యువర్ నేమ్ ఈజ్ జస్టిన్

                                                   Your Name is Justine

Director : Franco da Pena

Country : Luxembourg

Duration : 97 minutes

Language : German, Polish & English languages.

siva lakshmi

siva lakshmi

యువర్ నేం ఈజ్ జస్టిన్: “మారియోలా” అనే ఒక యువతిని బెర్లిన్ లో బలవంతంగా పరమ దాష్టీకంగా వ్యభిచార వృత్తిలోకి దింపడం ఈ సినిమా ఇతివృత్తం. ఎంత గింజుకుని తప్పించుకుని పారిపోవాలని చూసినా ఆమె ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ పురుష ప్రపంచం ఆమెను అమానుషంగా,పరమ కిరాతకంగా లైంగిక దోపిడీకి గురి చేసిన విధానం చుట్టూ కథనం అల్లబడీందీ సినిమాలో.

మారియోలా ఒక అందమైన యువతి .పోలాండ్ లోని లక్సెంబర్గ్ లో అల్లారు ముద్దుగా చూసుకునే తన అమ్మమ్మతో భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ హాయిగా జీవించే యువతి. తన అమ్మమ్మలా పాతతరం మనుషుల్లాగా సాదా సీదాగా సాఫీ జీవితం కాకుండా జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా , భిన్నంగా, ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కోటి కోరికలతో తపన పడుతూ ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించబోతున్న  ప్రత్యేకమైనదానిలా కనిపిస్తుంది మారియోలా.బలిష్ట మైన శరీర సౌష్టవంతో, అంతే దృఢమైన వ్యక్తిత్వంతో స్థిరమైన అభిప్రాయాలున్నదానిలా  ఉంటుంది .

ఆమెకు  “ఆర్ధర్” అనే  అందమైన ప్రియుడుంటాడు.. ఆర్ధర్  ఒక సెలవు దినాన్ని  యూరప్  వెళ్ళి సముద్రతీరంలో సృజనాత్మకంగా,అద్భుతంగా గడుపుదామని నచ్చజెప్పి మారియోలాను ఒప్పిస్తాడు. ఆర్థర్ ఆమె మాజీ ప్రియుడు కాబట్టి యూరప్ చుట్టూ విహార యాత్ర అనగానే మురిసిపోతుంది మారియోలా. ఖర్చులకోసం అక్కడక్కడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంతోషంగా గడుపుదామంటాడు. ఆమెను తిరిగి పొందడానికి, ప్రేమగా మాట్లాడుతూ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి అతని తండ్రి మారియోలాను చూడాలనుకుంటున్నాడని  జర్మనీకి వెళదామంటాడు. అమాయకంగా, గుడ్డిగా నమ్ముతుంది మారియోలా. అమ్మమ్మకి స్నేహితుల సమూహంతో వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఆర్ధర్ వెంట బయలుదేరుతుంది మారియోలా. అక్కడికీ అమ్మమ్మ అడుగుతుంది కూడా ఆర్ధర్ మీతో వస్తున్నాడా అని. వస్తున్నాడని చెప్తుంది.అప్పుడు వాళ్ళ అమ్మమ్మ మారియోలా తల్లి ఎఫ్ఫుడూ “గ్రామాల్లో ఉండే అనాగరిక,అమాయకపు మనుషులు విశ్వసనీయమైనవారని “అంటూ ఉండేదని గుర్తు చేస్తుంది.అది విన్న మారియోలా వెళ్ళేటప్పుడు స్నేహబృందం లాంటిదేదీ లేదనీ,తానొక్కతే ఆర్ధర్ తో వెళ్తున్నాననీ తెలియజేస్తూ రాసిన ఒక ఉత్తరాన్ని అమ్మమ్మకు వదిలి వెళ్తుంది.మారియోలాకి స్నేహితుడి మీద కించిత్తు అనుమానం కూడా రాదు మనసులో. ఎందుకంటే జర్మనీ లోని  కొలోన్ లో ఉన్న  ఆర్థర్  వాళ్ళ  కుటుంబాన్ని  సందర్శించడానికి  పోలాండ్ నుండి ప్రయాణం చేయబోతున్నామని చెబుతాడు. ట్రిప్ ప్రారంభానికి ముందు, అతను ఆమె నివసించే ప్రాంతానికి వచ్చి ఆమెవి రకరకాలభంగిమల్లో నవ్విస్తూ కొన్ని ఫొటోలు, ఆమె అమ్మమ్మ తో  సహా . కొన్ని ఫొటోలు తీస్తాడు. నాన్న తమ పెళ్ళికి తొందర పడుతున్నాడనీ,ఆయనకి మారియోలాను చూపించడానికి  జర్మనీకి తీసికెళ్తున్నానని కూడా చెబుతాడు.తాను జర్మనీలో కాబోయే మామగారిని చూడబోతున్నానననుకుని దారిలో చాలా ఉద్విగ్నంగా కొన్ని  జర్మన్  పదాలు కూడా నేర్చుకుంటుంది. జర్మనీ దాటగానే బెర్లిన్ లో ఒక అపార్ట్ మెంట్ కి తీసికెళ్తాడు ఆర్ధర్.ఆఇంట్లో చంటిపాపతో ఉన్న ఒక మహిళ తనవంక వింతగా చూడడం,ఆ ఇంటి వాతావరణం అసాధారణంగా, తేడాగా ఉండడంతో ఆర్ధర్ తో “ వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం,వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం” అని అంటుంది మారియోలా. “ఒక్క రాత్రికే .సర్దుకుందాం” అని అంటాడు ఆర్ధర్.

11ఇంతలో ముగ్గురు  రాక్షసుల్లాంటి మృగాళ్ళు వస్తారు. అతి కౄరంగా ఉన్న ఒకడు సరాసరి మారియోలా దగ్గరకొచ్చి దౌర్జన్యంగా మీద చెయ్యేస్తాడు. “ఈ రోజునుంచి నీ పేరు జస్టిన్ “అని అంటాడు. తీవ్రంగా ప్రతిఘటించి గొప్ప నమ్మకంతో “ఇతను మీదకొస్తున్నాడం”టూ ప్రియుడికి అమాయకంగా ఫిర్యాదు చెయ్యబోతుంది మారియోలా. అందులో ఒకడి దగ్గరనుంచి ఆర్ధర్ నోట్ల కట్టలు అందుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు ఆర్ధర్ .” నీ ప్రియుడు నిన్ను మాకు అమ్మేశాడు ” అంటాడు చెరబట్టినవాడు.

దురదృష్టవశాత్తూ ఆమె ప్రియుడు పైకి కనిపించినంత మంచివాడు కాదు.లోపల పైశాచిక ప్రవృత్తి గల అతి కౄరుడు. మారియోలాను పాస్ పోర్ట్ తో సహా ఒక వేశ్యవలె అమ్మేసి మరుక్షణంలో మాయమవుతాడు. లక్సెంబర్గ్ సరిహద్దు దాటి జర్మనీలోకి ప్రవేశించి బెర్లిన్ లోని ఒక ఇంటికి తీసికెళ్ళే వరకూ ఆనందంగా ఉంటుంది మారియోలా. అంతే! ఆమె జీవితంలో సంతోషపు ఘడియలంతరించిపోతాయి!! మరుక్షణంలో జీవితం ఊహించని విధంగా భయనకంగా మారిపోతుంది!

ఇక మారియోలా అమాయక మైన గత జీవితం ముగిసిపోయింది గనుక మనం కూడా జస్టిన్ అనుకుందాం.

ఇక జస్టిన్ జీవితంలో చూడలేని,భరింపరాని లైంగిక హింస మొదలవుతుంది. చెరబట్టిన ముగ్గురిలో ఇద్దరు జస్టిన్ ని చెప్పనలవి కానన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆమె వారించినకొద్దీ విపరీతంగా కొట్టి కొట్టి రక్తాలు కారేలా చేస్తారు. వారిలో ఇద్దరు ఒకడి తర్వాత ఒకడు పశువులకంటే హీనంగా,నీచాతి నీచంగా ప్రవర్తిస్తారు. జస్టిన్ కూడా చాలా బలంగా మంచి శరీర దారుఢ్యంతో  ఉండి తనకున్న శక్తినంతా ఉపయోగించి ధీటుగా ఎదిరిస్తూనే ఉంటుంది. ప్రచండంగా,భీకరమైన పోరులో శక్తి కొద్దీ శత్రువుతో పోరాడినట్లు ప్రతిఘటిస్తూనే ఉంటుంది.కానీ ఆమె శక్తి చాలదు.పెనుగులాడీ,పెనుగులాడీ నిర్జీవంగా మిగిలిపోతుంది ప్రతిసారీ. వారి రాక్షసత్వం ముందు ఆమె నిస్త్రాణంగా నిస్తేజంగా మిగిలిపోతూ ఉంటుంది. చివరికి ఆమె కొట్టొద్దని దీనంగా వేడుకునే పరిస్థితికి వస్తుంది. ఒకసారి కాదు,అనేకసార్లు ఆమె మీద బలప్రయోగం చేస్తారు. వస్తూ,పోతూ తాళాలు వేసి బంధిస్తూ ఉంటారు.ఆ ఇల్లొక భూతాల కొంప లాగా,పాడుపడిన  కొంపలా పరమ మురిగ్గా ఉంటుంది. ఎవరూ ఉండరు. తాగుదామంటే పంప్ లో నీళ్ళు రావు.ఫ్రిజ్ తెరిస్తే తినడానికేమీ ఉండవు. అమ్మమ్మను తల్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది.  ఆకలితో అలమటించిపోతూ,ధ్వంసమైపోతున్న తన జీవితాన్ని తలచుకుని భయంకరమైన మానసిక సంఘర్షణకు గురౌతుంది. ఇంట్లో దయ్యం  పట్టిన దానిలా తిరుగుతూ తిండికోసం వెతుక్కుంటూ,అందంగా ఉన్న తన జుట్టును ఒక కత్తిని దొరికబుచ్చుకుని బర బరా కోసేసుకుంటుంది.బట్టలు ఎక్కడివక్కడ చింపేసుకుంటుంది.అపార్ట్ మెంట్ కిటికీ తలుపుల్ని తన బలాన్నంతా ఉపయోగించి ఊడదీసి బయటికొచ్చి  రక్షించమంటూ వెర్రి కేకలు పెడుతుంది.ఎవరికీ వినిపించని ఆమె కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. ఆ రాక్షసులు సుడి గాలిలా వస్తూనే ఉంటారు.భీభత్సం సృష్టిస్తూనే ఉంటారు.  

 

వారిలో మూడోవాడు  మాత్రం నేను నిన్నేమీ చేయను,నమ్మమంటాడు. లైంగికంగా ఏ విధంగానూ వేధించడు. ఆమెను చూసి జాలి పడినట్లే,కనికరించినట్లే చేస్తాడు . ఒకరోజు తినడానికి కాస్త తిండీ, తాగడానికి డ్రింకూ తెచ్చిస్తాడు.

అప్పుడప్పుడూ వచ్చి కాస్త తిండి, అవసరమైన చిన్న చిన్న వస్తువులు  తెచ్చి పెడుతూ దయగా ఉంటాడు.నేను చెప్పినట్లు వింటే నీకిక్కడనుంచి విముక్తి కలిగిస్తానని నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె వినక చేసేది కూడా ఏమీ లేదు. అతడికి  వేరే ప్రణాళిక లుంటాయి.  ఆమెను బయటికి తెచ్చి ఒక హోటెల్ లో కాల్ గర్ల్ గా నియమిస్తాడు. ఆ హోటెల్ రూం రష్ ని కాలింగ్ బెల్ మోగడం- వాడొక పక్కన నిలబడి డబ్బు వసూలు చేసుకోవడం ద్వారా సూచిస్తాడు డైరెక్ట్రర్ ఫ్రాంకో.విటులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని “నేను మోసపోయాను.నన్ను మా అమ్మమ్మ దగ్గరికి చేర్చి సహాయం చెయ్యమ”ని వేడుకుంటుంది. ప్రతి అడుగు లోనూ పదునైన బాకులు పొంచి చూస్తున్నట్లు,పగబట్టినట్లున్న ఆమె జీవితంలో అంతటి అదృష్టమేది?  

ఇంతలో ఒకరోజు ఎక్కడినుంచో ప్రియుడి రూపంలో ఉన్న కిరాతకుడు ఆర్ధర్  ఊడిపడతాడు.”నీకొక చెడు వార్త “అంటూ అమ్మమ్మమరణం గురించి చెప్తాడు. అప్పటివరకూ అంతటి దుఃఖంలోనూ “అమ్మమ్మా! నీ రాజకుమారి కఠినమైన జైల్లో ఉంది.ఎవరూ చొరబడలేని కోట బురుజులున్న రాజ భవనంలో బంధింపబడి ఉంది.స్వేచ్చగా ఎగిరే పక్షుల్ని చూడాలనుకుంటుంది”అని అనుకుంటూ అమ్మమ్మని తల్చుకుని ఊహల్లోనైనా సేదదీరే జస్టిన్ కి ఆ ఆశ కూడా లేకుండా పోయింది.పట్టరాని కసితో ఆర్ధర్ ని చంపేస్తుంది.జైలుకి వెళ్తుంది.

మూడేళ్ళ జైలు శిక్ష ముగిశాక కూడా మన మారియోలా  గొప్ప ఆశా జీవిగా కనపడుతుంది.తన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలనుకుంటుంది.కానీ తన చుట్టూ ఉన్నబయటి ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది.తనకి అమ్మమ్మ లేదు.ఎవరూ లేరు. ఉన్న ఇద్దరు దోస్తులు గుర్తొస్తారు గానీ తాను జీవితం నుంచి ఎంత దూరం జరిగిందో గుర్తొస్తుంది.అసలు న్యాయం ఎక్కడుంది? ప్రేమకు అర్ధమేమిటి? స్వేచ్చ అందని వస్తువేనా? అనడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుల హృదయాలు భారమవుతాయి.

లక్సెంబర్గ్ దాని చరిత్రలో మొదటిసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో   జనవరి 1 – 2013  నుండి  డిసెంబర్ 31-2014 వరకు తాత్కాలిక సీటు  సంపాదించింది. ఒక లౌకిక రాష్ట్రంగా చెలామణీ అవుతున్నప్పటికీ  లక్సెంబర్గ్ లో ప్రధానంగా రోమన్ కాథలిక్ సాంప్రదాయం ఉంది. అన్ని మతాలూ,అన్ని సాంప్రదాయాలూ స్త్రీల పట్ల అన్యాయంగానే వ్యవహరిస్తున్నాయి.

కొన్నిసార్లు సినిమా పేరుని బట్టి సినిమా గురించి కొంచెం ఊహించవచ్చు. కానీ ఈ శీర్షికకూ సినిమాకూ ఏమీ సంబంధం లేదు. మారియోలాను చెరబట్టిన రౌడీ మూకలోని ఒకడు నీ పేరు జస్టిన్ అనడం అదే సినిమా పేరు కావడం ప్రత్యేకంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంది.

నటి అన్నా సీజ్లైక్ మేకప్ అమోఘంగా ఉంది.మొదటి సీన్లలో ఆమె స్నేహితుల మధ్య మనోహరమైన అందంతో మెరిసిపోతుంది. మొదట ఆమె మానభంగానికి గురైనప్పుడు ఎదురు తిరిగీ పోరాడటానికి ప్రయత్నించే  ఉగ్ర శక్తిలా కనిపించింది. అమ్మమ్మను గుర్తు తెచ్చుకుని నిరాశలో మునిగిపోతుంది. దౌర్జన్యానికి బలైనప్పుడు మానసిక కల్లోలంతో అలిసిపోయినట్లు, దిగులు మనిషిని కుంగదీస్తున్నట్లు, జీవితం మీద విరక్తి చెందినట్లుంటుంది. మూడేళ్ళ జైలు శిక్ష తర్వాత మళ్ళీ  అలిసిపోయినట్లు కనిపిస్తుంది.కానీ ఇంతకుముందులా విరక్తితో కూడిన అలుపు కాదు.”జీవితం తనతో ఇంత నిర్దయగా ఎందుకు ఆడుకుంటుంది?” అనే తెలివిడితో కనిపిస్తుంది.కానీ ఈ జస్టిన్ కీ మనం మొదట చూసిన మారియోలాకీ స్పష్టమైన తేడా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. నిప్పు మీద నడక లాంటి ఆమె జీవితాన్ని,కఠిన పరిక్షలను ఆమె ఎదుర్కొన్న దారుణమైన ప్రయాణాన్ని మేకప్ ద్వారా వ్యక్తం చేసిన  పనితీరు అద్భుతం!

 

కొన్ని విషయాలు చెప్పడానికి భాష లేదంటారు శరత్. నిజంగా జస్టిన్  ఎదుర్కొన్న దాష్టీకాన్నీ,దౌర్జన్యాన్నీ వర్ణించడానికి నాకు తెలిసిన భాష సరిపోదు. దొంగలు ఇంటిని పూర్తిగా చిల్లిగవ్వ మిగలకుండా దోచుకున్నట్లు  ఆడవాళ్ళ శరీరాల్ని లూటీ చేసే  ఇంత హింసాత్మకమైన చిత్రాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదు. విదేశాల్లో ఈ సినిమా హింసాత్మకంగా ఉంటుందని ముందునుంచే ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేశారట! నేనైతే భరించలేకపోయాను. ఎయిడ్స్ గురించి చదివినప్పుడు కూడా ఇలాగే వారం రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను. లైంగిక బానిసత్వం గురించి, ఎయిడ్స్ కి గురవుతున్న స్త్రీల గురించి పుస్తకాల్లో చదివితేనే కడుపులో కెలికినట్లు  వికారం మొదలై మనసంతా వికలమవుతుంది. ఇక దాన్ని దృశ్యరూపంలో చూడడమంటే ఎంత భయోత్పాతానికి గురి చేస్తుందో చెప్పాలంటే  భాష పేలవమై తేలిపోతుంది!

సినిమా ఒక దృశ్య కథా కళ. “All is well with the World “అనుకునే వాళ్ళందరూ ఈ సినిమా చూసి తీరాలి!

ఇది అన్ని కాలాలకూ వర్తించే మానవజాతి సిగ్గుపడవలసిన మర్చిపోలేని సినిమా!!

ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిని  కలకాలం కలతపెట్టే అంశం, ఇప్పటి వరకూ మానవజాతి సాధించిన నాగరికతకు మచ్చ తెచ్చే లైంగిక బానిసత్వాన్ని ఇతివృత్తంగా తీసుకుని దిగ్భ్రాంతి కలిగేలా చిత్రాన్ని మలచిన డైరెక్టర్ ఫ్రాంకోకి స్త్రీజాతి తరఫున ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది. అంతే ధీటుగా ఇంత క్లిష్టమైన, కష్టంతో కూడుకున్న పాత్రను పోషించిన అన్నా సీజ్లైక్ సామర్ధ్యం మీద అంతులేని గౌరవం కలిగింది. అన్నా సీజ్లైక్ నటన అనితరసాధ్యం .

మనసుని మెలిపెట్టే బాధతో, గుండెలవిసిపోయేలా గింజుకుని, ఊపిరాడక అల్లాడిపోతాం.ఈ జస్టిన్ పాత్రను ప్రపంచీకరణ నేపధ్యంలో దేశ దేశాల్లోని మహిళలు నిస్సహాయమైన పరిస్థితుల్లో లైంగిక దోపిడీ కి బలవుతున్న మహిళలకు ప్రతీకగా చూడాలి. 

విషవాయువులా వ్యాపించిన ఇలాంటి దుష్ట సంసృతి వల్లే సౌత్ ఆఫ్రికాలో 28000 మిలియన్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా  కొన్ని లక్షల మిలియన్ ప్రజలు భయానక ఎయిడ్స్ బారిన పడ్డారు ,పడుతున్నారు . ప్రభుత్వాలు దిక్కు తోచక భీతిల్లిపోతున్నాయి! తోటి మనుషుల పట్ల,ముఖ్యంగా మహిళలపట్ల సహానుభూతి లేని వ్యవస్థల దాష్టీకం వల్ల జరుగుతున్న ఘోరాలివి !! మనుషులందరికీ “FELLOW FEELINGS” నేర్పించే కృషి అందరం తక్షణం చేపట్టాలి!!!

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

3 Responses to యువర్ నేమ్ ఈజ్ జస్టిన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో