‘గ్రేవ్ యార్డ్ కీపర్’స్ డాటర్ ’

          Graveyard keeper’s Daughter

       Director:  Katrin Laur

       Country  : Estonia

       Language: Estonian,Russian,Finnish Languages

       Duration : 98 minutes.

ds

                             ప్రపంచీకరణ ప్రభావంతో, వేగంగా విధ్వంస మవుతున్న గ్రామీణ జీవితాన్ని  లూసియా అనే  ఎనిమిది ఏళ్ల పాప దృష్టికోణం నుంచి చూపిస్తుందీ చిత్రం. మారుమూలల్లో ఉన్న పల్లెల్లో సైతం అత్యంత వేగంగా జరుగుతున్న మార్పులను తట్టుకుని,ఎదురీదడాన్ని ఆ పాప నేర్చుకోవడమే ఈ సినిమా కధాంశం.

                                లూసియా  ఎస్టోనియా లోని ఒక చిన్న పల్లెలో కొంటెచేష్టలు, అల్లరి-చిల్లరి ( Pippi-Longstocking) శైలి జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె నివసిస్తున్న చిన్న గ్రామంలో ఆమె తండ్రి కైడో(35)  శ్మశానంలో పని చేసే ఒక కాటికాపరి. ఊళ్ళో జనాభా తక్కువ కాబట్టి మరణాలు అరుదుగా సంభవిస్తుంటాయి. ఎవరైనా మరణిస్తే తప్పించి ఆ పల్లెలో లూసియా తండ్రికి  పని ఉండదు. చాలా రోజులు పని లేకుండానే గడుపుతుంటాడు. పనికోసం ఎక్కువగా బయట తిరుగుతుంటాడు. తల్లి మరియా(37) కి ఉన్న పని ఊడి పోతుంది. అసలే ఆర్ధికంగా స్థిరమైన ఏ ఆధారం లేని దానికి తోడు తలిదండ్రులిద్దరూ తాగుడికి బానిసలవుతారు. రోజులు చాలా గడ్డుగా అతికష్టంగా గడుస్తుంటాయి. సహజంగానే ఆ చెడు ప్రభావాలు పిల్లల మీద పడతాయి. ఇంట్లో ఉన్న అస్తవ్యస్థ పరిస్థితుల వల్ల  పాఠశాలలో క్రమశిక్షణా రహితంగా,నియమాలకు విరుద్ధంగా కనీసమైన పరిశుభ్రత లేకుండా పాప ప్రవర్తిస్తూ ఉంటుంది. మురికి గా ఉండడంతో పాటు,పాఠాలు చదవడంలో కూడా వెనకబడిపోవడంతో చిన్నారి లూసియాకి బాధలు మొదలవుతాయి. ఆమె గురించి ఉపాధ్యాయులు విచారణ ప్రారంభించడానికి నిర్ణయించుకుంటారు. లూసియా  తల్లిదండ్రులు గనక, స్కూలు యాజమాన్యాలు నిర్దేశించుకున్ననాగరిక ప్రమాణాల కనుగుణంగా లేకపోతే, పిల్లల పెంపకం విషయంలో అసమర్ధులని రుజువయితే ఆమెను దూరంగా ప్రభుత్వ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంచవచ్చని భావిస్తారు.

fgk

                              ఉపాధ్యాయులు  కైడో,మరియాల ఇంటి మీద నిఘా పెట్టి లూసియానీ,ఆమె తలి-దండ్రులనూ,ఇంటి పరిస్థితుల్నీ గమనించి, ఒకరోజు ఇంటికొచ్చి మరియాని పాప గురించి ప్రశ్నిస్తారు. టీచర్ అడిగే ప్రశ్నలలో ఒక్కదానికి కూడా సవ్యమైన  సమాధానాలు  చెప్పలేకపోతుంది తల్లి మరియా .తన పాపను  నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఆమె చాలా సిగ్గు పడుతుంది. పాపంటే ఆమెకు ప్రాణమే కానీ తాగుడు అలవాటు నుంచి విముక్తి  పొందే శక్తిని కోల్పోతుంది. ముందు ముందు ఇలాగే ఉంటే పాపకు చాలా హాని కలుగుతుందని భావించి భవిష్యత్తులో ప్రమాదంలో పడబోయే చిన్నారిగా ఆమెను క్వాలిఫై చేస్తారు. 

                            రేపెలా గడుస్తుందనే అతి దారుణమైన పరిస్థితుల్లోఉన్న ఆ కుటుంబానికి, ఒక స్వల్పకాలిక ఉద్యోగం కోసం కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఫిన్లాండ్ లోని ఒక దయామయురాలైన  సర్పా(SIRPA 45) అనే పాస్టర్ ఇంటి నుంచి ఒక ఉత్తరం వస్తుంది.ఇది వారి జీవితాల్లో రవ్వంత మిణుకుమనే ఆశను కలిగించడమే కాదు, ప్రతి ఒక్కరి వైఖరిలో మార్పు తెస్తుంది.

                                          చిలిపిగా ఇష్టమొచ్చినట్లుండే లూసియాకి సర్పా బైబిల్ లోని నీతి కథలు చెప్తూ కథలోని ఉల్లాసంగా ,విలాసంగా ఉండే “పిప్పీ” తో  లూసియాని  పోల్చి ఆమెను మంచి గుణాల కనుకూలంగా మారేటట్లు సానుకూలపరుస్తుంది.  సర్పా స్వయంగా పాస్టర్ కాబట్టి నెమ్మదిగా ధైర్యాన్నిచ్చే మాటలు చెప్తూ, శుచి శుభ్రత,మంచి నడవడిక,నైతిక విలువలగురించి సుతిమెత్తగా బోధిస్తున్నట్లు కాకుండా  పిల్లల కథలు చెప్తున్నట్లుగా చెప్తూ,ఆ కథల్లో లూసియాని కథానాయకురాలిని చేసి  లూసియా దృష్టిని ఆకర్షిస్తుంది. అంతకుముందెప్పుడూ వాళ్ళ అమ్మ-నాన్నలిలాంటి పనులు చెయ్యలేదు. ఇంత చేస్తూ కూడా సంతానం లేని తాను ఏం చెప్పినా,ఏం చేసినా ఎవరేం కష్టపెట్టుకుంటారోననే సంశయంతో మధన పడుతుంది.పాప మంచికోసం, భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచించి పని చేసిన సర్పా మరియా గురించి, కుటుంబం బాగు కోసం కూడా ఆలోచిస్తుంది. కానీ అస్తమానం  మద్యం మత్తులో కైపెక్కి తూలుతున్న మరియాను మాత్రం రవ్వంత కూడా మార్చలేకపోతుంది. కైడో కూడా తన ఒడినెక్కి సంతోషంగా ట్రక్ నడుపుతానంటున్న లూసియాకి ఆనందంగా డ్రైవింగ్ నేర్పడానికి ప్రయత్నిస్తాడు గానీ భార్య మద్యం మత్తులో అమ్మాయి ఆలనా పాలనా సరిగా పట్టించుకోవడం లేదనే విషయం తెలిసినా అది తన పని కాదన్నట్లు బాధ్యత నుంచి తప్పించుకుంటాడు. 

                       ప్రేక్షకులు పాత్రల గత జీవితమేమిటి? ప్రస్తుతం వారి ఆకాంక్షలు, భయాలు,కోరికలేమిటి? అని మరింత సమాచారం కోరుకునేలా దర్శకురాలు సెటప్ ను ఆసక్తికరంగా చిత్రించారు. దర్శకురాలు పాత్రల అంతర్గత ఆలోచనలను దాచిపెట్టాలని చూసినప్పటికీ ప్రేక్షకులు పరిసరాలు,భౌతిక పరిస్థితులు,ఇరుగు పొరుగుల ప్రవర్తనల ఆధారంగా కొన్ని వాస్తవాలు గ్రహించవచ్చు. సంఘసేవకుణ్ణి  సందర్శించే ముందు సోషల్ వర్కర్ లూసియా  జుట్టుని దువ్వెనతో శుభ్రంగా దువ్వుతుంది. వీళ్ళిద్దరినీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు సొంత తల్లి  మరియా  లూసియా పట్ల ఎంత నిర్ల క్ల్యంగా ఉందో  తెలిసి వస్తుంది.చిన్నారి లూసియా స్థానిక షాప్ నుండి చాక్లెట్ మార్స్ బార్లు దొంగిలించడానికి  ప్రయత్నిస్తుంది. ఈ చర్య కుటుంబం యొక్క పేదరికాన్ని చెప్పకనే చెప్తుంది. లూసియా చిన్న సంతోషాలకోసం కూడా మొఖం వాచిపోయి ఉందనీ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అసహ్యించుకునే పరిస్థితికి వచ్చిందనీ ప్రేక్షకులకు ప్రస్పుట మౌతుంది. అదే విధంగా దుకాణదారుడు పొరుగువారి ముందే కఠినంగా,హీనంగా మాట్లాడడాన్ని బట్టి గ్రామంలో ఆ కుటుంబం పట్ల అంతగా గౌరవ మర్యాదలు లేని వైఖరిని ప్రతిబింబిస్తుంది. 

                                            ఇంతలో, పాఠశాలకు కొత్తగా వచ్చిన  టీచర్ , సామాజిక స్పృహతో లూసియా  శ్రేయస్సు కోసం  నిజంగానే ఆందోళన చెందినట్లు కనపడుతుoది.కానీ ఆమె పిల్లల సంక్షేమ దృష్టితో కాకుండా  ఫక్తు వ్యపార ధోరణితో వ్యవహరిస్తుంది. పిల్లల సంక్షేమం గురించిన కొన్ని ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి . కొన్ని సందర్భాలలో అది  పిల్లల్నితల్లి తండ్రుల సంరక్షణలో పెరగనివ్వడం మంచిదని స్పష్టమవుతుండగా,అమెరికా లాoటి అగ్ర దేశాల్లో సైతం తలిదండ్రుల్ని ప్రభుత్వాలు చాలా అనుమానంగా చూస్తూ అడుగడుక్కీ అనవసరంగా జోక్యం చేసుకుంటాయి . అక్కడ చదువులు ఏమాత్రం వత్తిడి లేకుండా ఉంటాయంటారు గానీ ప్రభుత్వాలు నడిపే స్కూళ్ళలో తమ పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ కొన్ని వత్తిడులకు లోనవ్వడమనేది వాస్తవమే!సంవత్సరం మొత్తం మీద 5 రోజులే లీవ్ పర్మిషన్ కి వీలుంటుంది. పిల్లలకి ఏ జబ్బు చేసినా, పీకలమీదికొచ్చినా సెలవు తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు. తప్పని పరిస్థితుల్లో సెలవు తీసుకుంటే డాక్టర్ సర్టిఫై చెయ్యాలి.అదొక పెద్ద తతంగం.అక్కడి హడావిడి జీవితాల్లో ఇవన్నీ ఒత్తిడి చేసే విషయాలే!పిల్లల్లో ఏ చిన్న తేడా కనిపించినా ఇక సోషల్ వర్కర్ల నుండి తలి-దండ్రులు మద్యం  మత్తులో జోగుతున్నారా,డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారా మొదలైన అనుమానాలతో వేధింపులు మొదలవుతాయి.

                        కొన్నిసార్లు అమాయకులు కూడా బలయ్యే ప్రమాదముంటుంది. స్థిరంలేని పెళ్ళిళ్ళూ-విడిపోవడాల నేపధ్యంలో కొన్ని సార్లు పెంపుడు తలిదండ్రులు తమ స్వంత పిల్లలు కాని వాళ్ళను  అమానుషంగా నిర్లక్ష్యం చేసిన సంఘటనలు కూడా కనిపిస్తాయి.ఏది ఏమైనప్పటికీ పిల్లలు ప్రభుత్వాలు నిర్వహించే హోంస్ లో కంటే అమ్మా-నాన్నల దగ్గర ఉండాడానికే ఇష్టపడతారు.  ఒక  గృహ వాతావరణం పిల్లల మీద  చెడు ప్రభావం వేస్తుంది కాబట్టి మేము అభివృద్ధి చర్యలు చేపడతామని అధికారులు నిర్ధారించడం అన్నిసార్లూ అంత సబబైన పని కాదు .  

                        2011 లో ఎస్టోనియన్ ప్రభుత్వం సమాజ జీవితం యొక్క నాణ్యతను మెరుగు పరిచేందుకు, ప్రణాళికాబద్ధంగా ఒక వ్యూహ రచన చేసి, అది 2012 సంవత్సరం నుంచి 2020 వరకూ వర్తించే విధంగా రూపొందించుకుని ఆమోదింపజేసుకుంది. సానుకూల సంతానం,బాలల హక్కులు,రక్షణ వ్యవస్థలు,కుటుంబ ప్రయోజనాలు,జననాల వృద్ధిరేటును పెంచడం -అనే ఐదు అంశాలు ఈ ప్రణాళికా లక్ష్యాలు. లక్ష్యాలు ఆహ్వానించదగ్గవే కానీ  పిల్లల పట్ల ఏమాత్రం బాధ్యత లేని తలి-దండ్రుల గురించీ, కుటుంబ విషయాల్లో ఒక్కోసారి అనవసరంగా జోక్యం చేసుకుంటూ,అత్యుత్సాహం ప్రదర్శించే ప్రభుత్వాల గురించీ, కుటుంబాల్లో-ప్రభుత్వాల్లో రెండిట్లోనూ ఉన్న అపసవ్య పద్ధతులగురించి  ప్రేక్షకులను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తుంది ఈ సినిమా డైరెక్టర్ కట్రీన్ లార్. 

                  ఎస్టోనియా -ఫిన్లాండ్ రెండు దేశాల్లోని సాధారణ ప్రజల జీవితాల స్థితిగతుల్ని పోల్చి నేటి ఎస్టోనియన్ గ్రామీణ జీవితం లోని పేదరికాన్ని వాస్తవికంగా చిత్రించారు. పిల్లల పెంపకం-సంక్షేమం,తలి-దండ్రుల ప్రబావాలు, ఆర్ధిక వ్యవస్థలు మొదలైన అంశాలను చర్చించిన చిత్రమిది. కాటికాపరి  కుమార్తెను కేంద్రంగా చేసుకుని ఆమె ద్వారా సందేశాన్నిస్తుంది దర్శకురాలు. ప్రధానంగా పిల్లలపెంపకం గురించి దర్శకురాలు చెప్పదలచుకుందా అనిపిస్తుంది.

                          ప్రపంచం లో ఎక్కడ చూచినా ఆధిపత్యాలు రాజ్యమేలుతున్న కాలంలో, పేద దేశాల మానవాళి గురించి ముఖ్యంగా భావి పౌరుల గురించి డైరెక్టర్ కట్రీన్ లార్ బాధ్యతగా పట్టించుకునే విధానానికీ ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది. పాత్ర చిత్రణలో ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను వారి వారి దృక్కోణం నుంచి గౌరవంతో సహానుభూతితో  చిత్రించడానికి  తీసుకున్న శ్రద్ధ,నిజాయితీలకు ఆమెను ప్రశంసించాలి. ఇందులోని పాత్రలన్నీ లోపాలతో ఉన్నప్పటికీ ఒక భావోద్వేగ స్థాయిలో ప్రతి ఒక్కరినీ ప్రేక్షకులు అర్ధం చేసుకోగలుగుతారు.

              ఈ సినిమాలో చర్చించిన బరువైన విషయాలు గొప్ప వేదనను, వ్యాకులతను కలిగించేవైనప్పటికీ ప్రేక్షకులకు  డిప్రెషన్  గానీ,అధైర్యంగానీ కలగదు. పల్లెటూరిని  ప్రశాంతంగా,చల్లగా ప్రకాశవంతమైన రకరకాల రంగుల్లోనూ, ఊరు ఊరంతా ఆకుపచ్చగా అమరిన రసవత్ లోకాన్ని చూపిస్తూ ఉపశమనం  కలిగిస్తుంది. గ్రామం లోని అందమైన లిరికల్ సౌందర్యం రిఫ్రెష్ చేస్తుంది. ” కాటికాపరి కూతురు” అనే శీర్షిక భీభత్సంగా తోచినప్పటికీ,నిజానికి ఈ చిత్రం లోని  వాతావరణం   స్మశానంలోని  “మరణం” తో కాక ,  ఆహ్లాదకరమైన ,రమణీయమైన  ప్రకృతి సౌందర్యంతో ముడి పడి ఉంది.

                         ప్రధాన పాత్రధారి లూసియా కీర్తూ-కిల్లూ గ్రెన్మన్ (Kertu-Killu Grenman) గొప్ప భావాలు పలికించగల అద్భుతమైన బాలనటి. ఆమె అమాయకమైన పసిముఖం చూస్తుంటే జాలీ వేస్తుంది. విసిగించి,ఎదుటి వాళ్ళకు చిరాకు తెప్పించే ఆమె   వయసుకి మించిన ఆరిందా తనపు మాటలకు, ప్రవర్తనకు కోపమూ వస్తుంది. అదే సమయంలో ఆమె చిలిపి, అల్లరి, కొంటె పనులకు సానుభూతీ కలుగుతుంది.  లూసియాకి తన చెల్లాయి లాగే అనిపించే పక్కింటి  చిన్న పాప మంచి దోస్త్. స్మశాన మైదానంలో ప్రతిష్టించి ఉన్న దేవతను  గురించిన ఉత్తేజపరిచే అద్భుత కథలు లూసియాకి తెలుసు.పాపాయి పోలికలు ముమ్మూర్తులా దేవత ప్రతిబింబం లాగానే.తోస్తుంది లూసియాకి. డౌన్ సిండ్రోమ్(క్రోమోజోమ్‌లలోని లోపం  వలన కలిగే శారీరక మానసిక క్షీణత) తో ఉన్న పాప అచ్చం బుజ్జి  బుజ్జి చిట్టి చిట్టి  పాపాయిలు చేసే అల్లరి-కదలికలతో లూసియా తోటే ఎప్పుడూ ఆడుతూ ఉంటుంది.

                       లూసియాకి ఈ పాపతో బోలెడంత  ప్రాణస్నేహం,అనుబంధం పెనవేసుకుపోతాయి. ఇద్దరూ ఉల్లాసంగా తుళ్ళిపడుతూ , అమితానందాలతో గంతులు వేస్తుంటారు. ఆటలాడే బాల్యంలోనే వయసుకి మించిన పెద్దతనంతో స్వచ్చందంగా తన సంగతి తాను చూసుకో వడమే కాదు, స్థిరచిత్తంతో , ఒక ఆదిమ నిష్కపటంతో  ఎల్లవేళలా  పాపాయిని ఒక బుజ్జి కుక్క పిల్లని కాపాడినట్లు కనిపెట్టుకుని ఉంటుంది.ఎన్ని పొరపాట్లున్నప్పటికీ ఈ ఒక్క విషయానికి లూసియా ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొడుతుంది. కైడో ఫిన్లాండ్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు  ప్రమాదవశాత్తూ ఇంటికి నిప్పంటుకుంటుంది.అనుకోకుండా జరిగిన ఈ దుర్ఘటనలో, మరియా,లూసియా, పాప  ముగ్గురూ మంటల్లో చిక్కుకుంటారు. మరియా,లూసియా చిన్న పాపను మంటల్లోంచి బయటికి తేవడానికి  ఎంతగానో ప్రయత్నిస్తారు.మంటలు భయానకంగా ఉండడంతో పాపను రక్షించలేకపోతారు గానీ పాప కోసం తల్లీ-పిల్లలిద్దరూ తల్లడిల్లిపోతారు. సినిమా చివర్లో అది చూసిన ప్రేక్షకులు కూడా చలించిపోతారు.

                      తన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు పేకాడుతూ,తాగి తందనాలాడుతున్నా ఇదంతా ఏమీ పట్టించుకోకుండా తన చుట్టూ ఉన్న వైవిధ్యమైన ప్రపంచాన్ని కుతూహలంగా చూస్తూ దేన్నీ లెక్కచెయ్యని స్వేచ్చా జీవిగా  కనిపిస్తుంది లూసియా. వాయిస్ లూసియాది కాకుండా సీనియర్ నటిది ఉపయోగించారు. సౌండ్ ఇంజనీర్ల మెప్పు పొందిందీ సినిమా. థియేటర్ నుంచి బయటికొచ్చాక  పూర్తిగా తవ్విన, సగం తవ్విన సమాధుల మధ్య సంతోషంగా పరుగులు తీస్తూ వారు ఆడిన  హైడ్ అండ్ సీక్ ఆటలు కళ్ళల్లో మెదులుతాయి. కెమెరా క్లోజప్ లోనూ,లాంగ్ షాట్స్ లోనూ లూసియా – పాపాయి ముఖాల్లో   బహిర్గత మైన ఆటల్లోని సంతోషాలు,బలహీనతలు, భావోద్వేగాలు , మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి . సమాధి మీద పాతిన రా ళ్ళ మధ్యలోనుంచి, సగం తవ్విన సమాధుల మధ్యలో నుంచి ఆ పిల్లలు ఆడుకోవడం చూసిన వాళ్ళకు ఈ భావి పేద ప్రపంచపౌరుల ఆటస్థలాలు,ఉద్యానవనాలు స్మశానాలేనా? అనే ఆలోచనలొచ్చి హృదయాలు ద్రవీభూతమౌతాయి. 

                        రకరకాల అంశాలను ఆర్ధ్రంగా చిత్రించిన దర్శకురాలిని అభినందించవలసిందే కానీ యూరప్ దేశాల పేదరికం,కుటుంబాల సంక్షేమం,పిల్లల పెంపకం,నిరుద్యోగం,ఆర్ధిక స్థోమత లేకపోయినా అప్పులు చేస్తూ మనుషులు చెడు అలవాట్లకు  బానిసలవడం-ఇలా అనేక సమస్యలను ఒకే సినిమాలో చూపించాలని తాపత్రయ పడిందా అనిపించింది.”ఏ సమస్యైనా దానికదే విడి విడిగా ఉండదు కదా,ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే కదా? అక్కడ షాపుల్లో చూశారా? నిత్య జీవితావసరాలైన వస్తువులు కనిపించడం లేదు.ఎక్కడ చూసినా మద్యం సీసాలే కనిపిస్తున్నాయి.ఈ సమస్యలన్నిటికీ మూలం ప్రపంచీకరణే కదా?” అని నా పక్క సీట్లో కూర్చుని సినిమా చూస్తున్న “లోకసంచారి”( కలం పేరు ) గారన్నారు.నిజమే ననిపించింది.

ఈ సినిమా రిగా లో అర్సీనల్స్(Arsenals) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు – అవార్డులతో పాటు, ఇంటర్నేషనల్ ప్రైజ్ కూడా గెలుచుకుంది. అంతే కాదు, బాల్టిక్ సినిమా పోటీలో “Graveyard Keeper’s Daughter” ని  ఉత్తమ చిత్రం గా విమర్శకులు ఎంపిక చేశారు.

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, Permalink

One Response to ‘గ్రేవ్ యార్డ్ కీపర్’స్ డాటర్ ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో