమేస్తే ,దూడ గట్టున మేస్తుందా! అని అది తప్పకుండా బిడ్డని తీర్చిదిద్దవలసిన తల్లిదేనని ఘంటాపథంగా చెప్పకతప్పదు.
‘’అమ్మా!నువ్వెంత గొప్పదానివి. అమ్మా!నీ ఋణం నేనెలా తీర్చుకోవాలి.( ఒకవేళ తల్లి చచ్చుంటే) అమ్మా!నా కోసం మళ్ళీ బ్రతికి రా. ఈ సారి బాగా చూసుకుంటాను. అమ్మా! నన్ను నువ్వు నవమాసాలు మోసావు,కన్నావు,పెంచావు.అమ్మా! నువ్వుతినకుండా నాకు పెట్టావు.’’ అంటూ ఆమె తనకి చేసినవి తాను మరచిపోయినా,ఆమెకి గుర్తు చేస్తున్నట్టు వ్రాసే కవితల్లో,కథల్లో శుష్కప్రియాలు వల్లిస్తూ (మొసలి) కన్నీరు కారుస్తూ,కార్పించడం కన్నా,అమ్మ అంటే ఏమిటి ?మాతృ మమత అంటే ఎలాటిది! మాతృ శక్తిలోనున్న గొప్పతనమేమిటి ? అసలు మాతృత్వం అంటే ఏమిటి?అన్న సత్యాన్ని తల్లి కాబోయే ప్రతి స్త్రీ ,ప్రతితల్లి తెలుసుకోగలిగేలా చెయ్యాలి.చీకటి సమాజంతో పోరాడి, ‘సత్య’ప్రకాశాన్ని విడిపించగలశక్తి కత్తికి లేదు,కలానికుంది.
అవసరానికి మించిన ఖర్చులు,ఆడంబరాలకు పోతూ,భర్త తెచ్చిన డబ్బును ఎడాపెడా షాపింగులకి ఎగరగొట్టేది కొందరైతే,భర్త తెచ్చే జీతం తమ ఆడంబరాలకు సరిపోదని,పిల్లల్ని ‘డే కేర్’ లో పడేసి ఉద్యోగాలు వెలగ బెట్టేవారు కొందరు. ఒకప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ అన్నట్టుగా, భర్త బయట సంపాదించి తెస్తే,వచ్చిన దాంతో గుట్టుగా సంసారాన్ని నడిపించగల సహనం,సమర్ధత స్త్రీలో వుండేవి.అప్పుడు ఇల్లే కోవెల,తన కుటుంబమే చిన్న ప్రపంచం. ఒకరికోసం ఒకరు ,ఒకరితో ఒకరుగా వుండేవారు.మరి నేడో! ప్రతిఒక్కరు తమ కోసం కాకుండా,ఇతరులకోసం బ్రతకడం అలవాటు చేసుకున్నారు,అలా అని పరోపకారాయణత అనుకుంటే పొరపాటే.నా రూపురేఖలు,చీరెలు,నగలు,నా గొప్పదనం,నా ఆడంబరం చూసి ఇతరులు మెచ్చుకోవాలి ,అంతే కాదు,అసూయ పడాలి….ఇది నేటి మన స్త్రీల మనస్తత్వం.ఇలాటి మనోభావాలు గల స్త్రీలు,ఇదే భావాలను తమ గర్భస్థ శిశువులకు తమ ప్రకంపనల ద్వారా అందజేస్తూ,వారు పుట్టాకకూడా ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్నారు.
వెనుకటి రోజుల్లో తల్లి బిడ్డకి స్నానం చేయించి,సాంబ్రాణి ధూపమేసి,గుడ్డ ఉయ్యాలలో పరుండబెట్టి,కమ్మని జోల పాట పాడితే బిడ్డ ఆదమరచి గంటలు,గంటలు నిద్ర పోయేది. మరి నేడో! స్నానం చేసిన బిడ్డని తొట్టెలో వేసి,చెవులకి ‘ఇయర్ ఫోన్స్’తగిలించి,ఐపాడ్ లో మ్యూజిక్ సన్నగా ఆన్ చేసి,నిద్రపుచ్చామని మురిసిపోతుంటారు.వారి గొప్పతనం చూసి ఇతరులు ఈర్ష్య చెందినా, ఐపాడ్ విద్యుత్ తరంగాలు చిన్నారి మెదడులో చేరి,వారికేలాటి హాని కలిగిస్తోందో ఆలోచించడం లేదు. ఆ బిడ్డలు పెరిగి పెద్ద వారైనా తరువాత,మెదడు సరిగ్గా ఎదక్క మొద్దుబారిపోతే ‘’ఆటిజం’ అనే పేరు తగిలిస్తుంటారు.ఇటువంటి ప్రక్రియలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి.’పులిని చూసి నక్కవాత’పెట్టుకున్నట్టు వారిని మనవారు అనుకరిస్తున్నారు. ఐఫోన్లు,ఐపాడ్లు, ఇయర్ ఫోన్స్,వీటినుండి ప్రసారమయ్యే విద్యత్ తరంగాలు పసివారి లేలేత నరాల్ని కాల్చివేస్తున్నాయన్న సంగతి వారు గ్రహించక పోవడం విచారకరం.
బిడ్డకి కావలసినది తల్లి ప్రేమ,లాలన .మమత. తల్లి ప్రేమగా ఎత్తుకొని గోరుముద్దలందిస్తుంటే ఆ రోజుల్లో బిడ్డలు ఎంత ఆరోగ్యంగా ఎదిగేవారు !! అలా ఎత్తుకొనే ఆసక్తి,ఓపిక,సమయం నేటి ఆధునిక మహిళకు లేవు.తనని చికాకు పరచకుండా వుంటే చాలని,బిడ్డకి యీ ఉపకరణాలన్నీ అలవాటు చేస్తుంది.కాని తల్లి తాత్కాలిక ఉపశమనం కోసం బిడ్డ బంగారు భవిష్యత్తు ఏమవుతుందోననే ఆలోచన లేకపోవడం శోచనీయం.వారి అంతరాంతరాల్లో అమ్మ తనకి కావలసిన ప్రేమ అందించలేదనే అసంతృప్తి,వారు పెరిగి పెద్దయ్యాక అమానుషంగా రూపుదిద్దుకుంటోంది.కొద్ది రోజుల క్రితం అమెరికాలో జరిగిన ఒక సంఘటన జగద్విదితం. ఇరవై సంవత్సరాల కుర్రవాడు తన తల్లితో సహా ,స్కూల్ లో వున్న స్టూడెంట్స్ నీ, టీచర్స్ ని,మొత్తం ఇరవై ఎనిమిది మందిని అకారణంగా ఒకేసారి పిస్టల్ తో కాల్చిచంపాడు.తనని తాను కాల్చుకు చచ్చాడు. ఆ అబ్బాయి కాల్చిచంపిన వారిలో,ఇద్దరు తప్ప,మిగిలిన అందరూ మహిళలు,బాలికలే.మన దేశంలో కూడా జరుగుతున్నది అదే. తుపాకీలు మనకి వుండవు కనుక,స్త్రీల పట్ల అత్యాచారాలకు దిగుతున్నారు. ఇది కామం కాదు, ఒక రకమైన మనో వైకల్యం. మనసు పొరల్లో పేరుకు పోయిన ఏదో అసంతృప్తి. అది పొగొట్టగలిగేది తల్లి ప్రేమ,తల్లి లాలన.అందుకే అమ్మ బిడ్డల పట్ల అలక్ష్యం వహించకూడదు.
‘అడుసు తొక్కనేల,కాలు కడుగనేల’ అని మొదట్లోనే మన పాత సాంప్రదాయాలను,సంస్కృతులను తూలనాడకుండా,పెద్దల మాట గౌరవిస్తే యీ అగచాట్లుండవు. కనుక అమ్మ కావాలనుకున్న ప్రతి యువతీ ముందు ఒక గొప్ప ‘సత్య చైతన్యం’తో బిడ్డని యీ లోకం లోకి ఎలా తీసుకు రావాలి అనే సత్యాన్ని గ్రహించాలి. దానికి పెద్దలు సహకరించాలి,పెద్దల మాటల్ని పిన్నలు గౌరవించాలి. నా బిడ్డకి నేను ఎంత బంగారం,వెండి ,డబ్బు కూడబెట్టి ఇవ్వగలను ? అని ఆలోచించకుండా,నా బిడ్డని ఎంత మహోన్నత సంస్కారవంతంగా తీర్చిదిద్దగలను! మానసికంగా,శారీరకంగా ఎంత ఆరోగ్యకరమైన బిడ్డను ఈ భూమిమీదకు తీసుకు రాగలను.! అలాటి నా బిడ్డ ద్వారా నా కుటుంబం,నా వంశం,నా దేశ ప్రతిష్టని నేనెంత వరకు పటిష్టంగా నిలుపగలను..?అని ఆలోచించాలి. మహిళా సంఘాలు,సమాజాలు ఆ దెసగా స్త్రీలను ప్రభావితం చెయ్యడానికి వీధివీధినా, పల్లె పల్లెనా తగిన ప్రచారాలను ప్రభోదాత్మకంగా అందించాలి.
‘దేశమంటే మట్టి కాదోయ్,దేశమంటే మనుషులోయ్ ‘
అన్నట్టుగా ముందు మనుషులు మారాలి,మనస్తత్వాలు మారాలి,ముఖ్యంగా స్త్రీలు మారాలి.
అమ్మ కావాలనుకొనే వారికీ, అమ్మలకి,అమ్మలగన్న అమ్మలకి చెప్పేదొక్కటే, యీ ప్రపంచంలో సుస్థిర శాంతిసౌహర్ద్రతలు వెల్లివిరియాలంటే,స్త్రీల పట్ల రోజురోజుకి పెరిగి పోతున్న అత్యాచారాలు,అన్యాయాలు, దురాగతాలు, సమసి పోవాలంటే, ప్రతి స్త్రీ తానొక అబల కాదని ఆదిశక్తి అంశం అని గ్రహించాలి. సరైన చేతనతో బిడ్డని యీ భూమి మీదకు తీసుకు రావాలి.చక్కని క్రమ శిక్షణతో బిడ్డల్ని పెంచాలి.మలగి పోతున్న మన సంస్కార కాంతుల్ని ప్రజ్వరిల్లజేయాలి.మన భారతీయ మహోన్నత పురాతన సంస్కృతిని పునరుద్ధరించి,ప్రతి భారత నారి ఒక ‘భరత’ మాతగా రుపుదిద్దుకోవాలి. అదే నిజమైన ‘అమ్మ’ తనం,ఆడతనం.
సర్వేజనః సుఖినో భవంతు

– ఉమాదేవి అద్దేపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

One Response to అమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో