పాపినేని శివ శంకర్ ‘ సుశీల ‘ కథలో స్త్రీ , పురుష మానవీయ సంబంధాలు

              తెలుగు సాహితీ ప్రపంచంలో మానవుని జీవిత సంఘటనలను సామాజిక సంబంధాలని స్పురింపజేసే ప్రక్రియలెన్నో వచ్చాయి. అలాంటి వాటిలో కథ ఒకటి. మనిషిని అర్ధం చేసుకోవడానికి శతాబ్ధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికి సమాజానికి ఉన్న సంబంధాన్ని ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాలను చర్చించే కథలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాలను కథలుగా మలచిన రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వాటిలో పాపినేని శివశంకర్‌ గారు ఒకరు. వీరు తన కథల ద్వారా స్త్రీ, పురుష సంబంధాలను తెలియపరిచారు. అలాంటి కథలలో ”సుశీల” అనే కథ ఒకటి.
స్వీయవ్యక్తిత్వం కలిగి ఆత్మవిశ్వాసంతో ఆలోచించే సుశీలపై తన బంధువుల అబ్బాయి అత్యాచారం చేస్తాడు. అది బయటి ప్రపంచానికి తెలియడం వలన ఆమెను అతనికే ఇచ్చి వివాహం చేయాలనుకునే ఘోరమైన ఆలోచనను తిరస్కరిస్తూ, అదే క్షణంలో ఇతరులు తనపట్ల చూపే జాలిని సహించక, తన ఆత్మాభిమానాన్ని నిల్పుకుని తన తెలివితో స్వంత వ్యక్తిత్వంను ఏర్పరచుకొని, అవే భావాలు కల నరేంద్ర అనే యువకుడిని ఆమె ఇష్టపడి పెళ్ళి చేసుకోవడం అనేది సంక్షిప్తంగా కథ.
కథ ఇదే అయినా కథను రచయిత నడిపించిన తీరు రచయిత సృజానాత్మక దృక్పథానికి నిదర్శనం. కేవలం సుశీల నరేంద్రలను కలపడమే కాదు రచయిత అంతర్గతంగా నరేంద్ర బావ అనే పాత్రద్వారా సంఘంలో స్త్రీకి ముఖ్య అవసరాలుగా భావించే శీలం, పవిత్రత, మానం, పెళ్లి గురించి ఆయా పాత్రల ద్వారా నాటకీయ సంభాషణల ద్వారా వ్యక్తపరచిన తీరు బావుంది. స్త్రీల పట్ల సంఘంలో, కుటుంబంలో పురుషుడికుండే దృకృథంలో రావల్సిన మార్పును, తద్వారా స్త్రీ, పురుష సంబంధాన్ని  పెంపొందించుకోవలసిన తీరును వివరించాడు.
సుశీల అనే ఒక అబల మనోవైకల్యం కలిగిన పురుషుడిచే బలాత్కరించబడితే సంఘం స్త్రీని దోషిగా చూడటం తప్పు. అసలు దోషి పురుషుడే కదా? అతన్నెందుకు దోషిగా చూపెట్టరు?  పురుషుడు చేసిన తప్పుకు స్త్రీకి శీలం పోయింది అనడం తప్పు. శీలం అనేది స్త్రీ శరీరానికి సంబంధించినదిగా చూసే సమాజం, స్త్రీ శరీరానికి అయిన గాయాన్ని చూసే సమాజం, మనస్సుకు అయిన గాయాన్ని ఎందుకు చూడటం లేదని రచయిత సూటిగా ప్రశ్నించిన విధానం బాగుంది.
నేటికి సమాజంలో స్త్రీ, పురుషులకి వివాహం జరుపబోయే ముందు స్త్రీ శీలవతా? కాదా? అని ఆలోచించే సమాజం పురుషుడు శీలవంతుడా? కాదా? అని ఎందుకు ఆలోచించడం లేదని రచయిత ప్రశ్నిస్తున్నాడు. అంతేగాక స్త్రీ పురుషుల మధ్య కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు ఆత్మీయతతో కూడిన స్నేహసంబంధం ఉండాలని కాంక్షిస్తున్నాడు.
కథను ఉత్తమ పురుషులో నడిపిస్తూ నరేంద్ర బావ అనే పాత్ర ద్వారా ప్రశ్నిస్తూ నరేంద్ర పాత్ర ద్వారా సమాధానం చెప్పించడంలో నరేంద్ర యొక్క వ్యక్తిత్వము, అతని మానసిక పరిపక్వతను తెలియ పరుస్తాడు శీలం అంటే ”భర్తని తప్ప పరపురుషుణ్ణి గురించి మనసా, కర్మణా కోరుకోకుండా పవిత్రంగా ఉండడం అని. అయితే ఎన్నడూ పరపురుషుణ్ణి మనసా – కాసేపు కర్మణా తీసేద్దాం. ఇష్టంగా ఆలోచించని స్త్రీ లెంత మందుంటారు? పెళ్ళి, కాకముందు వేరే ఎవర్నీ ఇష్టపడకుండా కాబోయే భర్తని మాత్రమే ఇష్టపడదాం అని ఏ స్త్రీ అయినా మనస్సు బిగతీసుకుని ఉండగలదా? అలాగే మగవాడైనా. అంటే స్త్రీ పురుషులందరికీ శీలం ఉన్నట్టా? లేనట్టా?” అని అనిపించడం ద్వారా ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ పట్లగాని, పురుషుడి పట్లగాని గావించవలసిన మనో సంస్కరణలను ఎత్తి చూపుతున్నాడు. ఇందులో నరేంద్రది సంస్కరణలతో కూడిన మనస్తత్వం అని చెప్తునే రచయిత తన సంస్కరణ దృక్పథాన్ని నిర్మించిన తీరు చాలా బావుంది.
పవిత్రత అంటే ? ”స్త్రీ  అయినా పురుషడైనా తనకిష్టమైన వ్యక్తిని కాంక్షించడంలో తప్పులేదు. ఆకాంక్షలో మనశ్శరీరాల సమతౌల్యాన్ని బట్టి దాని మంచి చెడ్డలుంటాయి. అంటే ఒక వ్యక్తి ఎదుటి వాళ్ల మనసుతో పని లేకుండా శరీరాన్నే కోరుకోవడం తప్పనుకుంటాను. అంతేగాని వేరుగా శీలం అనే పవిత్ర పదార్ధం ఎక్కడుంది? పవిత్రత, అపవిత్రత చాలా పెద్దమాటలు. ఈ పవిత్రతని నిర్ణయించుటకు పెళ్లీ పెటాకులు ప్రమాణాలే కావు” అని రచయిత నరేంద్ర ద్వారా వ్యక్తపరచడంలో  పవిత్రతను స్త్రీకి మాత్రమే ఆపాదించి స్త్రీని దోషిగా చూపెట్టబడినది అని ఇది మానవీయ సంబంధాలను నాశనం చేయడమేనని రచయిత దృక్పథం. అంటే భవిష్యత్తులో సమాజం ఎదుర్కొనే ప్రధాన సమస్యగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాడు.
మానం అంటే ? ”ఒక స్త్రీకి మానభంగం జరిగితే… నో మానభంగం అనే మాట సరైంది కాదు. మనిషికి అభిమానమేగాని మానం ఎక్కడుంది? ఒకవేళ ఉంటే అది స్త్రీతో పాటు పురుషుడికి ఎందుకు లేదు? అంటే మనం స్త్రీకి మాత్రమే మానం లేదా శీలం అనేది కల్పించి, అది తన పురుషుడి కోసం కాపాడకోవలసిన అంశంలాగా పవిత్రత రంగు పూశాం. మరి మగాడి సంగతేమిటి? నిజానికి స్త్రీని  బలాత్కరించినపుడు పవిత్రత కోల్పోతున్నది స్త్రీయా? పురుషుడా? నిజానికి పవిత్రత అనేది ఉంటే అత్యాచారాల విషయంలో స్త్రీని తప్పుపట్టనవసరం లేదు. తన ప్రమేయం లేకుండా తన మీద జరిగిన దాడికి తననెందుకు తప్పు పట్టాలి” అని నరేంద్ర పలకడం వలన నరేంద్రలో తాత్త్విక పరిశీలనను చెప్తూ ఇలాంటి విషయాలపట్ల సంపూర్ణ అవగాహనను ఏర్పరచుకొనుటకు రచయిత సంఘానికి సంధించిన ప్రశ్నలుగా చెప్పవచ్చు.
సుశీల పాత్రను రచయిత మలచిన తీరు స్త్రీ జాతిపట్ల గౌరవాన్ని తెల్పుతుంది. పిరికితనంతో  పరిస్థితికి లొంగిపోయిన అబలస్థాయి నుంచి ఆత్మావిశ్వాసంతో స్వీయవ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని ఆత్మాభిమానాన్ని నిల్పుకున్న  చైతన్యవంతురాలైన స్త్రీమూర్తిగా సుశీలను తీర్చిదిద్దారు. ప్రతి స్త్రీలోను ఇలాంటి లక్షణాలు ఉండాలని సంఘంలో స్త్రీ రక్షణాత్మక ధోరణిలో జీవనం గడపకుండా సంఘానికి స్త్రీయే రక్షకురాలిగా నిలబడాల్సిన అవసరం ఉందని ఆశించారు. ”కవయః క్రాంతదర్శిః” అన్నారు మహానుభావులు. రచయిత నేటి పరిస్థితులను ముందుగానే దర్శించినట్టు భవిష్యత్‌లో సంభవించే సంఘంలో స్త్రీ జాతిపై వివక్షను సంస్కరించాలని తాపత్రయపడినట్టు చెప్పవచ్చు,
సుశీల పాత్ర చిత్రణలో రచయిత కవితాత్మక ధోరణి, సంభాషణ చతురత అతని సృజానాత్మకతకు నిదర్శనం. ”విశాలమైన మైదానం కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు పచ్చిక బయల్లలో గొర్రెల మంద. అంతవరకు అది మామాలు బొమ్మే.  కానీ ఆ వెనగ్గా ఒక గొర్రెపిల్లని ఎత్తుకుని నడుస్తున్న గొర్రెల కాపరి మూర్తి ఆ మామూలు బొమ్మని అసాధారణ చిత్రం చేసింది. గొర్రెపిల్ల కన్నుల్లోని అమాయకత్వం. కాపరి కన్నుల్లోని కారుణ్యం నిజంగా గొప్ప చిత్రం.” మనిషికీ ప్రకృతికీ మధ్యఉన్న సంబంధాన్ని ప్రకృతిలో మనిషి, మనిషిలో ప్రకృతి లయమై జీవిస్తాడాని తెల్పుతూనే సుశీల మానసిక ప్రకృతిలో అమాయకపు మృదుత్వాన్ని, కరుణను ఈ చిత్రం ద్వారా తెలియపరిచాడు. అలాంటి చిత్రాన్ని సుశీల ద్వారా వేయించడంలో తన గురించి తెలుసుకోవడానికి వచ్చిన నరేంద్ర బావకి సుశీల యొక్క మనసు, సౌందర్యాన్ని దాని వెనుక దాగిఉన్న వ్యక్తిత్వాన్ని అంతర్గతంగా చెప్పదలచాడు.
”సుశీలకి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అయితే వాటిని శాశ్వత సత్యాలుగా భావించకుండా సాపేక్షంగానే ప్రతిపాదిస్తుంది. అభిప్రాయ కాఠిన్యం వల్ల మనిషి చాలా కోల్పోతాడు. తన అభిప్రాయాల చట్రాల్లోనే కాస్త అటు, ఇటుగా కదలగల వెసులుబాటు ఉన్నవాడు సంతోషంగా జీవించగలడు. పక్కవాళ్లనీ సంతోషపెట్టగలడు. ఇక్కడ వెసులుబాటు అనడం ద్వారా మాటిమాటికి ”ఒపీనియన్స్‌ ఛేంజ్‌” చెయ్యటమని కాదు. మార్పుకు అవకాశం ఉంచుకోవడం అనడం ద్వారా మనిషి కానీ, మనిషి నివసించే సంఘం కాని  కాలక్రమంలో వచ్చే పరిణామాలను ఎదుర్కొనుటకు మార్పును అంగీకరించవలసినదేనని సుశీల ద్వారా తెలియపరుస్తూ అదే సమయంలో ఆమె మానసిక పరివర్తనం వివరిస్తూన్నారు. దీన్నిబట్టి సుశీల భవిష్యత్‌లో తనలా ఆలోచించే, తన భావాలను, భావనలను గౌరవించే పురుషుడి పట్ల సుముఖత వ్యక్తం చేస్తుందని నరేంద్ర బావ ద్వారా నరేంద్రకు తెల్పుతూనే నరేంద్ర మనస్తత్వాన్ని కూడా వ్యక్తం చేయడం అనేది రచయిత శైలిని, కథను నడిపిన తీరుని తెల్పుతుంది.
”సుశీల వెళ్లిపోయింది పెయింటింగ్‌ తీసుకుని. ఒక చల్లని పరిమళం గది దాటి వెళ్లిపోయినట్లు అనిపించింది. అన్న నరేంద్ర బావ మాటలలో సుశీల పట్ల తనకి సరైన దృక్పథం అలవడిందని అంతర్గతంగా సుశీల, నరేంద్రలు మంచి జోడి నిర్ణయానికి వచ్చాడు.
నరేంద్ర సుశీలతో సంభాషిస్తూ ”నీమీద ఎవరో అత్యాచారం చేశారంటగదా? అన్నప్పుడు నన్ను చూసి జాలిపడుతున్నావా? పోనీలే ఎగతాళి చెయ్యలేదుగా అంతవరకు నయమేలే బాధను సహించ గలనుగాని  జాలిని సహించలేను. ఆ సంఘటన వల్ల సమస్తం కోల్పోయాను అనుకోవడంలేదు. కాకపోతే ఆ పరిస్థితులో నేను పిరికితనం ఎందుకు అబలనైపోయానా అని ఇప్పుడైతే ఏ పరిస్థితినైన  ఎదుర్కొనేందుకు చాలినంత ధైర్యం ఉంది.” అని అనడంలో సుశీలకి సంఘాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నరేంద్రకు తెలపడం ద్వారా అతని పట్ల తన ఇష్టాన్ని, తనపై నరేంద్ర అభిప్రాయ ఏమిటని ఒకేసారి ప్రశ్నించినట్లుగా సంభాషణ పూర్తి గావించడం కథను పతాకస్థాయికి తీసుకువెళ్ళడమే అవుతుంది.
ముగింపులో ”మనిషి సుఖంగా బ్రతకడానికి అంతో ఇంతో ధైర్యసాహసాలు అవసరం అనుకుంటాను. అవి సుశీల, నరేంద్రల్లో ఉన్నాయి. పరస్పర విశ్వాసం ఉంది. వాళ్లు సుఖపడ గలరనే అనుమానం.” అనడంలో ఈ మాటలు నేపధ్యంగా తీసుకుని రచయిత కథను మలచినట్లు చెప్పవచ్చు. ”ప్రేమను పంచి ప్రాణాలైన ఇచ్చే నీ మీదనే అత్యాచారాలు చేస్తూన్నటువంటి కృతఘ్నులున్నచోట తమ శక్తి, యుక్తులను పరాయికరణకు లోనైనా స్త్రీలు పురుషాధిక్య సమాజాన్ని నిరసిస్తూ స్త్రీ పురుష సంబంధంలోని వైరుధ్యాలను బహిర్గతం చేస్తూ అణచివేతకి వ్యతిరేకంగా ఆలోచించాలని చెప్పే హెచ్చరిక చేస్తూ సమాజంలో స్త్రీ ఒక వ్యాపారవస్తువు కాదు. సమాజంలో ఉండవలసిన ముఖ్యపాత్రగా అలాంటి స్త్రీని గౌరవించడం ద్వారా స్త్రీ పురుష సంబంధాలు పెరిగి సమాజం పటిష్ఠమవుతుందని రచయిత ఆకాంక్ష. దీనిని మనం గౌరవించవలసిన అవసరం ఉంది.

                                                                                – యమ్‌. రవీంద్రనాథ్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో